Site icon Sanchika

మనసులోని మనసా-28

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]నే[/dropcap]ను రింగ్ రోడ్ సెక్షన్‌లో పని చేస్తుండగా సుగుణ నేనున్న కేబిన్‌లోకి వచ్చింది.

సుగుణ మా ఆఫీసులో ఇటీవలే ఎప్పాయింట్ అయిన అటెండరు. భర్త వ్యసనాలతో తీసుకుని తీసుకుని చనిపోతే ఆమెకా వుద్యోగం కంపాషనేట్ గ్రవుండ్స్ మీద లభించింది.

ఇది మామూలే!

నా సర్వీసులో చాలా మంది దుర్వ్యసనాలతో కుటుంబాన్ని సర్వనాశనం చేసి వున్నదంతా ఆస్పత్రులకి వూడ్చి మరీ చనిపోతే వారి పిల్లలో, భార్యలో వుద్యోగాలలో చేరి కొంతలో కొంత బాగుపడటం చూశాను. ప్రభుత్వం చేసిన మహోపకారం ఇది!

సుగుణ వచ్చినప్పుడు చాలా బెరుకుగా వుండేది.

ఒక మూల బెంచీ మీద బిక్కుబిక్కుమంటూ కూర్చునేది.

అనేక సంవత్సరాలు ఇంట్లో గృహిణిగానే వుండటం వలన ఒక్కసారి ఆఫీసు వాతావరణంలో ఇమడడమంటే భయమే కదా.

నేను రాస్తున్న నోటు ఆపి ఏంటన్నట్లుగా చూసి నవ్వు నవ్వేను.

సుగుణ నాకు నమస్కరించి నిలబడింది.

సుగుణ నా సెక్షన్ అటెండరు కాదు.

ఒక వేళ ఏ డి.సి.ఇ. గారన్నా పిలవమంటే అందుబాటులో వున్న అటెండర్స్ వస్తుంటారు.

“మేడం మీరే మనుకోనంటే చిన్న మాట!” అంది.

“చెప్పు. ముందు కూర్చో” అన్నాను.

సుగుణ బెరుగ్గా నా ఎదురు కుర్చీలో కూర్చుని “మీరు రచయిత్రా మేడం?” అంది.

నేను ఔనన్నట్లుగా నవ్వేను.

“నే నొక కథ రాశాను మేడం” అంది మెల్లగా.

ఆప్పుడామె చేతిలోని నోట్ బుక్ చూసి అర్థం చేసుకున్నాను.

“అవునా?” అన్నాను నవ్వుతూ.

“మీరు నా కథ చదివి ఎలా వుందో చెప్పాలి మేడం!” అంది నిదానంగా.

“సరే! నాకిప్పుడర్జెంటు వర్కుంది. డి.సి.ఇ. పిలుస్తారు. అక్కడ పెట్టు, తర్వాత చదువుతాను” అన్నాను.

సుగుణ ఆ బుక్ నా టేబుల్ మీద పెట్టి మళ్ళీ నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది.

తిరిగి సాయంత్రం వరకు నాకు లీజర్ దొరకనే లేదు.

ఆఫీసు నుండి వెళ్తూ గుర్తొచ్చి ఆ నోట్ బుక్ తిసుకుని ఇంటికి వెళ్ళి పోయాను.

ఇక ఇంటికి వెళ్తే సరేసరి!

‘ఆడవాళ్ళు ఆఫీసుకి ఇంటిని తొడుక్కుని వెళ్తారు’ అని కల్పనా రెంటాల గారు రాసిన మాట యథార్థం. అంతే కాదు. ఇంటి కొచ్చి ఆఫీసుని మోయాల్సిన స్థితులు కూడా వుంటుంటాయి ఇండియాలో.

అంత హెవీ లోడ్ వర్కుంటుంది కొన్ని సీట్లులో.

నా పనంతా అయి, భోజనాలయ్యేక ఎవరి నిద్రల్లోకి వారెళ్ళిపోయేక ఒక శూన్యం ఏర్పడుతుంది నాకు.

ఆ శూన్యంలో నుండి కొంత తడవయ్యేక నాకు నేనుగా కన్పడటం మొదలవుతుంది.

అలాంటప్పుడు ఏ కిటికీ దగ్గరో నిలబడి కనిపించినంత మేర ఎపార్టుమెంటుల గోడల్ని ఛేదించుకుని తునకలయి దర్శనమిచ్చే ఆకాశాన్ని, అందులో మిణుకు మిణుకుమనే ఒకటి అరా నక్షత్రాల్ని దర్శించుకున్నప్పుడు ఎక్కడయినా మిగిలివున్న ఒకటీ అరా చెట్లని, వాటి కొమ్మల కదలికని చూస్తూ ఆలోచించడం, ఆలోచిస్తూ చూడటం నా దైనందిక చర్య! అప్పుడు మెదిలే భావాలే కథలుగా మారుతుంటాయి.

అలా చూస్తుండగా సుగుణ కథ గురించి గుర్తొచ్చింది.

పాపం, ఎంతో ఆశగా అడిగింది. చూడకపోతే నిర్లక్ష్యం అనుకుంటుంది.

వెంటనే లైటు వేసుకుని కథ చదవడానికి ప్రయత్నించాను. కష్టమే అయ్యింది. కారణం భాష. ఆమె ఎక్కువగా చదువుకోలేదు. రాసే అవసరం కూడా ఆమెకు వుండకపోవచ్చు.

ఇప్పుడు ఒక్కసారి కలం పట్టి రాయాలంటే కష్టమే కదా! వెంటనే ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్టు చేస్తూ ముందుకి సాగేను.

అది నిజానికి కథ కాదు.

ఆమె ఇంటి పక్కనే బందువుల్లోనో జరిగిన ఒకానొక సంఘటన!

నిజానికి కథలన్నీ చాలా వరకు అలా పుట్టుకొచ్చినవే.

రచయిత తన ప్రతిభతో, శైలితో, కథనంతో వాటిని తీర్చిదిద్దుతాడు.

సుగుణకవన్నీ తెలియవు. తనకు తెలిసిన ధోరణిలో రాసుకుంటూ పోయింది. భాష లేదు. కథని ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ముగించాలో తెలియదు. అసలు ముందేం చెప్పదలచుకుందో అవగాహన లేదు.

ఆమె రాసిన కథ ముగించాక నేను ఆలోచనలో పడ్డాను.

అసలు కథ రాయడానికి మెప్పిచడానికి ఏమైనా పడికట్లున్నాయా?

కొన్ని రచనలు అలా మనసుకి హత్తుకు పోతాయెందుకు?

కథ రాయడం అనేది నేర్చుకునే విద్యా?

దీనికి టెక్నిక్స్ వున్నాయా?

ఆ మధ్య కథల వర్క్‌షాప్స్ కొన్ని వెలిసాయి.

అదేంటో ఆ పేరే నాకు నచ్చదు.

కారణం బహుశా మాకు ఫస్టియర్లో వర్క్‌షాప్ అని ఒక క్లాసుండేది.

అందులో మేం నిజంగా చెప్పాలంటే కమ్మరి పని, వడ్రంగి పని చేయాలి. చెక్కలు కొసి వాటిని చతురస్రాకారంగానో, త్రికోణాకారంగానో తయారు చేయాలి. అలాగే ఇనుప కడ్డీలు కాల్చి వంచడం వేరే వేరే షేపులుగా తయారు చెయ్యడం. ఆ క్లాసుకి వెళ్ళాలంటే ఏడుపొచ్చేది. చెయ్యలేక చేతులు కందిపోయేయి. పేళ్ళు గుచ్చుకునేవి.

అయితే రాఘవయ్య గారని మాకు చాలా మంచి ఇన్‌స్ట్రక్టర్ వుండేవారు.

ఆయన తనే స్వయంగా అంతా చేసి మేం చేసినట్లు మమ అనిపించేవారు. అలా బతికి పోయేం.

కథల వర్క్‌షాప్ అనగానే నాకదే గుర్తొస్తుంది మొదట.

రచనలు చేయడం అనేది ఒక సృజనాత్మకమైన కళ కదా.. అది నేర్పించడమేంటి – మనకున్న గొప్ప గొప్ప రచయితలు ఎక్కడ క్లాసుల కెళ్ళి ఈ విద్య నభ్యసించారు.

పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఎందుకు కథ రాయడంలో కృతృత్యులు కాలేకపోయేరు. చాల తక్కువ చదువులో కొందరెందుకు అద్భుతమైన కథలు రాశారు!

ఒక పెద్దిబొట్ల సుబ్బరామయ్యగారు, కొడవటిగంటి గారు, ఇచ్ఛాపురం జగన్నాధ శర్మగారు, రావి శాస్త్రి, బీనాదేవీ గార్లు ఇలా చాలా మంది పెద్ద కథకులకి ఎవరు రాయడం నేర్పించారు!

ఒక ఆటోవాలా చంద్రకుమార్ ఆటోలో కూర్చుని అప్పుడప్పుడూ ఖాళీ సమయాల్లో రాసిన ‘లాకప్’ నవల ‘విసారణై’ పేరుతో సినిమాగా మారి తమిళనాడులో విజయ ఢంకా మోగించి జాతీయ బహుమతిని గెలుచుకుంది. అనేక యితర దేశాలకి నామినేట్ అయి బహుమతులు సంపాదించింది. అతనేం చదువుకున్నాడో ఏ డిగ్రీలు వున్నాయో తెలియదు. అతనిలోని సృజనాత్మకత, పరిశీలనా దృష్టి అలాంటివి!

ఎంతో సాహిత్యాన్ని ఔపాసన పట్టిన వారంతా ఉత్తమ కథకులు కాలేరు. వారు కథ ఇలా వుండాని అలా వుండాలి, ఇది కథ కాదు అది మాత్రమే కథ అని విశ్లేషించగలరు!

నిజానికి కథ గొప్పదని చెప్పడానికి కొలమానమేమీ లేదు. కొన్ని కథలు న్యాయనిర్ణేతల చేతిలో పడి అప్పటి వడపోతలో మంచి కథగా నిర్ణయింపబడతాయి. బహుమతులు గెలుచుకుని గుర్తింపుని పొందుతాయి.

సాదా సీదాగా ఎన్నో ఉత్తమ కథలు మనకు తారస పడుతునేవుంటాయి.

ఒక్కోసారి ఎవరి రచనైనా చదివినప్పడు మనకి అందులోంచి మరో సరికొత్త ఆలోచన పుట్టుకొచ్చి మరో కొత్త కథగా రూపాంతరం చెందుతుంది.

కొందరు కొన్ని విషయాల్ని మాత్రం సమగ్రంగా రాయగల్గుతారు. వారికి వాటి పట్ల అభిరుచి, అవగాహన వుంటుంటాయి.

ఇన్ని కథలు రాసి మంచి రచయిత్రినని పేరు తెచ్చుకున్న నేను కూడా కొంతమంది రచనలు చదివినప్పుడు నేను చాలా సిగ్గుపడుతుంటాను. వారి భావోద్వేగం, అవగాహన, చెప్పే తీరు, పదల అల్లిక ఎంతగానో ముగ్ధుల్ని చేస్తాయి. ‘అలా ఒక్క కథ రాసినా చాలు’ అనిపిస్తుంది.

‘అసలు మనమిప్పుడు రాసి ఉద్ధరించేదేముంది, ఉత్తమ సాహిత్యాన్ని చదివి ఆనందిస్తే పోలే!’ అనిపిస్తుంది కూడ.

నాకు నేను అనుకునేదేమిటంటే ఎవరి కథయినా సరే పేరు చూడకుండా ఆమూలాగ్రం చదివింపజేయాలి! కథ ముగించాకా ఎవరబ్బా ఇంత మంచి రచన చేసారూ! అనిపించి పేరు చూడగల్గాలి! అలాగే మొదలు పెట్టగానే ఆ తర్వాత ఆ రచన ఏ బలవంతం లేకుండా, ఎలాంటి మొగమాటాలు లేకుండా మనల్ని అందులోకి దానంతట అదిగా తీసుకుపోయి చదివింప చేయగల్గాలి! ఆ సింపుల్ టెక్నిక్ చాలు మనసుని హత్తుకుని మంచి రచన అనిపించడానికి అనుకుంటాను.

శ్రీశ్రీగారన్నట్లు ఏదీ రచనకి అనర్హం కాదు, చెప్పే సత్తా వుంటే.

అయితే నేను రేపు సుగుణకేం చెప్పాలి!

నువ్వు రాయగలవు అనా.. రాయలేవనా!

రాయలేవనడానికి నేనెవర్ని!

ఏ కలంలో ఏ పదునుందో!

నా సర్వీసులో ఈ పరిస్థితి నాకేం కొత్తది కాదు. వర్ధమాన రచయితలు వచ్చి తమ రచనల్ని చూపించి మన సలహా కోరడం మన గుర్తింపుని ఆశించడం!

అలా ఆలోచిస్తూ ఆటోలో ఆఫీసుకి వెళ్తుంటే దారిలో పూల కొట్టొకటి కనిపించింది. అందులో ఒకబ్బాయి అతి లాఘవంగా వేళ్ళని మిషన్‌లా కదిలిస్తూ పూలమాల కడుతున్నాడు. అతని చేతులు ఏ మాత్రం ఆలోచించకుడా ఎదురుగా కుప్పగా పోసిన మల్లెల్ని కనకాంబరాల్ని, మరువాన్ని ఎక్కడెలా అమర్చాలో అమరుస్తూ చక చకా దండ అద్భుతంగా కడుతున్నాడు. చక్రంలా వున్న ఆ దండని చూస్తుంటే నా కర్థమైంది మంచి రచన ఎలా చెయ్యాలో!

Exit mobile version