[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]
[dropcap]న[/dropcap]యాగర జలపాతం చూడాలన్నది ఎవరికైనా ఒక కల!
దాన్ని మించిన జలపాతాలు ప్రపంచ పటంలో మరిన్ని వుండొచ్చు!
కాని మన భారతీయులకి చూసే అవకాశం కల్పించిన మన పిల్లల్ని ముందుగా అభినందించుకోవాలి!
అంగలకుదురెళ్ళినంత తేలికగా మనం అమెరికా వెళ్ళిపోతున్నాం. నేను మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు అందరిలానే నా కల సాకారం చేసుకునేందుకు నయాగర చూసేందుకు బయల్దేరాం.
పెన్‌సిల్వేనియా మీదుగా ప్రయాణం అద్భుతమైనది. అంతకు ముందే మేం అటుగా మా వంశీ పని చేస్తున్న లేబరోప్, పిట్స్‌బర్గ్ వెంకటేశ్వరస్వామి ఆలయం చూసివచ్చాం. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అడవి సౌందర్యం అది! ఎత్తుపల్లలా రోడ్లు, స్టీప్ కర్వ్స్, ఒక పక్క లోయలు, వాటి నిండా ఆకాశాన్ని అందుకోవాలని అర్రులు చాచే వృక్ష సముదాయం! అద్భుతమైన సౌందర్యాన్ని దేవుడు వెళ్తూ వెళ్తూ అక్కడ జారవిడుచుకున్నాడా అనిపిస్తుంది. ఫాల్ సీజన్ అయితే ఆ అందాలని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. కళ్ళు నోళ్ళయి ఎంత త్రావినా తీరని దాహం అది.
నేను సహజంగా ప్రయాణం చేసేడప్పుడు మాట్లాడడానికి ఇష్టపడను. మౌనంగా ఆ అందాల్ని ఆస్వాదించడంలో చాలా హాయి వుంటుంది. కొందరు ప్రతిక్షణం కేరింతలు కొడుతుంటారు. ఏదో ఒకటి మాట్లాడి తమ సంతోషాన్ని ప్రకటించుకుంటారు. కాని నా మనసు అందుకు విరుద్ధం.
సరే దాదాపు ఒక పగలంతా ప్రయాణించి చీకటి పడ్డాక నయాగరా చేరేం. ఎక్కడిదో ఒక అస్పష్టమైన హోరు చెవులను తాకుతోంది. వెంటనే జలపాతాన్ని చూడాలని మనసు ఉరకలు వేస్తోంది.
ఆ రోజు జూలై నాల్గవ తేదీ. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవరపు రోజు. అందుకే ఎక్కడ వెదికినా హోటల్ రూమ్స్ ఖాళీ లేవు. అమెరికన్స్‌కి లాంగ్ వీకెండ్ కావడంతో చాలామంది నయాగర చూసేందుకు వచ్చారని అర్థమవుతోంది. బయట మాత్రం నిర్మానుష్యంగా, ప్రశాంతంగా వుంది. ఎలాగో కష్టపడి ఒక ఇండియన్ హోటల్ పట్టుకుని ‘బ్రతుకు జీవుడా’ అనుకున్నాం. అమెరికాలో మనవాళ్ళు ఇలాంటి హోటల్ కట్టి మెయిన్‌టెయిన్ చేయగలుగుతున్నందుకు కడుంగడు సంతసించి లగేజ్ అందులో పడేసి వాటర్‌ఫాల్ దగ్గరికి పరిగెత్తేం.
రకరకాల రంగుల దీపాలతో ఫాల్ అద్భుతంగా అలంకరించేరు. హోరుమని క్రిందకు దూకుతున్న జలపాతం అనేక రంగులు మార్చుకుని క్రిందకి దూకుతోంది. ఫాల్‌కి అవతలవైపు ఉన్న కెనాడాలో కూడా చాలా అద్భుతంగా ఫాల్‌ని, హోటల్స్‌నీ దీపాలతో అలంకరించేరు. నిజానికి కెనడా నుండే నయాగర చూడడానికి అందంగా కనబడుతుంది.
సరే – చూడవలసినంత చూసి, అక్కడే వున్న రెస్టారెంటులో భోం చేసి హోటల్‌కి వచ్చాం. హోటల్ వారు తమ వంతు కృషిగా టాయిలెట్లలో వేడి నీరు లేకుండా, మంచాల్లో నల్లులు వుండేట్లుగా ఎనలేని కృషి చేసి ‘మేం భారతీయులం’ అని చాటి చెప్పుకున్నారు.
ఆ మర్నాడు బఫేలో వారు చెప్పిన అయిటమ్స్ లేకపోవడం, ఏదడిగినా అక్కడి అమ్మాయిలు జవాబు చెప్పకుండా గంటల తరబడి ఫోనుల్లో మాట్లాడుకోవడం చూసి ఉసురుమని తిరిగి కారులో ఫాల్ దగ్గరికి చేరుకున్నాం.
చెప్పలేని రష్ వలన కారు పార్కింగ్‍కే స్థలం దొరకలేదు. ఒక గంట తర్వాత ఎలాగో ఒక చోట దొరికిన స్థలంలోనే కారు పెట్టి ఫాల్ పొడవునా నడక ప్రారంభించేం. ఒక పక్క జలపాతం వైపు పరుగులు తీస్తున్న నీరు, మరో పక్క విశాలమైన లాన్స్, పెద్ద పెద్ద చెట్లు. అలసిపోయి కూర్చున్న చోట ముద్దుగా పలకరిస్తూ మన పక్కన జేరి ఎగురుతూ కవ్వించే నీటి పక్షుల సముదాయం! నీడ పట్టున నడుకుంటూ అలసట వచ్చినప్పుడు కూర్చుంటూ ముందుకి సాగేం. వుండీ వుండీ ప్రవాహపు హోరు పెరిగిపోయింది. నీటి దుడుకు కూడా రెట్టింపయి పోయింది. అంటే జలపాతం దగ్గర పడుతోందన్న మాట. ప్రమాదం లేకుండా నదీ ప్రవాహానికి పెద్ద ఐరన్ నెట్ వేశారు. మాలో కూడా థ్రిల్ పెరిగిపోయింది. అలా నడుచుకుంటూ బ్రిడ్జ్ దాటి ఫాల్ నెత్తిమీదకు చేరుకున్నాం. జలపాతాన్ని చూడగానే మా అలసటంతా మాయమైపోయింది. ఒక పాయ విడివడి కొంచెం అవతలగా దూకుతున్నది. కెనడాని, అమెరికాని కలిపే రెయిన్‍బో బ్రిడ్జ్ ఎదురుగా కనిపిస్తున్నది.
ఆ జలపాతాన్ని అనేక భంగిమల్లో చూసేందుకు ఏర్పాట్లు చేశారు. ఒకసారి జలపాతం పై నుండి, మరోసారి దాని ఎదురుగా బ్రిడ్జి మీద నుండి, మరోసారి బోటులో. అన్ని రకాలుగా చూసేక, బోటులోకి వెళ్ళేందుకు లిఫ్ట్‌లో జలపాతం పాదాల దగ్గరకు వెళ్ళాం. ఆ హోరు చూసి నేను చాలా భయపడ్డాను. రానంటే రానని వాదించాను. అంత పెద్ద జలపాతం అంత ఎత్తు నుండి దూకుతుంటే బోటు తలక్రిందులయి పోతుందని నా భయం.
‘ఇప్పటి దాక నువ్వు చూసింది ఒక ఎత్తు, బోటులో దాని ఎదురుగా వెళ్ళడం మరో ఎత్తు. అది చూడకపోతే, నువ్వు నయాగర చూసినట్లే లెక్కకి రాద’ని మా వంశీ వాదన.
చివరికి అమెరికన్స్ కూడా ఈ వ్యవహారం చూసి అర్థమయి నన్ను ‘కమాన్’ అంటూ చెయ్యి పట్టుకుని లాక్కుపోయారు. వారిచ్చిన రెయిన్ కోట్సు వేసుకుని బోటులో పై ఫ్లోర్‌కి చేరుకుని కూర్చున్నాం. నేను వంశీ చెయ్యి గట్టిగా పట్టుకుని బిక్కు బిక్కు మంటూ కూర్చున్నా.
బోటు బయల్దేరడమే అమెరికన్స్ వుత్సాహంతో ఒకటే పాటలు! డాన్సులు! బోటు జలపాతం దగ్గరగా చేరగానే నీరు ఒక్కసారిగా ఎగసిపడి చిమ్మి మమ్మల్ని తడిపేసింది. అందరూ ఒక్కసారి నవ్వులు!
నేను చిన్నపిల్లలా తెగ నవ్వేసేను.
అప్పుడు మా వంశీ నా మొహంలోకే చూస్తున్నాడు.
నేను వాడి వైపు చూశాను.
“అమ్మా బాగుందా!” అన్నాడు సంతోషంగా.
వాడి కళ్ళు మెరుస్తున్నాయి.
నేను చిన్నపిల్లలా తలూపి వాడి చేతులు పట్టుకుని నొక్కాను. వాడికి పుట్టినప్పటి నుండి నేను ఎన్నెన్నో చూపించి, నేర్పించి వుంటాను.
కాని… ఇప్పుడు వాడు నాకొక అద్భుతమైన దృశ్యం చూపించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.
అదొక అపురూపమైన అనుభవం! వాడికి కూడా అమ్మకిలా చూపించగల్గేనన్న ఆనందం!
పైగా చాలా అపురూపంగా ఎక్కడికి వెళ్ళినా నన్ను ముందు సీట్లో తన పక్కనే కూర్చోబెట్టుకుని ప్రతీది నాకు వివరిస్తూ తీసుకెళ్ళేవాడు.
తర్వాతి ట్రిప్స్‌లో నేను ఆ సీటు మా కోడలికి ఇచ్చేసాను.
నేనూ, సాకేత్ రాం వెనుక సీట్లో ఆడుకుంటూ – పాడుకుంటూ!
వంశీ అలా ఎక్స్‌ప్లయిన్ చేయడం వలన చూసిన ప్రతి ప్రదేశం నా మైండ్‌లో రికార్డయిపోయాయి. ఎప్పుడైనా నేను ఫోనులో వాటి గురించి మాట్లాడినప్పుడు వాడు ఆశ్చర్యంగా “నీకెంత గుర్తమ్మా… నేను మరిచేపోయాను” అంటూంటాడు.
సరే!
అలా చూశాక కాసేపు రెస్టు కోసం లాన్‌లో చతికిలబడ్డాం.
“మీకసలు బుద్ధి లేదు. మీ అమ్మని తేవద్దంటే తెచ్చారు. ఇప్పుడావిడ చూడకపోతే ఏమన్నా నష్టమా! కొంపలేమయినా కూలిపోతాయా” ఆ గొంతు విని ఉలిక్కిపడి చూశాను. ఆ అమ్మాయి బాబ్డ్ హెయిర్‌తో జీన్స్, టీ షర్టుతో వుంది. అటు పక్కన వాళ్ళత్తగారు కాబోలు – విషణ్ణ వదనంతో కళ్ళ నీళ్ళతో కూర్చుని వుంది.
అతను కొడుకు కాబోలు, కోపంగా ఉన్నాడు.
“పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను” అంటున్నాడతను.
“ఆఁ! ఆఁ! చాలా చూశాను, ఈ చంపేయడాలు! ఆవిడ నడవలేకపోతోంది. అన్నిటికీ నేనమ్మా అని రావడాలు! ఛీ! ఛీ!” అంటూ చెలరేగిపోతున్నదా అమ్మాయి.
ఆ తల్లి నా వైపు చూసింది.
నేను చూపు తిప్పుకున్నాను.
“నాన్నా… అందరూ చూస్తున్నారు. గట్టిగా మాట్లాడకండి. నేను రావడం తప్పే. నా ఆరోగ్యం గురించి నా కన్నా బాగా ఎవరికి తెలుస్తుంది?” అందా వృద్ధురాలు బాధగా.
“అన్నిటికీ రెడీ అయిపోవడం… తర్వాత ఇలా హార్మోనియం నొక్కులు నొక్కడం!” కోడలు సణుగుతూనే ఉంది.
ఆ సంఘటన నాకు చాలా బాధ కల్గించింది.
ఈ డిగ్రీలు, విదేశాల్లో ఉద్యోగాలు, డాలర్లు – మనకేమీ నేర్పించలేదా?
వృద్ధాప్యం ఆమెకు రాదా!
తల్లి కాబట్టి తను చూసిన అపురూపమైన దృశ్యం తన తల్లికి కూడా చూపించాలని అనుకోవడం అతని తప్పా! ఎందుకిలా మానవత్వం మరిచి మాట్లాడటమో అర్థం కాలేదు.
తిరిగి హోటల్‌కి వచ్చాం.
అక్కడే ఉన్న ‘కోణార్క్’ అనే హోటల్‌కి భోజనానికి వెళ్ళాం. ఎక్కడ చూసినా తెలుగువారే ఎక్కువ!
అక్కడ అరుపులూ, కేకలూ… బఫే సిస్టమ్ కావడంతో కక్కుర్తిగా ప్లేట్లు పట్టనన్ని అయిటమ్స్ తెచ్చుకోవడం – వాటిని క్రిందా మీదా ఒలకబోయడం, పిల్లల గోల – ఒక్కసారిగా ఇండియా వచ్చేసానా అని అనుమానం వచ్చేసింది నాకు.
భోజనమయ్యిందని బయట పడ్డాం.
బయట హోటల్ ముందు కూర్చోవడానికి వేసిన బెంచీల్లో సగం తాగి వదిలేసిన బీరు బాటిల్స్ పడిపోయి బీరు వలుకుతూ లాన్‌లో పడేసిన పిజ్జాలు, బర్గర్‌లూ.
“అదేంట్రా ఎదవేక్షను!
మనోడు చించేసాడు.
ఆడికంత సీన్ లేదొరే!
ఈసారి తొక్క తీసేయాలి!”
– లాంటి పదజాలంతో మన తెలుగు కుర్రకారు రెచ్చిపోతూ.
“వీళ్ళంతా ఎమ్మెస్ చేయడానికి వచ్చిన మన ఆంధ్రా పిల్లలమ్మా. వచ్చీరాని డ్రయివింగ్‌తో కార్లు అద్దెకు తీసుకుని తాగి డ్రైవ్ చేస్తారు. ఆనక ఏక్సిడెంట్లలో ఇరుక్కుంటారు. అక్కడ తల్లిదండ్రులకెంత బాధో!” అన్నాడు వంశీ తిరిగొస్తుంటే.
“అంతే కాదు. ఇక్కడ మనమే వస్తువు కొన్నా తిరిగి మూడు నెలల్లో వాపసివ్వొచ్చు. అది సాకుగా తీసుకుని మనవారు మూడు నెలలు డ్రెస్సులు వేసుకుని ఒక రోజు ముందుగా అక్కర్లేదని వాపసిస్తారు.
రూల్ ప్రకారం తప్పదని వాళ్ళు వెనక్కి తీసుకుంటారు కాని వాళ్ళకి మనవాళ్ళు ప్లే చేసే చీప్ ట్రిక్స్ తెలుసు!
అందుకే ఒక్క ముక్కలో మనల్ని వాళ్ళు ‘ఇండియన్ మెంటాలిటీస్’ అని ఊరుకుంటారు” అన్నాడు తిరిగి.