[dropcap]నే[/dropcap]ను ఇది వరకు సంచికలో వ్రాసిన వ్యాసం సాహిత్య అకాడమీ అవార్డులు అన్న వ్యాసం చదివే ఉంటారు. ఒక సామాన్య పాఠకురాలిగా నా ఆవేదనని ఆ వ్యాసంలో వ్యక్తపరిచాను. ఇప్పుడు కూడా అదే విధంగా నేను గమనించిన విషయాలు Madras Music Academy సంస్థ విషయంలో వ్రాస్తున్నాను. తప్పులుంటే తప్పక సరిదిద్దుకుంటాను.
కేంద్ర సాహిత్య అకాడమీ
సాహిత్యం అంటే పెద్ద అవగాహన లేని నాలాంటి వారికి కేంద్ర సాహిత్య అకాడమీ సంస్థ అంటే ఏమిటో వారి వెబ్సైటు లో ఏమి చెప్పారో చూద్దాం.
కేంద్ర సాహిత్య అకాడమీ అనే సంస్థ భారత దేశంలో వివిధ సాహిత్య చర్చలు, ప్రచురణలు మరియు ప్రచారం కోసం ఏర్పడిన కేంద్ర సంస్థ. ఈ అకాడెమీ భారతదేశంలోని అనేక రచయితలు అందించే సాహిత్యాన్ని ఆంగ్లంతో సహా 24 భారతీయ భాషలలో ప్రచారం చేస్తుంది. భారతదేశం యొక్క సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక విషయాలలో విభిన్నమైన సాహిత్యాన్నిఅందించే ప్రయత్నం కోసమే ఈ సంస్థ ఉన్నది . విదేశాలలో భారతీయ సాహిత్యం అందించడం కూడా సాహిత్య అకాడెమి లక్ష్యాల్లో ఒకటి. అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అనేది భారత ప్రభుత్వం ఆమోదించిన భారతీయ సాహిత్యాన్ని అందించే ఒక authorized channel.
ఒకసారి కేంద్రీయ సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చిన తరువాత, అవార్డు వచ్చిన రచనలు వివిధ భాషల్లో అనువాదం చేయబడతాయి. నేను ఎప్పుడూ తీసుకునే ఉదాహరణే చెప్తాను. ఓల్గా గారు వ్రాసిన విముక్త కథలు. ఆ కథలనే ‘The Liberation of Sita’ అని ఆంగ్లంలో అనువదించారు. అయితే నా లాంటి పాఠకురాలి ప్రశ్న →
“మరి కేంద్రీయ సాహిత్య అకాడమీ లో అవార్డులు పొందుతున్న రచనలు, ముఖ్యంగా తెలుగు రచనలు, భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ న్యాయం చేకూరుస్తున్నాయా ?”
Madras Music Academy
ఇదే విధంగా Madras Music Academy కూడా శాస్త్రీయ సంగీతము మరియు నాట్యము కళలను ప్రోత్సాహ పరచడానికి, ఆ విలువలను పరిరక్షించడానికి అన్న ఉద్దేశ్యంతోటే మొదలయింది అని అన్నట్టు అర్ధమవుతుంది. వారి వెబ్సైటు లో వారి అధ్యక్షుల వారి సందేశం దీనికి ఆధారం. ఆ సందేశం ఈ విధంగా ఉంటుంది ‘The Music Academy is the premier organisation of our country involved in the promotion and safeguarding of the classical fine arts of music and dance. Its tradition and history go back 88 years to 1928, when the Academy was founded. Over these eight decades and more, the Academy has always striven to uphold the core values of classicism and maintain high standards of excellence. The classic dilemma for an organisation of this kind is to look to achieve a fine balance between the competing demands of tradition and modernity. It is fair to say that the Academy has had reasonable success in achieving that golden mean, without compromising on the classical values.’ తమిళనాట వివిధ సంగీత సభల్లో ప్రతీ ఏడాది డిసెంబర్ నెలలో జరిగే మార్గళి ఉత్సవానికి కూడా ఈ అకాడమీ నాంది పలికింది. ఈ అకాడమీ వారిచ్చే ‘సంగీత కళానిధి’ అనే బిరుదు సంగీత శాస్త్రంలో అత్యధిక ప్రమాణం కలిగి ఉన్న సన్మానంగా కూడా భావిస్తారు.
T M కృష్ణ గారికి ‘సంగీత కళానిధి’ బిరుదు
‘ఈ ఏడాది 2024 లో ఈ బిరుదుని గాయకుడైన T M కృష్ణ గారికి ఇస్తున్నాము’ అని వీరు ప్రకటించడంతో, ‘RaGa’ అని పిలవబడే అక్కా చెల్లెళ్ళు అయిన గాయనీమణులు రంజనీగాయత్రి ‘తామిక ఆ అకాడెమీలో పాడబోమని’ నిరసన ప్రకటించారు. ఎందుకంటే ‘T M కృష్ణ గారు కర్ణాటక సంగీత వాగ్గేయకారులైన త్యాగరాజుల వారిని, ప్రముఖ గాయనీమణి & భారతరత్న అయిన శ్రీమతి M S సుబ్బులక్ష్మి గారి లాంటి వారిని అవమానించారు. మరి అటువంటి వారిని ఈ అకాడమీ సత్కరిస్తున్నందుకు మా నిరసన’ అని ప్రకటించారు. వీరిని అనుసరిస్తూ, గతంలో ఈ బిరుదు తీసుకున్న కొంత మంది గాయనీ గాయకులూ, తమ ‘సంగీత కళానిధి’ బిరుదుని తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. రంజనీగాయత్రి గార్లకు జవాబుగా అకాడమీ వారు ‘అకాడమీ కమిటీ ఈ బిరుదు ఎంతో ఆలోచనతో T M కృష్ణ గారికి ఇవ్వడం నిర్ణయించారని, ఆ నిర్ణయంలో ఏ మార్పు ఉండబోదని ‘ ప్రకటించారు.
మేధావీ వర్గం గురించి చూద్దాం. ‘T M కృష్ణ గారు పీడిత వర్గాల పైన పాటలు పాడారని, అది నచ్చని గాయనీగాయకులు ‘బ్రాహ్మణ భావజాలం దూషణలు చేస్తున్నారూ’ అంటూ, Madras Music Academy పైన నిరసనలు వ్యక్తపరిచే గాయనీగాయకుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు మేధావులు. అంతే కాదు, ఇంకొందరు ముందుకి వెళ్లి ‘చాంధసవాదులు కొందరు T M కృష్ణ గారు నాస్తికులు అంటున్నారు. నాస్తికులైతే సంగీతం పాడకూడదా, పాడటానికి నమ్మకానికి లంకె ఎలా పెడతారు’ అని ప్రశ్నించడం మొదలు పెట్టారు.
బ్రాహ్మణ భావజాలం / పీడికుడు- పీడితుడు
ఈ రెండు అకాడమీ అవార్డుల విషయాల్లో నేను గమనించినది బ్రాహ్మణ భావజాలం, పీడికుడు- పీడితుడు అనే అంశాలు.
నేను ఇదివరకు చెప్పిన మాటే మళ్ళీ “T M కృష్ణ గారికి ‘సంగీత కళానిధి’ బిరుదు విషయంలో కూడా చెబుతున్నాను. ప్రతీ భారతీయ వ్యవస్థని ఈ అంశాల కోణంలో చూస్తూ, ఆ భారతీయ సంస్కృతిని వేళ్ళతో పెకలించి వేసే ప్రయత్నం ఇది.
భారతదేశం కళలకు పెట్టింది పేరు. చేనేతలు, శిల్ప కళ, చిత్ర కళ, సంగీతం, నృత్యం, సాహిత్యం అన్నీ కళలు గుడితో ముడిపడి ఉండేవి. (గత వారం కాకినాడలో వంగూరి చిట్టెన్‌రాజు గారి తెలుగు సాహిత్య సభలో రమా శాండిల్య గారి ప్రసంగం ఆధారంగా). ఏదైనా ‘కళ’ అంటే భగవంతుడికే అంకితం. అది భారతీయ సంస్కృతి.
సంగీతసాహిత్యాలు ఒక సంస్కృతి యొక్క అస్తిత్వాన్ని చెప్తాయి. భారతీయ అస్తిత్వపు రూపురేఖలు మార్చేందుకే కంకణం కట్టుకున్న కొన్ని శక్తులు చాలా ముందుచూపుతో, చక్కటి ప్రణాళికతో అనుక్షణమూ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అది క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.
సాహిత్య విషయం తీసుకుంటే గత 200 ఏళ్ళలో తెలుగు సాహిత్యంలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఏ బడికి వెళ్ళని సామాన్యులు కూడా గజేంద్ర మోక్షం పద్యాలు అనర్గళంగా పాడటమే కాదు భావం కూడా చెప్పేవారు. అటువంటిది నిఘంటువు లేకుండా ఒక పద్యం భావం తెలుసుకోలేని స్థితిలోకి వెళ్లిపోయాం. అసలు తెలుగు భాషకే చాలా దూరం అయిపోయాము.. ఇక ఉన్న తెలుగు సాహిత్యంలో కూడా తెలుగు సాహిత్యం అంటే ‘ఇలా వ్రాస్తేనే సాహిత్యం’ అని నిర్ణయించే స్థాయిదాకా వచ్చింది. ఆ ‘అలా సాహిత్యం వ్రాసిన వారే’ సాహితీ వేత్తలు. రామాయణంని ఏ దృష్టితో చూడాలో, ఏ దృష్టితో చూస్తే సాహిత్యం అవుతుందో చెప్పేస్తారు. కొన్ని పత్రికలు నాలాంటి పాఠకుడు ఏమి చదవాలో కూడా ముందే నిర్ణయం చేసి, ఏదైనా విమర్శ చేసినా ఫలానా పాఠకుడికి చదవడం రావటం లేదు అని కూడా ప్రకటనలు చేసేస్తున్నారు. ఈ విషయం ఈ మధ్య కథానిలయం వార్షికోత్సవంలో వినపడిన ఒక ప్రసంగం తీసుకుంటే కొంత స్పష్టం అవుతుంది. తాము రాసేదే సాహిత్యం, తాము మెచ్చినవారిదే సాహిత్యం అని ఎలాగైతే సాహిత్యాన్ని సంకుచిత పరిథి చట్రంలో బిగించి, ఇతర సాహిత్యం సాహిత్యమే కాదంటూ సాహిత్యంపై గుత్తాధిపత్యం నెరవేర్చే ధోరణి కనిపిస్తోందో, అదే ధోరణి భవిష్యత్తులో సంగీతంలోనూ కనిపిస్తుందేమో??
నృత్యం, సంగీతము దేవాలయంలో ఆ దేవతామూర్తికి భోగంగా చేసేవారు. ఆ భోగాన్ని చేసేందుకు కళావంతుల వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థలో భాగం పంచుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు. కొంతమంది మాత్రమే ఉండేవారు. అందులో భాగం పంచుకోవడానికి కొందరు తమ ఆడపిల్లలని దత్తత కూడా ఇచ్చేవారు. అంటే సమాజంలో ఆ వ్యవస్థ అంటే అత్యంత గౌరవమైన వ్యవస్థో అర్థమవ్వాలి. మహమ్మదీయ దండ యాత్రలతో ఆ వ్యవస్థలో కూడా మార్పులు వచ్చాయి అంటారు. ఇక బ్రిటిష్ వారి పరిపాలన మొదలయ్యాక వారు తమ చర్చిలో ‘temple prostitution’ తో సమానం చేసి వీరిని సమాజంలో వేశ్యలుగా ముద్ర వేశారు. బైబిల్ గ్రంథంలో ‘temple prostitution’ అత్యంత పాపం. అందువలన ఈ వ్యవస్థని ‘దేవదాసి చట్టం’తో పూర్తిగా నిర్మూలించారు. ఈ అంశం మీద యశోదా ఠాకూర్ గారు ఒక ఆరు గంటల podcast లో చాలా వివరంగా చెప్పారు. ఆసక్తి ఉన్నవారు వినవచ్చు.
భారతీయ సంగీతంకి మూలం సామవేదం. భారతీయ సంగీతంలో ముఖ్యమైనవి హిందుస్థానీ సంగీతం & కర్ణాటక సంగీతము. ఈ రెండిట్లో కొన్ని రాగాలు కూడా కలుస్తాయి. రెండూ కలిపి జుగల్బందీ ప్రక్రియ కూడా తెలిసినదే. అయితే హిందుస్తానీ సంగీతము మహమ్మదీయ దండయాత్రల వలన వచ్చిన పర్షియా సంగీత ప్రభావంకి గురయింది అంటారు. ఉదాహరణకి ‘ఖయాల్’ అనే ప్రక్రియ హిందూస్థానీలోని సామవేదం నుంచీ వచ్చిన ద్రుపద్ ఆధారంగా వచ్చిందే. కర్ణాటక సంగీతం పెద్దగా ఏ ప్రభావానికి లోనవ్వకుండా మూలాలతో ఉన్నది.
భారతీయ అస్తిత్వం నిండి ఉంది భారతీయ సంగీతంలో. భక్తి అనేది కర్ణాటక సంగీతానికి జీవం. భజన సంప్రదాయం భగవంతుడిని చేరుకోవడానికి, మోక్షానికి సులభ మార్గము అన్ని భారతీయులు నమ్ముతారు. భారతీయ సంగీతంలో దైవ భావన అవిభాజ్యమైన అంగం. శరీరానికి ప్రాణానికి వున్న సంబంధం సంగీతం , దైవ భావనలది.
ఒక రచన రచయిత అంతరాళం నుండీ వచ్చే భావన నుండీ వస్తుంది. సంగీతమూ అంతే. మరి అటువంటి సంగీతం భక్తి అనేది లేకుండా ఎలా పాడగలరు ఎవరైనా? సాహిత్యంలో ఒక అస్తిత్వపు కథ చెబితే, ఆ కథ వ్రాసే వ్యక్తి ‘ఆ అస్తిత్వంలో నుంచి వచ్చినవారయితే కథలో జీవించి ఎంతో బాగా చెప్పగలరు, అప్పుడే కథ బాగా పండుతుంది’ అని ఎలా అంటామో , కర్ణాటక సంగీతము కూడా అంతే కదా మరి? ‘సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా’ అని త్యాగరాజుల వారు స్పష్టంగా చెప్పకున్నారు కూడా.
ఈనాడు AI తో కూడా ఎన్నో సంగీతాలు సృష్టించవచ్చు. ఆ రోబోకి భక్తి ఉండనక్కరలేదు. మరి ఇప్పుడు చెప్పండి. T M కృష్ణ గారికి ‘సంగీత కళానిధి’ బిరుదు ఇవ్వవచ్చు అంటారా? ఎంతో మంది వాగ్గేయకారుల భక్తితో కర్ణాటక సంగీతం నిండిపోయి ఉంది. త్యాగరాజుల వారి కృతి పాడుతున్నపుడు ‘సాహిత్యం ఏమైనా పరవాలేదు’ అని చెప్పిన ఈ మహానుభావుడు ఏమి MMA policyని ‘safeguard’ ఏమి చేస్తున్నట్టు? సాహిత్యాన్నితెగ్గొట్టి ‘రాముని తోక పీవరుండు’ పాడటమా? ఇతగాడికి అవార్డు ఇవ్వడం, అకాడమీ వారు వారు ఉద్దేశ్యంలో కళని పరిరక్షించడం అని చెప్తున్నారా?
ఇంకొక అసలు ముఖ్య విషయం ఈ అవార్డు గ్రహీతలు అకాడమీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మూడేళ్ళ పాటూ ఉంటారు అని వారి వెబ్సైటు చెబుతోంది. అంటే త్వరలో ఈ అకాడమీ కూడా కేంద్ర సాహిత్య అకాడమీ లాగే, ఊంచవృత్తి చేసుకుని రోజూ వాల్మీకి రామాయణం చదువుకున్న త్యాగరాజుల వారు లాంటి, కామాక్షిని తల్చుకుని పాడుకునే శ్యామశాస్త్రుల లాంటి వారి వాగ్గేయకారులని & వారి కృతులను పీడకుడు-పీడితుడు అనే ఓ చట్రంలో బిగించి, బ్రాహ్మణ భావజాలము అనే ముద్ర వేస్తూ ఈ మార్క్సిజం సిద్ధాంతం మాట్లాడే ‘సంగీత కళానిధుల’తో నిండబోతోందన్నమాట! అంటే భారతీయ శాస్త్రీయ సంగీత అస్తిత్వపు ఛాయలు తన కళలో ప్రదర్శించే ఓ కళాకారుడు, ఆ అకాడమీ ప్రదర్శన జోలికి పోకుండా ఇంట్లో కూర్చొని పాడుకోవాలి. భారతీయ శాస్త్రీయ సంగీత అస్తిత్వపు ప్రయాణం ఎటువైపు వెళ్తోందో ఓ భారతీయుడే ఆలోచించాలి!!