[dropcap]2[/dropcap]016లో అంతర్జాలాన్ని ఏ ఆటంకాలు లేకుండా అందుకోగలిగిన మానవహక్కుగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఐతే స్వీడన్, కోస్టారికా, ఫ్రాన్స్, స్పెయిన్, ఎస్తోనియా, కెనడా, ఫిన్లాండ్ వంటి దేశాలు అంతకు చాలాముందే అంతర్జాలాన్ని మానవహక్కుగా గుర్తించాయి. స్వీడన్ 2010 లోనే దాన్ని జన్మాంతరమైన మానవహక్కుగా గుర్తించింది.
మనదేశంలో అంతర్జాల వినియోగాన్ని మానవహక్కుగా మొట్టమొదటగా గుర్తించిన రాష్ట్రం కేరళ. ఉచితంగా/రాయితీలతో 20 లక్షల పేదకుటుంబాలకు డిజిటల్ సేవలను అందించదలచుకొన్నట్లు అప్పట్లో ఆ రాష్ట్రం ప్రకటించింది. బ్రాడ్‌బాండ్ వేగాన్ని పెంచే మౌలికవసతుల కోసం రూ. 1000 కోట్లు కేటాయించింది కూడా. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో హైస్పీడ్ అంతర్జాలం అందుబాటు మౌలికహక్కు.
దేశంలోని వివిధ వర్గాల ప్రజలు, స్త్రీలు, గృహిణులు, యువత, వృద్దులు అందరూ – కోట్లసంఖ్యలో నెట్‍ను వినియోగిస్తున్నారు. త్వరలో ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ (I.O.T) కూడా మన జీవితంలో భాగం కానుంది. ఇటీవలి సంవత్సరాలలో వచ్చిన ‘క్లౌడ్’ విధానానికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
‘క్లౌడ్’ విధానంలో విశ్వసనీయమైన సమాచారాన్ని ఆన్‍లైన్‍లోనే భద్రపరచుకోవచ్చు. అయితే హాకర్ల ముప్పు లేకపోలేదు. తస్కరణలూ సాధారణమైపోయాయి. సర్వీస్ ప్రొవైడర్లకు బ్రౌజింగ్ చరిత్రను విక్రయించేందుకు అవకాశాన్ని కల్పిస్తూ అమెరికా నిర్ణయం తీసుకొన్నప్పుడు వ్యక్తిగత సమచార భద్రతకు ముప్పు ఏర్పడుతుందని అప్పట్లో పలు సంస్థలు ఆందోళనలు చేశాయి.
భారతదేశంలోని వినియోగదారుల డేటాను స్థానికంగా భద్రపరచాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల అమెరికా సముఖంగా లేదు.
భారతదేశానికి అందుబాటులో ఉన్న ప్రఖ్యాతమైన 10 వెబ్‍సైట్లలో 8 అమెరికాకు చెందినవే. ఆ కారణంగా వాటికి సంబంధించి ఏవైనా సాధారణ నేరాలు లేదా సైబర్ నేరాలు వెలుగు చూసినపుడు నేరపరిశోధనలో భాగంగా ద్వైపాక్షిక విధానంలో అమెరికన్ ప్రభుత్వం ద్వారా ఆయా సమాచార ప్రసార కేంద్రాలనుండి సాక్ష్యాలను సేకరించడానికి విపరీతమైన ప్రయాస, కాలహరణం సహించవలసి వస్తోంది. ‘శ్రీకృష్ణన్ కమీషన్’ 2018 జూలై 27 న విడుదల చేసిన “వ్యక్తిగత సమచార భద్రత బిల్లు” ముసాయిదా నివేదికలో – అటువంటి జాప్యానికి అవకాశం లేకుండా వినియోగదారులకు సంబంధించిన సమాచారం తాలూకు ఒక కాపీని మన దేశంలో స్థానికంగా భద్రపరచి ఉంచడం తప్పనిసరి చేయాలని సూచించింది. అదే జరిగితే నేర విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి వీలుపడుతుంది. ఆ కారణంగా ఆ డిమాండ్ పెరుగుతూ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆర్థిక లావాదేవీలకు కూడా సంబంధించిన అన్ని వివరాలు/డేటాను స్థానికంగా భద్రపరచి ఉంచాలని అభిప్రాయ పడుతోంది.
ప్రస్తుతం దేశాల నడుమ ఉన్న ‘మ్యాచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ’ (MLAT) చాలా పాతది. సాంకేతిక సంస్థలు ఏవైనా తమ వద్దనున్న సమచారాన్ని వెల్లడించడానికి ఫెడరల్ గవర్నమెంటు అధికారిక అనుమతి తప్పనిసరి. వినియోగదారుడు ఉన్నచోటు, ఒక దేశం ఆ వ్యక్తి యొక్క సమాచారాన్ని అడగడంలో గల సహేతుకతను బట్టి సమాచారం లభిస్తుంది. స్థానికంగా డేటాను భద్రపరచినప్పటికీ ఈ విధానం మారబోదు. భారతదేశంలోని చట్టసంస్థలు, వినియోగదారుడు ఇద్దరికీ డేటా అందుబాటులో ఉండేవిధంగా చట్టాలలో సవరణలు రావాలి. అంతర్జాతీయ నేరాల విషయంలో పరిశోధన విచారణలకు ‘క్లౌడ్’ చట్టాలలో భాగస్వామి దిశగానూ మన దేశం ఆలోచించాలి. అపుడు సైబర్ నేరాల పరిశోధన, కట్టడి వంటి అంశాలలో దారి సుగమం అవుతుంది.