[dropcap]చా[/dropcap]లా కాలం క్రితం శ్రద్ధావతి రాజ్యాన్ని కాలసింహుడు పరిపాలించేవాడు. ఆయన మంచి పరిపాలన చేస్తున్నా కాలక్రమేణా కొన్ని బలహీనతలకు లొంగి పోసాగాడు.
ఆయనలో వస్తున్న మార్పులను గమనించిన మంత్రులు నమ్రతగా చెప్పి చూశారు.
మనిషిని మంచి మార్గం కంటే, చెడు మార్గం ఎక్కువగా ఆకర్షిస్తుంది కదా! అందుకే ఆయన మంత్రుల హిత వచనాలు పట్టించుకోకుండా తన బలహీనతల్లో తాను మునిగి పోసాగాడు!
పరిపాలన పట్టించుకోకపోవడం వలన రాజ్యంలో ప్రజలు ఇబ్బంది పడసాగారు. అభివృద్ధి పనులు సజావుగా జరగడంలేదు!
క్రమేణా ప్రజల్లో రాజు మీద ఏవగింపు కొనసాగింది. రాజు రోజూ త్రాగుతూ మత్తులో ఓలలాడుతూ, వివిధ నర్తకీమణుల నృత్యాలు వీక్షిస్తూ కాలం గడుపుతున్నాడు.
అవన్నీ గమనించిన మంత్రి సుహస్తుడికి మంచి ఆలోచన వచ్చింది. సుహస్తుడు కవి ఆనందుడిని కలసి వ్రాయవలసిన నృత్య నాటికకు తగిన విషయం వివరించాడు. ఎందుకంటే రాజు అప్పుడప్పుడు నృత్య నాటికలు చూస్తుంటాడు కాబట్టి ఆయనలో మార్పు తీసుకు రాగలిగిన విషయం వివరించాడు. అందులో రాజు వ్యసనాలలో మునిగి పోయినట్టు, ప్రజలు తిరుగుబాటు వలన ఆ రాజు ఏ విధంగా నాశనం అయిపోయింది, కవి ఆనందుడు ఎంతో హృద్యంగా వివరించాడు!
ఆ నృత్య నాటికను రాజ్యంలోని ఉద్దండ కళాకారులచేత నటింప చేశారు.
మంత్రి సుహస్తుడు ఆలోచించినట్లే ఆ నృత్య నాటిక రాజును ఆలోచింప చేసింది! ఇక మెల్లగా వ్యసనాలకు దూరం అవ్వాలని రాజు ఆలోచించాడు. కానీ ఒక్క రోజులో మార్పులు రావు కదా! రాజధానిలో నాలుగు కూడళ్లలో తన విగ్రహాలు పెట్టి విగ్రహాల క్రింద తను చేయబోయే మంచి పనులు వ్రాయించాలని నరసింహుడు మంత్రులను ఆదేశించాడు.
రాజులో ఎంత మార్పు వచ్చినా, జరగవలసిన నష్టం జరిగింది పోయింది. విగ్రహాల కింద వ్రాతలు ప్రజలు నమ్మ లేదు!
అన్ని వ్యసనాలను తగ్గించినా రాజు త్రాగడు మానలేదు! దాని వలన ఆయన ఆరోగ్యం దెబ్బ తినింది. ఒక రోజు ఆయన కన్ను మూశాడు!
రాజు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోలేదు కాబట్టి రాజు మరణ వార్త విని వారు అంత బాధ పడలేదు! కొంత కాలం తరువాత రాజు గారి విగ్రహాలను ముక్కలు చేసి కొంత మంది ఆ కంచు, వెండి అమ్ముకుని అవసరాలు తీర్చుకున్నారు! అంతటితో కాలసింహుడి హయాం అయిపోయింది!
ప్రజలు రాజు గారి విగ్రహాల స్థానంలో కవి ఆనందుడి, మంత్రి సుహస్తుడు, నృత్య నాటికను రంజింప చేసిన కళాకారుల చిన్న విగ్రహాలు పెట్టి కింద ఫలకాల మీద వారిని గురించి వ్రాయించారు.
చూశారా, పదవి ఉన్నప్పుడు మంచి పనులు చెయ్యాలి, ప్రజల మనసులో నిలవాలి. అప్పుడే మంచి చేసిన రాజు గాని అధికారి పేరు నిలబడుతుంది! ఇందుకు ఎన్నో ఉదాహరణలు కృష్ణదేవరాయలు, అశోకుడు మొదలైన మంచి రాజులు.