మనసులోని మనసా… 6

0
1

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]మే[/dropcap]ధస్సు –

గొప్పదే!

మేధస్సు వలన సాధించిన ప్రగతి అపారం!

నష్టమూ అంతే!

ఈ రోజు మనం అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు మేధస్సు నుండి వుధ్భవించినవే!

అపారమైన తెలివి తేటలతో తిమ్మిని బమ్మిని చెయ్యొచ్చు.

రాముణ్ణి రావణాసురుణ్ణి చేసి చూపించొచ్చు. సీతని తాటకి చేసి హీనపరచొచ్చు. అణుబాంబులు తయారు చేసి ఘోరమైన వినాశనానికి పాల్పడవచ్చు.

కాని మనసు, అందులో చిటికెడు జాలి, దాతృత్వం లేని తెలివితేటలు నేను గౌరవించలేను. అలాంటి సంఘటలను కొన్ని చూసి నేనలాంటి నిర్ణయానికి రావడం జరిగింది.

గాయపడిన కాకి నడి రోడ్డు మీద పడివుంటే చుట్టూ కాకులు చేరి గోలగోలగా అరచి చివరికి ముక్కులతో రెక్కలు పట్టుకుని పక్కకి లాక్కు వెళ్ళిన సంఘటన చూసాను.

అదే ఒక మనిషికి ఏక్సిడెంటయి రోడ్డుమీద రక్తం ఓడుతుంటే సెల్ ఫోన్‌లో ఫోటోలు తీసుకుని వినోదించడం చూశాను.

మనకెందుకులే తలనొప్పి అని కారుల్లో ఎవరి దారిన వారు వెళ్ళిపోవడమూ చూశాను.

నేను చిన్నపిల్లగా వున్నప్పుడు మా యింటి దగ్గర ‘సీత’ అనే అమ్మాయి వుండేది. తనకప్పుడు పదహారేళ్ళుంటాయేమో! చాలా అందంగా చురుకుగా వుండేది. అప్పటికి నాకు అందానికి నిర్వచనం చెలియక పోయినా ‘అక్క’ చాలా అందంగా వుంటుందనుకునేదాన్ని. ముఖ్యంగా ఆమె తెలివి, చరుకుదనం, గలగలా కపటం లేకుండా నవ్వే తీరు నాకు బాగా నచ్చేవి.

తనూ, మా పెద్దమ్మ కూతురు కృష్ణక్క పెరట్లో చేసే అల్లరి చెప్పనలవి కాదు. మా యింటి పెరడు చాలా పెద్దది. కొబ్బరిచెట్లు, మామిడి, పనస చెట్లతో నిండి వుండేది. మా అల్లర్లన్నీ అక్కడే పెద్దవాళ్ళకి తెలియకుండా సాగేవి. అక్కడ సీత, కృష్ణక్క హరికథలూ, బుర్రకథలూ చెప్పేవారు. అవన్నీ వాళ్ళు అప్పటికప్పడు కల్పించి ఆశువుగా నవ్వించడానికి అల్లినవే. మేమంతా కూర్చుని చూసి తెగ నవ్వుతుండే వాళ్ళం.

మాకు మా వీధి చివర్న ఒక మూడు వందల గజాల స్థలం వుండేది. అందులో బూరుగు దూది చెట్లు, ద్రాక్షతోట వుండేవి. మధ్యలో చుట్టూ గట్టు కట్టి అందులో కొళాయి వుండేది. అందులో మునిసిపల్ వాటర్ వచ్చేది. అక్కడప్పుడందరికి కొళాయిలు (నల్లాలు) లేవు.

కాకినాడ బావుల్లో వుప్పు నీళ్ళే పడేవి. అందుకని వాళ్ళంతా మా అత్త దగ్గర తాళం తీసుకుని నీళ్ళు వచ్చినంత సేపు ఆ పేట వాళ్ళంతా మంచి నీళ్ళు పట్టుకనేవారు. నీళ్ళు ఆగిపోయాక తాళం వేసి తెచ్చిచ్చేవారు. చెట్లు మీద చెయ్యేసేవారు కాదు. ఇది మా తాతగారు వారి కోసం ఏర్పాటు చేసింది.

ఒకసారి మా పెద్దనాన్నగారు (ఆయన పోలీసాఫీసరు) కేంప్‌కి వెళ్ళనిచ్చి మా దొడ్డమ్మ లేని టైము చూసి వీళ్ళు (సీత, క్రష్ణక్క) పెదనాన్న పోలీసు యూనిఫామ్ వేసుకుని కేప్‌లు పెట్టుకుని లాటీలు పట్టుకుని మా అత్తని తాళం యిచ్చి నీళ్ళు ఎందుకు దానం చేస్తున్నావు, అరెస్టు చేస్తామని నానా రగడ చేసారు. మా అత్త పాపం చాలా అమాయకురాలు. కొంగు నిండుగా కప్పుకుని తలుపు వెనుక దాక్కుని “ఆయన లేరండి వచ్చాక చెబుతాను” అని గజగజలాజడుతూ జవాబు చెప్పేది. నేను నవ్వాపుకోలేక నవ్వితే, అప్పుడు మా అత్త గ్రహించి “నువ్వా కృష్ణా, రానివ్వు మీ అమ్మని. చెబుతాను” అనగానే వీళ్ళు యూనిఫామ్స్ పీకి పరిగెత్తేవారు.

అనాటి సీతకి వాళ్ళవాళ్ళు చాలా నిర్దయగా, పుట్టినప్పటి నుండి వుబ్బసంతో దగ్గుతూ వుండే వాళ్ళ బావ కిచ్చి పెళ్ళి చేయడానికి నిర్ణయించేరు. అతనెప్పుడూ అరుగు మీద వాలు కుర్చీలో కూర్చుని దగ్గుతుండే వాడు. ఎప్పుడూ నవ్విన దాఖలాలు కాని, ఆడుకుంటున్న మా వైపు చూసిన దాఖలాలు లేవు. సీతక్క మాయింటి కొచ్చి మా దొడ్డమ్మకి ఈ పెళ్ళి ఆపమని ఏడ్చి బ్రతిమాలడటం చూశాను. ఆ చిన్న వయసులో పెళ్ళంటే సీతక్క ఎందుకేడుస్తుందో అర్థం కాక ఆశ్చర్యపోయేను నేను. ఈ విషయం అడిగితే పెద్ద విషయాలు నీ కెందుకని తిట్టేవారు. పెళ్ళంటే నా దృష్టలో సన్నాయి మేళం, బంధువుల రాకలు, పందిళ్ళు, భోజనాలు! ఇంత ఆనందం దొరికితే ఏడవటం దేనికో నా కర్థం కాలేదు.

నేను మాత్రం ఆ పెళ్ళిని చాలా ఆనందించి చూశాను. సీతక్క పెళ్ళి తయారులో అపర సీతలా వుంది. పెళ్ళికొడుకు శవానికి అలంకరణ చేసిలనట్లున్నా నేను పట్టించుకోలేదు.

సీతక్క కాపురానికెళ్తూ చెప్పడానికి మా యింటికొచ్చింది. సీతక్క అత్తగారిల్లు కూడ అక్కడే. అయినా పద్ధతి ప్రకారం కాపురానికి వెళ్తోంది. వెళ్తూ మా దొడ్డమ్మతో మీరెవరూ నా పెళ్ళి ఆపమని చెప్పలేదు మళ్ళీ నా శవమే పుట్టింటికి తిరిగొస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది.

అలాగే సీత ఆర్నెల్ల లోపునే కాల్చుకుని చనిపోయింది.

చనిపోతూ సీత అన్న ఆఖరి మాట “ఎందుకేడుస్తారు మీరేగా నా చావుకోరుకుంది” అన్నదట నవ్వుతూ.

ఆ మాట అందరూ చెప్పకుంటుండగా విని నా మనసు చాలా వికలమైపోయింది. ఎన్నాళ్ళో సీత చిలిపి మొహం నన్ను వెంటాడేది.

‘సీత ఎదిరించి బ్రతికి సాధించుకోవచ్చు కదా’ అని ఇప్పటి తరం అనుకోవచ్చు. అప్పటి తరంలో కొన్ని కుటుంబాల్లో సాంప్రదాయమనే ముళ్ళకంప వుండేది. ముఖ్యంగా స్త్రీ హృదయానికి ఎలాంటి విలువ, గుర్తింపు లేవు.

అలాగే నేను చదువుకునే రోజుల్లో నా సీనియర్ ఒకమ్మాయి వుండేది. తనతో నాకెలా స్నేహం కుదిరిందో నాకు తెలియదు. నా అల్లరి మురిపెంగా చూసి నవ్వుకునేది. ‘అలా చేయకూడదురా’ అని ముద్దుగా మందలించేది. కాని నేనంటే చాలా యిష్టం. తల్లి లేదు తనకి. తండ్రి డొనేషన్ కట్టి ఆమెను మెడిసిన్‌లో జాయిన్ చేసాడు. తనకి మెడిసిన్ చదవడం యిష్టం లేదు. తను చదువులో అంత రాణిపు వున్న వ్యక్తి కాదు. కాని తండ్రి చండశాసనుడు. కూతురు డాక్టరయి తీరాలని పట్టదల. అందుకని ఆమెను ఆడపిల్లని కూడా చూడకుండా హంటర్‌తో కొట్టేవాడు. నిలబడి తిరుగుతూ చదివిచేవాడు. నిద్ర వస్తే చల్లటి నీళ్ళు మొహాన కొట్టేవాడు. ఇవన్నీ ఒకసారి ఏడుస్తూ తనే చెప్పింది. ఫెయిలయితే ఇక నరకమే. తర్వాత మేము ఆ వూరి నుండి వచ్చేసాం. తను డాక్టరయిందో లేదో తెలియదు. ఇంత రాక్షసత్వంగా కూతుర్ని డాక్టరు చెయ్యాలా! ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే! అప్పుడు ఏడ్చి ఏడ్చి కథలుగా చెప్పి సానుభూతి పొందాలనుకుంటారు. కాని ముందు పిల్లల అభిమతం తెలుసుకోరా! డాక్టర్లు, ఇంజనీర్లయితేనే మునుషులా!

అలానే మా చుట్టాలో ఇంజనీరింగు చదివే అబ్బాయి సెకండ్‌షో చూసోచ్చాడని కొట్టి ఇంట్లోంచి నెట్టేస్తే తెల్లారి ఉప్పుటోర్లో శవమై తేలేడు. ఆ రోజుల్లో తల్లిదండ్రులు బంధువులు క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని హింసించడం చూశాను.

ఇక ఆడపిల్లల్నయితే ఎవరో ఒక అనామకుడు కిచ్చి పెళ్ళి చేసి భరించలేక పుట్టింటి కొస్తే శ్రీరంగ నీతులు చెప్పి వెనక్కు పంపుతారు. దిక్కులేని స్థితిలో బలవన్మరణం పొందితే ఏడుస్తారు. ముందుగా ఎవరూ బలవంతంగా చనిపోవాలని కోరుకోరు. ఎవరికో ఒకరికి తమ గోడు విన్నవించుకునే వుంటారు. సరైన ఆదరణ, ఒక మంచి మాట దొరకకే చావుని ఆశ్రయిస్తారు.

ప్రముఖ సినీ నటుడు రంగనాథ్‌గారు చనిపోయినప్పుడు నేను అమెరికాలో వున్నాను. నేను పైనుండి మెట్లు దిగొస్తుండగా మా వంశీ ఆ విషయం చెప్పేడు. నేను చాలా షాకయ్యేను. ముందుగా హార్టెటాక్ ఏమో అనుకున్నాను. ఆత్మహత్యని తెలిసాక చాలా తెల్లబోయాను. చాలా రోజులు అతని మరణం నన్ను ఎంతగానో వెంటాడింది. నిజానికి రంగనాథ్‌గారితో నా కెలాంటి వ్యక్తిగత పరిచయమూ లేదు.

ఒకసారి అనుకోకుండా చెన్నై నుండి వారితో ట్రైయిన్‌లో ప్రయాణం చేసే సందర్భమొకటి వచ్చింది. ఆయన్ని నేను గుర్తు పట్టాను. నేను వారికి తెలియదు. గబగబా పరిచయాలు చేసుకుని మాట్లాడే స్వభావం కాదు నాది. ఆయన ఒక పుస్తకం చదువుకుంటూ కూర్చున్నారు. ఆ ప్రయాణంలో ఆయన బిహేవియర్ చాలా హుందాగా సాత్వికంగా అనిపించింది. సినిమా హీరోనన్న భేషజం అణువంత కూడా కనిపించలేదు.

తర్వాత కాలంలో ఆయన కవిత్వం చదివాను. అందులో ఆయన ఆలోచనలు కనిపించాయి.

సినీరంగంలో కూడా ఆయనకి మంచివాడు అనే పేరే వుంది. ముఖ్యంగా ఆయన శ్రీమతికి దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి వెన్నెముక విరిగి మంచం పాలయితే జీవితకాలం ఆమెకు ఆయన ఎంతో ప్రేమతో ఒక పసి పిల్లలా చేసిన సేవ ఆయన ఔన్నత్యాన్ని చాటి చెప్పింది. ఆయన పట్ల గౌరవాన్ని మరీ మరీ పెంచింది. అంతటి వ్యక్తి ఒక భీరువులా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు. వారినా పరిస్థితికి తీసుకెళ్ళిన సంఘటన లేమిటి?

ఒక చిన్న వూరడింపు, మంచి స్నేహము ఆయన్ని బ్రతికించి వుండేవేమో అనిపిస్తుంది నాకు.

మనిషి పోగానే లాజిక్కులు మాట్లాడేవారు కట్టుకథలు చెప్పుకుని ఆనందించేవారు, ధర్మశాస్త్రాలు వల్లె వేసేవారు, నీచ చరిత్రలు సృష్టించే వారు సిద్ధమయిపోతారు.

సముద్రయానం తాగడానికి గుక్కెడు నీళ్ళు లేవు అన్న మాట నాడు పదేపదే గుర్తొస్తుంటుంది.

అందరూ అయినవారే – స్నేహితులే! అక్కరకెవరూ వుండరా? ప్రపంచశాంతి గురించి పద్యాలు రాసేవారికి పక్కవారి గొడు వినిపించదా?

మన భాషలో అదృష్టవశాత్తు ప్రతి పదానికి వ్యుత్పత్తర్థమున్నది. మనిషి అంటే మానవత్వంతో కూడుకున్న వారనే కదా అర్థం! ఆ అర్థాన్ని నిలబెడుతున్న వారి శాతం ఎంత!

ఒక మనిషిని ఆదుకోవడానికి కులం, మతం, ప్రాంతీయత, భాష అడ్డాలు వస్తే ఇక మనుషుల్ని మనిషని పిలవడం దేనికో అర్థం కాదు. మానవత్వం ముందు అన్ని ప్రతిభలూ ఓడిపోతాయి.

పెళ్ళిని పెల్లి అన్నా నష్టం లేదు – అచ్చ తెలుగు మాట్లాడకపోయినా అరిష్టం లేదు గాని మనిషిలో జాలీ దయ నశిస్తే మాత్రం మానవ మనుగడకే నష్టం కదా! మీ ఒక్క పలకరింపు ఎవరి ప్రాణాన్నయినా నిలబెడుతుందేమో ఆలోచించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here