[box type=’note’ fontsize=’16’] ‘మంచిపాట – మనసైన పాట’ శీర్షికతో సంచిక పాఠకులకు అద్భుతమైన సినీ పాటల నేపథ్యాన్ని, విశ్లేషణని అందిస్తున్నారు డా. కంపెల్ల రవిచంద్రన్. ఇది రెండవ భాగం. [/box]
రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ డాక్టర్ ఆనంద్ (1966) చిత్రంలోనిదీ పాట. రచన – దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం – కె.వి. మహదేవన్.
మధురప్రణయిని రాధ తన గోపికలతో, పిలుసున్న జారువలపుల జాజిలతల జడివాన ఈ పాట.
అచ్చ తెలుగు నుడికారానికి, స్వచ్ఛమైన స్వరార్చన అందించింది కె.వి. మహదేవన్. మొదట ఈ చిత్రానికి సంగీత దర్శకుడు టి. చలపతిరావు. ఈ చిత్రంలో ఆత్రేయ రాసిన ఒక పాట పల్లవి ట్యూన్ కట్టడానికి పనికిరాదన్నారు చలపతిరావు. “మూగమనసులు” ప్రభావంతో ఆ సమయంలో కె.వి. మహదేవన్ హవా నడుస్తోన్న అప్పట్లో, ఈ చిత్ర దర్శకుడు (వి. మధుసూదనరావు) చలపతిరావును సంగీత దర్శకుడిగా నియమించుకున్నా, పై సాకుతో తమ్మారెడ్ది కృష్ణమూర్తి (నిర్మాత), అతని స్థానంలో మహదేవన్‌ను తీసుకున్నారు. ‘మామ’ ఆత్రేయ రాసిచ్చిన పల్లవికే వరుస కట్టారు.
కె.వి. మహదేవన్ – కృష్ణశాస్త్రిల కాంబినేషన్ ప్రారంభమైందీ చిత్రంలోని ఈ పాటతోనే. ఈ పాటలో దేవులపల్లి రచన ఎంత రమ్యంగా ఉందో, వరుసా అంతే సొగసుగా సమకూర్చారు మహదేవన్. పి. సుశీల బృందం పాడటం, అభినేత్రి కాంచన నృత్యం వాటికి తగిన అందాలే.
ఈ చిత్రం విడుదలై సరిగ్గా ఇది యాభై రెండవ సంవత్సరం. అప్పట్లో ఈ చిత్రం పరాచయం పాలైనా, ఈ పాట ఈనాటికీ వసివాడక రేడియోల్లోనో, టీ.వీ. ఛానల్స్‌లోనో విన్పిస్తూనే ఉన్న దివ్య పారిజాతం.
***
నీలమోహనా రారా…
నిన్ను పిలిచె నెమలి నెరజాణ
జారువలపు జడివాన కురిసెరా
జాజిలత మేను తడిసెరా
లతలాగే నా మనసు తడిసెరా. ॥ నీల॥
ఏలాగె మతిమాలి?
ఏడే నీ వనమాలి?
అతడేనేమో అనుకున్నానే
అంత దవుల శ్రావణ మేఘములగనీ ॥ అతడే॥
ప్రతిమబ్బు ప్రభువైతే
ప్రతికొమ్మ మురళైతే
ఏలాగె
ఆ… ఆ… ఆ… ఆ…
సారెకు దాగెదవేమి?
నీ రూపము దాచి దాచి
ఊరించుటకా స్వామీ?
నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు
నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా
అటు… అటు… ఇటు… ఇటు…
ఆ పొగడకొమ్మవైపు
ఈ మొగలి గుబురువైపు
కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా…
నీలిమేఘమాకాశము విడిచి… నేల నడుస్తుందా?
నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా?
నవ్వే పెదవులకూ మువ్వల మురళుందా?
పెదవి నందితే పేద వెదుళ్ళు కదిలి పాడుతాయా?
నడిచే మబ్బులకు నవ్వే పెదవులు
నవ్వే పెదవులకు మువ్వల వేణువులు