[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]
[dropcap]మొ[/dropcap]న్నొకసారి ఎక్కడికో వెళ్ళి వస్తున్నాను.
ఒకమ్మాయి స్కూటీ మీద వెళ్తున్నది.
ట్రాఫిక్ చాలా ఎక్కువగా వుంది.
హైద్రాబాదులో నిర్మానుష్యంగా వున్న రోడ్లని అసలు ఊహించలేం. మాటి మాటికి ట్రాఫిక్‌తో వెహికల్స్ జామవుతున్నాయి.
పాపం – ఆ అమ్మాయి ఆగుతూ ముందుకు సాగుతుంది.
సిటీలో స్కూటీలు, కార్లు నడిపే అమ్మాయిలు చాలామందే వున్నారు. అదేం కొత్త విషయం కాదు.
ఒకతను కావాలని ఆమె వెనుక బండి నడుపుతూ, మాటి మాటికి హారన్ వేస్తూ ఆ అమ్మాయి దగ్గరగా తన బండి తీసుకెళ్ళి సడెన్ బ్రేక్స్ వేస్తూ వేధిస్తున్నాడు.
ఒక పక్క హెల్మెట్ – మరో పక్క వెహికల్‌ని మాటి మాటికి ఆపి నడుపుతూ వెనుక వ్యక్తి వేధింపులకి గాభరా పడుతూ వెనక్కి చూస్తూ నడుపుతుందా అమ్మాయి.
నాకు చాలా బాధగా, అసహనంగా అనిపిస్తోంది ఆ దృశ్యం చూస్తుంటే. దిగి ఒక్కటివ్వాలనిపించింది. కాని… హెవీ ట్రాఫిక్!
“చూడు… ఆ అమ్మాయిని వాడెలా సతాయిస్తున్నాడో… అందరూ చూస్తూ కూర్చున్నారు” అన్నాను కేబ్ డ్రైవర్‌తో.
బదులుగా అతను పళ్ళికిలించాడు.
అతనికి దాదాపు యాభయ్యేళ్ళుంటాయి. ఆ అమ్మాయంత కూతురుండొచ్చు. కాని ఆ క్షణం అతనికదేం గుర్తొచ్చినట్లు లేదు. రోడ్డు మీదకి రాగానే అతనొక పురుషుడు, హీరో మాత్రమే!
పరాయి ఆడవాళ్ళంతా చులకన చేసి ఏడిపించదగినవారే!
నాకు వళ్ళు మండింది కాని… చేసేదేమీ లేదు.
ఎక్కడా అమ్మాయికి ప్రమాదం జరుగుతుందోనని భయం భయంగా చూస్తూ కూర్చున్నాను. ఇంతలో కొద్దిగా ట్రాఫిక్ క్లియరైంది. నా కేబ్ ముందుకు సాగిపోయింది.
రోజూ యిలా ఎంతోమంది అమ్మాయిలు అవస్థ పడుతూ ఆఫీసులకీ, కాలేజీలకి వెళ్తుంటారు. తమ పిల్లలని స్కూల్స్‌కి వదలడానికి, తీసుకురావడానికి వెళ్ళకతప్పదు. రోజూ దినదిన గండంగా ఈ రద్దీలో తిరగడం ఒకెత్తు, ఇలాంటి ఆకతాయిల నుండి, వారు సృష్టించే ఆపదల నుండి తమని తాము రక్షించుకోవాల్సి రావడం మరొక ఎత్తు.
అలా ఆలోచిస్తుంటే నాకు నేను సర్వీసులో చేరిన కొత్తలో జరిగిన సంగతి గుర్తొచ్చింది. సీతమ్మధారలో వెళ్తున్నాను.
నేనున్న క్వార్ట్సర్స్ కూడ దగ్గరే!
ఆ ముందు రోజు వర్షం పడింది.
అంతా ఎర్రమట్టి కావడంతో రోడ్లన్నీ మన ప్రభుత్వం వారి దయ వలన మురికి గుంటలతో ఎర్రమట్టి నీళ్ళతో నిండి వున్నాయి.
వాతావరణం మాత్రం ఆహ్లాదంగా వుంది.
ఇంకా మబ్బులు ఎదురుగా వున్న కొండ మీదకు దిగుతూ, కొండల్ని తాకి జల్లకాయ కొట్టి పరిగెడుతూ వున్నాయి.
నేను వాటిని గమనిస్తూ ఆనందంగా సాగుతుండగా దబదబా శబ్దం వినబడింది.
దూరంగా సిటీ బస్సు వూగిపోతూ వస్తుంది.
క్లీనర్ ఆ బస్సు మీద దబదబా కొడుతూ, ఈలలు వేస్తూ వస్తున్నాడు.
నేను వులిక్కిపడి వెంటనే చాలా పక్కకి జరిగిపోయాను. కారణం అప్పుడవన్నీ ప్రయివేటు బస్సులు!
ఆ డ్రైవర్స్, క్లీనర్స్ ఎంత మిస్‌బిహేవ్ చేస్తారో నాకు తెలుసు!
కాని ఆ శాడిస్టు డ్రైవరు నేను చాలా పక్కకి వెళ్ళటం చూసి ఎదురుగా ట్రాఫిక్ లేకపోయినా నా పక్కగా దగ్గరికి బస్సు కావాలని నడిపి గుంటలోకి చక్రం పోనిచ్చి నడిపేడు!
అంతే!
ఎర్రటి వర్షపు బురద నీళ్ళు నిలువునా తల నుండి పాదాల వరకు చిమ్ముతూ నా మీద పడిపోయాయి.
ఆ రోజు నేను కట్టుకున్న తెల్లని ప్రింట్ వున్న తెల్లని సెమీ ఆర్గండీ చీర బురదతో నిండిపోయింది.
నేను షాకయి చూసేటప్పటికి డ్రైవరు, క్లీనర్ నవ్వుతూ బస్ నడుపుకుంటూ వెళ్ళిపోవడం కనిపించింది.
ఏడుపు ఆపుకుని, అవమానంతో నేను తల దించుకుని ఎవరి వైపూ చూడకుండా గబగబా యింటికి వచ్చేసేను.
వచ్చి తల స్నానం చేసి చాలాసేపు ఏడ్చేసాను.
నా సీట్లో అర్జెంట్ ఫైల్స్ వున్నాయి.
నా డివిజన్ పార్వతీపురం ఇ.ఇ.గారితో మా ఎస్.ఇ.గారి మీటింగ్ వుంది. అసలే మా ఎస్.ఇ.గారు చండశాసనుడు!
ఇవన్నీ తలచుకుని ఇంకాస్త ఏడ్చి నేను తిరిగి గబగబా ఆఫీసుకి వెళ్ళాను.
నా అదృష్టం కొద్దీ ఎస్.ఇ.గారు ఆఫీస్‌కి ఇంకా రాలేదు. కాని ఇ.ఇ.గారు వచ్చి ఎదురు చూస్తూ కూర్చున్నారు.
మా స్టాఫ్‌కి తెలిసి ఆ సాయంత్రం ఆ బస్సుని పట్టుకుని డ్రైవర్ని, క్లీనర్‌ని కొట్టినంత పని చేశారు.
అదంతా తర్వాత సంగతి!
ఆ క్షణం నేను పడిన వేదన వర్ణనాతీతం!
ఒకసారి ధవళేశ్వరంలో వున్న మా సిస్టర్‌ని చూడడానికి నేను, మిగతా సిస్టర్స్ అంతా వెళ్ళాం. రాజమండ్రికి దగ్గర కాబట్టి మేం ఎప్పుడూ ఆటోల్లోనే వెళ్తుండేవాళ్ళం. ఆ రోజు సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మాకు ఆటోలు దొరకలేదు.
చూసి చూసి చివరకి బస్సెక్కాం.
బస్సు ఖాళీగానే వుంది.
మమ్మల్ని చూడగానే అందులో ఒకతనికి చెప్పలేని నవ్వు వచ్చేసింది. దాని నిండా అవహేళన!
మేమంతా సింపుల్‌గానే వుండేవాళ్ళం!
కాలేజీ వరకు ఎంత ఫాషన్‌గా వున్నా, వుద్యోగాల్లోకి వచ్చేసరికి మేం చాలా సింపుల్‌గా కాటన్ చీరలు కట్టేవాళ్ళం. నగలు కూడ వేసుకునేవాళ్ళం కాదు.
ఆ నవ్వే అతను ఎక్కడో కూలీలా వున్నాడు.
వయసు ఏభయి పైనే వుంటుంది.
వెలిసిన పాలిస్టర్ షర్టు, నిక్కరు, నెత్తిన నాలుగు వెంట్రుకలు, బీడీ కంపు కొడుతున్నాడు.
వెకిలి నవ్వులు నవ్వుతూ, “ఏట్రా ఈ రోజు మన బస్సులో పెట్రమాక్సు లైట్లెలిగి పోతున్నాయి. బస్సు కలకలల్లాడి పోతంది గురవా! బస్సు నెమ్మదిగా తోలు” అని పిచ్చి వాగుడు మొదలుపెట్టాడు. మాకా వాతావరణం చాలా చికాకుగా, అసహనంగా అనిపించింది.
మా ఆఖరి చెల్లెలికి చాలా కోపం! అసలు సహించలేదు.
మేమే ఏమీ అనవద్దని వారించాం.
అయినా దాని మొహం ఎర్రబడిపోతున్నది కోపంతో.
బస్సు మేం దిగే చోటుకి వచ్చేవరకు అలా ఏదో ఒకటి వాగుతూనే వున్నాడు.
మేం బస్సు దిగగానే వాడు కిటికీ లోంచి “పాపలూ, బై” అన్నాడు.
అంతవరకూ అదుముకున్న కోపం ఒక్కసారి బరస్టయి, “ఒరేయ్, ఇంట్లో మొక్కలకి పాదులు తవ్వాలి రారా! సార్‌వి రెండు చొక్కాలిస్తాను” అంది మా చెల్లెలు.
వాడు తెల్లబోయేంతలో బస్ సాగిపోయింది.
ఇలాంటి సంఘటనలు ఎక్కడో అక్కడ అన్ని వర్గాల్లోనూ స్త్రీలకి ఎదురవుతూనే వుంటాయి.
ఆడది అనేటప్పటికి అడుక్కు తినేవాడు కూడ హీరో అయిపోతాడు. అవతలి స్త్రీ తనకన్నా ఎంత ఎక్కువ స్థాయిలో వున్నదీ మరచిపోయి చులకనగా మాట్లాడడం నేను అనేక రంగాల్లో చూశాను.
రైలెక్కినా, బస్సెక్కినా, ఈ బాధల్ని స్త్రీలు భరిస్తూనే ప్రయాణాలు చెయ్యాలి!
ఇన్ని విధాల ఇంటా బయట నెట్టుకుని నెగ్గుకొస్తున్న స్త్రీలని అవకాశం దొరికితే అవమానించాలని చూస్తుంటారు కొందరు!
అయినా స్త్రీలు తమ విధుల్ని మరింతగా పెంచుకుని అన్ని రంగాల్లొ శ్రమపడి ప్రముఖంగా వెలుగుతున్నారు.
అదే సంతోషం!
అలాంటి నా తోటి సోదరీమణులందరికీ నా హృదయపూర్వక అభినందనలు!