మనసులోని మనసా-37

1
2

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]ఇం[/dropcap]టర్మీడియట్ పసిపిల్లల మరణాలు, వారి ఫెయిల్యూర్స్ చూసినప్పుడు మనసు కలచి వేస్తుంది. పిల్లల జీవితాలతో ఆటలాడుతున్న రాజకీయ నాయకుల్నీ, ప్రభుత్వాలని చూస్తుంటే మనసు రగిలిపోతుంది.

చదువుల పేరిట వ్యాపారం చెయ్యడం ఈనాటిదేం కొత్తది కాదు. ఏ నాడు డొనేషన్ కాలేజీలు వెలిసాయో ఆ నాడే ఈ అవినీతి సామ్రాజ్యం వెల్లివిరిసింది. ఈ కాలేజీలే లేకపోతే ఎవరైతే ఈనాడు చాలా సీనియర్ డాక్టర్లుగా ప్రపంచమంతా చలామణి అవుతున్నారో వాళ్ళంతా ఎడ్రసు లేకుండా వుండేవారు.

అడ్దదారిన డిగ్రీలు సంపాదించడం, అడ్డదారిన అమెరికా వెళ్ళిపోయి విచ్చలవిడిగా సంపాదిస్తున్న చాలామంది ఈ డొనేషన్  కాలేజీల పుణ్యమే!

ప్రభుత్వాలు కుమ్మక్కయి చిన్న చిన్న గదుల్లో, పిల్లల మొహాన ఎండ పడుతున్నా, గాలి లేకపోయినా, వాళ్ళని వురిమి చూసి ఆ పసిమొగ్గల్ని భయపెట్టి రాత్రింబవళ్ళూ బండకేసి చేపల్ని రుద్దేసినట్లు రుద్దేసి బట్టీలు పట్టించి రేంకుల కోసం, పైసల కోసం దారుణాలకి ఒడిగడుతున్న ఈ యాజమాన్యం మీద చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు.

ఇక న్యూస్ ఛానెల్స్ వుండనే వున్నాయి, చనిపోయిన పసిపిల్లల మొహాల మీద రాత్రింబవళ్ళు కెమెరాలు పాతిపెట్టి చెప్పిందే చెప్పి ఏకరువు పెట్టి  బాధించడానికి!

ఇక్కడ ఎవరికీ నిజాయితీ లేదు. సమస్యని పరిష్కరిద్దామన్న ఆలోచన లేదు. ఈ పిల్లలు చచ్చినట్టు ఆ నాసిరకం చెత్త కాలేజీలు పాలు కాక తప్పదు. కారణం ప్రభుత్వ కాలేజీలని కావాలనే ఎందుకూ కొరగాని వాటిగా తయారుచేసి వీటినే దిక్కు చేసారు.

ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే!

ఏదో బాధ కొద్దీ రాయడం!

మనకి పేరుకి అతి పెద్ద ప్రజాస్వామ్యముంది. న్యాయ వ్యవస్థ వుంది. రక్షక వ్యవస్థ వుంది. ఇవన్నీ నేతి బీరకాయలో నెయ్యిలా నామమాత్రంగా వుండి పాలకవర్గం కొమ్ము కాస్తుంటాయి.

అప్పటికప్పుడు కొంత హడావిడి… కొంత తిరుగుబాటు!

ఇవన్నీ మన నీచ నికృష్ట డైలీ సీరియల్స్ చూసినట్లు చూసి వదిలేయడమే.

ఒకప్పుడు రచనారంగం వ్యాపారమైనా, ఎంత కమర్షియల్‌గా రాయాల్సివచ్చినా అందులో కొంత న్యాయాన్ని, సమస్యలని, వాటి పరిష్కారాల్ని ఇరికించి కొంతలో కొంత న్యాయం చేయడానికి ప్రయత్నించేం.

ఒక్కసారిగా టి.వి. సీరియల్స్ మీద ఎక్కడిదో ఇంత దుమ్ము పడింది. న్యాయం లేదు; ధర్మం లేదు; సమస్యా పరిష్కారం లేదు. ఒకప్పుడు హారర్ సినిమాల్లో నటించిన పిశాచాలు, వంటగదుల్లో, బెడ్ రూముల్లో ప్రవేశించాయి.

‘నీకన్న పెద్ద పిశాచం నేనూ…’ అన్నట్టు భయంకరమైన మేకప్పులు చేసుకుని, అంతకన్నా దారుణమైన విలనిజమ్ చేస్తున్న స్త్రీ రత్నాలు మనకు కుప్పులు తెప్పలుగా వచ్చిపడ్డారు. వీటిని నోరావలించి చూస్తూ గుమ్మాల ముందు ముగ్గు వేయడం, వంట చేయడం కూడా మరచిపోయి కర్రీ పాయింట్ కూరలు తెచ్చుకు తింటూ కాళ్ళార జాపుకుని కూర్చునే స్త్రీలని నేను కళ్ళారా చూసేను.  ఇక పిల్లలు ఎక్కడి నుంచి మంచీ చెడ్డా నేర్చుకుంటారు. ఇక పూర్తిగా చెడగొట్టే సెల్స్ చేతిలో వుండనే వున్నాయి. మనిషితో మనిషికి మాట కరువు, స్నేహాలు కరవు, చిరునవ్వులు కరవు! ఎవరి గదులు వారివి, ఎవరి ఆలోచనలు వారివి! ఏది తోస్తే అది చేసెయ్యడమే!

ఎక్కడి నుండి వచ్చిందో ఒక భయంకరమైన మహమ్మారి మన సమాజంలోకి వచ్చిపడింది.

వాళ్ళు మాట కలిస్తే కేవలం పిల్లల చదువుల గురించి, వాళ్ళు ర్యాంకుల గురించి, వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ వంశాల గొప్పదనం గురించి – కేవలం మెటీరియల్ గురించే మాట్లాడుతారు.

ఒకసారి కంచి కామాక్షమ్మ వారి దేవాలయంలో అమ్మవారి దర్శనం కోసం నిలబడ్డాం. ఆ రోజు మంగళవారం. చాలా హెవీ రష్‌గా వుంది. వంశీ వీసా కోసం వెళ్ళాం. టైముందని కంచికి వెళ్ళాం. ఆ రష్‍లో ఒక తెలుగావిడ మాట కలిపింది. దైవ దర్శనం దగ్గర, రైలు ప్రయాణాల్లో నాకెక్కువ మాట్లాడడం ఇష్టముండదు. కారణం అక్కడ మనం ఎంత మౌనంగా వుంటే అంత మనసు బాగుంటుంది..

అడగకపోయినా ఆవిడ చెప్పడం మొదలుపెట్టింది. వాళ్ళబ్బాయిని సత్యభామా యూనివర్సిటీలో జాయిన్ చేయడానికి వచ్చారట. అడగకపోయినా పిల్లవాడికి ఇంటర్‌లో వచ్చిన మార్కులూ, ర్యాంకూ ఏకరువు పెట్టింది. నేను మర్యాదకి ‘ఊ’ అన్నాను. తర్వాత వాళ్ళకి వున్న ఎకరాలు, స్థలాలు, ఆస్తులు చిట్టా చెప్పింది. ఇప్పుడు కంచిలో కూడా కొంటారట.

ఇలా మనుష్యులు డబ్బుతోనో, పిల్లల ర్యాంకులతోనో తమ స్థాయిని కొలుచుకోవాలని ప్రయత్నించడం ఎంత దారుణం!

అది చూసి అందరూ పోటీ పడి తమ పిల్లలు ఆ డాక్టరు, ఇంజనీర్లే కావాలని పోటీ పడుతున్నారు. ఇష్టం లేని చదువులు పిల్లల నెత్తిన రుద్దుతున్నారు. పిల్లల మీద పడుతున్న ఒత్తిడిని వారసలు గమనించడం లేదు. అటు కాలేజ్ యాజమాన్యాలతో, ఇటు ఇంట్లో ఒత్తిడితో పిల్లలు మరో దారి లేనట్టు, బ్రతుకు శూన్యమయి పోయినట్లు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు.

కారణం యింట్లో తల్లిదండ్రులతో పిల్లలకి దగ్గరితనం లేకపోవడమే!

“చదువు! చదువు! పక్కింటివాడికి అన్ని మార్కులొచ్చేయి, ఎదురింటి వాడికిన్ని మార్కులొచ్చేయి. నీ పెద్దమ్మ కొడుకు ఇంజనీరయి అమెరికా వెళ్ళిపోయాడు. మనం వెళ్ళకపోతే పదిమందిలో పరువు పోతుంది. సుబ్బారావు గారబ్బాయి వెళ్ళి రెండేళ్ళయిందో లేదో… ఇప్పుడిక్కడ ఎంత పెద్దిల్లు కట్టాడో! అప్పట్నించి వాడి నీలుగు చూడలేకపోతున్నాం!” ఇలాంటి మాటలు తరచూ వినబడుతుంటాయి.

ఇంటర్మీడియట్ అంటేనే టర్నింగ్ పాయింట్. టీనేజ్‌లో హార్మోన్స్ ఒత్తిడి ఎక్కువగా వుంటుంది. వాళ్ళు ఆవేశంగా వుంటారు. ప్రతీది తమకు తెలుసనే నమ్మకంతో వుంటారు. ఆ ఉత్సాహం అలాంటిది! అప్పుడు వాళ్ళతో తల్లిదండ్రులు చాలా సాహచర్యంగా ప్రవర్తించాలి! స్నేహితుల్లా మసలాలి. అందరూ ఒక్కలా చదవలేరు. ఒక్కలా జ్ఞాపకశక్తి వుండదు. కొన్ని సబ్జెక్ట్స్ మీద ఇంటరెస్టు వుండదు.

వారికి నచ్చ చెప్పి వీలయినంత వరకూ ఒత్తిడికి గురికాకుండా చూడాలి. ఏ కష్టమొచ్చినా తల్లిదండ్రులకి చెప్పుకోగల్గే చనువివ్వాలి! వారితో కలిసి మెలిసి నవ్వుతూనే అవసరమైతే సున్నితంగా హెచ్చరించి దారిలో పెట్టుకోవాలి! ముఖ్యంగా ఒక సంవత్సరం కోసం నిండు జీవితాలు బలి చేసుకోకూడదని – ఇది కాకపోతే మరో రంగంలో రాణిస్తావనీ ధైర్యం చెప్పాలి!

లేకపోతే ఇలానే మొగ్గలు వికసించకుండానే రాలిపోయి ఒక వార్తగా మిగిలిపోతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here