మనసులోని మనసా… 2

8
2

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]ఒ[/dropcap]క్కోసారి కొన్ని చిత్రాలు జరుగుతుంటాయి. అందులోని నిజానిజాల గురించి నాకు తెలియదు. నేను మూఢ నమ్మకాలను నమ్మను. పెద్దలు ఏదైనా చెబితే అందులోని నిజానిజాలు సైంటిఫిక్ రీజన్స్ తెలుసు కోవడానికి మాత్రమే ప్రయత్నిస్తాను. కాని మన నమ్మకాలకి సంబంధం లేకుండా కొన్ని చిత్రాలు జరిగిపోతుంటాయి. వాటి గురించి నాకు ఎప్పటికీ సందేహమే.

ఇక నేను చెప్పేది సిక్త్స్‌సెన్స్ గురించి. అదే ముందు జరగబోయేది తెలియడం. అలా నిజంగా జరుగుతుందా? ఏమో మరి.

నేను చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటన ఇది. మా అమ్మమ్మ అంటే మా అమ్మగారికి ప్రాణం. అందుకని తరచూ ఆమెని అమ్మ తీసుకొస్తుండేది. ఇది కాకినాడలో మేము చదువుకుంటున్నప్పుడు.  అక్కడ నాన్న వుండేవారు కాదు. నాన్న గుంటూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వుద్యోగం చేస్తూ, మమ్మల్నిక్కడ పెట్టారు. అమ్మమ్మ అల్లుడింటికి వచ్చేది కాదు. కనీసం కనపడేది కూడా కాదు. ఆ ఫార్సు మరోసారి చెబుతాను.

తరచూ ప్రతి నెలా మా యింటికి వెంకటగిరి చీరలబ్బాయి వస్తుండేవాడు. అమ్మ, అమ్మమ్మ ఆ చీరల్నే కట్టేవారు. అమ్మమ్మ దరిదాపు ఆరడుగులు ఎత్తుండేది. అందుకని అమ్మమ్మకి ప్రత్యేకంగా చీరలు నేయించేవారు. అలానే ఆ నెలా అతను వచ్చేడు. అమ్మ అమ్మమ్మని చీరలు ఏ రంగులు కావాలనీ నేయించడానికి అడిగింది. “వద్దమ్మా వచ్చే నెల నేనుండను కదా, డబ్బు దండగ!” అంది.

అమ్మమ్మ సహజంగా వూరు దాటదు. ఎప్పుడూ పుట్టింటికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. నా అతి చిన్నతనంలో కృష్ణక్క (పెద్దమ్మ కూతురు)  పెళ్ళికి వాళ్ళక్క, తమ్ముడు వచ్చినట్లు గుర్తు. అంతే.

“ఎక్కడి కెళ్తావు?” అనడిగింది అమ్మ ఆశ్చర్యంగా

“నేను చచ్చిపోతాను కదమ్మా” అంది అమ్మమ్మ అతి సాధారణంగా పెరట్లోని చాప మీద ఎండ కోసం కూర్చుని.

అమ్మతో పాటు అందరం తెల్లబోయేం.

నిజానికి అమ్మమ్మ అరోగ్యంగానే వుంది.

“ఏంటా మాటలు!” అని కసురుకుంది అమ్మ.

ఆ తర్వాత వారం రోజులకి ఎవరో వాళ్ళమ్మాయికి  పెళ్ళి కుదిరిందని వచ్చే నెలలో ముహుర్తాలు పెట్టుకున్నామని అమ్మమ్మని కూడా రమ్మని చెప్పేరు.

“మీ అమ్మాయి పెళ్ళికి నేనుండను కదా!” అంది అమ్మమ్మ నవ్వుతూ.

ఈ సారి మా అమ్మగారికి చిర్రెత్తుకొచ్చింది.

“ఏంటస్తమానూ… నేనుండను నేనుండను అంటూ పాడుతున్నావు. నీకు తెలుసా?” అంది కోపంగా.

“తెలుసమ్మా. నేనబద్ధం చెప్పడం లేదు” అంది అమ్మమ్మ. ఆ తర్వాత టెక్నికల్ టూర్‌కి వెళ్తూ నేను  “అమ్మమ్మ వెళ్ళొస్తాను” అని చెప్పాను.

అమ్మమ్మకి నాకు సాన్నిహిత్యం ఎక్కువ. ఏ అల్లరి చేసినా అమ్మమ్మ నన్ను అమ్మ బారి నుండి కాపాడేది.

అమ్మమ్మ కొడుకులు సరిగ్గా చూడటం లేదని బాధ పడినప్పుడల్లా నేను “నా చదువయి పోగానే నిన్ను నాతో తీసుకెళ్ళిపోతా. మనిద్దరం కలిసుందాం” అని చెప్పేదాన్ని.

అమ్మమ్మ గబగబా నేను ఎక్కబోతున్న రిక్షా దగ్గర కొచ్చి “ఇదిగో శారదా… ఎక్కడి కెళ్తున్నావో గాని నువ్వొచ్చేప్పటికి నేనుండనే!” అని చెప్పింది.

నేను వెంటనే షాక్‌కి గురయ్యేను.

అమ్మ కోపంగా “శుభమా అని అది వూరెళ్తుంటే… ఏంటా మాటలు, ఎందుకూ దాన్ని హడలుగొడ్తావు” అంది అమ్మమ్మతో.

“హడలగొట్టడం కాదు మళ్ళీ నన్ను చూడదు కదా, అందుకని” అంది అమ్మమ్మ శాంతంగా.

 “నీకేం కాదు. నే నొచ్చేస్తాగా” అన్నాను నేను కూడా.

ఆ తర్వాత పదిహేను రోజులు టూర్‌లో వుండిపోయాను. ఇప్పటిలా సెల్స్ లేవు. అనేక వూర్లు తిప్పారు కాబట్టి ఇంటి నుండి మాకెలాంటి కమ్యూనికేషన్స్ లేవు.

తిరిగొచ్చేక అమాంతం రిక్షాలోంచి దూకి అన్నీ మాట్లాడుతూ ‘అమ్మమ్మేది’ అనడిగాను మామయ్యగారింటి కెళ్ళిందేమోనని.

“లేదు. అమ్మమ్మ చనిపోయింది” అన్నది అమ్మ కన్నీళ్ళతో.

నేను షాకయిపోయాను.

“అనును. నువ్వెళ్ళిన మర్నాడే ‘నాకు కొంచెం బాగోలేదు. నీకిక్కడ యిబ్బందవుతుంది. నన్ను వెంకటనారాయణ దగ్గర వదిలేయ్’ అని చెప్పింది. ఏమీ కాదని చెప్పినా వినలేదు. ఇక తీసుకెళ్ళి వదిలేను.  ఆ రాత్రే… ఏ జబ్బులేదు” అంది అమ్మ.

దిన వారాలు కూడా అయిపోయాయి.

ఎంతసేపు ఏడ్చానో!

వీధి వీధంతా ఆమె తన మరణం గురించి ముందే చెప్పడం వింతగా చెప్పుకున్నారు,

నాకు కూడా ఇప్పటికీ ఆశ్చర్యమే!

నేను ఎర్రం మంజిల్ ఆఫీసులో పని చేసేటప్పుడు గోపాల్ అనే వాచ్‌మన్ వుండేవాడు. చాల పెద్ద ఆఫీసు మాది. చాలా మంది వాచ్‌మెన్లు వుండేవారు.

అతనికీ నాకూ ఏ జన్మరుణమో తెలియదు. ఎప్పుడూ నా టేబుల్ దగ్గరే తారట్లాడేవాడు. అతన్ని చూస్తే మా నాన్నగారు గుర్తుచ్చేవారు.

ఒక రోజు ప్రొద్దుటే మా యింటి కొచ్చేడు.

“ఏం గోపాల్ పనేమన్నా వుందా?” అనడిగాను.

“రాత్రి అన్నం తినలేదమ్మా. డ్యూటీ దిగి ఎల్తన్నాను” అన్నాడు బుర్ర గోక్కుంటూ.

వెంటనే “అటు తిరిగిరా” అని చెప్పి భోజనం పెట్టాను.

అంతే! నాకు అతుక్కుపోయాడు.

ఆఫీసులో నాకు టిఫిన్ తెచ్చిపెట్టడం, కూజాలో నీళ్ళు పెట్టడం, ఎప్పుడూ నీడలా కనిపెట్టుకుని వుండేవాడు.

తెలుగుదేశం వచ్చాక రామారావు గారి గవర్నమెంటులో మాకు వేసవి కాలం వుండే వాటర్‌బాయిస్‌ని ఎబాలిష్ చేసారు. వాళ్ళ పని మార్చి నుండి మే వరకు కిటికీలకి వట్టివేళ్ళ చాపలు కట్టి నీళ్ళు జల్లడం.

నేను ఎండకి తట్టుకోలేను. అప్పుడు గోపాల్ ఎక్కడ దాచేవాడో చాపలు తెచ్చి నా దగ్గర కిటికీలకి కట్టి నీళ్ళు జల్లేవాడు. చాలా మంది నా కొలీగ్స్ ఇది చూసి వుడుక్కునే వారు. “ఏం గోపాల్… మాకు కూడా కట్టొచ్చు కదా” అనేవారు.

“మీరు శారదమ్మ కారు” అనేవాడు నిర్మొహమాటంగా.

నేనంత తోట పెంచానంటే ఎర్రమంజిల్ కాలనీలో అదంతా గోపాల్ చలవే. నేను వద్దన్నా నేను నిద్రపోతున్నా… ఇంట్లో లేక పోయినా… వచ్చి ఏదో పని చేసుకుంటూనే వుండేవాడు.

అప్పు కింద డబ్బు తీసుకుంటే ఆ డబ్బు అణా పైసలతో తెచ్చి యిచ్చేసేవాడు. కాని… చాల మంది నాగరికులమని యింటికి వచ్చి అప్పుగా తీసుకున్న డబ్బుని ఎగ్గొట్టిందే కాకుండా మనల్ని తిట్టడం, నిందలు వేసి ప్రచారాలు చెయ్యడం  నాకు తెలుసు.

ఒక రోజు నేను నిద్ర పోతుండగా గోపాల్ వచ్చి ‘అమ్మా’ అని పిలిచినట్లుయింది. లేచి ఇంటి చుట్టూ తిరిగాను. ఎక్కడా కనిపించలేదు.

“గోపాల్ వచ్చాడు ఏడి” అని పిల్లల్ని అడిగాను.

“నీ కెప్పుడూ గోపాల్ ధ్యాసే. అసలు రాందే” అన్నారు వాళ్ళు.

“లేదమ్మా పిలిచాడు” అని మరోసారి చూసి పడుకున్నాను. అప్పటికే గోపాల్ రిటైరయ్యేడు. ఎవరూ అతని సంగతి అడిగినా చెప్పలేదు.

ఒక రోజు వాళ్ళ కూతురు ఏడుస్తూ నా దగ్గర కొచ్చి ‘నాన్న చచ్చిపోయాడ’ని చెప్పింది. షాకయ్యేను.

చాలా బెంగ పడ్డాను.

అన్నిటికన్నా చిత్రమేమిటంటే గోపాల్ చనిపోయిన టైం నన్ను ‘అమ్మా’ అని పలిచిన టైం ఒకటి కావడం.

నేను అమెరికా వచ్చాక మొట్టమొదటిసారిగా వంశీ నన్ను పాయింట్ ఆప్ రాక్స్‌కి తీసుకెళ్ళాడు. ఆ స్థలం వర్జీనియాకి మేరీలాండ్ రాష్ట్రానికి మధ్యన వుంటుంది.

పోటోమేక్ నది ఆ రెండు రాష్ట్రాలని విడదీస్తూ ఆ ప్రదేశంలో ప్రవహిస్తుంటుంది.

నది చాలా దిగువగా వుంటుంది. బ్రిడ్జి చాలా ఎత్తున పురాతనంగా వుంటుంది. ఒక పక్కన ఎత్తయిన కొండ. నది దాటి క్రిందుగా నడిచి వెళ్తే నది దగ్గరగా చేరుకుంటాం.

 

అక్కడ చెట్ల మధ్య బాటలో నడుస్తూ నేను నదిని, ఆ కొండని పరిశీలనగా చూస్తూన్నాను.

వంశీ వెనక్కి తిరిగి ‘ఏంటమ్మా’ అన్నాడు.

“ఎందుకురా ఇక్కడికి రావడం. వెళ్ళిపోదాం పద” అన్నాను. వాడు ఆశ్చర్యంగా “ఎందుకు” అన్నాడు.

“ఇక్కడ వాతావరణం బాగా లేదు. భయంగా వుంది” అన్నాను. “నది ప్రవాహం లేనట్లుగా నిర్జీవంగా కనిపిస్తుంది. ఆ కొండకి కళ లేదు. నదిలో నీళ్ళు కూడా బూడిదరంగులో వున్నాయి” అన్నాను.

“ఇక్కడ సివిల్ వార్ జరిగింది. చాల మంది ప్రజలు స్వాతంత్య్ర పోరాటంలో చనిపోయారు” అని చెప్పాడు వంశీ.

అక్కడ వాళ్లు  యుద్దానికి వాడిన స్టీమింజను రైలు తదితర వస్తువుల్ని అలానే వుంచారు. తిరిగి ఇంటికి వచ్చాశాం.

మేము ఎక్కడికెళ్ళినా ఆ బ్రిడ్జి దాటి వెళ్ళాలి. ఆ బ్రిడ్జి రాగానే నాకు వళ్ళు ఝల్లుమనేది.

ఎక్కడయినా అమెరికాలో దారులు నాలాంటి వాళ్ళు గుర్తు పట్టడం కష్టం. అంతా అడవిలానే వుంటుంది. రోడ్డు కిరుప్రక్కలా దట్టమైన చెట్లువుంటాయి. వంశీ ఏ దారిన వచ్చినా ఒక పది మైళ్ళు వుండగానే నాకేదో సంకేతం అందేది. భయపడేదాన్ని.

“వంశీ మనం పాయింట్ ఆప్ రాక్స్ వైపు వెళ్తున్నామా?” అని అడిగేదాన్ని.

కొన్నాళ్ళకి వాడికి అనుమానం వచ్చి “నీకెలా తెలుస్తుందమ్మా” అనడిగాడు ఆశ్చర్యపోతూ.

“ఏమోరా బహుశా ఈ సివిల్ వార్లో నేను కూడ యుద్ధం చేసిన అమరవీరురాలినేమో” అన్నాను నవ్వుతూ.

పైకి నవ్వానే గాని… నాకు అనుమానమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here