Site icon Sanchika

మంచిమాట – ముత్యాలమూట

[box type=’note’ fontsize=’16’] ఒక వివేకవంతమైన మాట, సందర్భోచితమైన సమాధానం ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో వివరించారు యండి. ఉస్మాన్‍ఖాన్ “మంచిమాట ముత్యాలమూట” కథలో. [/box]

[dropcap]మం[/dropcap]చిమాట అందరికీ నచ్చుతుంది. వివేకంతో మాట్లాడేమాట ఎన్నో ప్రయోజనాలను చేకూర్చి పెడుతుంది. దేవుడు మానవుడికి తెలివితేటలనిచ్చాడు. తెలివిని ఉపయోగించి, వివేకంతో మాట్లాడి ఒక రైతు ఎంతటి లాభాన్ని ఆర్జించాడో చూడండి.

పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. అతను తన మంత్రులకు ఇలా ఆదేశించాడు. ‘నేను ఎవరి మాటలనైనా మెచ్చుకుంటే, ప్రశంసిస్తే, వారికి వెయ్యి నాణేలు కానుకగా ఇవ్వండి.’

మంత్రులు సరేనన్నారు. ఒకరోజు రాజు వేటకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక ముసలిరైతు తనచేలో మొక్కలు నాటుతున్నాడు. అది చూసి, వెంట ఉన్నభటులతో, ‘చూశారా ఈ వృద్ధుడు ఈ వయసులో కూడా ఎలా కష్టపడుతున్నాడో! వెంట్రుకలన్నీ తెల్లబడి పొయ్యాయి. నడుం కూడా వంగిపోయింది. అయినా ఆశ చావలేదు. ఆ మొక్కలు పెరిగేదెప్పుడు, కాసేదెప్పుడు, కాటికి కాళ్ళు జాపిన ఈ ముసలాడు తినేదెప్పుడు?’ అన్నాడు సేవకులతో.

‘అవును మహారాజా తమరు చెప్పింది నిజం’ అన్నారు సేవకులు.

‘సరే ఆ వృద్ధుణ్ణి నా దగ్గరకు తీసుకురండి. అనవసరపు శ్రమ ఎందుకని ముసిలాడికి నచ్చజెపుతా’ అన్నాడు.

వెంటనే ఆ వృద్ధ రైతును రాజ దర్బారులో  ప్రవేశపెట్టడం జరిగింది. రాజు ఆ రైతు నుద్దేశించి, ‘ఏం పెద్దమనిషీ! నీ వయసెంత?’ అని ప్రశ్నించాడు.

‘అయ్యా, నా వయసు 86 సంవత్సరాలు’ సమాధానం చెప్పాడు వృద్ధుడు.

‘ఇంకెన్నాళ్ళు బ్రతుకుతావో ఏమైనా అంచనా ఉందా?’ మళ్ళీ ప్రశ్నించాడు రాజు.

‘లేదయ్యా. నేనే కాదు ప్రపంచంలో  ఎవరూ చెప్పలేరయ్యా. మహా అయితే ఇంకో రెండు మూడేళ్ళు బతుకుతానేమో’ అన్నాడు.

‘మరిప్పుడు నువ్వు నాటుతున్న మొక్కలు ఎన్నాళ్ళకు కాపుకొస్తాయి?’

‘ఒక పదేళ్ళకు కాస్తాయనుకుంటా.’

‘మరి వీటివల్ల నీకు లాభమేమిటి? కనీసం వీటి పళ్ళు కూడా నువ్వు తినలేవు. ఇది అనవసరపు శ్రమే కదా నీకు?’ అన్నాడు రాజు

‘మహారాజా! దేవుడు ఎవరి శ్రమనూ వృధాగా పోనివ్వడు. నా పూర్వీకులు నాటిన మొక్కల ఫల సాయాన్ని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఈ రోజు నేను నాటిన మొక్కల ఫలసాయం రేపు నా సంతానం అనుభవిస్తుంది. దైవ సృష్టిలో వివేకవంతులైన ప్రజలు ఇలాగే చేస్తారు’ అన్నాడు వృద్ధుడు.

‘ఓహ్! చాలా బాగా చెప్పావు. నీ మాట నాకు నచ్చింది’ అన్నాడు మహారాజు.

రాజు ముందుగా చెప్పిన ప్రకారం సేవకులు ఆ వృద్ధుడికి వెయ్యి నాణేల సంచి బహుమానంగా అందజేశారు. బహుమానం అందుకున్న వృద్ధుడు, ‘మహారాజా! నేను నాటిన ఈ మొక్కలు ఇంకా పదేళ్ళకు గాని ఫలాలనిస్తాయి. కాని వాటి ప్రతిఫలం ఇప్పుడే నా చేతికందింది’ అన్నాడు.

‘పెద్దమనిషీ,ఎంత బాగా చెప్పావు. ఈ మాట నాకు బాగా నచ్చింది’ అన్నాడు రాజు.

వెంటనే మరో వెయ్యి నాణేల సంచి బహుమతిగా అందజేయడం జరిగింది. రెండవసారి మరో బహుమతి పొందిన వృద్ధుడు, ‘మహారాజా, నా ఈ మొక్కలు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కాపునిస్తాయి. కాని నాకిప్పుడు వాటి రెండవ పంట కూడా చేతికందింది’ అన్నాడు మహదానందంతో.

‘పెద్దమనిషీ, ఎంత బాగా చెప్పావు. నాకు ఈ మాట కూడా నచ్చింది’ అన్నాడు మహారాజు రైతును మెచ్చుకుంటూ..

దీంతో సేవకులు అతనికి మరో కానుకను బహూకరించారు. మూడవ బహుమతినీ అందుకున్నరైతు, ‘నా స్వహస్తాలతో నాటిన ఈ మొక్కలు పంటకొచ్చినప్పుడు వాటిని కోసి, మార్కెట్‌కు తీసుకెళ్ళి అమ్మాల్సి ఉంటుంది. కాని నాకైతే ఇప్పుడు ఎలాంటి శ్రమా లేకుండా, కూర్చున్నచోటే డబ్బులు కురుస్తున్నాయి’ అన్నాడు.

ఈమాట రాజుగారికి ఎంతగానో నచ్చి, ‘భళా భళా’ అని గొప్పగా ప్రశంసించాడు. ఈసారి భటులు రైతుకు రెండువేల సంచిని బహూకరించారు. వృద్ధుడు దాన్ని కూడా స్వీకరించి, ‘రాజా..! నేను నాపూర్వీకుల ద్వారా విన్నదేమిటంటే, రాజు మంచివాడైతే, రైతులు, కూలీలు, చేతివృత్తుల వారిని గౌరవించేవాడైతే, ప్రజల పట్ల ప్రేమ గల వాడైతే దేశప్రజలు సంతోషంగా ఉంటారు. నేనీ మాటలు గతంలో చెవులారా విన్నాను, కాని ఇప్పుడు ప్రత్యక్షంగా కళ్ళారా చూస్తున్నాను’ అన్నాడు.

రాజు ఈ మాటలకు అమితంగా సంతోషించాడు. ‘భళా భళా’ అని గొప్పగా మెచ్చుకున్నాడు. వెంటనే సేవకులు మరిన్ని బహుమతులు అతనికి ఇస్తూ, ‘ఇప్పుడిక నీ ఇష్టమొచ్చింది కోరవచ్చు. రాజుగారు నువ్వేమడిగినా కాదనరు’ అని చెప్పారు.

అప్పుడా వృద్ధరైతు, ‘రాజా..! మా రైతాంగానికి నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. నీటి అవసరం తీరే ఏర్పాట్లు చేయండి, మహారాజా’ అని విన్నవించుకున్నాడు.

వెంటనే మహారాజు తన రాజ్యంలో చెరువులు, కాలువలు తవ్వించి, ప్రాజెక్టులు కట్టించి నీటి కొరత అనేది లేకుండా చేశాడు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఆ రాజ్యంలో అభివృధ్ధి మూడుపువ్వులు ఆరుకాయలుగా పరిఢవిల్లింది.

ఒక వివేకవంతమైన మాట, సందర్భోచితమైన సమాధానం ఎంతటి ప్రభావాన్ని చూపిందో చూశారా..!

 

Exit mobile version