మనసులోని మనసా-30

0
3

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]అ[/dropcap]ప్పుడు నాకు సరిగ్గా పందొమ్మిది సంవత్సరాలు. ఒక రాత్రి నేను ఏనుగెక్కి వూరేగుతున్నట్లు కలొచ్చింది.

ప్రొద్దుట లేవగానే కల గుర్తొచ్చి నాకు పరమ సంతోషం వేసి అమ్మ దగ్గరకి వెళ్ళి “అమ్మా, అమ్మా, నాకు ఏనుగెక్కి వూరేగినట్లు కలొచ్చింది” అని చెప్పేను చాలా సరదాగా.

మా అమ్మ వంటగదిలో బిజీగా వున్నారు.

“ఇప్పుడు కొత్తేముంది. చిన్నప్పుడే ఊరేగేవుగా!” అని అమ్మ నిర్లక్ష్యంగా అంది.

ఇంకాసేపక్కడే నిలబడితే “అమ్మ ఊరేగిస్తుందిలే” అని మా అక్క వెక్కిరించిది. అమ్మ అన్నది నిజమే!

చిన్నతనంలో నేను చాలా సార్లు ఏనుగెక్కి తిరిగిన మాట వాస్తవం.

ఆ సంగతి నా చిన్నతనం గురించి రాసిన ‘చిగురాకు రెపరెపలు’లో రాశాను.

ఆయితే ఆ పుస్తకం చదవని వారికి యిక్కడ ఆ విషయం చెబుతాను.

మా పెదనాన్నగారు నర్సీపట్నంలో పోలీసాఫీసర్‌గా పని చేస్తున్న రోజుల్లో ఆ చుట్టుపక్కల వున్న దట్టమైన అడవుల్లోకి వెళ్ళడానికి ఏనుగుని యిచ్చారు. శెలవులకి మేం పెదనాన్నగారింటికి వెళ్ళేవాళ్ళం. అమ్మానాన్నకి మాతో రావడానికి వీల్లేకపోతే పెదనాన్న మా కోసం ఒక కానిస్టేబుల్‌ని పంపేవారు. పేరుకి పోలీసాఫీసరు అయినా పెదనాన్న చాలా సున్నితమనస్కులు. రూపురేఖలూ అంతే. హిందీ నటుడు బల్‌రాజ్ సహానీలా వుండేవారు. ముఖ్యంగా పిల్లల్ని చాలా ప్రేమించేవారు. పిల్లల్లో పిల్లల్లా కలిసి ఆడిపాడేవారు. ఆ రోజుల్లో వచ్చిన కొన్ని హిందీ సినిమాల కథలు మాకు చెప్పేవారు. ఎప్పుడూ హిందీ పాటలు వింటూ వుండేవారు.

సరే – ఏనుగు సంగతి కొస్తాను. రోజూ ఏనుగు మీద వెళ్ళరు కదా! ఏనుగుశాల పెద్దనాన్నగారి క్వార్టర్స్‌కి ఎదురుగా కాస్త దూరంగా వుండేది. మా యింటి వరండాలో కూర్చుని వుంటే ఏనుగు తొండంతో ఈగల్ని దోమల్ని తరమడం, చెవులూపడం కనిపిస్తుండేది. ఎప్పుడో సర్కస్‌లో దూరం నుండి చూసి సంబరపడే మాకు ఏనుగుని అలా దగ్గరగా చూడగల్గడం ఒక అదృష్టమే అని చెప్పాలి.

రోజూ రెండు పూటలా ఏనుగుని మా యింటికి ఆహారం పెట్టడానికి తీసుకొచ్చేవాడు మావటి. ఏనుగు వచ్చే టైంకి మేమంతా మెట్ల మీద సర్దుకుని కూర్చునే వాళ్ళం. ఏనుగు రాగానే మావటి ‘బార్ సలాం’ అనేవాడు. అది తొండం ఎత్తి సలాం చేసేది. మావటి గడ్డిని గిన్నెల్లా చుట్టి అందులో బియ్యం పోసి ఏదో (అరగడానికేమో) మందు వేసి తొండానికి అందించేవాడు. ఏనుగు అది నోట్లో పెట్టుకు తినేది. అలా అతను ఏనుగు తినవలసిన ఆహారం పెట్టడం పూర్తవ్వగానే మేం స్టోర్ రూమ్‌లోకి పరిగెత్తి చెరకుగడలు, వెలగపళ్ళు, నారింజ – ఒకటేమిటి అక్కడ ఏజెన్సీలో దొరకే పళ్ళని తెచ్చి ఏనుగు తొండానికి అందించే వాళ్ళం. ఏనుగు వాటిని తింటుంటే మాకు చాలా సరదాగా వుండేది.

ఆ తర్వాత మావటి మమ్మల్నిందర్నీ ఏనుగెక్కించే వాడు.

ఏనుగు తన ముందు కాలుని మెట్లలా వంచేది. దాన్ని ఆధారం చేసుకుని దాని మెడలో గంటలు పట్టుకుని ఏక్కేవాళ్ళం. లేదా అది కూర్చుంటే, ఒక స్టూల్ వేసుకుని ఏక్కేవాళ్ళం. అయితే ముందు కూర్చోవడానికి అందరూ జంకేవారు. కారణం దాని మెడకండరాలు. అది నడుస్తుంటే కదులుతూ వుండి మనం పడిపోతామనే భ్రాంతి కలిగిస్తుంది. అది కాక దాని మెడ మీద దాని శరీరం నుండి ఒక రకమైన జిడ్డు పదార్ధం వుద్భవిస్తుంది. అది కూడ చిరాకు కలిగిస్తుంది. నేనొక్కర్తినే ధైర్యంగా దాని మెడలో బలంగా కట్టిన తీగెల్ని పట్టుకుని కూర్చునేదాన్ని. ఆ తీగెలకి గంటలు, వెదురుతో చేసిన పూసలు వుండేవి. అది నడుస్తున్నప్పుడు ఆ కండరాలు కదిలి ‘పడిపోతామా’ అని భయాన్ని కలిగిస్తుంది. దాని చెవులు మనకి తగలుతూ గగుర్పాటు కలిగిస్తాయి. నా కప్పుడు అయిదారు సంవత్సరాల వయసే కాబట్టి నిజంగా భయంగానే వుంటుంది. కాని చిన్న తనం నుండి ఎడ్వంచర్స్ చేయాలన్న ఆసక్తి వుండడం వలన బింకంగా కూర్చునే దాన్ని.

మావటి ఏనుగుని నర్సీపట్నం దాపుల వున్న అడవుల్లోకి తీసుకెళ్ళేవాడు. అది కొన్ని కొమ్మల్ని ఆహారం కోసం విరిచేది. వాటిని మావటి తీసుకుని నడిచేవాడు. ఒక్కోసారి దాన్ని చెరువుకి స్నానానికి తీసుకెళ్ళేవాడు. మేం దిగి ఒడ్డున కూర్చుని అది తొండంతో నీళ్ళు వెదజల్లుతుంటే వినోదంగా చూసే వాళ్ళం. ఒక సారి నేను మా కాంపౌండ్‌ లోని తాడి చెట్లు క్రింద తేగల కోసం తవ్వుతుంటే మా అన్నయ్య ఏనుగుని బెదిరించాడు. అది కోపంతో గ్రవుండంతా పరిగెత్తింది. అప్పుడందరూ నేను చచ్చిపోయాయని బెదరిపోయారు. ఏనుగు నా మీదగా పరిగెత్తింది. అదృష్టవశాత్తు అది నన్ను తొక్కకపోవడం వలన ఆ సంగతులు మీకిప్పుడు చెప్పగల్గుతున్నాను.

అలా శెలవులకి వెళ్ళినప్పుడన్నా ఏనుగు మీద వూరేగే అదృష్టం మాకు కల్గింది.

మాచర్లలో నేను ఇంటూ ఫస్ట్ ఫామ్ పరీక్ష రాసి 6th క్లాసులో జాయినయ్యేను. అప్పుడు నాకు సరిగ్గా ఏడేళ్ళు. ఆ పరీక్షేమిటో ఆ కథేమిటో కూడ నాకు సరిగ్గా తెలియదు. అంతదాకా చదవంతా ఇంట్లోనే.

అప్పుడు మాకు హిందీలో ‘హాథీ’ అనే పాఠం వుంది.

మా హిందీ మాస్టారు శ్రీవైష్ణవులు. నల్లగా పెద్దనామం పెట్టుకుని వెనుక ముడి వేసుకుని పెద్ద షాల్ కప్పుకుని దాన్ని విలాసంగా వూపుకుంటూ క్లాసుకొచ్చేవారు. ఆయన్ని చూస్తే హడల్ మాకు. చాలా సీరియస్‌గా వుండేవారు. ఆయనకి అందరం లేచి నిలబడి సాధ్యమైనంత గట్టిగా “నమస్కారం మాస్టారు గారూ!” అని చెప్పాలి. లేకపోతే మన పని అయిపోతుంది.

మాస్టారుగారు హాథీ పాఠం చెప్పబోతూ “ఏరా, మీలో ఏనుగుని ఎవరన్నా చూశారా” అని అడిగారు.

క్లాసులో ఏనుగుని చూసిన వారెవరూ లేరు.

మాచర్ల అప్పటికి చాలా వెనుకబడిన పలనాడు ప్రాంతం. సర్కస్ వచ్చిన దాఖలాలు కూడా లేవు.

అందరూ “లేదు సారూ” అని ముక్త కంఠంతో అరిచారు.

నేను మాత్రం లేచి నిలబడ్డాను.

ఆయన నా వైపు తిరిగి (ఆడపిల్లల బెంచీ పక్కకి వేసి వుండేది) “ఎక్కడ చూశావ్?” అని అడిగారు.

“చూడ్డమే కాదు, ఎక్కాను సార్!” అన్నాను సంబరంగా.

ఆయన నా వైపు చాలా వెటకారంగా చూసి “ఎక్కేవా? రాత్రిగాని కలొచ్చిందా?” అన్నారు హేళనగా.

నాకు చాలా పౌరుషమొచ్చేసింది.

కానీ ఏమీ అనలేక కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి.

అప్పటికీ యిప్పటికీ అంతే! ఎదుటి వారిని ఏమీ తొందరపడి అనలేను. కాని బాధ పడతాను. దాన్ని భరించడంలో కళ్ళు నీళ్ళతో నిండిపోతాయి. ఎవరన్నా అవమానిస్తే చాలా విలవిలలాడిపోతాను. అందుకే నేను చాలా విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తపడతాను. నాకు నచ్చకపోతే వాటి జోలికి పోకుండా వదిలేస్తాను.

అందుకే మాస్టారుగారి మాటకి దుఃఖమొచ్చి కూర్చుండిపోయాను.

ఇంటికొచ్చాక మా నాన్నకి చెప్పేను.

“పోనీలే! నువ్వేం అబద్ధం చెప్పలేదు కదా!” అని వూరడించారు.

ఇప్పుడిన్నాళ్ళకి ఏనుగు మీద వూరేగిస్తున్నట్లు కలొచ్చింది.

ఆ కలని గుర్తు చేసుకుంటుంటే భలే థ్రిల్‌గా అనిపించింది.

‘ఇది నిజంగా ఏనుగు మీద వూరేగించినట్లు తెగ సంబరపడిపోతున్నదే’ అని మా అక్కే చెల్లెళ్ళు ఒకటే నవ్వు!

సరిగ్గా ఆ కల వచ్చిన వారంలో నాకొక లెటర్ వచ్చింది. మా నాన్నగారు ఆ వుత్తరం తెచ్చి నాకిస్తూ “నీకో గుడ్ న్యూస్‌ రా! నీ కల వృథా పోలేదు. నిన్ను కొవ్వూరు రోటరీ క్లబ్బు వారు ఆనర్ చేస్తారుట. ఆహ్వనించారు” అని చెప్పేరు. నేను తెల్లబోయేను. ఆ వుత్తరం పదే పదే చదివాను. నిజంగానే నన్ను ఆహ్వానించారు. అక్కడ నేను ప్రముఖ చిత్రకారుడు శ్రీ దామెర్ల రామారావుగారి గురించి మాట్లాడాలి. రోటరీ క్లబ్బు అంటే అందరూ లాయర్లు, డాక్టర్లు – ప్రొఫెసర్లూ – అందరూ విద్యాధికులే. వీళ్ళు వయసులోనూ, విద్యలోనూ అతి చిన్నదాన్ని నన్ను పిలవడమేంటి – “అమ్మో నేను వెళ్ళను నాన్నా!” అన్నాను.

మా నాన్నగారు నాకు ధైర్యం చెప్పారు. “వాళ్ళు ఆషామాషీ మనుషులు కారు. చాలా విద్యావంతులు. నీలో ఏదో ప్రతిభ చూసి పిలుస్తున్నారు, వెళ్ళు” అని ప్రోత్సహించారు.

అయినా భయమే.

నా కసలే స్టేజ్ ఫియర్.

నేను నా పదహారో ఏట నుండే కథలు రాస్తున్నాను. అందకు ముందు రాసినా పబ్లిష్ అవ్వడం అప్పటి నుండే. కొన్ని చిన్నపాటి మేగజైన్స్ మీద కవర్ పేజీకి బొమ్మలు వేస్తుండేదాన్ని. కాని ఆ మాత్రానికే వీళ్ళు నన్నెందుకు ఆహ్వనించారో అర్థం కాలేదు.

చివరకి లైబ్రరీ నుండి దామెర్ల రామారావు గారి గురించి కొన్ని పుస్తకాలు సేకరించి నోట్సు ప్రిపేర్ చేసుకుని మా అమ్మగారిని తీసుకుని ‘రాజు వెడలె రవి తేజముతో’ అన్నట్లు వెళ్ళాను.

వాళ్ళు అత్యంత మర్యాదతో మమ్మల్ని స్టేషను కొచ్చి తీసుకెళ్ళి ఒక లాయర్ గారింట్లో బస ఏర్పాటు చేస్తారు.

సభలో అందరూ నన్ను చూసి ముసుముసిగా నవ్వుకున్నారు. అందరూ తలలు పండిన మేధావులు. వాళ్ళకి నేనేం చెప్పాలి. నేనేం నిష్ణాతురాలయిన చిత్రకారిణిని కాదు.

వాళ్ళు నన్ను సభకి పరిచయం చేస్తూ “ఈ రోజు మనం ఆహ్వనించిన అమ్మాయి వయసులో చాలా చిన్నది. మీరేం ప్రశ్నలు వేసి వేధించకండి” అని సభకి పరిచయం చేసేరు. నేను ముక్కున పెట్టుకున్న విషయాలు నాలుక పిడచ కట్టుకపోతుంటే గడగడా చెప్పేసేను. వాళ్ళు మెచ్చుకోవాలని, మెచ్చుకుని నాకో షాల్ కప్పి రోటరీ క్లబ్బు వారి మెమెంటో ఒకటిచ్చి అమ్మకి నాకు మంచి పట్టు చీరలు పెట్టి గౌరవించారు. మర్నాడు అందరూ వాళ్ళంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించారు.

అలా నా మొదటి సన్మానం ఘనంగా జరిగింది.

ఇంటి కొచ్చాక మా అమ్మగారు మా నాన్నగారితో చెప్పి కాకినాడలో ఒక జ్యోతిష్య పండితుడు నా జాతకం చూసి చెప్పిన మాట గుర్తు చేసుకుని నవ్వారు.

ఒక్కసారి మా అమ్మగారు నన్ను ఒక జ్యోతిష్యుడి దగ్గరికి తీసుకెళ్ళేరు నేను మెడిసిన్ చదువుతానో లేదో తెలుసుకోవడానికి. ఆయన చాలా గంభీరంగా ఎత్తుగా తెల్లగా అడ్డనామాలతో నదుట మెరుస్తున్న కుంకుమతో గౌరవభావం, భయం కలిగించేలా వున్నారు.

ఆయన నా చెయ్యి చూసి ‘ఈ అమ్మాయి డాక్టరూ అవ్వదూ, ఏక్టరూ అవ్వదు. ఈ అమ్మాయి సభలూ, సమావేశాల్లో గౌరవ మర్యాదలు పొంది ఖ్యాతికెక్కుతుంది’ అంటూ ఏవేవో చెప్పారు.

గౌరవ మర్యాదల సంగతెలా వున్నా నే డాక్టరవ్వనని ఆయన చెప్పడం నాకు చెప్పలేని సంతోషం కల్గించింది.

ఇంటికి తిరిగొచ్చేక మా సిస్టర్స్ నా చీరని, మెమెంటోని చూసి మూతులు తిప్పుకుంటుంటే నేను కాలరెగరేసేను గర్వంగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here