Site icon Sanchika

మనసులోని మనసా-25

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]ని[/dropcap]న్న గాక మొన్న ఎగ్జిబిషన్ గ్రవుండ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం చూసి గుండె గుభేలుమంది. క్షణాల్లో మొత్తం షాపులన్నీ పరశరామ ప్రీతికి గురయ్యేయి. దేవుని దయో, అదృష్టమో ప్రాణ నష్టం జరగలేదు.

కాని దేశం నలుమూలల నుండి నాలుగు రూపాయలు వస్తాయన్న ఆశతో వచ్చిన వ్యాపారస్థుల లక్షల రూపాయల సరుకు మంటల పాలయి బూడిదగా మారిపోయింది. ఆ తర్వాత వాళ్ళు హృదయాలు కాలిపోయి ఎంతగా అలమటిస్తారో వూహకందనిది కాదు.

కుటుంబాల్ని వదిలేసో, కుటుంబ సహితంగా వచ్చిన వ్యాపారస్థుల నష్టం ఎవరు పూడ్చేది! ప్రభుత్వం యిచ్చే కాంపెన్సేషన్ ఏ పాటిది! అదెంత మందికి న్యాయబద్ధంగా అందుతుందో తెలియదు!

అలా అందర్నీ ఆకర్షించి ఎన్నో సంవత్సరాలుగా జనవరి మాసంలో జరిగే ఈ ఎగ్జిబిషన్‌కి ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి! ఫైర్ ఇంజన్స్ అక్కడే రెడీగా వుండాలి కదా! ఏది ఏమైనా అదృష్టం కొద్దీ ఆదివారం కాకపోవడంతో కొంత రద్దీ తక్కువగా వుండటంతో ప్రాణ నష్టం జరగలేదు.

నా చిన్నతనంలో తరచూ విజయవాడలో ఎప్పుడూ అగ్ని ప్రమాదాలు జరుగుతుండేవి. విజయవాడని బ్లేజ్‌వాడని పిలిచేవారు కూడా.

ఒకసారి జరిగిన అగ్ని ప్రమాదం గురించి అందరూ ఎంతగానో చెప్పుకోవడం నాకిప్పటికీ గుర్తుంది. ఒక వివాహ సందర్భంగా జరిగిన పెను ప్రమాదంలో అందరూ అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు. కేవలం మగవాళ్ళు మాత్రమే గోడలు దూకి పారిపోయారట. ఆడవాళ్ళు, పిల్లలు నిస్సహాయంగా అగ్నికి ఆహుతి అయిపోయారు. వారి వంటి మీద కరిగి ముద్దలయిన బంగారాన్ని బట్టి వారిని గుర్తించారట! ఎంతటి విషాదం అది!

ఇప్పుడు కూడ కృత్రిమంగా ఏర్పాటు చేస్తున్న దీపోత్సవ కార్యక్రమాలు ప్రతి ఏడూ చూస్తూన్నప్పుడు నాకు వళ్ళు గగుర్పొటుస్తుంది. అక్కడ పట్టు చీరలు కట్టుకుని ఒకరి వళ్ళో ఒకరు కూర్చున్నట్లు వెనకా ముందూ ప్రక్కల్న కూర్చుని దీపాలు వెలిగించి పూజలు చేసే తతంగాల్ని చూస్తున్నప్పుడు నేను మనుషులకి ఎంత భయం లేకుండా పోతుందని ఆశ్చర్యపోతుంటాను. డబ్బు సంపాదన కోసం వ్యాపారస్థులు కుమ్మక్కయి ఏదో ఒకటి మనకి నూరి పోస్తుంటారు. కాని అందులో వున్న నిజానిజాలు తెలియనంత అమాయకులం కాము మనం.

ఒక ప్రాణ ప్రతిష్ఠ లేని ప్లాస్టర్ ఆఫ్ పేరిస్ విగ్రహాన్ని పెట్టి అభిషేకాలు చేస్తుంటే మనం మన యింట్లో దేవుడు లేనట్లు అక్కడికి పరుగులు తీయడమేంటి? అంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో కూర్చుని పూజలు చేయటమేంటి? పూర్వం నిజానికి కార్తీక మాసపు పూజలు అందరూ చేసే వారు కానే కాదు. భక్తి ఒక తంతు కాదు. అది మానసికమైంది. దేవుడు మన ఆత్మే అని ఒక పక్కన చెబుతూనే వుంటారు. కాని యిలాంటి వేలం వెర్రి పూజలకి పరుగులు తీస్తూనే వుంటారు. అక్కడకి వెళ్ళే ప్రవచనాలు వినాల్సిన పని లేదు. మనకన్నీ టివిల్లో అందుబాటుల్లోనే వున్నాయి. వినేవాళ్ళ కన్నా చెప్పేవారే ఎక్కువయి పోయారు ఈనాడు.

పూర్వం ఒక రైతు వున్నాడంటే చీకటి తోనే లేచి తూర్పు దిక్కుకి తిరిగి యింకా వుదయించని సూర్య భగవానుడికో నమస్కారం పెట్టి తన పనిలో తాను నిమగ్నమయ్యేవాడు. అలానే చేతి వృత్తుల వారికి ఎవరి వృత్తి వారికి దైవం! నాకు బాగా గుర్తు. అనేక మంది యిళ్ళలో యుప్పటిలా పూజా మందిరాలే వుండేవి కావు. హాల్లోనే దేవుడి పటాలు వుండేవి. ఎప్పడూ ఏదో దైవ నామాన్ని స్మరిస్తూ తన కుటుంబానికి అన్ని సదుపాయాలు చూడటమే ఆ యింటి ఇల్లాలికి పూజ.

ఒకసారి మేము అనుకోకుండా రాజమండ్రి వెళ్ళి తిరిగి వస్తున్నాం. అప్పుడు మా వంశీ కూడా అమెరికా నుండి వచ్చాడు. మా ట్రెయిన్ అనుకున్న టైం దాటి చాలా ఆలస్యంగా సికింద్రాబాదు స్టేషన్ చేరింది. ఒక్కసారే అనేక రైళ్ళ రావడంతో ప్లాట్‌ఫామ్ మీద భయంకరమైన రద్దీ ఏర్పడింది. అడుగు వెయ్యడానికే వీలు లేదు. ఇక ఫ్లయ్‌ఓవర్ మీద క్రిక్కిరిసిన జనంతో అసలు బ్రతికి బయట పడతామో లేదోనన్నంత భయంతో వణికి పోయాం.

వంశీ చేతులడ్డం పెట్టి ఎలాగోలా బయటకి లాక్కొచ్చాడు. ఇప్పటికీ ఆ సంఘటన తలచుకుంటే భయంతో వళ్ళు గగుర్పొడుస్తుంది. అసలు ఏనాడో కట్టిన ఆ ఫుట్ బ్రిడ్జి కూలితే అంతే సంగతులు!

ఇప్పటికీ పండగలొస్తే మూఖ్యంగా సంక్రాతికి హైద్రాబాదు మూడొంతులు ఖాళీ అయిపోతుంది. ఎపార్టమెంటుల్లో చాలా యిళ్ళకి తాళాలు పడతాయి. ఎన్ని దొంగతనాలు జరిగినా అంతే! వెళ్ళిపోవాల్సిందే! ఎన్ని సంవత్సరాలయినా అంతే! పెళ్ళయి ఎన్నేళ్ళయినా అంతే, పండగొస్తే పుట్టిళ్ళకి పరుగులే!

పండగ ఎక్కడ లేదూ! మనిళ్ళకి తాళాలు పెట్టి మరెక్కడికో ఎందుకు? దాని వలన మనం ఎంత రద్దీని సృష్టిస్తున్నాం! ఇప్పుడు బస్ ఛార్జీలు, రైల్వే ఛార్జీలు కూడా మూడేసి రెట్లు పండుగ సీజన్లో పెంచేస్తున్నరు. అయినా వెళ్ళాల్సిందే. అయినదానికి కాని దానికీ తిరగాల్సిందే. అసలే ఎంతో ఎక్కువ జనాభా వున్న మన దేశంలో మనం మన చేతులతో మరింత రద్దీని సృష్టించడం లేదా!

ఎక్కడో ఏదో ఫ్రీ అన్నా, తక్కువ ధరలకి యిస్తున్నామని షాపుల వాళ్ళు ప్రచారం చేసినా అక్కడ వూరంత క్యూలు రెడీ. అందులో నిజనిజాలు మోసాలు మనకి అవసరం లేదు. తెలిసినా ఏదో వంకన బయటపడాలి!

ఉత్తరాఖండ్‌లో ప్రమాదాలు చూసిన ఎన్నో గుడులలో రద్దీతో త్రోక్కిసలాటలో చనిపోయినా ఏ దేవాలయాల్లో రద్దీ తగ్గడం లేదు.

ఒకప్పుడు తిరుమలకి ఆపదలకి మొక్కుకున్న మొక్కుల్ని తీర్చుకోవడానికి మాత్రమే భక్తులు వ్యయప్రయాసల కోర్చి నడిచి, మెట్టెక్కి వెళ్తుండేవారు. ఈనాడు తిరుపతి ఒక పిక్నిక్ స్పాట్ అయిపోయింది. సంపన్నులు, రాజకీయ నాయకులు తిధి మారితే గుడిలో వుంటున్నారు. వారి వలన నిజ భక్తులకి దర్శనం దుర్భరమైపోతున్నది. ఎంతో కష్టపడి వెళ్ళిన వారికి దేవుడసలు కనబడటమే లేదు.

ఈనాడు అందరికీ ఆదాయమూ, ఆయుషూ కూడ పెరిగేయి. దాంతో ఎక్కడికో చోటకి వెళ్ళిపోవాలన్న యావ కూడా పెరిగిపోయింది. అలా ఆరోగ్యంగా వున్నవాళ్ళు వెళ్ళడం తప్పని నేనటం లేదు. మనం వెళ్ళే ప్రదేశాలు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వున్నాయో యోచించుకుని వెళ్ళలన్నదేనా ఉద్దేశ్యం.

ఈ రద్దీని తగ్గించడం కోసమే ఆమెరికాలో చాలా మందికి వర్క్ ఎట్ హోం అనే సదుపాయాన్ని కల్పించారు.

అమెరికాలో ఒకసారి మేం వర్జీనియా సౌత్ బీచ్‌కి వెళ్ళి తిరిగొస్తున్నాం. రేడియోలో ఒక వంద కిలో మీటర్ల అవతల జరిగిన రోడ్డు ప్రమాదం గురించి పదే పదే చెబుతున్నారు. ట్రాఫిక్ ఏ ఏ రోడ్లకి డైవర్టు చేసింది తెలియజేస్తున్నారు. అలానే మేం మలుపు తీసుకుని వెళ్తుండగా ఆ ఏక్సిడెంట్ జరిగిన స్పాట్ కనిపించింది. రెండు కార్లు ఢీ కొన్నాయి. పెద్ద ప్రమాదమే జరిగినట్లుంది. అటూ ఇటూ ఏ మాత్రం కనపడకుండా స్క్రీన్స్ పెట్టేసారు. హెలికాఫ్టర్ వచ్చి క్షతగాత్రుల్ని తీసుకెళ్ళిపోతూనే వుంది. వీలయినంత వరకు బ్రతికించాలనే ప్రయత్నాలు అక్కడ సిన్సియర్‌గా జరుగుతున్నాయి.

ఒకసారి నేను ఆఫీసు నుండి వస్తూ లక్డీకాపూల్ – ఖయిరతాబాద్ రోడ్డులో ఒక ఏక్సిడెంటు చూశాను. ఏదో ఒక ట్రక్ ఒక వ్యక్తిని గుద్దేసింది. అతని శరీరంలోకి ఒక రాడ్ వెళ్ళిపోయి వుంది. అతను హృదయ విదారకంగా అరుస్తున్నాడు. అందరూ చాలా యాంత్రికంగా వెళ్ళి పోతున్నారు. దానికి కారణం మన లా అండ్ ఆర్డర్‌లో వున్న ప్రాబ్లమ్స్. ఇప్పుడు కొన్ని రూల్స్ సడలించినట్లున్నారు. ఏది ఏమైనా మన దేశంలో భక్తికున్న ప్రాముఖ్యత పక్కవాడి కష్టం పట్ల లేదు. ఒకరి కష్టం వింటేనే తమకు కష్టాలొచ్చేస్తాయని నమ్మే కర్మభూమి మనది! అందుకే మనకి అడుగడుగునా బాబాలు, ప్రవచనాలు చెప్పి కడుపులు నింపుకునే స్వామీజీలు వెలసేరు.

ఎవరి పని వారు నిష్కామంగా నిర్వర్తిస్తూ ప్రక్కవారిని ఆదరిస్తూ జీవించడంలో దేవుడున్నాడని మనం గ్రహించిన నాడు స్వామీజీల పేరుతో జరుగుతున్న మోసాలు, అన్యాయాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా స్త్రీలు వీరి దగ్గరికి ఎంత వెళ్ళకపోతే అంత మేలు! అమాయికంగా నిరక్షరాస్యులయిన స్త్రీలు వెళ్ళడం వేరు. చదువూ సంస్కరం వున్న మహిళలు కూడ అక్కడికెళ్ళి మోసపోవడం దురదృష్టకరం!

మీ యిటికి దీపం మీరు! మీ యింటి దేవత మీరు!

మీ చిరునవ్వులోనే దేవుడున్నాడు.

దేవుడు నిర్వికారుడు!

దేవాలయాలు ఖాళీగా వుండే రోజుల్లో సందర్శించుకోండి. ఆ స్వామి దీవెనలు అందుకోండి. సాధ్యమైనంత వరకూ రద్దీ స్థలాలకి వెళ్ళడం మానుకుని ఆపదలకి దూరంగా వుండండి. ఇది నా ప్రార్థన!

Exit mobile version