[dropcap]సి[/dropcap]ద్ధానంద యోగి ఒకరోజు సాయంత్రం ఆంజనేయ స్వామి గుడి మంటపంలో కూర్చుని ప్రవచనాలు చెబుతున్నాడు. పురాణాల లోని సూక్ష్మాలను గురించి వివరించి ఆ రోజుకి సభ ముగించాడు. జనం మధ్యలో కూర్చుని ఆ మంచి విషయాలను విన్న రవిచంద్ర సిద్ధానంద యోగి ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు కలసి నమస్కారం పెట్టి ఈ విధంగా అడిగాడు –
“మహానుభావా నా పేరు రవిచంద్ర. నాకు డబ్బు బాగా సంపాదించాలనే కోరిక ఉంది. తద్వారా అవసరం ఉన్నవారికి సహాయం చేయవచ్చు, అందుకోసం డబ్బు సంపాదించే సులభ మార్గం చెప్పండి” అని అడిగాడు.
సిద్ధానంద యోగి చిరునవ్వుతో, “చూడు రవిచంద్రా డబ్బు సులభ మార్గంలో రాదు. కష్టపడి సంపాదించాలి, లేదా నీ పరిధిలో అవసరం ఉన్నవారికి సహాయం, లేదా మేలు చేస్తే నీకు ధన ప్రాప్తి ఉంటుంది. సహాయం అంటే కేవలం ధన సహాయమే కాదు, మాట సహాయం, కష్టాలలో ఉన్నవారికి ‘ధైర్య సహాయం’ రోగికి అభయ సహాయం చెయ్యగలిగితే నీవు ఊహించిన దానికంటే ఎక్కువ లాభం పొందుతావు. అది ధనమే కావచ్చు, గౌరవం కావచ్చు” చెప్పాడు సిద్ధానంద యోగి.
“అది నా బోటి సామాన్యుడికి సాధ్యం అవుతుందా?” అడిగాడు రవిచంద్ర.
“నాయనా నీకు ఒక రుద్రాక్ష మాల ఇస్తాను. అది మహిమాన్వితమైనది. నీవు చేసే సహాయంలో నీకు అపార శక్తి ఇస్తుంది. దానిని ధరించి అవసరం ఉన్న వాళ్ళకి మేలు చేస్తే నీకు తెలియకుండానే నీకు ఊహించనంత మేలు జరుగుతుంది” వివరించి రుద్రాక్షమాలను ఇచ్చి “దీని శక్తి ఆరు నెలలు మాత్రమే. ఆ తరువాత కూడా నీ శక్తి, ధైర్యం, సేవ చేసే గుణం, ఆలోచనా శక్తి వృద్ధి చెందుతాయి. నీవు దీనిని ధరించి నీకు నీవు ఎక్కువ లాభపడాలనుకుంటే మాత్రం కష్టాలలో పడతావు. దీనిని ధరించి కేవలం సేవా భావంతో ఉండు. నీకు అంతా మేలు జరుగుతుంది” వివరించాడు సిద్ధానంద యోగి.
ఆ మాలను రవిచంద్ర కళ్ళకద్దుకుని “అర్థమయింది మహానుభావా, నేను మీరు చెప్పినట్టు అవసరమైన వారికి నా పరిధిలో సహాయ, సహకారాలు అందిస్తాను, మీ దీవెనే నాకు బలం” అని ఆయనకు నమస్కరించి వెళ్ళాడు.
అలా వెళ్ళిన రవిచంద్రకు ఆంజనేయ స్వామి గుడికి కొంత దూరంలో ఒక ముసలాయన సొమ్మసిల్లి పడిపోయి ఉండటం కనబడింది. రవిచంద్ర పరుగున వెళ్ళి ఆ ముసలాయనను లేవనెత్తాడు. కొంచెం దూరంలో ఉన్న ఇంటికివెళ్ళి వారిని చెంబుతో నీళ్ళు అడిగి తెచ్చి ఆ ముసలాయనకు తాగించాడు. ఆయనకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆయనను ఒక బాడుగ బండిలో తీసుకున వెళ్ళి దగ్గరలోని వైద్యశాలలో చేర్చాడు. తన దగ్గర ఉన్నపది రూపాయలతో పండ్లుకొని తెచ్చి ఇచ్చాడు. మూడు గంటల్లోనే ఆ పెద్దాయన పూర్తిగా కోలుకున్నాడు. అది మసలితనం వలన వచ్చిన బడలిక అని వైద్యులు ఆయనకు చికిత్స అవసరం లేదని చెప్పారు.
పెద్దాయన రవిచంద్రకు నమస్కారం పెట్టబోయాడు. “తమరు పెద్దవారు నాకు నమస్కారం పెట్టకూడదు” అని సున్నితంగా తిరస్కరించాడు.
పెద్దాయన చిరునవ్వుతో తన నడుముకు కట్టుకున్న పంచెను వదులు చేసి ఒక పురాతన నాణేన్ని ఇచ్చి, “నాయనా నేను పెద్దవాడినై పోయాను. ఈ నాణెం వలన నాకు ఉపయోగం లేదు. ఇది చాలా పురాతనమైనది, ఇక్ష్వాకుల వంశ రాజులది. దీనిని నీవు పురాతన వస్తువుల విపణిలో అమ్మితే మూడువేల రూపాయలు రావచ్చు” అని చెప్పి దానిని ఇచ్చాడు.
“నాకు వద్దు తాతా మీ వాళ్ళెవరికైనా ఇవ్వండి” అన్నాడు రవిచంద్ర.
“నాకు ఎవ్వరూ లేరు నాయనా, నా భార్యా పిల్లలు ప్రమాదంలో పోయారు.. నేను ఒంటరిని” అని కన్నీళ్ళతో చెప్పాడు.
“అయితే మా ఇంటికి రా తాతా, నిన్ను నా తండ్రిలాగా చూసుకుంటాను” అన్నాడు.
ఆ తాత కొంతసేపు ఆలోచించి రవిచంద్రతో బయలుదేరాడు.
రవిచంద్ర ఆయనను ఇంటికి తీసుకవెళ్ళి మంచి తిండి, వైద్యం సమకూర్చి చక్కగా చూసుకోసాగాడు.
రవిచంద్ర ఆ నాణేన్ని పురాతన వస్తు విపణిలో అమ్మితే పదివేల రూపాయలు వచ్చాయి!
రవిచంద్ర రుద్రాక్షమాలను కళ్ళకద్దుకుని మనసులో సిద్ధానంద యోగికి నమస్కారం పెట్టుకున్నాడు. నిజమే ఆ పెద్దాయనకు సహాయం చేస్తే అంత డబ్బు వచ్చినందుకు రవిచంద్ర ఆశ్చర్యపోయాడు.
ఇలాఉండగా రవిచంద్ర ఉన్నవిజయగిరి రాజ్యం మీదకు పొరుగు రాజు దండెత్తి వస్తున్నట్లు తెలిసింది. తన మాతృభూమికి తనవంతు సహాయం చెయ్యాలని రవిచంద్ర నిశ్చయించుకుని, వెంటనే రాజుగారి వద్దకు వెళ్ళి తనను కూడా సైన్యంలో చేర్చుకోమని కానీ, అందరికంటే తనే ముందు ఉండాలని రాజుగారికి విన్నవించుకున్నాడు.
రవిచంద్ర దేశభక్తి, ధైర్యం చూసి రాజుగారు ఆశ్చర్యపోయాడు. అందుకే రవిచంద్రకు కొన్నియుద్ధ మెళకువలు, కత్తి యుద్ధం నేర్పించి సైనిక దళంలో చేర్చాడు.
కొద్ది రోజుల తరువాత పొరుగు రాజు సైన్యంతో వచ్చి విజయగిరి రాజ్యంపై దండెత్తడానికి గుడారాలు వేసుకుని సైనిక కవాతు ప్రారంభించాడు.
రవిచంద్ర ఒక్కసారి సిద్ధానంద యోగిని తలచుకుని అందరికంటె ముందువెళ్ళి గుడారాలకు దూరంగా నిలబడి శత్రుసైన్యాన్ని పరిశీలించసాగాడు.
కానీ శత్రు రాజుకు వారి సైన్యానికి రవిచంద్ర పది అడుగుల ఎత్తుగా చేతిలో ఒక విచిత్ర ఆయుధంతో భీకరంగా కనబడసాగాడు. ఆ భీకర ఆకారాన్ని చూసి శత్రురాజు, సైనికులు గడగడ వణికి పోయారు.శత్రు రాజు కూడా రవిచంద్రను చూసి అతను సామాన్యుడు కాడని విశేష శక్తి గలవాడిగా అంచనా వేసుకుని యుద్ధం విరమించుకుని సంధికోసం తెల్ల పతాకం చేతబూని రవిచంద్ర వద్దకు వచ్చాడు.
రవిచంద్ర ఆ రాజుచేత శాంతి సంధి పత్రం రాయించి ఇక ఎప్పటికీ యుద్ధం చేయకూడదని కూడా రాయించి తన రాజు గారి వద్దకు తీసుక వెళ్ళాడు. రవిచంద్ర ధైర్యానికి, శక్తికి మెచ్చి రాజుగారు రెండువందల ఎకరాలు మాగాణి భూమిని, మంచి భవనాన్ని ఇచ్చాడు.
ఆ విధంగా ఆరునెలలు గడచి పోయాయి. రవిచంద్ర సిద్ధానంద యోగి వద్దకు వెళ్ళి నమస్కరించి “మహానుభావా మీరు చెప్పినట్టే అంతా జరిగింది. మీరిచ్చిన రుద్రాక్షమాల వలన మన రాజ్యాన్ని శత్రు రాజు దండయాత్ర నుండి కాపాడాను. ఇప్పుడు నాకు భూమి, భవనం చేకూరాయి. ఇకనుండి నేను మరింతగా అవసరం ఉన్నవారికి సహాయం చేస్తూ నా శేష జీవితాన్ని గడుపుతాను” అని నమస్కారం పెట్టి చెప్పాడు.
“మంచిది నాయనా నీలో మేలు చేసే గుణం, మంచి చేసే గుణం నిన్ను సదా కాపాడుతాయి” అని రవిచంద్రను ఆశీర్వదించి పంపివేశాడు సిద్ధానంద యోగి.