యువభారతి వారి ‘మందార మకరందాలు’ – పరిచయం

1
2

మందార మకరందాలు:

[dropcap]తె[/dropcap]లుగు సాహిత్య చరిత్రలో పోతనకి ఒక విశిష్ట స్థానం ఉంది. తెలుగు భాషని మకరందంతో రంగరించి మందారాల్లాంటి పద్యాలను అందించిన ఘనత పోతన గారిది. నిన్నటి తరంలో మహాభాగవతంలోని కనీసం కొన్ని పద్యాలైనా నోటికి రాని తెలుగువాడు ఉండేవాడు కాదంటే అతిశయోక్తి కాదు. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కల్యాణం, వామనావతార ఘట్టం వంటి సన్నివేశాలలో పోతనగారు వ్రాసిన పద్యాలు – కవితలతో కట్టిన బొమ్మలు, అక్షరాలలో అమర్చిన శిల్పాలు, పాత్రల మనః ప్రవృత్తికి ఛందం పట్టిన దర్పణాలు –  తెలుగు భాషాప్రియులకు మధుర మకరంద సదృశాలు.

అటువంటి పోతన భాగవతం లోని ఏర్చి కూర్చిన కొన్ని పద్యాలకు,  జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి కమనీయ వ్యాఖ్యానమే, యువభారతి 17 వ ప్రచురణ – “మందార మకరందాలు”.   పోతన భాగవతంలో తెలుగుదనాన్ని తొలకరించే తియ్యని అందాలను, ప్రజల నాల్కలపై ఇప్పటికీ కదలాడుతూ నిత్య వ్యవహారంలో క్రొత్త అర్థాలను సంతరించుకొన్న  “ఇంతింతై.. వటుడింతయై”..    “ఊరక రారు మహాత్ములు”  వంటి పద్య పాదాలను, ఉక్తి వైచిత్రుల వలన వ్యక్తమయ్యే చమత్కారాలను, తన వ్యాఖ్యానంలో మెరుపుల్లా మెరిపింపజేశారు డా. నారాయణ రెడ్డి గారు.

ప్రథమంగా 1973 లో ప్రచురించిన 25,000 కాపీలను కేవలం ఒక్క రూపాయ ధరకే సాహితీ ప్రియులకు అందించినా, 2012 లో హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన మా స్వర్ణోత్సవాల ఆరంభ సమావేశానికి విచ్చేసిన సాహితీ బంధువులందరికీ ఉచితంగానే అందజేశాం. అలాగే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైన తరువాత జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొన్న delegates అందరికీ ఈ ప్రచురణ ఉచితంగా అందజేయబడింది.

ఈ ప్రచురణ  ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణలలో భాగంగా ఉన్నది.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ  పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/20221001_20221001_1208

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ మకరందాలను ఉచితంగానే గ్రోలవచ్చు.


యువభారతి సాహిత్య ఉద్యమానికి ప్రశంసలు

తెలుగు ప్రాభవం తిరిగి గర్వదాయక స్థాయి నందు రోజులు వస్తున్నాయని విద్యామంత్రి శ్రీ. పి. వి. హర్షం

ఆంధ్రజనత, 13-9-71

“తెలుగుజాతికి శుభోదర్కమైన రోజులు వస్తున్నాయన్న నమ్మకమేర్పడుతున్నది. తెలుగువారి సమగ్రత, సమైక్యత, భాషాప్రాభవం, గర్వదాయకమైన స్థాయి నందుకోగల వనిపిస్తున్నది.” అని నిన్న సాయంత్రం యువభారతి సాహిత్య సంస్థ అష్టమ వార్షికోత్సవాల కావ్యలహరి ఉపన్యాసమంజరి తుది సమావేశంలో ఉపన్యసిస్తూ రాష్ట్ర విద్యామంత్రి శ్రీ పి. వి. నరసింహారావు హర్షం వెల్లడించారు. యువభారతి సమావేశాలకు హాజరవుతున్న వేలాది సాహితీ పిపాసువులను చూసి ఆయన విభ్రాంతి చెందారు. తన అనుభవంలో ఇంతటి సాహితీ చైతన్యం ఎన్నడూ తెలుగువారిలో చూడలేదనీ – నిజంగా ఇది తెలుగు దేశమేనా అని అనిపిస్తున్నదనీ శ్రీ పి. వి. పేర్కొన్నారు. తెలుగు భాషకు ఒక అధికారస్థాయి తేవడానికి ప్రభుత్వం. తీసుకుంటున్న చర్యల్ని ఆయన వివరించారు.

యువభారతి సభలకు వస్తున్న జనాన్ని చూస్తుంటే క్రమబద్ధంగా క్రమశిక్షణతో జరిగే ఇటువంటి సభలు ఇక మీదట ఫతేమైదాన్ సేడియంలో ఏర్పాటు చేస్తే తప్ప స్థలం చాలదేమో ననిపిస్తున్నదని శ్రీ పి. వి. అన్నారు. సాహిత్యోపన్యాసాలకు కూడా టికెట్ పెట్టడం వంటి ఒక సంస్కారపూరిత సంప్రదాయాన్ని విద్యామంత్రి సూచనప్రాయంగా పేర్కొన్నారు.

యువభారతి సంస్థ కార్యకర్తలలో సభ్యత, సంస్కారం, వివేచన ఉన్నాయనీ ఇది ఉత్తమ కార్యక్రమాలు నిర్వహించగల దీక్ష దక్షతలు కల సంస్థగా చిరకాలం పెంపొందాలని సభాధ్యక్షత వహించిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆశించారు.

ప్రాచీన కావ్యావలోకనం ద్వారా సాహిత్యభిరుచి ఉత్తమ సాహిత్య వివేచన, కవితాహృదయం, అన్నిటికి మించి సాహిత్యసహనం పెంపొందించడానికి క్రమశిక్షణాత్మకంగా యువభారతి నిర్వహిస్తున్న సాహిత్యోద్యమం పెడదారులు తొక్కుతున్న అరాజకవాదం నుంచి యువతరానికి మంచిమార్గం చూపగలదన్న  ఆశాభావాన్ని సభకు హాజరైన పలువురు పరిశీలకులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here