మనసులోని మనసా-43

2
2

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]’రా[/dropcap]జకీయాల’ పుణ్యమా అని ఈ మధ్య కాలంలో కులమతాల ప్రసక్తి బాగా ఎక్కువయి పోయింది.

వృత్తుల కోసం ఏర్పడిన కులం, సమాజాన్ని సక్రమంగా నడిపించడానికి ఉత్పన్నమైన మతం – ఇప్పుడు మనుషుల మధ్య చిచ్చు పెట్టడానికి, ఆరని అగ్నిజ్వాలలు రగిలించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఎందుకు వీటిని పట్టుకుని వ్రేలాడి మనుషులు తమ అంతరంగాల మధ్య, అనుబంధాల మధ్య గోడలు కట్టుకుని ఊపిరాడని సమాధులు నిర్మించుకుంటున్నారో అర్థం కాని విషయం.

ఒక పక్క కుల, మతాంతర వివాహాలు జరుపుతూ ఎంతో విశాల దృక్పథంతో కొందరుంటే, కొందరు కేవలం వాటి కోసమే కన్న బిడ్డల్ని కూడా కసిదీరా చంపుకుంటున్నారు.

ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా మనుషులింత సంకుచితంగా ఆలోచించడం, దాని కోసం రక్తపాతం చిందించుకోవటం గర్హనీయం.

నాకు బాగా చిన్నతనంలో మా ఇంటికి గ్రేసమ్మ పంతులమ్మగారని ఒక స్కూల్ హెడ్‌మిస్ట్రెస్ గారు వస్తుండేవారు. ఆమెని చూస్తే నాకు భారతంలోని విదురుడు గుర్తొస్తుండేవారు. భుజాల మీదుగా నేల వరకు జీరాడే కొంగు, గ్లాస్కో బ్లవుజు, వేలుముడి, చాలా నిదానంగా చెరగని చిరు దరహాసంతో ఎక్కువ మాటలు లేకుండా వచ్చి కూర్చునేవారు. మేమందరం ఆమెని చూడగానే వినయంగా నమస్కరించే వాళ్ళం. పెద్దవాళ్ళు కూడా ఆమెకి నమస్కారాలు పెట్టి చాపపరిచి కూర్చోబెట్టేవారు. అసలు ఆమె ఏదో అధిక ప్రసంగాలు చేయడానికో కాలక్షేపం చేయడానికో వచ్చేవారు కాదు. ఆమెని రమ్మని మాలాంటి వాళ్ళ చేత కబురు చేస్తేనే వచ్చేవారు. కారణం మా బంధువుల్లో ఆస్తిపాస్తుల విషయాల్లో ఎప్పుడూ ఏవో తగదాలు జరుగుతుండేవి. నాకా చిన్న వయసులో అంత వివరాలు తెలియవు కాని దేనికో దానికి పేచీలు పడుతుండేవారు. అది పిల్లలమైన మాకు చాలా మనస్తాపం కలిగిస్తూ వుండేది. పంతులమ్మ గారొస్తే అవన్నీ పరిష్కరించి అందర్నీ కలుపుకుపోతారని మాకు ఆశగా వుండేది.

ఆమె రాగానే మా దొడ్డమ్మ ఏవేవో చెప్పి గయ్యిగయ్యిలాడేది. ఆమె అవన్నీ చిరునవ్వుతో విని “తొందరపడకండి వెంకటరత్నమ్మ గారూ! మీరూ మీరూ ఒక తల్లి కడుపున పుట్టినవారు. ఆయన మీకు చేసిన మంచిని కూడా గుర్తు చేసుకోండి” అని ఓపికగా చెప్పేవారు. అయినా మా దొడ్డమ్మ కోపంతో కథాకళి చేసేది.

అన్నిటికీ ఆవిడ చిరునవ్వే సమాధానంగా చెప్పి మా దొడ్డమ్మ చెప్పినవి విని మళ్ళీ మా మావయ్య దగ్గరకి వెళ్ళేవారు. ఆయన కూడా తనకొచ్చిన డాన్సులు చేసి జరిగింది ఆయన వెర్షన్ చెప్పేవారు.

ఇలా అటూ యిటూ తిరిగి వారి మాటల్ని పడి సమస్యని ఒక కొలిక్కి తెచ్చి పరిష్కరించేవారామె.

అలా గ్రేసమ్మ గారంటే అందరికీ గౌరవం. ఆమె చెప్పినట్టు నడుచుకునేవారు.

ఆమె ప్రతిఫలంగా ఏమీ ఆశించేవారు కూడా కాదు.

ఎంతమంది బంధువులూ, పలుకుబడీ వున్న రాయబారాలకి ఆమెని మాత్రమే పిలిచేవారు.

కారణం ఆమె నిజాయితీ, మంచితనం – అందరిని కలపాలనే అభిలాష మాత్రమే!

ఆమె మతం వేరని ఎవరూ చిన్నచూపు చూసి ఎరగరు. కులం పేరుతో కొందరిని సంబోధించి పిలవడం వుండేది కాని ఆ కులం తక్కువదనే భావన వుండేది కాదు. ‘ఆ సృష్టి కర్ణాల సీతని పిలవ్వే, ఆ పంతులుగారి భార్యను రమ్మను’ అంటూ చెప్పేవారు. కాని స్నేహాలు గౌరవంగానే సాగుతుండేవి.

కొంత కులాధిపత్యం, జులుం కూడా వుంటుండేది కాని అప్పట్లో అవతలివారు కూడా వాటిని అంత పట్టించుకునేవారు కాదు. మాకు అదంత అర్థమయ్యేది కాదు.

మా వీధిలో వేరు కులస్థులు ఎందుకు నడిచేవారు కాదో, పక్క వీధి నుండి ఎందుకు వెళ్తున్నారో, మా మూడో మావయ్య గబుక్కున అందరి మీదా చెయ్యి ఎందుకు చేసుకుని జులుం చేస్తున్నారో తెలిసేది కాదు.

అవతలి వీధిలో బలరాం అని టైలర్ వుండేవాడు. మా అందరి బట్టలు అతనే కుడుతుండేవాడు. అతనెప్పుడో మహారాష్ట్ర నుండి వచ్చి కాకినాడలో సెటిలయ్యాడట. మా దొడ్డమ్మ అతన్ని అర్జెంటుగా పిలుచుకు రమ్మంటే మేం పరిగెత్తుకెళ్ళి “బలరాం రా! మా దొడ్డమ్మ రమ్మంటోంది” అని ఊపిరాడకుండా గొడవ చేసేవాళ్ళం.

అతనికి మమ్మల్ని చూస్తేనే హడల్!

వానరమూక వచ్చి పడుతుందని గాభరా పడేవాడు.

“ఇది కుట్టేసి వస్తాను. మీరు పదండి” అనేవాడు బ్రతిమలాడుతున్న ధోరణిలో.

“ఏంటి, తర్వాత వస్తావా?” అని మేం అతను కుడుతున్న గుడ్డని లాగేసి, సూది విరిచేసి, అక్కడ కట్టలు కట్టి వున్న బట్టలు బయట విసిరేసేవాళ్ళం.

పాపం అతను – అతని దగ్గర పనిచేసే కుర్రాళ్ళు అవన్నీ గబగబా ఏరుకునేవాళ్ళు.

ఇక చేసేది లేక బలరాం ఉన్నపాటున “పదండి” అంటూ చెవిలో పెన్సిల్ పెట్టుకుని బయల్దేరి వచ్చేసేవాడు.

ఇక ఇక్కడ మా దొడ్డమ్మ తదితరులు అతను కుట్టిన బట్టల లోపాలు చూపించి అవి అతని మొహాన విసిరేసేవారు.

అప్పుడది జులుం అని, తప్పని మాకు తెలియని వయసు!

కొంచెం పెద్దయ్యేక స్థానబలం, ధనబలం, కులబలం – వీటితో వచ్చిన జులుం ఇది అని అర్థమయ్యేక చాలా బాధ కల్గేది.

తర్వాత అన్నీ తొలగిపోయాయి.

మావాళ్ళ ఆస్తులూ, ఇళ్ళూ ఇతర కులస్థులే కొనేసారు.

ఒకసారి మా నాన్నగారు మాచర్లలో పని చేసేటప్పుడు అక్కడ టూరింగ్ టాకీసులో ఒక డొక్కు పాట సినిమా వచ్చింది. అందులో వేసిన హీరోయిన్ మా అమ్మగారితో చిన్నప్పుడు చదివిందట. ఆవిడని చూపించి మా అమ్మగారు చాలా సంబరపడిపోతూ చెప్పేరు.

ఆ సినిమాలో ఆవిడ డాన్సు చూసి మా అక్కాచెల్లెళ్ళం తెగ నవ్వుతుంటే మా అమ్మగారికి కోపం వచ్చేసింది.

ఆవిడ గుండ్రంగా తిరగడానికి పావుగంట టైం తీసుకుంటున్నది.

అప్పటికే లలితా పద్మిని రాగిణీలు, కమలా లక్ష్మణ్, బి.వి.సరోజ, కుచల కుమారి, వైజయంతిమాల, వహీదా రెహమాన్‌లు బ్రహ్మాడంగా డాన్సు చేస్తుంటే ఈ డాన్స్ ఏం చూస్తాం!

తర్వాత కొన్ని సంవత్సరాలకి నేను నా ఫ్రెండ్‌తో ఒకరింటికి వెళ్ళాను. ఆ ఇల్లు కాకినాడలో ఏటివారన వుంది. వాళ్ళెవరో నాకు తెలియదు. వాళ్ళూ వాళ్ళూ మాట్లాడుకుంటున్నారు. నాకు తోచక, పెయింటింగ్స్ అంటే వున్న పిచ్చి వలన గోడల మీద వున్న రవివర్మ బొమ్మల్ని చూస్తున్నాను. అంతలో ఆ మధ్య ఫొటో నన్ను ఆకర్షించింది.

“ఈవిడ… ఈవిడ… మా అమ్మగారి ఫ్రెండ్” అంటూ అరిచాను సంబరంగా.

వాళ్ళంతా నా వైపు చూశారు.

మా అమ్మగారి వయసావిడ నా వైపు చూసి, “నేనే అది! మీ అమ్మగారెవరూ?” అనడిగారు.

నేను అంతా చెప్పాను. ఆవిడ చాలా సంతోషపడ్డారు.

నేను కూడా చాలా సంతోషంతో విజయగర్వంతో వచ్చి మా అమ్మగారికా సంగతి చెప్పాను.

మా అమ్మగారు సంతోషపడకపోగా, “వాళ్ళింటికెందు కెళ్ళావ్! అలా అందరి ఇళ్ళకీ వెళ్ళిపోతావా? ఈసారి వెళ్ళేవంటే చంపేస్తా!” అని కేకేలేసేరు.

నాకేమీ అర్థం కాలేదు. ఆ రోజు ఎంతో సంబరంగా “నా ఫ్రెండ్” అని తీసుకెళ్ళి సినిమా చూపించిన అమ్మ, తర్వాత కాలంలో ఇలా మాట్లాడుతుందేమిటని ఆశ్చర్యపోయాను.

తర్వాత చిన్నగా అన్నీ అర్థమవసాగాయి.

కాలేజీలో మా క్లాస్‌మేట్స్ కులాలు మాకెవరికీ తెలియవు. అసలు ఎప్పుడూ ఆ టాపిక్ వచ్చేదే కాదు. అందరం చాలా కలిసిమెలిసి వుండేవాళ్ళం.

ఒకసారి ఎవరో మంచినీళ్ళకని మా యింటికి వస్తే, మా అత్తగారు “ఆవిడని వెళ్ళిపొమ్మని చెప్పు శారదా” అన్నారు.

నాకు మనస్సు చివుక్కుమంది.

మా ఇంట్లో బోర్ బాగా లోతుకు వేసారని, నీళ్ళు తియ్యగా వుంటాయని చాలామంది వచ్చేవారు. అందరికీ యిచ్చి ఆమెని వెళ్ళిపొమ్మంటున్నారేమిటని అడిగాను.

ఆమె చెప్పిన కారణం నన్ను ఖిన్నురాలిని చేసింది.

కాకపోతే వాదించడానికి నాకు ఆమెతో చనువు తక్కువ. నాలుగు రోజుల తర్వత ఆమె పాపం జున్నుపాలు తీసుకుని వచ్చింది.

మా అత్తగారు లోపల పని చేసుకుంటున్నారు.

“మా గేదె ఈనిందమ్మా. జున్ను పాలు యిద్దామని వచ్చాను” అందామె అమాయకంగా.

“వద్దండీ. మేమెవ్వరం జున్ను తినం. మాకు పడదు” అని చెప్పాను.

నిజానికి నాకు జున్ను చాలా యిష్టం. అయిన కావాలనే చెప్పాను. ఆవిడ వెళ్ళిపోయారు.

నేనా విషయం మా అత్తగారికి చెప్పాను.

ఆవిడ తెల్లబోయి, “అదేంటి శారదా, పిల్లలందరికీ జున్నంటే చాలా యిష్టం. నేనే తెమ్మన్నాను. అలా చేసావేంటి?” అన్నారు.

“ఏమో నాకేం తెలుసత్తయ్యా, ఆవిడ మన నీళ్ళు ముట్టుకోకూడదన్నారు కదా… ఆవిడ జున్నుపాలు మనం ముట్టుకోకూడదేమోనని పంపించేసేను” అన్నాను అమాయకంగా.

ఆవిడకి నేను ఎందుకలా చేసానో అర్థమయి మొహం మాడ్చుకున్నారు.

రాజాకీయాల పుణ్యమా అని ఆఫీసుల్లోకి కులాలు వచ్చి పడ్డాయి. ప్రమోషన్‌లలో, ఇంపార్టెంట్ సీట్లలో కులప్రాతిపదికలు పెరగడం… ఏమీ రాకపోయినా వారిని నెత్తిన పెట్టుకోవడాలు కూడా చూశాం.

దీని వలన ఎంతో ప్రేమగా అందరం కలిసి మెలిసి వుండాల్సిన వాళ్ళం ఎడమొహం పెడమొహాలయ్యాం.

దూరాలు పెరగడం ప్రారంభమైంది.

ఏ అభిమానాలన్నా దురభిమానాలుగా, మౌఢ్యంగా మారితే అది ఆ సమాజానికే నష్టాన్ని కలిగిస్తుంది.

మనవాడు ఏ తప్పు చేసినా వెనకేసుకొస్తే – అది జాతినే సమూలంగా నాశనం చేస్తుంది.

ఎంత గొప్పవారో – జమీందార్లో కూలిపోవడం చూశాం.

పిల్లలకి ఆస్తులు – అంతస్తులు పంచడమంటే వారిని మన చేతులారా నాశనం చెయ్యడమే!

వారిని ప్రయోజకులుగా పెంచి వారి కాళ్ళ మీద వారిని నిలబడేట్టు చేయడం వలన సమాజం, దేశం నిలబడతాయి.

ఈ రోజున ఎవరూ ఎవరి జులుంని, ఆధిపత్యాన్ని భరించి తల ఒగ్గరు. ఒక్క ప్రేమ, దయ, ఇతరుల పట్ల సహనం ఆదరణ మాత్రమే అందర్నీ కలిపి ఒక త్రాటి మీద నడిపిస్తుంది.

ఇగోలు, అహంకారాలు ఏనాటికి కలిపి వుంచలేవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here