Site icon Sanchika

మనవడి పెళ్ళి-5

[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘మనవడి పెళ్ళి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కోమలి తన స్నేహితురాలు మైత్రేయి కుటుంబాన్ని గుర్తు చేసుకుంటుంది. వాళ్ళందరూ స్థూలకాయమని; కొంత అనువంశికంగా, కొంత ఆహారపు అలవాట్ల వల్ల వచ్చిన ఒళ్ళని అనుకుంటుంది.  మైత్రేయి తోబుట్టువుల గురించి, మైత్రేయి చదువు గురించి తలచుకుంటుంది. మెడిసిన్ చదువుతాన్న మైత్రేయిని వద్దని చెప్పి మామూలు చదువు చదివించి, ఓ మెడికల్ ఆఫీసర్‍కిచ్చి పెళ్ళిచేస్తారామె తల్లిదండ్రులు. పెళ్ళయి ఏడాదయినా సంతానం కలగకపోయేసరికి అత్తగారు మైత్రేయిని విసిగిస్తుంది. చివరికి ఏవేవో మందులు వాడితే వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుడతారు. ఆరోగ్యం సరిగా లేదని ఆపరేషన్ చేయించుకుంటుంది మైత్రేయి. అయితే మగపిల్లాడు పుడితేనే ఆస్తి ఇస్తానని మైత్రేయి అత్తగారు తన కొడుకుని బెదిరించి – సంతనం కలిగేలా – మైత్రేయికి మళ్ళీ ఆపరేషన్ చేయిస్తుంది. మూడోసారి కొడుకు పుడతాడు, కానీ కాళ్ళు వంకరగా ఉంటాయి. వైద్యులు కాళ్ళు సరిచేసి, మందులు వేసి, ఏడాది తిరిగేసరికి అన్నీ సెట్ అవుతాయని భరోసా ఇస్తారు. బాబు చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉండేవాడు కాదు, అక్కలిద్దరూ వాణ్ణి జాగ్రత్తగా పెంచుతారు. ముగ్గురు పిల్లని బాగా చదివిస్తుంది మైత్రేయి. పెద్దమ్మాయి ఎం.టెక్, చిన్నమ్మాయి పాలిటెక్నిక్ చదివారు. ఇద్దరికీ పెళ్ళి చేసి అత్తవారింటి పంపుతుంది మైత్రేయి. పెద్ద కూతురు పరిశోధన చేస్తాననంటే భర్త ఒప్పుకున్నా, ఇంట్లో వాళ్ళు గొడవ పెడతారు. కానీ భర్త అనుమతితో ఫీల్డ్ వర్క్ మొదలుపెడుతుంది. భర్త ఉద్యోగ రీత్యా గల్ఫ్ దేశాలకి వెళ్తాడు, ఆమె కూడా ఉద్యోగంలో చేరుతుంది. మైత్రేయికి సాహిత్యమంటే ఇష్టం, ఓ పేపర్‍లో వచ్చిన కవితని చదువుకుని, నిట్టూరుస్తుంది. – ఇక చదవండి.]

అధ్యాయం-11

[dropcap]కో[/dropcap]మలి పేపర్లో కవితలు చదివింది, చాలా బాగున్నాయి అనుకున్నది. పెళ్ళికాని క్రితం కాలేజీలో సంచికలో కవితలు రాసేది. కాని పెళ్ళి తరువాత అత్తగారు కాంతమ్మ కబంధ హస్తాల్లో చిక్కుకుని ఆమె మాటల్ని అలా ఆశ్యర్యంగా వింటూ ఊ అంటూ ఉండిపోయింది.

ఇప్పుడు పంచదార కట్టిచ్చిన ఆ పేపర్లో కవితలు చూస్తోంది.

పెళ్ళితో అన్ని వాళ్ళ ఇష్టప్రకారమే! వంట బాగా చేసిపెట్టు చాలు ఈ జన్మకి అంటుంది అత్త.

హాల్లో ఫోన్ రింగ్ అవుతోంది.

కాంతమ్మ అక్కడే ఉంది. కాని ఫోన్ తియ్యలేదు.

కోమలి గబగబ హాల్లోకి వచ్చి ఫోన్ ఎత్తి “హలో ఎవరండి?” అన్నది.

“నేనే కోమలి మైత్రేయిని” అన్నది.

“అబ్బా, ఎన్నాళ్ళో అయ్యింది కదా” అన్నది కోమలి.

“అవును. పెద్ద పిల్ల గల్ఫ్ వెళ్ళింది. వాళ్ళాయనకి ఇప్పటికి మోక్షం వచ్చింది. భార్య కావాలనే భావన వచ్చింది. ఇది పరిశోధన పూర్తి చేసింది. గల్ఫ్ వెళ్ళింది దాని పురిటి కోసం నేను వెళ్ళాను ముందు. తరువాత ఆయన వాలంటరీ పెట్టి వచ్చారు.

ఆ దేశంలో ఇంచుమించు పదినెలలు ఉన్నాను. ఇప్పుడు మా ఆయన అరవై వసంతాల పండుగ అంటే షష్టిపూర్తి చేస్తాము అంటున్నారు.

పెద్దపిల్లకి ఇండియాలో ఏ ఫంక్షన్ చెయ్యలేదు. గాజులు ఫంక్షన్, బారసాల అన్నీ కూడా ఆ దేశంలోనే. ఇప్పుడు అన్నప్రాసన చేస్తాము. ముందు అరవై వసంతాల పండుగ, హోమాలు, నవగ్రహ పూజలు, జపాలు, దానాలు, మళ్ళీ మంగళస్నానాలు, పెళ్ళి మంత్రాలు అన్నీ చేసి – మళ్ళీ అరవైయేళ్ళ తరువాత పెళ్ళికూతురు, పెండ్లికొడుకు అవుతాము” చెప్పింది మైత్రేయి.

“మరి పిల్లాడి పెళ్ళి అయ్యిందా!” అన్నది కోమలి.

“లేదు వాడు, వాళ్ళ అక్క సెటిల్ అయ్యే దాకా పెళ్ళి చేసుకోను అన్నాడు. ఇప్పుడు చూస్తున్నాము సంబంధాలు.. ఇకమీదట చెయ్యాలి. ముందు నీ పెళ్ళిరా అంటే కాదు, మీకు ఫంక్షన్ చేస్తాము అంటూ అక్కలు వాడు కలిసి మొదలు పెట్టారు.

నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి. ఏది ఒక్క అరగంట ప్రయాణమే కదా! కొంచెం మీ అత్తగారికి, మామగారికి వండి పెట్టి బయలుదేరితే సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు.

నువ్వు రాక తప్పదు. నా చిన్ననాటి ప్రాణమిత్రురాలివి. నిన్ను చూడాలని నాకు మనసారా ఉంది. మీ అత్తగారిని అడిగానని చెప్పు. ఆవిడకి నా మనస్పూర్తిగా నమస్కారములు తెలియజెప్పు.

పెద్దవాళ్ళు కదా! చాదస్తంగా ఉంటారు. మామగారు బావున్నారు. ఒకరికి ఒకరు అన్నట్లు జీవితంలో తోడు అవసరము. మరి ఉంటాను.

తప్పకుండా వస్తావు కదా! ఫంక్షన్ ఎల్లుండే మరచిపోవు కదా! మీ ఆయనకి కూడా చెప్పు. ఇన్విటేషన్ పిల్లలు ఒక వీడియోగా తయారు చేసారు. నేను వీడియో ఫోన్లో పెడతాను.” అని చెప్పి ఫోన్ పెట్టేసింది మైత్రేయి.

“ఎవరు? నీ పుట్టింటి వాళ్లా? అంత ఆనందంగా ముఖం వికసించింది?” అన్నది అత్తగారు.

“కాదు అత్తయ్య నా ఫ్రెండ్ మైత్రేయి. వాళ్ళ షష్టిపూర్తి మహోత్సవ కార్యక్రమానికి రమ్మని ఫోన్ చేసి పిలిచింది. మీకు నమస్కారాలు చెప్పమన్నది.”

“ఆ.. వాళ్లకి డబ్బు ఎక్కువ అందుకి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు.”

“డబ్బు ఉంటే సరా మనిషికి అంగబలం, ఆసక్తి ఉండాలి కదా! అది లేకపోతే ఏమీ చెయ్యలేరు ఎవరు కూడా! దాని కొడుకు పెళ్ళికి ఉన్నాడు. వాడే కలగ జేసుకుని చేస్తున్నాడు.”

“మన ఇంటా.. వంటా లేవు. నువ్వు కూడా చెయ్యాలని నా కొడుకుని ఊదరగొట్టకు” అంది కాంతమ్మ.

“మా నాన్న సహస్ర చంద్రోదయం చేస్తున్నారు. మా తమ్ముళ్ళు చేసారు”.

“మీ మామగారికి వచ్చే ఏడు ఎనభై నాలుగు వస్తాయి. ఏడాది పొడుగునా ఉత్సవం చెయ్యవచ్చును. ఎనభైనాలుగు పూర్తికి పెద్ద ఫంక్షన్ చెయ్యవచ్చును. ఈలోగా మన కీరణ్ పెళ్ళి చెయ్యాలి” అంటూ మురిపోతూ తొందరపెట్టింది.

“అలాగే అత్తయ్యా” అంటూ కోమలి ముసిముసి నవ్వులు నవ్వింది.

భర్త సుబ్బారావు వచ్చాక విషయం చెప్పింది.

“మా అమ్మ తెలివైనది. ముందు మనకి బంధం వేసింది. సరే మనం వెళ్ళి వద్దాము. ఎప్పటి నుంచో వచ్చే స్నేహాలు.” అన్నాడు.

“అవును అవును ఏమి పట్టుకెళ్ళదాము?” అడిగింది కోమలి.

“వాళ్లకి అన్నీ వున్నాయి. వాళ్ళ స్తోమతకి తగ్గ ఏమి ఇవ్వలేము. అభిమానంగా దీవెనలు ఇవ్వటమే” అన్నాడు సుబ్బారావు.

ఆ రోజు రానే వచ్చింది. పట్టు శాలువా, పట్టుపంచె కొన్నాడు. ఆమెకు పట్టుచీర కొన్నారు.

గాజులు, పళ్ళు, పువ్వులు పసుపు, కుంకుమ పెద్ద ప్యాకెట్లు కొన్నది. కర్పూరం దండలు కొని పట్టుకెళ్ళి కూర్చుని ఉన్నారు.

పదకొండు అయ్యింది. టిఫిన్ సెక్షన్‍కి వెళ్ళి చేసి రండి అని పీటలపై నుంచే తినమని చెప్పారు. వద్దు తిని వచ్చాము అన్నారు. అయింతే బాదంపాలు త్రాగండి అని వారి రెండవ అమ్మాయి పట్టుకుని వచ్చింది.

చక్కగా తయారు అయ్యారు పిల్లలు. హాలులో కలశాలు అన్నీ పెట్టి పూజ చేశారు. హోమాలు వీధి వాకిలి వద్ద చేశారు. వెనక్కాల కారు షెడ్లో మంగళ స్నానానికి సినిమాలో మాదిరి సెట్టింగ్ వేసి అన్ని పూలతో అలంకరించి బిందెలనిండా గులాబీ రేకులు బిందెలే, చెంబులు గంగాళానికి బంతి చామంతి దండలతో అలంకారం ఇల్లంతా పూలదండలు వీధి గేటు అలంకారం ఇల్లంతా పూల దండలు వీధి గేటు నుంచి పెట్టుకుని వచ్చారు.

ఆనాడు పెళ్ళిళ్ళకి కలర్ వీడియోలో అలంకరణలు ఇలా లేవు ఇప్పుడు అన్ని వచ్చాయి. ఆ కొత్త వైభవంతో రంగరంగ వైభవంగా ఈ ఫంక్షన్ పిల్లలు చేస్తున్నారు.

ఎంతటి అదృష్టం అందరికీ ఉండదు. ఉన్నా డబ్బు ఖర్చు పెట్టి చేసుకోవడంలో ఎంతో ఆనందము ఉన్నది.

కొత్త జీవితము ప్రారంభమే కదా మరి అంటారు.

భోజనాలు అన్ని ఘనంగా పెట్టారు, ముప్పై రకాల ఐటమ్స్ పెట్టారు. చివరగా స్టేజ్ మీద రిసెప్షన్ కూర్చోబెట్టి అందరూ బహుమతులు ఆశీర్వచనాలు ఇచ్చారు.

వచ్చిన వాళ్ళలో బంధువులకు బట్టలు పెట్టారు.

కోమలి అత్తగారికి మామగారికి కూడా కోమలి దంపతులతో పాటు బట్టలు పెట్టారు. “ఎందుకే ఇప్పుడు పిల్లాడు పెళ్ళికి పెట్టవచ్చును కదా!” అంది కోమలి.

“ఆ అది అదే.. ఇది ఇదే..” అన్నారు భార్య భర్త.

మిగిలిన వారు అందరికి తాంబూలం సెనగలు రవికెల బట్ట గాజులు అరటిపళ్ళు కర్పూరం కడ్డీలు పసుపు కుంకుమ డబ్బాలు చిన్నసైజ్‌వి వారి అకేషన్ ప్రింట్ చేసినది పెట్టి పంచి పెట్టారు.

చాలా మంది వచ్చారు. కనులవిందుగా ఉన్నది.

ఐదుగంటల ప్రాంతలో ఇంటికి తిరిగి వచ్చారు కోమలి, సుబ్బారావు.

అత్తగారుకి బట్టలు ఇచ్చింది కనుక తెగ పొగడింది అనే అర్థమయ్యింది.

‘మనింట్లో ఎప్పుడు కిరణ్ గాడు పెళ్ళి అవుతుందో, ఆ తరువాత మా ఫంక్షన్’ అనుకున్నది కాంతమ్మ.

అప్పటికీ తమ వయస్సు సహస్ర చంద్ర ఉదయానికి సరిపోతుంది. అనుకున్నది.

“కోమలీ ఇప్పటి నుంచే అన్ని లిస్ట్ రాసి పెట్టుకో” అని చెప్పి సంబరపడింది.

“దేనికైనా సమయం రావాలి అత్తయ్య!” అన్నది కోమలి.

“సరే మాకు కాస్త కాఫీ కలిపి పోసి, వంట పనిలోకి వెళ్ళు”

“అలాగే అత్తయ్య” అన్నది.

నవ్వుకుంటూ పట్టుచీర మార్చి కొంగు దోపి వంట ఇంటిలోకి వెళ్ళింది, కాఫీ కలిపి తేవడానికి.

కాఫీ తెచ్చింది. “స్థిమితంగా తాగండి! వచ్చేటప్పుడు మీకు ఇష్టమని బొప్పాస కాయ తెచ్చాను. అది ముక్కలు చేసి పెడతాను. సరేనా” అంటూ లోపలికి వెళ్ళింది.

అధ్యాయం 12

మైత్రేయి వాళ్ళింటికి దగ్గరగా ఒక సత్రం ఉంది. అందులో మేనేజర్‍గా ఉన్న అమ్మాయి ఆ ఫంక్షన్‍లో భోజనానికి వచ్చింది. ఆమెకు ఇంకా పెళ్ళి కాలేదు. కోమలి ఆ అమ్మాయిని వివరాలు అడిగింది. “పెళ్ళి కాలేదు కానీ నేను ఉద్యోగం మానను, బ్యాంక్ టెస్టులో పాస్ అయ్యాను. మంచి ఉద్యోగం, మంచి జీతం వస్తోంది, మానను” అని చెప్పింది.

***

కోమలి తెలిసినవాళ్ళు ఇచ్చిన చిట్టా అంతా తిరగవేసి ఒక పిల్లని ఎంపిక చేసింది, పిల్ల ముఖం చాలా కళగా ఉన్నది. బుగ్గలు అవీ అందంగా ఉన్నాయి. అలా అనుకుంటే ఫోటో పాస్‍పోర్ట్ సైజులో ఉన్నది.

నగలు అవి చూస్తే హిందీ వాళ్ళ మాదిరి. మర్వాడీస్ మాదిరి మంచి రంగు ఉన్నది. ‘ఎలాగైనా ఈ సంబంధం కుదిర్చి పెళ్ళి చేస్తాను. అవసరం అయితే ఇల్లరికం పెడతాను. అంతెందుకు వేరే ఇంట్లో పెట్టుకోమంటాను’ అనుకుని ఫోన్ చేసింది.

“మా పిల్లని గారంగా పెంచాము. ఐస్ క్రీమ్‌లు, అన్నీ నేతి పిండివంటలు పెట్టాము. పిల్ల ఆడింది ఆట, పాడింది పాట. అలాగని వేదిక లెక్కి కార్యక్రమాలు చెయ్యదు. ఇంటి దగ్గరే స్విమ్మింగ్ పూల్‌లో ఈత నేర్చుకుంది. డాన్స్, సంగీతం చిత్రలేఖనం అన్నీ నేర్పించి పరీక్షకి కట్టించాము. రేడియో టి.విలో ప్రోగ్రామ్స్ ఇస్తుంది. పిల్ల వెంట మేము ఉంటాము. పెళ్ళి తరువాత కూడా మేము ఉంటాము. మీకిష్టం అయితే వచ్చి చూడండి” అన్నారు.

సరే అనుకుంటే అత్తగారు అడ్డుపుల్ల వేసింది. కోమలి చివరికి “నా కొడుకు పెళ్ళి నా ఇష్టం” అని సంబంధం కుదుర్చుకుంది.

పెళ్ళి కూతురితో సహా వియ్యపురాలు, వియ్యంకుడు వచ్చేశారు. “హమ్మయ్య నా కొడుకు పెళ్ళి చేసాను. అని కోమలి తృప్తిపడింది.

సుబ్బారావుకి భార్య సంగతి తెలుసు. అత్తకి తగ్గ కోడలు అని ప్రేక్షకులు మాదిరి అన్నారు. పెద్ద హోటల్లో రంగరంగ వైభవంగా కిరణ్ పెళ్ళి ఘనంగా జరిగింది. సారె కూడా అన్ని బంగారు వెండి సరుకులు. సందడి ఇల్లంతా చక్కగా సందడిగా అందమైన ఖరీదయిన వస్తువులుతో కోడలు శ్రీ మహాలక్ష్మిలా అడుగుపెట్టింది. కోమలి ‘క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికికి నీరజాలయకును నిరంజనము’ అంటూ శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరస్వామి కీర్తనలో మగంళహారతి పాడి కోడల్ని ఇంటి గృహప్రవేశం చేయించి, అందర్నీ పిలిచి భోజనాలు పెట్టింది.

కోడలు, మేనకోడలు అంటూ అత్తగారు కోమలిని మెచ్చుకోకపోతే అంతా ఊరుకోరని “అదృష్టవంతురాలు, నీ కోడలు” అంటూ నవ్వింది. “మరి అంతేగా” అని కొడుకుతో పాటు అందరూ నవ్వారు.

***

నేడు సమాజంలో ఆడపిల్లకి కూడా మగపిల్లాడు మాదిరి విలువ ఇస్తున్నారు. కారణం జీవితం ఒక్కసారే పెళ్ళి. అందుకు వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. ఆడ మగ తేడా లేకుండా పెంచుతున్నారు.

నేడు బండి ఉపయోగించని ఆడపిల్లలు లేరు. బ్యాటరీ వాహనాలు, కరెంట్ చార్జింగ్ వాహనాలు వచ్చాక అంతా ఎంతో పురోగమనం చెందారు.

పిల్లల్ని ఎంతో గారంగా పెంచడమే కాదు. వాళ్ళు కార్లో వెడదాము అంటే కారులో లేదా విమానంలో వెడదామంటే, అలాగే తీసుకువెడుతున్నారు. వాళ్ల పిల్ల ఎక్కడ కందిపోతుందో అని కూడా బ్యాటరీ ఫ్యాన్ పట్టుకు వెడతారు.

కిరణ్‌ని పెళ్ళి చేసుకున్న సౌందర్య తల్లి తండ్రి పిల్ల వెంట వుంటారు. అల్లుడుగారు ఆఫీస్‌కి వెళ్ళాక అంతా వారి ఇష్టమే మరి, ఈనాడు పిల్లలని అంత గారంగా పెంచి పెళ్ళి చేసినప్పుడు అత్తవారు ప్రాణంగా చూసుకోవాలి.

ఈ తరంలో ఇది కొత్తమార్పు, ఆడపిల్ల కోరికలు, ఇష్టప్రకారం మగ పిల్లల తల్లి తండ్రులు కోడల్ని చూసుకోమని చెపుతున్నారు. లేదా “మేమే చూసుకుంటాము మా పిల్ల కూడా మేము ఉండి కావల్సినట్లే మా అల్లుడుని చూస్తాము. మా పిల్ల సుఖం మాకు ముఖ్యం.” అంటున్నారు.

“మా మనుమలని అతి ముఖ్యమైన పద్ధతిలో గారంగా పెంచి గొప్ప వాళ్ళని చెయ్యాలి. మా ఆస్తి అంతా వాళ్లకేగా” అంటూ కిరణ్‍ని తమ ఇంటికి తీసుకువెళ్ళారు.

తన మనవడిని వాళ్ళింటికి పంపే పద్ధతి కాంతమ్మకి నచ్చే విధంగా లేదు.

అయినా కోమలి ఆలోచించి సుబ్బారావుని ఒప్పించింది వారానికి ఒకసారి కాంతమ్మను చూడటానికి పళ్ళు పూలు పట్టుకు వచ్చేవారు కిరణ్ అత్తగారు మామగారు.

కోమలి సుబ్బారావు వాళ్ళకి వెళ్ళాలని ఉన్నప్పుడు వియ్యంకుడు ఇంటికి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు.

కాలక్రమంలో సౌందర్య ఇద్దరు ఆడపిల్లలకి తల్లి అయ్యింది. ప్రేమగా అమ్మమ్మ తాత పెంచుతున్నారు.

కిరణ్ క్రమక్రమంగా అత్తింటి వారి మాటలు వింటూ “అంతేగా అమ్మా” అంటాడు.

కోమలి ముసిముసి నవ్వులు నవ్వుతుంది. తమ కొడుకు మారినందుకు కోమలి, సుబ్బారావు సంతోషిస్తున్నారు.

“బామ్మ బామ్మ అంటూ ఆవిడ కొంగు పట్టుకుని తిరగడం మాని నీ పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకో. షాపింగ్‌కి తీసుకెళ్లి కావాల్సినవి కొనిపెట్టు, ఇంకా నీకు బామ్మ పర్మిషన్ కాదు. నీ భార్య ఇష్ట ప్రకారం నీ ఇల్లు నువ్వు సర్దుకో.

మొన్న బెంగుళూరులో మా మావయ్య కొడుక్కి పెళ్ళి అయ్యింది.

వాడు మిల్క్ బాయ్‍లా ఉండేవాడు. ఎమ్.టెక్. గోల్డ్ మెడలిస్ట్, వాడి చెల్లి డాక్టర్ ఇద్దరు కూడా బొద్దుగా ముద్దుగా ఉంటారు. వాళ్ళకి బెంగుళూరులో నాలుగు ఇళ్ళు ఉన్నాయి. చాలా ఆస్తులు ఉన్నాయని ఉన్నారు. వాళ్ళ అబ్బాయి సతీష్ పెళ్ళి చేశారు. ఆ పిల్ల వీడి బిహేవియర్ చూసి అమ్మకూచి అని చెప్పి నెలలోనే వెళ్ళిపోయింది.

అప్పుడు వాడిని వ్యక్తిత్వ వికాసం, కుటుంబ వికాసం క్లాసులకి పంపితే మార్పు వచ్చింది. మార్పువచ్చింది నిజమేనని తెలుసుకుని ఆ పిల్ల దగ్గరికి పంపారు. ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఆ పిల్ల బెంగుళూర్ బదిలీ చేయించుకుని వచ్చింది. ఇంటికి సారె పంపి తల్లి వచ్చి నెల ఉండి వెళ్ళింది.

ఇలా వుంటే ఎలా? జీవితంపై అవగాహన ఉండాలి. కొత్త పిల్లని ప్రేమగా చూడాలి. పూర్వకాలంలా కుదరదు” అని కోమలి కిరణ్‍కి చెప్పింది.

***

ఈనాటి పిల్లలు చాలా తెలివితేటలతో పుడుతున్నారు. ఈ విశ్వంలో పిల్లల్ని కనగానే సరా? వారికి చక్కని అందమైన పెంపకం, మంచి జీవితం ఇవ్వాలి. గారం గారం అంటూ మరీ బడుద్ధాయిలా, అల్లరి బుజ్జాయికి మల్లే పెంచుతూ ఉంటే ఎలా? నేడు అంతా పరుగెత్తే కాలం. దానికి తగ్గట్టుగా పిల్లల్ని పెంచాలి. ప్రేమతో పాటు డబ్బు కూడా అధికంగా ఇవ్వాలి. మూడేళ్ళ పిల్లలు సహితము బుల్లిబుల్లి కార్లలో ఇంట్లో పరెగెత్తే కార్లలో తిరుగుతూ ఉంటున్నారు.

సుబ్బారావు కొన్న అపార్ట్‌మెంట్ – సౌందర్య వస్తువులు, పిల్లల వస్తువులకు కూడా సరిపోలేదు. వెంటనే ఆమె తల్లి దండ్రి – “ఇల్లు మారాలి. మనవలకు హైజెనిక్ లేదు” అంటూ పెద్ద ఇండివిడ్యువల్ హౌస్ నెలకి యాభై వేలకి అద్దెకు తీసుకుని మనవల్ని ఆడిస్తున్నారు.

రెండు నెలలు కాగానే ఆ ఓనర్ విదేశాల నుంచి వస్తున్నట్లు ఫోన్ రావడంతో సుబ్బారావు ఫ్లాట్ కోటి రూపాయలకి అమ్మి సౌందర్య తండ్రి ఇంకో రెండున్నర కోట్ల రూపాయలతో కలిపి పెద్ద ఫామ్ హౌస్ లాంటిది కొన్నారు. అందులో మనుమలను ఆడించుకుంటూ హాయిగా జీవిస్తున్నారు.

(ఇంకా ఉంది)

Exit mobile version