[dropcap]ప్ర[/dropcap]కృతి మాత కనుసైగల్లో
పత్ర పరిష్వంగనంలో
మైమరచిన తుషారబిందువుల్ని
అప్పుడే నిద్రలేచిన సూరీడు
గుర్రుగా కన్నెర్ర చేయగా
ఉలిక్కిపడి హరిత కొంగుచాటున
దాక్కున తుహిన తుంపరలు
జీవిత పరమార్థ అన్వేషణలో
కొండలూ కోనలూ చెట్లూపుట్టల్ని
మనసారా అభిషేకించి
సంప్రోక్షణం చేసి
కమ్మని చెమ్మదనానికి
అమ్మని మించిన ఆప్యాయతా
నాన్నని మించిన ఆదరణా
రంగరించి ప్రదర్శించి
ఓ ఆదర్శ రూపానికి ప్రతీక కావాలని
హిమబిందు బాంధవ్య కామన.