మనసులోని మనసా-31

0
3

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]బొ[/dropcap]మ్మలు వేసే ప్రక్రియ నాలో ఏయే విధముల దినదినాభివృద్ధి చెందిందో, దాని వలన నాకు కలిగిన లాభ నష్టాల్ని బేరీజు వేసుకుంటూ పడుకున్నాను.

లాభనష్టాల కన్నా ఏవో కొన్ని మంచి చెడు జ్ఞాపకాలు మాత్రం మిగిలిపోయి వున్నాయి.

దానిమ్మ పూలు, ఆకుపసర్లు, చంద్రవంక నదిలో దొరికిన రంగురంగు గులకరాళ్ళు యిత్యాది ముడిసరుకులతో ప్రారంభమయి, నీటి రంగులు, పెన్సిళ్ళు, ఆయిల్ పెయింట్లు, ఫేబ్రిక్ పెయింట్స్ దాకా నా స్వయం కృషితో గురువుల జోక్యాలు లేకుండా – నే చేసిందే అద్భుతం అన్నట్టు నన్ను నేను తీర్చిదిద్దుకున్నానని చెప్పడానికి కడు ఆనందపడుతున్నాను.

అసలు బొమ్మలు వెయ్యాలని ఎందుకనిపించిందో – అందులో నే పొందిన ఆనందం ఏమిటో తెలియదు కాని ఎమ్మెస్ పెయింటింగ్ దగ్గర నా విద్య ఆగింది.

చిన్నప్పుడు ఎంతో సరదాగా అదే పనిగా వేస్తున్న నన్ను చూసి అందరూ ముచ్చటపడేవారు. క్లాసులో తమ నోట్ బుక్ ‌లిచ్చి వెనుక పేజీలో ‘ఒక బొమ్మ వేసిపెట్టవే ప్లీజ్!’ అని తోటి క్లాస్‌మేట్స్ అడిగినప్పుడు తెగ మురిసిపోయి వేసిపెట్టేదాన్ని.

చివరికదెలా తయారయ్యిందంటే వాళ్ళ సైన్సు బొమ్మలన్ని నా మొహాన పడేసేవారు. జీర్ణకోశాలు, శ్వాసకోశాలు వేసి వేసి నా శ్వాస ఆగిపోయే పరిస్థితి దాపురించింది.

వెయ్యనని చెబితే అలకలు – చెప్పకపోతే చేతినొప్పులు – అసలు చెప్పడానికి పీక నొక్కేసేనంత మొగమాటం – అలా రోజురోజుకి జీవితం దుర్భరంగా తయారయ్యింది.

ముఖ్యంగా ఆ ఫిజిక్స్ లోని త్రాసులు గట్రా జీవం లేని బొమ్మలు వేయాలంటే చిర్రెత్తుకొచ్చేది. నా మొహాన పుస్తకాలు పడేసి వాళ్లంతా గ్రవుండ్‌లో కేరింతలు కొడుతూ ఆడుకుంటుంటే వెళ్ళి పడేసి తన్నాలంత కోపం వచ్చేది. అయినా నేను ‘వెయ్యను’ అని చెప్పలేక ‘బ్రతుకే నేటితో బరువయిపోయెలే’ ఇత్యాది డొక్కు పాటలు గుర్తు చేసుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ వేసి పెట్టేదాన్ని.

పెద్దయినా ఈ బాధలు నాకు తప్పలేదు. ఒకసారి నా క్లాస్‍మేట్, బెంచ్‌మేట్, హౌస్‌మేట్ అయిన జిగ్రీ దోస్త్… నన్నొక బొమ్మ వేసి పెట్టమని కోరింది. అది నా ఇష్టమైంది కాబట్టి ఎంతో  ముచ్చటగా నా దగ్గరున్న రంగుల పెట్టెలోని రంగులు వుపయోగించి వేసిపెట్టేను. తీరా అది దాని పేరు రాసుకుని ఏదో పోటీకి పంపి బహుమతి సంపాదించిందని తెలిసి కొంచెం తెల్లబోయినా, ఆ బహుమతి నాకే వచ్చినట్లుగా సంబరపడి లోలోపల కూడా ఏడవకుండా తేలిగ్గా తీసుకున్నాను.

కాలేజిలో చదివేటప్పుడు మా కజిన్ ఒకర్తి వాళ్ళ కాలేజీలో ఏదో పోటీ వుందని బొమ్మలు కలెక్ట్ చేసి ప్రదర్శిస్తే ఏదో బహుమతి ఇస్తారని చెబితే నేను – మా అక్క మేం వేసిన బొమ్మలన్ని యిచ్చేం. తీరా చేసి అది మా పేరు తుడిచేసి చక్కగా తన పేరు రాసుకుని బహుమతి సంపాదించింది. చేసేదేముంది – అది కజిన్ కదా! మా అక్కా నేను మెటికలు విరుచుకుని వూరుకున్నాం.

టెక్నికల్ స్టడీస్‌లో వేయాల్సిన డ్రాయింగ్స్ నా కసలు నచ్చేవి కావు. మనసుకి చాలా విరుద్ధంగా ఆర్టు పేపర్ మీద ఇండియన్ ఇంకుతో అయిసోమెట్రిక్ వ్యూస్ (Isometric Views) వేసి రికార్డును అందంగా తీర్చిదిద్దేదాన్ని. లాభం ఏముంది! క్లాస్‌మేట్స్ అందరూ తోచక సరదగా వాళ్ళున్న హాస్టల్‌కి (హాస్టల్ కూడా మా యింటి దగ్గరే) వెళ్తే, “శారదా శారదా మా తల్లివి కదూ, నా రికార్డులో బొమ్మలు వేసిపెట్టవే” అంటూ నా మొహాన కొట్టి… నాకు ఫిల్టర్ కాఫీ యిష్టమనే నా వీక్‌నెస్ కనిపెట్టి వేడి వేడిగా కాఫీ తెచ్చి నా మొహాన కొట్టి వాళ్ళు పోయి ‘తైరంగా’ అని ఆడుకునేవారు. అలా వాళ్ళిచ్చిన కాఫీలు భవిష్యత్తులో నాకు అల్సర్ రావడానికి దోహదపడ్డాయని డాక్టర్ చెప్పింది.

అయితే బొమ్మల పిచ్చి నన్నే మాత్రం వదలలేదు.

యువ దీపావళి సంచికలో ప్రముఖ చిత్రకారులు వడ్డాది పాపయ్య గారి బొమ్మలన్నీ చింపి, జాగ్రత్త చేసుకొని, నేను మా అక్క వాటర్ కలర్స్‌తో వేసేవాళ్ళం. అలాగే జె.పి. సింఘాల్ పెయింటింగ్స్ ఆయిల్ పెయిటింగ్స్‌తో చెక్కల మిద నిర్మల్ పెయిటింగ్స్‌లా వేసేవాళ్ళం. అయితే ఆ బ్యాక్‌గ్రౌండ్ అంత నునుపుగా మెరుస్తూ ఎలా వస్తుందో అర్థమయ్యేది కాదు.

ఇలా వేస్తు వేస్తూ వుండగా ఒకసారి ఎవరో మా ఇంటికి వచ్చి మా పెయింటింగ్స్ చూసి, “నిన్నో చోటకి తీసుకెళ్తాను, సాయంత్రం రెడీగా వుండు” అని మా అమ్మగారి పర్మిషన్ తీసుకొని నన్ను ఒకరింటికి తీసుకెళ్ళేరు. తీసుకెళ్ళేటప్పుడు నేను రాసిన కథలు, బొమ్మలు పట్టుకురమ్మన్నారు. అంటే నన్ను మంచి చోటకే తీసుకెళ్తున్నారని నేను ఆనందంగా సదరు సరుకు మూటగట్టుకుని ఆయన వెంబడి వెళ్ళేను. అప్పుడు మా నాన్నగారు గుంటూరులో జాబ్ చేస్తున్నారు. నాకు ఆ అడ్రస్ సరిగ్గా గుర్తు లేదు కాని సాయంత్రం కను చీకటి వేళ ఆ యింటి టెర్రస్ మీదకి మేం వెళ్ళేసరికి అక్కడ కొన్ని కుర్చీలు వేసి, చాపలు పరచి వున్నాయి. ఒకామె ఎదురొచ్చి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. నన్ను తీసుకువెళ్ళిన ఆయన “ఈ అమ్మాయి పేరు శారద, కొద్దిగా కథలు రాస్తుంది – బొమ్మలు కూడ వేస్తుంది” అని చెప్పేరు. ఆవిడ నన్ను కూర్చోబెట్టేరు. ఆవిడ పేరు జయప్రద. డాక్టరుగా పేరున్న వ్యక్తని తెలుసుకున్నాను. ఇంతలో ఒక నడివయసు వ్యక్తి పంచె కట్టుతో, కొద్దిగా పలచని జుట్టు, కళ్ళద్దాలతో డాబా మీదకి వచ్చారు. ఆయన రాగానే అందరూ లేచి నిలబడ్డారు. నేను నిల్చుని తెలియకపోయినా నమస్కరించాను. ఆయన నన్ను చూసి చిరునవ్వు నవ్వారు. బహుశా అక్కడున్న అందరిలో నేనే చిన్నదాన్ని కావచ్చు.

ఆయన సాహిత్యం గురించి, చిత్రలేఖనం గురించి చాలా ప్రసంగించారు. చాలా నిదానంగా, ప్రశాంతంగా ఆయన చెప్పే విషయాలు కొన్ని నాకు అర్థమయ్యేయి, మరికొన్ని కాలేదు. సమావేశం ముగిసేక అందరూ వెళ్ళిపోతుంటే ఆయన నన్ను దగ్గరికి పిలిచేరు. పేరు, వివరాలు అడిగారు. నా కథలు తీసుకుని చదువుతూ నా బొమ్మల్ని చూసేరు. చాలా సంతోషిస్తూ “అభివృద్ధిలోకి వస్తావు. మా సమావేశాలకు వస్తుండు” అని చెప్పేరు. ఆయన ప్రముఖ చిత్రకారుడు, రచయిత శ్రీ తుమ్మపూడి సంజీవదేవ్ గారు.  నిజానికి అప్పటికి నా కాయన గురించి ఏమీ తెలియదు. ఆయన రచనలు నాకు కొన్ని యిచ్చేరు. వాటిని యింటికి తెచ్చుకుని పదే పదే చదువుతుండేదాన్ని. అలా కొన్ని మీటింగ్స్‌కి వెళ్ళేదాన్ని. ఆయన నన్నొక ప్రత్యేక వాత్సల్యంగా చూడటం నాకు బాగా గుర్తుంది. చాలా చల్లని చూపులవి. ఆయన మ్యూజింగ్స్ అంటే నాకు ప్రాణంగా వుండేది. ఉత్తరాలు కూడా రాసేవారు. తర్వాత తర్వాత మా అమ్మగారి వలన వెళ్ళడానికి కుదరలేదు. రాత్రి లేటవుతున్నదని ఆవిడ పెట్టిన నిబంధనల వలన మానుకున్నాను.

కాని ఆయన నాకు పోస్టులో బుక్స్ పంపుతూనే వుండేవారు. ఇప్పుడందరూ ఆయన గురించి రాస్తుంటే చదివి ఆ స్నేహాన్ని, వారి ఆత్మీయతని కోల్పోయినందుకు బాధ కలుగుతుంటుంది.

నా చదువయిపోయాక నాకు వెంటనే హైదరాబాదులో జాబ్ వచ్చింది. కాని మేం ఎక్కడ వుంటే అక్కడే జాబ్ చేయాలి, పెళ్ళి అయ్యేవరకు విడిగా పంపమని మా తల్లిదండ్రులు పెట్టిన నిబంధనకి ఏడుస్తునే అంగీకరించి (అంగీకరించకపోతే తాట తీస్తారు) ఇంట్లో బొమ్మలు విరివిగా వేసి పారేస్తున్న తరుణంలో ఒకరోజు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ నుండి ఒక కార్డు వచ్చింది. అది మా నాన్నగారు తెచ్చిస్తూ, “ఇది నీకు పనికిరాదు రా, ఏదో ఆర్టిస్టు కమ్ డ్రాఫ్ట్‌మన్ పోస్టట” అన్నారు. నేను కూడా చూసి పక్కకి పెట్టేను.

ఆ మర్నాడు నాన్న ఆఫీసులోకి వెళ్ళిపోయేక ఆలోచించాను. ఆర్టిస్టు అన్న పదం నన్నాకర్షించింది. ఆ ఆనందంతో నేను ఎవరికీ చెప్పకుండా తయారయి మెట్లు దిగి ఆ కార్డు, నా సర్టిఫికెట్స్ తీసుకుని ఎంప్లాయిమెంట్ ఆఫీసుకి వెళ్ళిపోయాను. ఆ ఆఫీసు మా వీధి కవతల వీధిలోనే హిందూ కాలేజి పక్కన.

నా పేరు పిలవగానే ఎంప్లాయిమెంట్ ఆఫీసరు ఛాంబర్ లోకి వెళ్ళి నమస్కరించాను. ఆయన నడి వయసు వ్యక్తి. సఫారీ డ్రెస్సు వేసుకున్నారు. నా సర్టిఫికెట్స్ చూస్తు, “ఏంటీ ఈ పోస్టు కొచ్చేవ్? నువ్వు ఇంజనీరింగ్ చేసి” అన్నారు.

“మీరే కదా సార్, మరి ఈ కార్డు పంపింది!” అన్నాను వినయంగా.

ఆయన నా వంక తేరిపార జూసి, “ఓహో, తప్పు మా మీదే తోసేస్తున్నావా! ఇదేం తమాషా కాదమ్మాయ్!  బొమ్మలు వేయాలి, తెలుసా బొమ్మలు!” అన్నారు బొమ్మలు అన్న పదాన్ని వత్తి పలుకుతూ.

నేనంతకన్నా వుత్సాహంగా “నేను వేస్తార్ సర్! నాకొచ్చు” అన్నాను, ఆ వుద్యోగం యింకెవరికన్నా పోతుందన్న భయంతో.

“అమ్మదొంగా! వుద్యోగం కోసం అబద్ధాలు చెబుతున్నావా?” అన్నారాయన నవ్వుతూ.

“లేద్సార్! మా యిల్లు యిక్కడే! ఇప్పుడే తెస్తాను. అప్పుడే వుద్యోగం ఎవరికీ యివ్వకూడదు మరి!” అన్నాను.

“అయితే పరిగెత్తు. ఇక్కడున్నట్లు రావాలి” అన్నారాయన నవ్వుతూ.

నేను నిజంగానే పరిగెత్తినట్లు ఇంటికి వచ్చి, మెట్లెక్కి టేబుల్ మీద బొమ్మలన్నీ చుట్టబెట్టుకుని “ఎక్కడికీ?” అని మా అమ్మగారు అడుగుతున్నా పట్టించుకోకుండా అదే స్పీడుతో ఎంప్లాయిమెంట్ ఆఫీసుకెళ్ళి ఆయనకు చూపించేను.

ఆయన వాటినన్నిటినీ చూసి తెల్లబోతూ నా వంక చూశారు. “నువ్వేదో వుద్యోగం కోసం అబద్ధాలు చెబుతున్నావనుకున్నా. నిజంగా అన్నీ నువ్వే వేసావా?” అని ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని ప్రకటిస్తు, “ఇదిగో ఇప్పుడే వెళ్ళు ఆ ఆఫీసుకి” అంటు నన్ను ఆ ఆఫీసుకి పంపించారు. ఆ ఆఫీసు ఫేమిలీ ప్లానింగ్ ట్రెయినింగ్ సెంటర్. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ క్రిందకి వస్తుంది. అక్కడ ఆఫీసర్ లేడీ. తమిళియన్. జస్ట్ రిటైర్‌మెంట్ ఎడ్జిలో వున్నారు. ఆవిడ నన్ను చూస్తూనే ఎంతో ఆప్యాయంగా పిలిచి కూర్చోబెట్టుకుని నా బొమ్మలు చూసి మురిసిపోయి ఫేకల్టీనంతా పిలిచి చూపించారు. అక్కడ స్టాఫంతా డాక్టర్లే. అందరూ చాలా అభినందించి నాకు వెంటనే పోస్టింగ్స్ ఆర్డరిచ్చారు.

ఇంటికొచ్చి మా నాన్నగారికి పోస్టింగ్స్ ఆర్డర్ చూపించగానే ఆయన, “అరె! నాకు చెప్పకుండా జాబ్ సంపాదించేసేవా!” అని నవ్వారు.

కాని ఆ అనందం నాకెంత కాలమో నిలవలేదు.

కారణం అక్కడ వేసిన ఛార్ట్స్ కూడా వైద్య సంబంధమైనవే! అయినా ఒక పది నెలల పాటు వేసాను. వాటిని చూసి అందరూ మెచ్చుకునేవారు. వారం వారం క్లాసులకి ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్లు, హెల్త్ విజిటర్స్, నర్సులు, హెల్త్ ఇన్‌స్పెక్టర్స్ బాచ్‌లుగా వచ్చేవారు. ఒకసారి మా ఆఫీసుకి ఇన్‌స్పెక్షన్‍కి వచ్చిన డైరక్టర్ ఆఫ్ మెడికల్ డిపార్ట్‌మెంట్ నన్ను వాళ్ళ ఆఫీసుకు డిప్యుటేషన్ మీద పంపమని మా జాయింట్ డైరక్టర్‌ని అడిగారు. ఆమె నిరాకరించింది. నేనూ వెళ్ళనని చెప్పాను.

వీరందరూ వుండటానికి మా బిల్డింగ్ పక్కనే మరో పక్కన హాస్టలుండేది. ఒకసారి మా ఆఫీసు సూపర్నెంటు అందులోకి ఫర్నిచర్ కొని వాటికి నెంబర్లు, పేర్లు రాయమని నన్ను అడిగేరు. వెంటనే నేను అఫెండ్ అయి ఆ జాబ్‌కి రిజైన్ చేసి మా జెడి బ్రతిమిలాడినా వుండలేదు. అలా ఆ ప్రహసనం ముగిసింది.

తర్వాత నేను తెలుసుకున్న దేమిటంటే వృత్తి, ప్రవృత్తి వేరుగా వుంటేనే మనకు థ్రిల్ మిగులుతుంది. ఉత్సాహం వుంటుంది. మనసులోని క్రియేటవిటి మిగులుతుంది.

మరోసారి ఫేబ్రిక్ పెయింటింగ్‌లో నేనెదుర్కున్న సమస్యలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here