[dropcap]మ[/dropcap]నిషి పుట్టుక నుండి మరణం వరకు కొనసాగించే ప్రయాణం జీవితం. ఆ జీవితాన్ని సార్థకంగా మార్చుకోవడం కోసం రూపొందించుకున్న సంకల్పంతో కూడిన సాధనం లక్ష్యం. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తూ సమాజంలో ఉన్నతమైన వ్యక్తిత్వంతో, మానవతతో, నిస్వార్థంగా, నిజాయితీగా విలువలతో కూడిన జీవనం కొనసాగించడమే మానవ జీవన లక్ష్యం.
“మనం దేన్నైతే సాధించాలనుకుంటామో దానికోసం ప్రయత్నిస్తే నీ విజయాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు” అన్నారు స్వామి వివేకానంద.
మనిషి జన్మించిన తర్వాత ఎందుకు పుట్టామో, ఏమి చేయాలనుకుంటామో అనే ఆలోచన లేకుండానే కొందరి జీవితాలు గడిచిపోతుంటాయి. కోటి విద్యలు కూటికోరకే అనే సిద్ధాంతాన్ని అలవరచుకుని శరీరం పోషించుకోవడం, డబ్బు సంపాదించుకోవడం తెల్లారి లేచామా వండుకున్నామా తిన్నామా అనే పద్ధతితో బతుకులు కొనసాగించే వారికి లక్ష్యం అంటూ ఏమీ ఉండదు, కేవలం పొట్ట నింపుకోవడమే.
మానవ జీవన లక్ష్యంలో లక్ష్యం అంటే గురి. ప్రతి మనిషికి తమ జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉండాలి. అది లేకపోతే గమ్యంలేని నావలో పయనించినట్లవుతుంది. మనసులో ప్రేరణ కలగాలంటే బలమైన లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం గురించి ఆకలి లాంటి తపన ఉండాలి. నిత్య స్ఫూర్తి కలిగిన వారికి నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. లక్ష్యసాధనకు శ్రద్ధ ఓర్పు, ఏకాగ్రత, పట్టుదల నిజాయితీలు అవసరం.
మన లక్ష్యమే మన జీవితం. లక్ష్యాన్ని బట్టే జీవితగమనం ఉంటుంది. మానవ జీవిత సాఫల్యానికి లక్ష్యం మౌలిక సాధనం. స్పష్టత లేని జీవితం ఆగమ్య గోచరం. లక్ష్యం నిర్దేశించుకోవడానికి ముందుగా సమగ్రమైన విషయ అవగాహనని అలవరచుకోవాలి. లక్ష్యం ఏర్పరచుకోవటం పెద్దల వల్ల, గురువుల వల్ల కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పరచుకోవచ్చు.
కొన్ని మనం చూసినవి, మనం తెలుసుకొన్నవీ మన పైన ప్రభావం చూపిస్తాయి. మనం లక్ష్యం నిర్దేశించుకోవడం అంటే మనల్ని మనం తిరిగి చూసుకోవడం. ఆ లక్ష్యం మనం చేరుకోగలమా అనే బేరీజు వేసుకోవాలి. తగిన మానసిక దృఢత్వాన్ని అలవరచుకోవాలి. మన శక్తి సామర్థ్యాలను సరిచూసుకోవాలి. అసాధ్యమైన వాటిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంటున్నామా అని ఆలోచించుకోవాలి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే సత్తా మనలో ఉందా లేదా అనేది తరచి చూసుకోవాలి. లక్ష్య సాధన ఎలా చేయగలమో మనకో ప్రణాళికను మనకు మనం ఏర్పరచుకోవాలి. లేదా జీవితంలో మనకు మార్గనిర్దేశనం చేసేవారి సహాయాన్ని స్వీకరించాలి. మంచి ఎవరు చెప్పినా అనుసరణీయమే. సంకల్పం స్థిరంగా, పటిష్టంగా ఉంటే మానవజీవన లక్ష్యం పరిపూర్ణంగా సాధ్యమవుతుంది.
అనుకొన్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి. గొప్ప అనుభవాలవైపు మనం చేసే ప్రయాణమే జీవన లక్ష్యం. “మేలుకో పరిశ్రమించు నీ గమ్యం చేరేవరకు విశ్రమించకు” అన్న వివేకానంద వాక్కుని, “ప్రయత్నించు ప్రయత్నించు ప్రయత్నిస్తూనే ఉండు” అన్న కాళిదాసు మాటలు, “కలలు కను, ఆ కలలను సాకారం చేసుకో” అన్న అబ్దుల్ కలాం మాటలు మన చెవుల్లో నిరంతరం మార్మోగుతూ ఉండాలి. లక్ష్యం సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు. గొప్ప లక్ష్యం లేకపోవడం నేరమవుతుంది. ఎందుకంటే లక్ష్యం పై ఉన్న స్థిరత్వం పైనే గెలుపు రహస్యం దాగుంటుంది. ఈ ప్రయత్నంలో “స్థిరమైన లక్ష్యంతో పాటు ఆ లక్ష్య మార్గంలో ‘నడిచే మార్గం’ సరైనది కావాలి” అని నెహ్రూ అన్నట్లుగా మనం నడుస్తున్న ప్రతి మార్గం చూసుకుంటూ ఉండాలి.
ఒక్కొక్కసారి మనం పెంచుకున్న లక్ష్యం చిన్నదైనా విలియమ్ షేక్స్‌పియర్ అన్నట్లుగా “చిన్న చిన్న లక్ష్యాలతో ప్రయత్నాలు మొదలు పెడితేనే భారీ లక్ష్యాలు సాధ్యమవుతాయి”. లక్ష్యం చేరడంలో కష్టమైనా అసాధ్యం కాదు. ధైర్యంతో ముందుకు సాగాలి. వాల్మీకి అన్నట్లుగా ఉత్సాహంతో ఏ పని చేసినా లక్ష్యసాధనలో మనం విఫలమయ్యే ప్రసక్తే ఉండదు.
జీవితంలో క్రమశిక్షణ, సమయపాలన, నిజాయితీ, సత్యమార్గం, సత్ప్రవర్తన మానవ జీవిత లక్ష్యానికి మనల్ని చేరువ చేస్తాయి. వ్యక్తిగత ఆనందం జీవిత గమ్యం కాదు. జీవితంలో ప్రతి మలుపులో సత్యమేదో అసత్యమేదో బోధపడుతుంది. మనలో ఉన్న సత్యాన్ని నిరోధించే భావాలను వ్యతిరేకిస్తూ ఉండాలి. ఓర్పు, పట్టుదల, నిజాయితీలను ఆయుధాలుగా చేసుకుని లక్ష్యసాధన దిశగా కృషిచేయాలి. మనిషి క్రమానుసారంగా సత్ చైతన్యం వైపు మేలుకొని ఉండటమే అసలైన లక్ష్యం. మీరు ఒక లక్ష్యం మీద ఒక కన్ను ఉంచితే మీరు ఆ లక్ష్యం చేరుకునే దారి వెతుక్కోవడానికి ఒక కన్నే ఉంటుంది. మనిషి తన దృష్టిని కేంద్రీకరించవలసిన విషయం ఇదే.. అంతేకానీ నేను దేనిగా మారాలి? నా దగ్గర ఏమి ఉండాలి అని కాదు. ఈ జీవితాన్ని పెంపొందించడం ఎట్లా అన్నది మీ లక్ష్యం కావాలన్నారు సద్గురు తమ సందేశంలో.
మానవ జీవితంలో ఆనందం పొందడం మనకు పరమావధి.. మనకు నచ్చిన పనిని చేయడం ద్వారా మన లక్ష్యాన్ని సాధించుకోగలం. మనకు పరిపూర్ణమైన ఆనందాన్నిచ్చే దిశలో మనం పనిచేయాలి. ప్రతి ఒక్కరూ మహోన్నత లక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఏ జీవరాశి అయినా ఒక నిర్దేశిత లక్ష్యంతో ఈ భూమి మీద ఉద్భవిస్తుంది. ప్రపంచంలో సకల జీవరాశులున్నాయి. ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. గొప్ప లక్ష్యాలను పెట్టుకుంటే మనలో ఉన్న బలం బయటకు వచ్చి ఆ లక్ష్యసాధనకు ప్రయత్నిస్తాం.
మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన పనికోసం సృష్టించబడ్డారు. ఒకరిని చూసి ఒకరు అనుకరించడం మనం సర్వసాధారణంగా చేస్తూంటాం. ఒకరిని రోల్ మోడల్‌గా భావించుకుని వారిని ఆదర్శంగా తీసుకుని వారిలా అయిపోవాలని అనుకుంటాం.
మనం ఎంచుకునే పని పరిపూర్ణ మానసికానందం ఇవ్వాలి. మనం ఎంచుకునే పనిలో మనకున్న నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నామో లేదో మనం గమనించుకోవాలి.
సాగర్ సింధూరి మానవ జీవన లక్ష్యసాధనకు కొన్ని అద్భుతమైన సూచనలు చేశారు. లక్ష్యం ఎంచుకున్నాక దాని సాధన కోసం తిండితిప్పలు లేకున్నా సరే పనిచేయడంలో ఆనందం పొందాలి. పూర్తిగా ఆ దిశగా ఆ పనిలో లీనమవ్వాలి. ఎంచుకున్న లక్ష్య సాధన వల్ల అనుకొన్న రీతిలో అది మన అవసరాలను తీర్చగలిగే సంపాదన లేదా, మన అంచనాలకు తగిన సంపాదన సంపాదించుకోగలమో లేదో చూసుకోవాలి. లక్ష్యసాధన ఎంత పరిపూర్ణంగా ఉండాలంటే అది నీవు మాత్రమే చేయగలవు అన్న ముద్రను వేసి నిన్ను ప్రత్యేకంగా చూపించగలిగేలా ఉండాలి. నీ లక్ష్యం పదిమంది జీవితాల్లో వెలుగులు నింపేలా ఉండాలి. నీ లక్ష్యం ఎదుటివారికి ప్రయోజనకారిగా ఉండాలి.
ఈ విధంగా అకుంఠిత దీక్షతో చేస్తున్న పనిమీద శ్రద్ధ పెట్టడం ద్వారా మానవ జీవన లక్ష్యం సాధ్యమవుతుంది. ఒక పనిని నువ్వు అత్యున్నతంగా చేయగలిగేలా చేసే ప్రక్రియ ప్రేరణ.ఈ ప్రేరణ ఎదుటి వారిలో ప్రేరణ కలిగించడం కన్నా ముందు మనకి మనం ప్రరేపితులం కావాలి. ఆత్మజ్ఞానం మాత్రమే మానవునిలో కలగాలి. సత్యం మాత్రమే మనలో మార్పుని తీసుకువస్తుంది. కనుక మన గురించి మనం సత్యాన్వేషణ చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాలి.
చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాలతో ఎందరికో మానవ జీవిత లక్ష్యాలను తెలిసి వచ్చేలా చేసారు. వీరు చెప్పినట్లుగా సంకల్పసిద్ధి గొప్పగా ఉండాలి. లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి పనిచేయాలి. ఏం చేయాలన్నా దానిలో స్పష్టత ఉండాలి. నేను అనుకొన్నాను. కుదరలేదు. అని దాటేయకుండా దానికి తగినట్లుగా తగిన సమయపాలన పాటించాలి. బ్రతకడం గొప్పకాదు. పదిమందికి పనికొచ్చేలా బ్రతకాలి. చరిత్రలో కలిసిపోవడం కాదు. చరిత్ర పుటలో నీవొక కాగితం కాగలవా, నీవొక అధ్యాయం నీ పేరుమీద ఏర్పరచుకోమని అబ్దుల్ కలామ్ అన్నారని గుర్తు చేసారు.
శ్రీ జె.డి. లక్ష్మీనారాయణ గారు తమ ఉపన్యాసాలలో ఎందరినో ప్రభావితం చేస్తున్నారు. యువతని తమ జీవనలక్ష్యం ఏర్పరచుకొనే దిశలో చేసిన ప్రసంగాలతో 24 గంటలు ఇంద్రియ చాపల్యముతో గడిపేవాడు అనుకున్న లక్ష్యాలను సాధించలేడని చెప్తూ ఆదిశంకరాచార్యులు చేసిన మంచి పనులను ఉదహరించారు. యువత సరైన లక్ష్యంతో ముందుకు సాగితే దేశం మరింత ముందుకు సాగితే దేశం మరింత ముందుకు సాగుతుంది. సూర్యున్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. వ్యాయామం చేయాలి. మన ఆలోచనలకు శిక్షణ నివ్వాలి. ఉదా: సిగరెట్లు తాగేవారు, మందు తాగేవారు తమ మనస్సును అదుపులో ఉంచుకోలేకపోవడం. పిల్లలు చదువుకుంటూ స్నేహితులు పిలవగానే వెళ్ళడం. మన మనస్సు మన ఆధీనంలో ఉండాలంటే మనసు శ్వాస మన ఆధీనంలో ఉంచుకోవాలి. దీనికి ధ్యానం, ప్రాణాయామం చేసుకోవాలి. మాటను సక్రమంగా ఉపయోగించాలి. వేదిక పైన మాట్లాడలేకపోవడం, భయం ఇవన్నీ సరైన జ్ఞానం లేకపోవడం వల్ల అని తెలుసుకోవాలి. మంచిగా మాట్లాడాలన్నా, ఉపన్యాసం ఇవ్వాలన్నా ముందు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి. అందుకోసం మంచి పుస్తకాలు చదవాలి.
ఎదుటివారితో ఏం మాట్లాడాలో తెలుసుకోగలగాలి. అందుకుగాను గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదివి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అబ్దుల్ కలాం, గాంధీ, సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంటి నాయకుల జీవితం గురించి చదివి తద్వారా మన జీవన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి.
వ్యక్తిత్వ వికాసం కోసం సూక్తులలోను, ఉపన్యాసాలలోను, ప్రవచనాలలోను, సదస్సులలో, సభలలో ఎందరో తమ వంతుగా మానవ జీవన లక్ష్య నిర్దేశనంలో సహాయ సహకారాలందజేస్తున్నారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారి, రామకృష్ణమిషన్, సత్యసాయి సేవాసంస్థలు, అమ్మ ఫౌండేషన్ వంటివి విస్తృతంగా మానవ మనస్తత్వ విశ్లేషణకు మానసిక వికాసానికి, మానవ జీవన లక్ష్యాన్ని సూచించడానికి విశేషంగా కృషిచేస్తున్నాయి.
మనిషి తన జీవితం సార్థకం చేసుకొనే దిశలో ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉండి వాటిని నెరవేర్చడంలో అకుంఠిత దీక్షతో ముందుకు కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.