మనసులోని మనసా-46

1
1

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]మ[/dropcap]నం గడప దాటి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టగానే మన జీవితాలు ఒక అడవి ప్రవేశం చేసినట్లే. అడవిలో క్రూరమృగాలు, తేళ్ళు పాములూ వాటి ఆకారంలో అవి కనబడి మనం కొద్దిగా జాగ్రత్త పడటానికి అవకాశం యిస్తాయి. కానీ మానవ జీవనారణ్యంలో చాలా ఉత్తమంగా నటిస్తూ క్షణక్షణం మనల్ని కాటువేసే ప్రయత్నాలు చేస్తుంటారు మనుషులు!

కొన్ని రంగాలలో అయితే ఈ రకం మనుషులు మరీ ఎక్కువగా వుంటారు. మనం చదువుకున్న చదువులు, నేర్చుకున్న పాఠాలు, నీతి సూత్రాలూ ఇక్కడ సమన్వయ పడక తెల్లబోతూ వుంటాం. అలాంటి సంఘటన నేను ఎదుర్కొన్నదొకటి మీకు చెబుతాను.

ఒకసారి నేను ఆఫీసులో పని చేసుకుంటుండగా మా అబ్బాయి గబగబా ఆఫీసుకు వచ్చి “అమ్మా, నీ కోసం ఎవరో వచ్చారు. నీ కథ సినిమా తీస్తారట” అని హడావిడిగా చెప్పేడు.  అప్పుడు వాడు నైన్త్ చదువుతున్నాడు. వాడికి నా నవల సినిమా తెర మీద ఈస్ట్‌మన్ కలర్‌లో కనిపిస్తున్నదేమో, వాడి మొహం సంతోషంతో వెలిగిపోతున్నది.

నేను కంగారు పడుతూ “అతనెక్కడున్నాడు” అనడిగాను.

“మన డ్రాయింగ్ రూమ్‌లో కూర్చోబెట్టి వచ్చాను” అన్నాడు సంబరంగా.

నేను ఉలిక్కిపడి గబగబా మా ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకుని మా వాడిని తీసుకొని అడ్డదారిన మా కొండ దిగిపోయాను. మా కాలనీ మా ఆఫీసుని ఆనుకొని కొండ దిగువన ఉంది.

ఈ పాటికి ఏమన్నా వుంచాడో దొంగతనం చేసి పారిపోయాడో అని వీడికి చీవాట్లు పెడుతూ యింటికొచ్చేను.

అతను సోఫాలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు.

నన్ను చూడగానే అతను చిరునవ్వుతో లేచి నిలబడి “నమస్కారమక్కా” అన్నాడు.

నేనది పట్టించుకోకుండా యాంత్రికంగా నమస్కరించి గబగబా అన్ని గదులూ ఒకసారి పర్యవేక్షించుకుని వచ్చి కూర్చున్నాను.

అతన్నప్పుడు దీక్షగా చూశాను.

చామనఛాయ, ఆరడుగుల పొడవు, తెల్లటి పేంటూ షర్టూ వేసుకొని చాలా సాదాగా ఉన్నాడు.

“నా పేరు వెంకటేశ్వర్రావు. ఎం.టెక్ చదివాను. సిక్కింలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఉంది. తల్లిదండ్రులు ఏక్సిడెంట్‌లో చనిపోయారు. అక్కగారు వుంది కాని అమెరికాలో వుంటుంది” అని తన గురించి ఉపోద్ఘాతంగా చెప్పాడు.

నేను వింటున్నాను.

అతని అనుమానించాల్సిన అవసరం గాని, అనుమానం కాని నా కప్పుడు లేవు.

“నాకు తెలుగు భాష మీద అభిమానం. నవల్సు బాగా చదువుతాను. మీరు రాసిన ‘వానకారు కోయిల’ చాలా నచ్చింది. అది సినిమా తియ్యాలని రైట్స్ కోసం వచ్చాను” అన్నాడు తిరిగి.

నేను వెంటనే సంబరపడి పోలేదు.

కారణం సినిమా మనుషులు చాలామంది రావడం – ఇలా పోవడం నాకు అనుభవమే.

ఆ నవల నిజానికి మూడవ నవల.

చాలామంది ప్రశంసలు పొందిన మాట వాస్తవమే.

“దాని రైట్స్ నా దగ్గర లేవు. సినీ హీరోయిన్ సువర్ణ టీ.వీ. సీరియల్ కోసం దాని రైట్స్ తీసుకున్నారు” అని చెప్పాను.

అతను ఆ మాట విని చాలా బాధపడిపోయాడు.

“అయ్యో అక్కయ్య గారు! నేను సిన్సియర్‌గా తీయాలని వచ్చాను. ఎలాగైనా ఆమెను అడిగి ఆ ఎగ్రిమెంట్ కేన్సిల్ చేయించండి” అన్నాడతను.

“చూస్తాను” అన్నాను.

అతను వెళ్ళిపోయాడు.

మా వంశీకి అలా ఎవరిని ఇంట్లోకి రానివ్వవద్దని గట్టిగా చెప్పి నేను ఆఫీస్‌కి వెళ్ళిపోయాను.

రెండు రోజుల తర్వాత నేను ఒక ఎడిటర్ గారికి కథ చెబుతున్న తరుణంలో అతను మళ్ళీ వచ్చాడు.

మళ్ళీ రైట్స్ కోసం ప్రాకులాట.

సువర్ణ ఆ ఎడిటర్ గారికి తెలుసు.

ఆయన వెంటనే సువర్ణకి ఫోన్ చేశారు.

“ఆ నవలలో కేంద్రంగా రాసిన యిల్లు సముద్రపు ఒడ్డున మా యిల్లు లానే ఉంటుంది. అందుకే చాలా ఇంప్రెస్ అయి ఆ నవలను తీసుకున్నాను. నేను ఎలాగయినా టీ.వీ. సీరియల్‌గా తీస్తాను. నేను ఇవ్వను” అని కరాఖండిగా చెప్పేసింది సువర్ణ.

అతనేమో పట్టు వదలడం లేదు.

చివరికి మేం ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారిని ఆశ్రయించాం.

భరద్వాజ గారు మా కేంపస్‌లో ఇరిగేషన్ డిపార్ట్‌మెంటులో ఇంజనీరు. తరచూ మాకు తారసపడుతూనే ఉంటారు. ఒకసారి ఆయనతో కథ డిస్కషన్‌లో కూడా పాల్గొన్నాను. ఆయనకి ఈ సంగతి చెప్పాను.

సువర్ణకి భరద్వాజగారు గురుతుల్యులు.

ఆయన సినిమాల్లో ఆమె నటించింది.

ఆ చనువుతో భరద్వాజగారు సువర్ణకి చెప్పి ఒప్పించి ఆ ఎగ్రిమెంటు కేన్సిల్ చేయించి ఇతనికిప్పించేలా చేశారు.

ఈలోపున వెంకటేశ్వర్రావుగారికి ఓ సైంటిస్ట్ చెల్లెలుతో వివాహం కుదిరింది. ఆ అమ్మాయి కూడా మంచి జాబ్ చేస్తుందట.

అతను ఎంగేజ్‌మెంటుకి మమ్మల్నందర్నీ పిలిచాడు.

నా నవల డైరెక్షన్ కోసం అతను దాసరి నారాయణరావు గారిని సంప్రదించి ఒప్పించాడు.

ఇక ఇతని ఎంగేజ్‌మెంటుకి అందరూ వచ్చారు.

వాళ్ళు ఎంగేజ్‌మెంటు ఘనంగా చేసేరు.

దాసరి నారాయణరావు గారు కూడా వస్తే హడావిడే కదా!

తర్వాత పెళ్ళి గుంటూరులో.

అతను తన పెళ్ళి పనులు చేసుకుంటూ మరోపక్క సినీ నటుల కోసం ప్రయత్నిస్తున్నాడు.

పెళ్ళికి ఎలాగైనా గుంటూరు రావాలని అతను పట్టుబట్టి కొన్ని కారుల్లో మమ్మల్నందర్నీ తీసుకెళ్ళాడు.

చీకటి పడుతూ ఉండగా మేమందరం నాజ్ థియేటర్ దగ్గర ఉన్న ఒక కళ్యాణ మండపం జేరుకున్నాం.

అతని కారు మాత్రం రాలేదు.

పెళ్ళివారు పెళ్ళికొడుకు ఇంకా రాలేదని కంగారు పడుతూ మమ్మల్నడుగుతున్నారు.

ఒకపక్క బంధుమిత్రుల భోజనాలయిపోతున్నాయి. నేను కూడా టెన్షన్‌గా చూస్తున్నాను.

చివరికి ముహూర్తం దగ్గర పడుతుండగా పెళ్ళికొడుకు కారు వచ్చింది. అందరూ హడావిడి పడుతూ అతనికి ఎదుర్కోలు పలికి కాళ్ళు కడిగారు.

“మా అక్క రాలేదు. నాకెవరూ లేరు” చెప్పడంతో పెళ్ళికూతురు తరఫు వాళ్ళే కార్యక్రమం అంతా నడిపించేశారు.

ఇక ఇతను ఇవ్వాల్సిన మంగళసూత్రం గురించి పెళ్ళికూతురు వాళ్ళు అడిగారు.

అతను చాలా యధాలాపంగా “ఆ బ్రీఫ్ కేస్‌లో ఉంది అక్కా. మీరు తీసి ఇవ్వండి” అన్నాడు నన్ను.

నేను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ కావడం ఇష్టం లేకపోయినా పెళ్ళికూతురు వదినగారు అడగటంతో నేను తెరిచి చూశాను. అతను చెప్పినట్లు మంగళసూత్రం కనిపించలేదు.

“సరిగ్గా చూడండి అక్కా. అందులోనే పెట్టాను” అన్నాడతను.

మళ్లీ తిరగా మరగా చేసి లేదని చెప్పాను.

ఆ దెబ్బతో నాకు అనుమానం వచ్చేసింది.

నేను ఆమె వదినగారిని పక్కకు తీసుకువెళ్లి “ఇతను ఫ్రాడ్. ఈ పెళ్ళి ఆపండి” అని చెప్పాను.

కానీ పెళ్ళికూతురు వదినగారు అమాంతం నా చేతులు పట్టుకొని “గట్టిగా అనకండి. బంధువుల ముందు మా పరువు పోతుంది” అని తన మెడలోని మంగళ సూత్రాలు పుటుక్కున తెంచి అందులోంచి ఒకటి తీసి పెళ్ళికొడుకు తెచ్చినట్లుగా పురోహితుడికి ఇచ్చింది.

నేను ఆ సంఘటన చూసి నిర్ఘాంతపోయాను.

ఈలోపున చాలామంది అతని స్నేహితులుగా వచ్చిన వారు ఒకరితో మరొకరు మాట్లాడుకుంటూ అతను ఈ మధ్యనే అందరినీ స్నేహం చేసుకున్నట్లుగా బయటపడి మమ్మల్ని అడిగారు. మేం కూడా ఆ సంగతే చెప్పాం.

కానీ… పెళ్ళి జరిగిపోయింది.

చాలా హర్టింగ్‌గా నేను మా వారితో, ఎడిటర్ తదితరులతో ‘చెబుతున్నా పెళ్ళి చేసేసారు’ అని చెబుతుంటే ఉదయం నుండి వచ్చి మాతో పాటుగా వున్న ఒక విలేఖరి అదంతా వింటున్నాడు.

తిరిగి చాలా బాధగా మేము ఇంటికి వచ్చేసరికి అతన అంతకన్నా ముందుగానే పెళ్ళికూతుర్ని, ఆమె చుట్టాన్ని తీసుకొని మా ఇంట్లోనే వున్నాడు.

నాకేం చేయాలో తోచలేదు.

అవతల ఏమీ తెలియని అమ్మాయి, ఆమె బంధువు ఉన్నారు. ఈలోపున మాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ గారికి చెబితే ఆయన ఒక ఇన్‌స్పెక్టర్‌ని మఫ్టీలో పంపారు. అందరూ ఏమడిగినా అతను ఎంతో సాదాగానే విషయాలు చెబుతున్నాడు.

నేను సహనం కోల్పోతున్నాను.

చివరకు నేను పెళ్ళికూతురికి జరిగిన విషయం చెప్పేసాను.

ఆమె నిర్ఘాంతపోయింది.

“ఒక నిమిషం మంగళసూత్ర ధారణకు ముందు చెప్పకూడదా?” అందామె బాధగా.

నేను జరిగిన విషయం చెప్పేను.

తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు.

ఇది జరిగిన నెల రోజుల్లో అతను కర్నూలులో అరెస్టయ్యేడు. అతను దొంగ బిజినెస్సులూ, దొంగ పెళ్ళిళ్ళూ బయటకు వచ్చాయి.

అతను ఈ పెళ్ళికూతురు నగలు కూడా తీసుకొని పారిపోయాడని, అతనికి అసలు చదువుసంధ్యలూ లేవని తెలిసి షాక్ అయ్యేం.

అతను మా అందరికీ చెవిలో పూలు పెట్టాడు.

అందుకే ఈ ప్రపంచంలో వేషాన్ని, భాషని చూసి ఎవరిని నమ్మేయకూడదని నాకర్థమైంది.

అందుకే సినిమాకి కథలని ఎవరైనా వస్తే నేనసలు నమ్మనే నమ్మను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here