Site icon Sanchika

మంచిపాట మనసైన పాట -1: రుక్మిణీ కల్యాణం

[box type=’note’ fontsize=’16’] ‘మంచిపాట – మనసైన పాట’ శీర్షికతో సంచిక పాఠకులకు అద్భుతమైన సినీ పాటల నేపథ్యాన్ని, విశ్లేషణని అందిస్తున్నారు డా. కంపెల్ల రవిచంద్రన్. ఇది మొదటి భాగం. [/box]

భాగవతంలోని పద్యాల్ని ఎన్నో సినిమాల్లో వాడుకున్నారు. అందులో రుక్మిణి పద్యాల్ని “విష్ణుమాయ” చిత్రంలో ఏ.పి. కోమల, ఒకదాన్ని పి. భానుమతి “అగ్గిరాముడు”లో, “చింతామణి”లో అదే ‘నల్లనివాడు’ పద్యాన్ని వాసంతి ముఖతా “సవతి కొడుకు” చిత్రంలో అత్యంత మధురంగా వినిపించారు సంగీత దర్శకులు. అప్పట్లో అంతకుమించినట్లు ఎవరూ పాడలేరు అనుకున్నారు ప్రేక్షకులు. కానీ ఆ అంచనా “శ్రీక్రిష్ణపాండవీయం” (1966) చిత్రంతో తారుమారైంది.

పురాణాల్ని అత్యంత భక్తిశ్రద్ధలతో తెరకెక్కించిన ఏకైక సంస్థ ఎన్.ఏ.టి. ఈ సంస్థ తీసిన ఈ చిత్రంలో ‘రుక్మిణీ కల్యాణం’ ఘట్టం ఒక మధుర స్వప్నం. ఈ ఘట్టంలో ఉన్న పద్యాలన్నీ భాగవతంలోనివి. ‘నల్లనివాడు’ పద్యాన్ని పి.బి. శ్రీనివాస్ గానం చేయగా వింటూంటే, ఆ మోహనమూర్తి పట్ల రుక్మిణికి భక్తి ప్రేమలు వెంటనే ఎందుకు కలిగాయో సులభంగా అర్థమౌతుంది. ‘ఘనుడా భూసురు డేగెనో’, ‘లగ్నంబెల్లి’ అన్న పద్యాల్లో ‘నా భాగ్యమెట్లున్నదో’ అని రుక్మిణి తలపోసినపుడు ఆమె మనసులో మెదిలిన భావాలన్నీ పి. సుశీల కంఠంలో ప్రతిబింబించాయి. ‘ఆ ఎలనాగ నీకు తగు’, ‘రాక్షస వివాహమునన్’ తనను చేకొనమని రుక్మిణి కోరినదని అగ్నిద్యోతనుడు శ్రీకృష్ణునికి చెప్పినప్పుడు ‘వచ్చెద విదర్భ భూమికి’ అని శ్రీకృష్ణుడు అభయమిచ్చిన పద్యం ఘంటసాల కంఠంలో వినబడుతుంటే, సంసారసాగరంలో మునిగితేలుతున్న మానవునికి కృష్ణాభయ ముద్రను చూసినంత సంతోషం కలుగుతుంది.

పద్యాలకు రాగాలు, స్వరాలు అమర్చడంలో టి.వి.రాజు చూపిన నైపుణ్యం అద్భుతం. భావానికి తగిన న్యాయం చేసే రాగాల్ని ఎన్నుకొని ఆ భావ ప్రకటనలకు అనువైన స్వరావళులను ఏర్పరచడమే జరిగింది కాని, ఎక్కడా సంగీతం కోసామని సంగతులు జొప్పించడం జరగలేదీ ఘట్టంలో!

ఇవి పాడిన పి.బి. శ్రీనివాస్, ఘంటసాల, పి. సుశీల కూడా తమనూ, ప్రతీ కళాకారునికీ ఉండే స్వోత్కర్షనూ పూర్తిగా మరచి, ఆ పాత్రలలో లీనమై పాడారు. వీరి గానానికి అతి సహజమైన నటన చూపించి, వాటి రాణింపుకు దోహదం చేసిన ఎన్.టి.రామారావు, కాంతారావు, కె.ఆర్. విజయ, వంగర ల నటనాపటిమ విస్మరింపరానిది!

1965లో రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా బహుమతి గెలుచుకున్న చిత్రమిది. కె.ఆర్. విజయకు తెలుగులో తొలి చిత్రమిది. ఎన్.టి.రామారావు శ్రీకృష్ణునిగా, దుర్యోధనుడిగా ద్విపాత్రాభినయనం చేసిన ఈ మహత్తర పౌరాణికానికి ఆయనే దర్శకుడు కూడా!

Exit mobile version