[కొచ్చి లోని మంగళవనం పక్షి కేంద్రం గురించి డా. కందేపి రాణీప్రసాద్ గారు ఈ రచనలో వివరిస్తున్నారు.]
[dropcap]మం[/dropcap]గళవనం బర్డ్ శాంక్చురీ అని పిలవబడే పక్షి అభయారణ్యం కొచ్చి నగరంలోని ప్రధాన రహదారి లోనే ఉన్నది. కొచ్చిలో ఉన్న ‘కేరళ హైకోర్టు భవనం’ వెనుక వైపున ఈ పక్షి కేంద్రం ఉన్నది. కొచ్చి నగరంలో పక్షి కేంద్రాలున్నట్లుగా నాకు తెలియదు. ఎవరి దగ్గరా వినలేదు కూడా. మేము జనవరి 24వ తేదీ కొచ్చికి వెళ్ళాము. అక్కడ మేము ‘తాజ్ వివంత’లో దిగాము. తాజ్ వివంత నుంచి గ్రాండ్ హయత్‌కు వెళ్ళే దారిలో చిన్న బోర్డు కనిపించింది. అది కూడా కేరళ హైకోర్టు భవనం అనే బోర్డునూ, బిల్డింగ్‌ను చూస్తుండగా ఈ ‘మంగళవనం బర్డ్ శాంక్చురీ’ అన్న బోర్డు కనిపించింది.
బోర్డు చూడగానే లోపలకు వెళ్ళాం. చుట్టూ నీళ్ళతో, పెద్ద పెద్ద చెట్లతో బర్డ్ శాంక్చురీ కనిపించింది. అక్కడ దిగి ఫోటో తీసుకుని లోపలకు వెళుతున్నాము. అంతలో అర్జెంటుగా కాన్ఫరెన్స్‌కు రమ్మని ఫోన్ రావడంతో మావారు వెంటనే వెళ్లాలన్నారు. అక్కడితో ఆగి వెనక్కి వెళ్ళిపోయాం. ఇక్కడ గ్రేట్ కార్మోరాంట్‌లు, బ్లాచ్క్ నెక్‌డ్ స్టార్క్‌లు ఉంటాయని బయట ఉన్న బయట బోర్డుల ద్వారా చూశాము. అంతేకాక ఇక్కడ పక్షులతో పాటు యాంఫీబియన్లు, మామల్స్, రేప్టైల్స్ ఉన్నాయని బోర్డు కనిపిస్తోంది.
మళ్ళీ మరో రోజు మంగళవనం బర్డ్ శాంక్చురీ చూడటానికి వెళ్ళాము. అరేబియా సముద్రపు జలాలు ఈ పక్షి కేంద్రం లోని చెట్లకు కాపలా కాస్తున్నాయి. ఈ పక్షి కేంద్రంలో మడ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోడ్డుకు డా॥ సలీం అలీ రోడ్డు అని పేరు ఉన్నది. లోపలకు వెళ్ళటానికి 10 రూ. టికెట్ తీసుకోవాలి. మేం టికెట్లు తీసుకొని లోపలకు వెళ్ళాం. ఇక్కడ డస్ట్ బిన్ లన్నీ పక్షి ఆకారంలో నోరు తెరుచుకుని ఉన్నాయి. మొదట్లోనే ఒక చెట్టు కింద బుద్ధవిగ్రహం పూల పళ్ళలతో ఉన్నాయి. అక్కడొక ఆఫీసు బిల్డింగ్ ఉంది. మా మెడలో ఉన్న మా డాక్టర్ల కాన్ఫరెన్స్ బాడ్జీలు చూసి అక్కడున్న సిబ్బంది ఆఫీసు బిల్డింగు లోకి తీసుకెళ్ళారు. అక్కడొక మీటింగ్ జరుగుతూ ఉన్నది. మేము మీటింగ్ కు రాలేదని చెప్పాక లోపలికి దారి చూపించారు.
లోపల చెట్లు చాలా దట్టంగా ఉన్నాయి. కాలిబాట కూడా చిన్నగా ఉన్నది. స్పష్టంగా లేదు. అలా కొద్దిగా ముoదుకెళ్ళాక తల పైకెత్తి చూశాం. పెద్ద వృక్షానికి గుడ్డ పీలికలు చుట్టుకుట్టున్నట్లుగా కనిపించింది. వృక్షానికి ఆకులు లేవు మోడు చెట్టు మోడు చెట్టుకు ఇన్ని నల్ల గుడ్డ పీలికలున్నాయేమిటి అని మరింత దీక్షగా చూస్తే అప్పుడు కదలికలు కనిపించాయి. తీరా చూస్తే అవి గబ్బిలాలు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దాదాపు వందకు పైగా గబ్బిలాలను మేము మొదటి సారిగా చూశాం. అదీ చెట్టు కొమ్మలకు వేలాడటం చూస్తే చాలా గమ్మత్తుగా అనిపించింది.
గబ్బిలాలను పోటో తీసుకున్నాక కొంచెం ముందుకెళ్ళాం. బాగా పొదలుగా ఉన్నాయి. పక్షి కూతలు వినిపిస్తున్నాయి కానీ పక్షులు కనిపించడం లేదు. ఇక్కడ పక్షులు బోనుల్లో పెట్టుబడి ఉండవు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉంటాయి. కాబట్టి ప్రతి ఆకును పొదను పరీక్షగా చూడాలి. అలా పక్షుల్ని వెతుక్కుంటూ ముందుకెళ్ళేసరికి పొదల దగ్గర అలికిడి అయింది అక్కడ ప్రేమ పక్షుల జంటలు కనిపించాయి. పక్షుల కేంద్రంలో ప్రేమ పక్షులు కనిపించడం ఆశ్చర్యంగా అనిపించింది. దీన్ని కవితగా రాసుకోవచ్చును.
పక్షి కేంద్రం మధ్యలో ఎత్తైన వాచ్ టవర్ ఉన్నది. అది ఎక్కితే చెట్లు పై భాగంలో వాలిన పక్షులు కనిపిస్తాయి. ఇనుపు మెట్లతో నాలుగైదు అంతస్తుల ఎత్తున్నది. మేము పైకి ఎక్కలేదు కింద ఉన్నవి మాత్రమే చూద్దామనుకున్నాం. కేరళ రాష్ట్ర పక్షి ‘గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్’ యొక్క బోర్డును చూశాం. ఎక్కువగా బోర్డుల రూపంలో ఉన్న పక్షులనే చూశాం. లేత నీలం రంగు తోకతో పసుపు రంగు మెడ, పసుపు నలుపు రంగుల ముక్కుతో ఉన్నది ఈ పక్షి గబుక్కున ఎగిరిపోయే పక్షులను చూడటమే తప్ప ఫోటో తీసుకోలేకపోయాం. వివరంగా దాని ఆకారం గమనించడానికి కూడా ఛాన్స్ ఉండదు.
కొచ్చి నగరం నడిబొడ్డున ఉన్న మంగళవనం బర్డ్ శాంక్చురీని ‘కొచ్చి యొక్క ఆకుపచ్చని ఊపిరితిత్తి’ అని పిలుస్తారు. ఇందులో స్థానిక బాతులైన పక్షులే కాక వలస పక్షులకు కూడా ఆశ్రయం కల్పించబడుతున్నది. ఇక్కడ ‘యురేషియన్ ఆటర్’ అనే పందికొక్కులు, పెయింటెడ్ గబ్బిలాలు, ఇండియన్ ఫ్లయింగ్ షాక్స్ అనబడే క్షీరదం, మూడు చారల పామ్ స్క్విర్రెల్ వoటి అనేక ఇంతువులనూ చూడవచ్చు. నేను ఇంతుకు ముందు రెండుసార్లు కొచ్చి నగరం వెళ్ళినప్పటికీ ఈ బర్డ్ శాంక్చురీని చూడలేదు. ఒకవేళ అప్పటికి ఈ బర్డ్ శాంక్చురీ ఉన్నదో లేదో కూడా తెలియదు.
మంగళవనం బర్డ్ శాంక్చురీ 2 హెక్టార్లకు పైగా స్థలంలో నిర్మించబడింది. ఇందులో మడ అడవులు ఎక్కువగా ఉన్నాయి. అరేబియా సముద్రపు జలాలు, కొచ్చి బ్యాక్ వాటర్స్‌తో చుట్టబడి ఉన్నది. కొచ్చి నగరాన్ని వాయు కాలుష్యం నుంచి ఈ పక్షి కేంద్రం కాపాడుతుంది. అయితే నగరంలోని ఎత్తైన భవనాలు పక్షుల టేకాఫ్, లాండింగ్ లకు అంతరాయాన్ని కరిగిస్తున్నాయి. పక్షులు గూడు కట్టుకోవడానికి తెచ్చే పుల్లలు, అలాగే పక్షి పిల్లల కోసం పక్షులు తెచ్చే ఆహారం తెచ్చుకోవడానికి నగర ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తుంది. అయినప్పటికీ పర్యావరణం బాగుండాలంటే ప్రతి నగరంలోనూ పక్షి కేంద్రాలు, జంతు ఉద్యానవనాలు తప్పని సరిగా ఉండాలి.
యూకలిప్టస్ టేకు, రావి కలప చెట్లు చాలా ఎత్తుగా పెరిగి విస్తరించి ఉన్నాయి. ఆయా చెట్ల మీద పక్షుల గుళ్ళు కట్టుకుని ఉన్నాయి. నలుపు కిరీటo గల నైట్ హెరాన్లు, లిటిల్ కార్మోరాంట్లు ఇక్కడ ఉండే సాధారణ పక్షులు నల్ల కాకుల్ని కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. జనవరి నుంచి మార్చి దాకా ఈ బర్ద్ శాంక్చురీని చూడటానికి అనువైన సమయం. రెండు ఆకులు కలిసినట్లుగా ఉoడే విస్తరాకుల వంటి చెట్లు పక్షి కేంద్రం మొదట్లోనే కనిపించాయి. వేర్లన్నీ బయటకు వచ్చి రకరకాల ఆకారాలతో వింతగా కనిపించే చెట్లు, మరియు తొర్రలున్న చెట్టు కాండాలు వింత ఆకారంతో చూపరులను ఆకర్షిస్తున్నాయి. నేను ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా చెట్ల కాండాల ఆకారాలను ఫోటోలు తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా కొన్ని తీశాను. పైకస్ రేసిమోసా, పైకస్ మైక్రో కార్పా, పైకస్ రెలిజియోస్, ఫైకస్ బెంగాలెన్సిస్ మటి, మర్రి చెట్లలోని వివిధ రకాల మర్రిచెట్లున్నాయి.
‘టెరిసిఫోన్ పారడైజ్’ అనే శాస్త్రీయ నామం కలిగిన ఏషియన్ పారడైజ్ ఫ్లై కాచర్ అనే చిలకలు ఇక్కడ ఉన్నాయి. దీనికి నెమలి ఫించం రంగు గల తల, ముక్కు, నెత్తి, మీద తురాయి. ఉంటుంది. ఇది ఆసియా ఖండంలో పుట్టినప్పటికీ చాల చోట్ల వ్యాప్తి చెందింది. దీనిలో 14 ఉప జాతులు గుర్తించబడ్డాయి.
ఎక్కువగా దక్షిణ ఆసియా, దక్షిణ తూర్పు ఆసియాలో విస్తరించబడింది. ఇంకా ‘ఈస్టర్న్ ఇంపీరియల్ ఈగిల్’ అనే గద్దలు కూడా ఉంటాయి. దీని శాస్త్రీయనామం ‘యాక్విలా హెలియకా’. దక్షిణ తూర్పు యూరప్‌లో ఈ పెద్దవైన గద్దలు నివసిస్తాయి. మామూలుగా కనిపించే కొంగలు, బాతులు, కోళ్ళు వంటి పక్షలు అనేకం ఉన్నాయి.
రోజ్ రింగ్‌డ్ పారాకీట్లు, రెడ్ వెంటెడ్ బుల్ బుల్, వంటి పక్షులకు కూడా నిలయమీ పక్షి కేంద్రం. రింగ్ నెక్ చిలుకను క్రామెరీ చిలక అని, కుండా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ‘సిట్టాకులా క్రామెరీ’. దీని మెడ చుట్టూరా రోజ్ రింగ్ ఉన్నది.
రెడ్ వెంటెడ్ బుల్ బుల్ మనుష్యులతో స్నేహితంగా ఉంటాయి. ఇది సాధారణంగా కనిపించే పక్షులే కానీ అంతర్ధానo అవుతున్న వాటిలో చేర్చబడ్డాయి. నలుపు రంగు ఈకలతో తల, ముక్కు, మెడతో శరీరం లేత గోధుమ రంగులో ఉంటుంది. దీని శాస్త్రీయ నామం ‘పిక్నో నోటస్ కేఫర్’. ఇవి పెంపుడు జీవులుగా పంజరాలలో పెట్టి పెంచుకుంటారు. దీనిని ఆస్సామి భాషలో బుల్ బుల్ అని పిలుస్తారు.
భారతదేశంలో పేరు పొందిన పక్షుల అభయారణ్యాలలో నేను కొన్నింటిని చూశాను. మొత్తం పది, పదకొండు పక్షి కేంద్రాలున్నాయి. అలాగే డా॥ సలీం అలీ గారి జీవిత చరిత్రను రాశాను. పక్షి పితామహుడుగా డా॥ సలీం అలీ ప్రసిద్ధులు. ఇవీ మంగళవనం పక్షి కేంద్రం విశేషాలు.