[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]
[dropcap]నా[/dropcap]కెందుకో గాని ముందు నుండి ఎవార్డులంటే సదభిప్రాయం లేదు. అందుకు కారణాలు లేకపోలేదు.
నిజంగా ప్రతిభకే ఎవార్డులిస్తే ఒక అద్భుత మహానటి సావిత్రికి, అసమాన నటుడు ఎస్వీ రంగారావుగారికి, వాణిశ్రీ లాంటి నటికి ఎందుకు రావు?
అలానే గొప్ప గొప్ప రచయితలకి ఎందుకు రావు!
ఒకసారి ఒక అసోసియేషన్ నాకు ఉత్తమ రచయిత్రి ఎవార్దు ఇవ్వబోతున్నామని ఫోన్ చేసి చెప్పింది. ఆ అసోసియేషన్‌కి ట్విన్ సిటీస్‌లో కొంత మంచి పేరే వున్నది. ఎవార్డు వస్తే కాదనలేం కదా! అప్పటికే నేను వివిధ పత్రికలలో రాసి కొంత మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకుని వున్నాను కాబట్టి అంగీకరించేను. ఎవార్డు యిచ్చే రోజు దగ్గరికి రానే వచ్చింది. ఆ ముందు రోజు సదరు సంస్థ నన్ను ఒక పదివేలు (మాత్రమే) పంపమని రిక్వెస్టు చేసింది. నేను తెల్లబోయి, “ఎందుకు?” అన్నాను. “మరి మీకు మెమెంటో, షాల్, పూలదండ యిత్యాదివన్నీ కొనాలి కదా! చీఫ్ గెస్ట్‌కి కారు పంపాలి. హాల్‌కి డబ్బులు కట్టాలి కదా!” అంది.
నాకు కాసేపు నోట మాట రాలేదు.
ఆ తర్వాత తేరుకుని “అలా డబ్బు ఖర్చు పెట్టే ఎవార్డు నాకు అవసరం లేదండి” అని చెప్పి రిసీవర్ క్రెడిల్ చేసేను.
నేను రెండు సార్లు నంది ఎవార్డ్సు కమిటీలో పని చేసాను.
నా పేరు కమిటీలో వున్నప్పుడు నాకసలు తెలియనే తెలియదు. ఎవరో ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతున్నప్పుడు నేను నమ్మలేదు.
“ప్రొద్దుటే జోక్ చేస్తున్నారే!” అన్నాను నేను కూడా నవ్వుతూ.
“అయ్యో రామ! మీరింకా పేపర్ చూడలేదా? వెళ్ళి చూడండి” అన్నారాయన.
నేను అప్పుడే ఎక్కడ పేపర్ చూస్తాను! ప్రొద్దుటే బండెడు చాకిరీ! హాడావిడి! అయినా అపనమ్మకంగా వెళ్ళి చూశాను. ఫస్టు పేజీలోనే ఆ న్యూస్ వుంది. అందులో నిజంగానే నా పేరు వుంది. నేను విస్మయం నుండి కోలుకోకుండానే ఆఫీసుకు వెళ్తే నా కొలీగ్స్ వరుసగా నన్ను అభినందించడం మొదలుపెట్టారు.
తీరా నేను వెళ్ళే సమయానికి మా ఆఫీసర్ వర్కు సఫర్ అవుతుందని నన్ను రిలీవ్ చేయనన్నారు.
నా కొలీగ్స్ అందరికీ కోపం వచ్చింది. చివరికి గవర్నమెంటు జోక్యంతో సెక్రటేరియట్ నుంచి లెటర్ వచ్చాక అతి కష్టం మీద నన్ను రిలీవ్ చేసేరు. అప్పటికే సగం ఉత్సాహం, సంతోషం చచ్చిపోయింది.
ఇక రోజూ ప్రభుత్వం వారి కారు వచ్చేది.
వంశీ ప్రెండ్స్ రోజూ బారులు తీరి నేను వెళ్తుంటే జోక్ చేసి నవ్వించేవారు.
ఇక కమిటీలో మరో ఇద్దరు స్త్రీలు వున్నారు.
ఛెయిర్‍పర్సన్ ప్రముఖ కేరక్టర్ నటుడు.
మిగతావారిలో చాలామంది ఛోటామోటా నటులు, దర్శకులు, నిర్మాతలు. కాలం సరదగానే గడిచేది.
రకరకాల సీరియల్స్ చూసి నవ్వుకునే వాళ్ళం. టి.వి. సీరియల్స్ కమిటీ కాబట్టి నలభయి రెండు రోజులు సాగిందా కమిటీ.
అయితే రాను రాను ఆ కమిటీ ఛెయిర్ పర్సన్ మెంటాలిటి బయటపడసాగింది.
ప్రొద్దుట మేము వెళ్ళేసరికి ఒక గ్రూపుతో ఆయన కూర్చునుండేవారు. సినీ నటుడవ్వడమే ఒక గొప్ప క్వాలిఫికేషన్‌లా ఆయన మిగతావారిని చులకనగా చూడటం, వ్యంగ్యంగా మాట్లాడి పరిహసించటం మేం కొంతమంది గమనిస్తుండేవారం.
ప్రభుత్వం సదరు సీరియల్స్‌ని కాని, షార్టు స్టోరీలని కాని వారు ఇచ్చిన వర్గంలో చూడకుండా – అది దానికి చెందదని అనధికారికంగా మార్చి ఆ ఎవార్డు వారికి రాకుండా చేసి ఇతరులకి యివ్వడం గమనించి మేం కొంతమంది పోరాటం సాగించి విఫలమై చివరికి డైరక్టర్ గారికి తెలియజేసేం.
ఆయన మేం కూర్చున్న హాల్‌కి వచ్చి, “మీరు కొన్ని రంగాలలో ప్రతిభావంతులని మిమ్మల్ని గౌరవించి కమిటీలో వేసాం. మీరు అతి తెలివితేటలతో మీ యిష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా మేం సబ్‌మిట్ చేసిన కేటగిరిలోనే చూడండి” అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు.
అయినా ఆయన తన ప్రవర్తన మార్చుకోలేదు. చివరికి ఆయన విషయం చీఫ్ సెక్రటరీ దాకా వెళ్ళింది. వెంటనే ఆయన్ని మార్చి మరొకర్ని నియమించారు. ఆ విధంగా కథ కొంత వరకు సుఖాంతమైంది.
ఈ మధ్య కాలంలో కొంతమంది నటులు ఇల్లు వెదుక్కుని పళ్ళూ స్వీట్లు తీసుకుని రావడం కూడా మొదలైంది. వాటిని తిరస్కరించి, “మీకు రావాల్సి వుంటే తప్పక ఓట్ చేస్తాను” అని చెప్పడం ఒక కార్యక్రమయ్యింది.
ఒకసారి ఒక ఛెయిర్‌పర్సన్‌కి నేను ఫోన్ చేసి గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.
“కొన్ని రోజులు ప్రభుత్వ సొమ్ము తింటూ, వారి వాహనాలు వాడుకుని అర్హుల్ని అనర్హుల్ని చేయాడానికా సర్!” అని అడిగాను. ఆయన కూడా ప్రముఖ నటుడే! చాలా గౌరవం ఆయనంటే నాకు! కాని ఆయన కూడా ఒక ప్రతిభావంతుడిని తప్పించి ఒక పనికిమాలిన వ్యక్తికి ఎవార్డు యిచ్చారు.
ఆయనకి నాకు ఒక గంట సంభాషణ జరిగింది.
కాకపోతే ఆయన వయసుకి చాలా పెద్దవారు. విద్యావంతులు. అందుకే ఆయన అందుకు తనకొచ్చిన ఒత్తిడులు, తప్పనిసరి పరిస్థితులు వివరించి క్షమాపణ కోరారు.
ఆయన చివరగా అన్న మాట నాకిప్పటికీ గుర్తుంది.
“అమ్మా, శారదమ్మా! ఇదంతా మనసులో పెట్టుకుని ఎక్కడైనా కనిపిస్తే మూతి ముడుచుకోకుండా నన్ను పలకరిస్తావు కదూ?” అన్నారు నవ్వుతూ.
అలానే నేను ఎవార్డ్సు ప్రదానోత్సవంలో ఆయన్ని చూసి పలకరించి నమస్కరించాను. ఆయన పక్కనే కూర్చున్న వాసిరెడ్డి సీతాదేవి గారు తర్వాత విషయం తెలుసుకుని తెగ నవ్వారు – “నువ్వు మెత్తగా కనబడతావు గాని నీ పెన్, మాట చాలా స్పీడ్!” అంటూ.
ఇలా చాలా చూసి విసిగిపోయాను నేను.
ఒకసారి ఒక రచయిత్రికి ఒక ప్రముఖుడి పేరుతో ఎవార్డు ప్రదానం చేసారు. ఆవిడకా ఎవార్డు యిచ్చినప్పుదు నిజంగానే అందరూ పెదవి విరిచారు.
ఆవిడ పక్కన కూర్చున్న నన్ను గుసగుసగా “ఆ ప్రముఖుడెవరండీ? స్పీచ్‌లో చెప్పాలి కదా?” అని అడిగితే, నేను నిజంగానే తెల్లబోయాను.
మరోసారి ఒక రచయిత్రికి ఒక ఎవార్డు వచ్చింది.
ఆమె నిజంగా ప్రముఖ రచయిత్రి కాదు. కొన్ని సంవత్సరాలు ఒక శీర్షిక మెయింటెయిన్ చేయడం వలన ఆమె పాపులర్ అయ్యారు. సరే! ఆమె గురించి మాట్లాడడానికి నా పేరు సజెస్ట్ చేసారట.
నిజానికి ఆమె వ్యక్తిగా మంచి మనిషి.
కాదనలేక ‘సరే’ అన్నాను.
అందుకు ఆమె వివరాలు అడిగాను.
ఆమె నన్ను వారింటికి ఆహ్వానించారు.
ఒక సాయంత్రం ఆఫీసు కాగానే నేను వారింటికి వెళ్ళాను.
ఆమె తన వివరాలు చాలానే చెప్పారు గాని అవన్నీ నాకు చాలా అప్రస్తుతంగా అనిపించాయి.
రచనల గురించి అడిగితే ఆమె వంటల గురించి చెబితే ఎలా వుంటుంది?
సరే అని సరిపుచ్చుకుని తిరిగి వస్తుంటే, ఆమె “శారద గారు! మీరూ నేను క్లాస్‍మేట్స్‌మని – ఒకే వూరిలో చిన్నతనం నుండి కలిసి పెరిగామని చెప్పరూ… ప్లీజ్!” అన్నారు.
నేను చాలా తెల్లబోయాను.
అదేం అవసరమో నాకు అర్థం కాలేదు.
నిజానికి ఆమె నాకన్నా వయసులో పెద్దవారు!
సరే, ఎవార్డు ప్రదానోత్సవం రోజు రానే వచ్చింది.
నేను అన్నీ మాట్లాడాను కాని ఆమె చెప్పమన్న అబద్ధం చెప్పలేదు. అందుకు నా మనసంగీకరించలేదు. ఆమె వూరు నేనసలు ఎప్పుడూ చూడలేదు.
కాని… ఆమె మాత్రం తన ఉపన్యాసంలో తనే… నేనూ తనూ క్లాస్‌మేట్స్‌మని చెప్పుకున్నారు.
చేసేదేముంది? మౌనం వహించాను.
నన్ను సీతాదేవిగారు అడిగారు, “ఆమె నీకన్నా చాలా పెద్దది కదా… శారదా! నువ్వు నిజంగా ఆమె క్లాస్‌మేట్‌వా?” అని.
నేను జరిగినదంతా చెప్పాను.
అలా వుంటాయి కొన్ని విషయాలు!
మళ్ళీ మొదటికే వస్తున్నాను.
ఒక సావిత్రికి, రంగారావు గారికి, వాణిశ్రీ గార్లకి ఎలాంటి ఎవార్డులూ యిచ్చి ప్రభుత్వాలు గౌరవించుకోలేకపోయాయి.
అంతమాత్రానా వారి ప్రతిభ సన్నగిల్లిపోయిందా!
పెట్రోమాక్స్ లైటులా వెలుగుతున్న వారి చేతికి కిర్సనాయిలు దీపం అందించే అవసరమేముంది!!!