ఇది కంగనా లక్ష్మీబాయి రనౌత్ సినిమా

4
3

[box type=’note’ fontsize=’16’] “సినిమాలో అతి పెద్ద లోపం స్క్రిప్ట్. ఎక్కడెక్కడ రాణి పాత్రను స్క్రిప్ట్ సరిగా రూపొందించలేదో అక్కడక్కడ సినిమా తేలిపోతుంది, కంగనా రనౌత్ కూడా తేలిపోతుంది. పాత్ర పట్ల కలిగే భావం నటి పట్ల కలుగుతుంది” అంటూ ‘మణికర్ణిక – ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమాని సమీక్షిస్తున్నారు కస్తూరి మురళీ కృష్ణ. [/box]

[dropcap]ఆ[/dropcap] మధ్య శ్రీదేవి ద్విపాత్రిభినయం చేసిన ‘గంగ మంగ’ లాంటి ‘చాల్ బాజ్’ అని ఒక సినిమా వచ్చింది. దాన్లో ఒక సన్నివేశంలో సన్నీ డియోల్ పాత్రతో బార్‌లో కూచుని మద్యం తాగుతూ అల్లరి శ్రీదేవి అంటుంది “ఈ పురుషాధిక్య ప్రపంచంలో నాకు నచ్చినట్టు జీవిస్తున్నాను. నాకు నచ్చినట్టు చేస్తున్నాను” అని. ప్రస్తుతం భారతీయ సినీప్రపంచంలో ఈ మాటలు ఎవరికయినా వర్తిస్తాయంటే, అవి నటి కనగనా రనౌత్‌కే. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా, పరిచయాలు, రికమండేషన్లు, శక్తిమంతులయిన తల్లితండ్రులు కుటుంబాల అండ లేకుండా, సినీ ప్రపంచంలో నిలదొక్కుకోవటమే కాకుండా, తన మాట చెల్లించుకుంటోంది. అందరినీ తన ఇష్టం ప్రకారం ఆడిస్తోంది. చివరికి ‘మణికర్ణిక’ సినిమా విడుదల ముందు బెదిరించిన వారిని ‘ఏం చేసుకుంటారో చేసుకోండి’ అన్నట్టు గడ్డిపోచల్లా తీసిపారేసింది. అలాంటి నటిని మించి ప్రస్తుతం ఝాన్సీ లక్ష్మీ బాయి వేషం వేయగలవారు మరెవరూ లేరు. అయితే, పురుషాధిక్య ప్రపంచంలో జీవిస్తూ కూడా తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నట్టే ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రనూ ఇష్టం వచ్చినట్టు చూపించేసి, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేసింది.

సినిమా ఆరంభంలోనే ఇది చరిత్ర కాదు అని వేసేశారు కాబట్టి ఇక ఆ విషయంతో సమస్య లేదు. దీన్ని చరిత్రలాగా కాక, సినిమాలా మాత్రమే విశ్లేషించాల్సి వుంటుంది. అయితే, ఈ సమీక్ష పలు కోణాల్లో సాగటం వల్ల నిడివి సినిమాలానే కాస్త పెద్దదవుతుంది. సినిమా ఒపికగా చూసినట్టే రివ్యూనూ ఓపికగా చదవండి.(సినిమా నిడివి పెద్దదవటం ఎడిటింగ్ లోపం, రివ్యూ నిడివి పెద్దదవటం సంపాదకుడి దోషం)

మణికర్ణిక సినిమా ఆసాంతం కంగనా రనౌత్ సినిమా.. మొదటి దృశ్యం నుంచి చివరి దృశ్యం వరకూ ఇది కంగనా లక్ష్మీబాయి రనౌత్ సినిమా.. నటిగా ఆమె జీవితంలో ఇదొక మైలురాయి వంటి సినిమా అనటంలో సందేహం లేదు. పాత్ర జీవితంలోని విభిన్న దశలను చక్కగా ప్రదర్శించింది. ఆరంభంలోని చిలిపి, చలాకీతనం, వివాహమయిన తరువాత కలిగే మార్పులు, రాణిగా వుండాల్సిన గాంభీర్యం, కరుణ, ఆత్మగౌరం, ఆత్మాభిమానాలు, విధవగా దైన్యం, కానీ రాణిగా బాధ్యతల భారాన్ని స్వీకరించిన గాంభీర్యము, రాజ్య రక్షణ కోసం పోరాడే పటిమ, తెగువలను చక్కగా ప్రదర్శించింది. ఈ మార్పులను ఆమె ప్రదర్శించిన తీరు, ప్రస్తుతం నటీనటుల్లో నటనలో ఆమెను అమీర్ ఖాన్ సరసన నిలుపుతుంది.

అయితే, సినిమాగా చూస్తే, ఎక్కడెక్కడ ఆ పాత్రను స్క్రిప్ట్ సరిగా రూపొందించలేదో అక్కడక్కడ సినిమా తేలిపోతుంది, కంగనా రనౌత్ కూడా తేలిపోతుంది. పాత్ర పట్ల కలిగే భావం నటి పట్ల కలుగుతుంది.

చరిత్ర సినిమాగా కాక, సినిమాగా చూస్తే కొన్ని దృశ్యాలు చక్కగా అనిపిస్తాయి. రాజమహళ్ళు, అలంకరణలు, రంగులు, తెరపై కనబడే వైశాల్యాలు చక్కగా అనిపిస్తాయి. ఆర్ట్ దర్శకుడిని, కెమేరా పనితనాన్ని మెచ్చుకోవాలనిపిస్తుంది. నేపథ్య సంగీతం కానీ, పాటలు కానీ అంతగా రిజిస్టర్ కావు.

సినిమాలో అతి పెద్ద లోపం స్క్రిప్ట్. స్క్రిప్ట్ రచయిత ఇంకా బాహుబలి హాంగోవర్ నుంచి బయటపడలేదని ఆరంభ దృశ్యాలు స్పష్టం చేస్తాయి. నీళ్ళలోంచి పాపను ఎత్తి చూపటం, లక్ష్మీబాయి పరిచయంలో నడుం వంకరగా పెట్టి బాణం గురి చూసి నిలుచోవటం వంటివి బాహుబలి తునకలు. అయితే, త్వరలోనే సినిమా ఈ హాంగోవర్ నుంచి బయటకు వచ్చి తన అస్తిత్వాన్ని నిలుపుకుంటుంది. లక్ష్మీబాయి పాత్ర వ్యక్తిత్వాన్ని చక్కగా ప్రదర్శిస్తారు ఆరంభ దృశ్యాల్లో. స్క్రిప్ట్ ఎక్కడ విఫలమయిందంటే, ఈ ఆరంభ దృశ్యాలు ప్రాతిపదికగా సినిమాలో పాత్రల వ్యక్తిత్వాలను తీర్చి దిద్ది, సినిమాలో సంఘర్షణలను, ఉద్విగ్నతలను సృజించి అర్థవంతమయిన సినిమాగా ఎదిగింపచేయటంలో. కృతకము, తర్క విరుద్ధము, ఔచితీ దూరమయిన సన్నివేశ సృజన తెరపై జరుగుతున్న సంఘటనలతో మమేకం అవటంలో అడ్డుపడతాయి. అయినా, సినిమాను పూర్తిగా చూడగలగటానికి ఏకైక కారణం, కంగనా రనౌత్.

రాణీ లక్ష్మీబాయిని ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కల వ్యక్తిగా మాత్రమే కాక, జాలి, దయ కరుణ కల చక్కని రాణిగా చూపాలని సృజించిన సన్నివేశాలు చాలా తక్కువ స్థాయివి. ఒక దొంగతో తిన్నగా యుద్ధానికి తలపడటం, దూడను రక్షించటం కోసం బ్రిటీష్‌వాళ్ళతో తలపడటం, బ్రిటీష్ అధికారి తల వంచమంటే కళ్ళెగరేసి చిరంజీవిలా, నాగార్జునలా చాలెంజిలు విసిరేయటం వంటి దృశ్యాలు హాస్యాస్పదం అనిపిస్తాయి. రాణి జీవితంలోనే ఆమె మంచితనానికి సంబంధించి ఒక కథ వుంది. పేద ప్రజలు చలికి వణకటం చూసి, నాలుగు రోజుల్లో అందరికీ రగ్గులు అందించింది… ఇలాంటి పనులవల్ల ఆమె ఝాన్సీ ప్రజలందరి హృదయాలను చూరగొంది. గౌరవాభిమానాలను అందుకుంది.

తమ లేగదూడను రాణి తెచ్చివ్వగానే అందరూ ఓ మామూలు సినిమాల్లోని ఐటం సాంగ్ లాంటి పాట పాడేయటం, వారితో పాటూ రాణి కూడా నడుం తిప్పుతూ, వొళ్ళు వూపుతూ నృత్యం చేయటం, తరువాత కళ్ళు తిరిగి పడిపోగానే, ఎవరో ఒకామె వచ్చి కళ్ళు చూసి గర్భవతి అని చెప్పేయటం (మన ప్రాచీన విజ్ఞానం అంత గొప్పది. ఇప్పుడంటే టెస్టులు అవీ చేస్తారు. అప్పుడయితే, కళ్ళు ఇలా చూసి అలా చెప్పేసేవారు), అదీ బహిరంగంగా ప్రజలందరి ముందూ చెప్పటం…. స్క్రిప్ట్ రచయిత విశృంఖల ఉన్మత్త మత్తు చిత్త పైత్య పరిపూర్ణ ఊహాత్మక శక్తి రెక్కలు తెగి పాతాళంలోపడి లుకలుకలాడుతూ విలవిలలాడిస్తోందని స్పష్టం చేస్తుంది.

ప్రధమార్ధం, ద్వితీయార్ధం నిండా వున్న యుద్ధ సన్నివేశాలకు భూమికను కల్పిస్తుంది. ఇక యుద్ధ సన్నివేశాలు, వాటి చిత్రీకరణ అనేక హాస్య సినిమాల తలదన్నే రీతిలో, చిన్నపిల్లలు సైతం పడీ పడే నవ్వి కడుపునొప్పి తెచ్చుకునేట్టు వున్నాయి. ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా యుద్ధంలో దిగిపోవటం, ప్రణాళిక వేయాలంటే గుడారంలో కూచుని ఒక మాప్ పెట్టుకుని దాని పై చేతులూపుతూ వేసేయటం, ఒకటా రెండా….. ముఖ్యంగా రాణి యుద్ధంలో దిగిన సన్నివేశాలయితే హాస్య సినిమాలు సైతం కన్నీళ్ళు కార్చేట్టున్నాయి. అన్ని దృశ్యాలలో రాణి ఒక గొప్ప శాడిస్టులా, రక్తపాత రాగరంజిత అహంకార ఉద్దీపిత రాక్షస లక్షణ సంపూర్ణగా తోస్తుంది. ముఖ్యంగా రెండు దృశ్యాలు మన స్క్రిప్ట్ రచయిత సృజనాత్మక శక్తికి దర్శక ప్రతిభకు పరాకాష్టగా నిలుస్తాయి. ఒక యుద్ధంలో మాట్రిక్స్‌లో కియానూ రీవ్స్ ఉలిక్కిపడేలా వొంగి, వాడి తలదన్నేలా రెండు చేతుల్లో కత్తులతో పొడిచేస్తుంది. మరోసారి ఎగుర్తూ, తంతూ, చీలుస్తూ కనిపిస్తుంది. అయితే, కోటపైనుంచి గుర్రంతో సహా క్రిందకు దూకి ఒక్క సెకను రాణి అదిరినట్టు చూపిన దృశ్యం ఈ సినిమాలో నిజానికి అతి దగ్గరగా వున్న దృశ్యం. ఎందుకంటే ఝాన్సి కోట ఎత్తు 935 అడుగులు మాత్రమే. అంత ఎత్తునుంచి క్రిందకు గుర్రంపై దూకిన రాణి వెంటనే పరుగెత్తినట్టు చూపకుండా అదిరినట్టు చూపటం, సినిమాను నిజానికి దగ్గరగా, నమ్మదగ్గట్టు వుంచాలన్న మన కళాకారుల ప్రయత్నానికి నిదర్శనం (సెక్స్ దృశ్యాల్లో నిజానికి దగ్గరగా వుండాలనే తాపత్రయం ఇలా 935 అడుగుల నుంచి దూకే దృశ్యాలలోనూ వుంటే ఎంతబాగుండు!!!).

ఈ సినిమాలో స్క్రిప్ట్ రచయిత చరిత్ర పరిశోధన శక్తికి చక్కటి నిదర్శనం తాతియా తోపే, నానా సాహెబ్‌ల పాత్రల రూపకల్పన. సినిమాలో మాటిమాటికీ నానా సాహెబ్ ఏడి? ఎక్కడ? అని అడుగుతారు. ఆయన కాంపూర్లో వున్నాడు.. ఇప్పటి వరకూ అని అరచి చెప్పాలనిపిస్తుంది. బ్రిటీష్ వారు భయపడి గౌరవించిన ఇద్దరు వీరులలో ఒకరయిన తాతియాతోపే వుండీలేనట్టుంటాడీ సినిమాలో….

సినిమాలో  బ్రిటీష్ వారు గుడి వెనుక ఫిరంగులు పెట్టి కాల్పులు జరుపుతూంటారు. దాంతో శత్రు ఫిరంగులపై ఎదురు కాల్పులు జరిపితే గుడి దెబ్బ తింటుందని జంకుతూంటారు (ఇదంతా అద్భుత అభూత జీమూత భూతాల కల్పనా చాతుర్యం). అదేమిటో పాత నాటకాల్లో రహస్యం మాట్లాడితే పావలా కాసువాడికి వినిపించాలనుకున్నట్టు, అత్యంత కీలకమయిన నిర్ణయాలు, చర్చలు అన్నీ మనవారు బహిరంగంగా, నుంచుని చర్చలు చేస్తారు. అలాంటి సమస్యను నుంచుని బహిరంగంగా చర్చించిన తరువాత రాణి హఠాత్తుగా కోట తలుపులు తెరచి బయటకు దూకుతుంది. ఫిరంగీ దెబ్బకు ఆమె గుర్రంబండి ఎగిరిపోతుంది. కానీ, టెర్మినేటర్‌లా ఆమె లేచి గుర్రం ఎక్కుతుంది. ఇంతలో మరో పాత్ర అలాగే పేలి సగం టెర్మినేటర్‌లా ముక్కుతూంటే, దీపావళి రోజు ఒక పెద్ద పుల్లతో టపాకాయలను దూరం నుంచి అంటించి అది పేలితే, ఎంతో గొప్ప పని సాధించినట్టు ఎలా భావిస్తారో, అలా ఒక పుల్లతో ఫిరంగీని పేల్చి చూస్తుంది రాణి..

మరో సన్నివేశంలో, కోటలోకి ప్రవేశించిన వారిని దుర్గ విగ్రహం ముందు నృత్యం చేస్తూ కూరగాయలు తరిగినట్టు తరుగుతుంది. ఆ దృశ్యంలో ఒక డెత్ కౌంటర్ పెట్టి వీరనరుకుడు దృశ్యం అని బిరుదిచ్చేయాలనిపిస్తుంది. (హాట్ షాట్స్ సినిమా తీసినావారు ఈ సినిమాను చూస్తే, హాట్ కట్స్ అని సినిమా తీసేస్తారు.)మన మామూలు సినిమాల్లో హీరోలు చేయి ఊపితే వందమంది ఎగిరిపడే దృశ్యాలకే మాత్రం తీసిపోదీ దృశ్యం.

ఇక అన్ని హాస్య, నమ్మశక్యం కాని, తర్కదూర తిక్క తిక్క దృశ్యరాజాలకే తలమానికము అనదగ్గ దృశ్యం ఒకటుంది. గ్వాలియర్ సైనికులలో దేశభక్తి రగిల్చి రాజు ఒప్పుకోకున్నా సైనికులను తనవైపు తిప్పుకోవాలని రాణి ప్రయత్నిస్తుంది. రాణి ఒక్కర్తే గ్వాలియర్ హర హర మహాదేవ్ అని బలహీనమైన గొంతుతో అరుస్తూ వెళ్తుంది. అప్పటికే పొట్టపట్టుకుని పడీపడే నవ్వుతున్న వారికి, ఆ తరువాత జరిగింది చూస్తే నవ్వుతూ ప్రాణాలు పైకే పోతాయి… నవ్వుతూ చచ్చిపోవాలనుకునేవారు ఈ సన్నివేశాన్ని పదేపదే పదిసార్లు చూస్తే చాలు (అందుకే ఒకసారి చూసి ఒకసారి తలచుకోగానే సగం ప్రాణం పోయినట్టయింది.. లాజిక్‌కు ప్రాధాన్యమిచ్చే దుర్బలులు మరింత జాగ్రత్తపడాల్సిన దృశ్యం ఇది). రాజకీయ చతురుడు, అత్యంత తెలివయినవాడు, ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో గేం చేంజర్ గా భావించే గ్వాలియర్ రాజు సింధియా సింహాసనంపై కూర్చుని వుంటే, చుట్టూ పరివార జనం వుంటే, రాణి తిన్నగా అతని ముందుకువెళ్ళి నుంచుని హీరో విద్యార్థి ,  ప్రిన్సిపాల్‌ బ్రహ్మానందంని అతని స్టాఫ్ ముందర తిట్టినట్టు, ఒరే రాజా నువ్వు పిరికివాడివి, దేశద్రోహివి, కుక్కా, సింహాసనం వదిలిపో, అనగానే రాజు సింహాసనం వదిలి యజమాని చేతిలో దెబ్బలు తిన్న కుక్కలా వెళ్ళిపోతాడు. అప్పుడు రాణి ఆ సింహాసనంపై కూచుని చూశారా, నేనేం తీస్తే అదే చరిత్ర, కాదంటే మీకు బుర్రలు లేవు అని, నగ్నత్వంలో  కళను చూడలేని వాళ్ళ మెదళ్ళు కుళ్ళిపోయాని ప్రకటించే సిగ్గొదిలేయటమే అభ్యుదయమనుకునే అభ్యుదయ కళాకారుల్లా నవ్వుతుంది.

నిజానికి ఈ దృశ్యాన్ని సృజించిన స్క్రిప్ట్ రచయితకు చెయ్యెత్తి దండాలు పెట్టి లెంపలు వాయించి లాజిక్ పాఠాలు తలక్రిందులుగా వ్రేలాడదీసి చెప్పాలనిపిస్తుంది. బ్రిటీష్ వారి వైపున్న రాజు దగ్గరకు రాణి ఒక్కర్తి గుర్రం మీద నిరాయుధ అయి వెళ్ళటమే గొప్ప మూర్ఖత్వం కూడా, సిగ్గుపడే మూర్ఖత్వం. ఇక రాజు ముందు నిలబడి సింహాసనం వదులు అనగానే వాడు వదిలేసి పోవటం, ఆమె సింహాసనంపై కూచున్నా ఎవ్వరూ ఏమీ అనకపోవటం అదీ సింధియా లాంటి శక్తిమంతుడయిన రాజు గురించిన దృశ్యం కావటం నిజంగా మన స్క్రిప్ట్ రచయితల ఊహా శక్తి ఏ స్థాయిలో వుందో, మన కళాకారులకు ప్రేక్షకుల స్థాయి పట్ల, తమ సామర్థ్యం పట్ల ఎంత విశ్వాసం వుందో, మన సినిమాలు ఏ స్థాయిలో వున్నాయో స్పష్టం చేస్తుంది. ఎలాటి కళ ఆదరం పొందుతుందో ఆ సమాజ ప్రజల పరిణతిని చూపుతుందని, ఎవరికి తగ్గ కళ వాళ్ళకు లభిస్తుందన్న అయాన్ రాండ్ గుర్తుకు రాక మానదీ సినిమాలో ఇలాంటి అనేక సన్నివేశాలు చూస్తూంటే…

సాధారణంగా స్క్రిప్ట్ రచనలో ప్రధానపాత్రను ఎలివేట్ చేసేందుకు ఒక సూత్రం వుంది. ప్రత్యర్థి పాత్రలు ఎంత శక్తివంతంగా వుంటే… ప్రధానపాత్ర అంతగా ఎలివేట్ అవుతుంది. అలాగే ప్రధానపాత్ర చుట్టూ వున్న పాత్రలు ఎన్ని చక్కగా ఎదిగితే, ప్రధానపాత్ర అంత గొప్పగా కనబడుతుంది. కానీ, మన స్క్రిప్ట్ రచయితలకు ఈ సూత్రం తెలిసినట్టులేదు. ప్రధానపాత్ర ఎలివేట్ కావాలంటే మిగతా పాత్రలన్నీ వచ్చి పోవాలి తప్ప ఎదగకూడదు అన్న అభిప్రాయం స్థిరపడ్డట్టుంది. అందుకే, బ్రిటీష్ వారంతా జోకర్లలా అనిపిస్తారు. రాణి చుట్టూ వున్నవారెవరూ అంతగా రిజిస్టర్ కారు.

చారిత్రిక పాత్రల ఆధారంగా సినిమా తీసేటప్పుడు ముందుగా రీసెర్చ్ అవసరం. ఈ సినిమాకూ ఒక కన్సల్టెంట్ హిస్టారియన్ వున్నాడు. కానీ, ఈ సినిమా చూసిన తరువాత ఆయన హిస్టరీ ప్రొఫెసరా? ఇష్టరీ ప్రొఫెసరా? అనిపిస్తుంది.

సాధారణంగా చరిత్ర సినిమాలన్నీ కల్పనలపై ఆధారపడతాయి. 1953లో సోహ్రాబ్ మోడీ ఝాన్సీ కీ రానీ తీసినప్పుడు లక్ష్మీబాయి గురువుకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఎందుకంటే, ఆ పాత్ర అతను ధరించాడు కాబట్టి. ఈ సినిమా కంగనా రనౌత్ ది కాబట్టి ఆమె తప్ప మరెవరూ కనిపించరీ సినిమాలో…

కానీ, ఒక చరిత్ర సినిమా చూస్తే, ప్రేక్షకులకు ఆనాటి సామాజిక, ఆర్థిక, మానసిక, ధార్మిక రాజకీయ పరిస్థితులపై అవగాహన రావాలి. ముఖ్యంగా, ప్రధానపాత్ర మనస్తత్వం, వ్యక్తిత్వం వంటి విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా, మన చరిత్ర సినిమాలు తీసేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన చరిత్ర మనం రాసుకోలేదు. మనల్ని బానిసలను చేసినవాడు వాడి దృష్టిలో రాశాడు. ఆ తరువాత మన సమాజంలో వున్న విచిత్ర పరిస్థితులవల్ల, ప్రతి చారిత్రిక ఘట్టాన్ని కొందరు కులం దృష్టిలో, కొందరు మతం దృష్టితో, ఇంకొందరు సిద్ధాంతాల దృష్టితో, మరికొందరు ఇజాల దృష్టితో చూసి ఎవరికి తోచింది వారు నిజమని ప్రచారం చేస్తున్నారు. అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా పరిశోధించి వీలయినంతవరకూ నిరూపితమయిన, లేక, అధికులు ఒప్పుకున్న నిజాలకు దగ్గరగా వుండేట్టు కల్పనలు చేయాలి. పాత్రలను రూపొందించాలి. ఈ సినిమాలో అలాంటివేవీ కనిపించవు. పైగా, తాము ఎంచుకున్న అంశం పట్ల ఎవరికీ అవగాహన వున్నట్టు కనబడదు. కొన్ని దేశభక్తి సంభాషణలు, కొన్ని ఫెమినిస్ట్ డైలాగులు, కాస్త విప్లవ నినాదాలు పెట్టేస్తే అది ప్రామాణికమయిన సినిమా అయిపోదు. తాము తీస్తున్న సినిమా విజయవంతమయితే, భవిష్యత్తు తరాలకు తమ కల్పనే చరిత్ర అవుతుందన్న నిజాన్ని కళాకారులు గుర్తించాలి. లేకపోతే, భవిషత్తులో ఝాన్సీ లక్ష్మీబాయి ఆత్మహత్య చేసుకుందని, బ్రిటీష్ వారికి చిక్కే బదులు స్వచ్ఛందంగా సజీవ దహనం అయిందని భావించే వీలుంది.

ఝాన్సి లక్ష్మీబాయి అత్యంత ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసము కల వ్యక్తి. ఆమె, అలా కాలిపోయినట్టు చూపటం ఆ పాత్రను సరిగా అర్థం చేసుకోలేదు స్క్రిప్ట్ రచయిత అని స్పష్టం చేస్తుంది. హుస్సార్ల తుపాకీ తగిలి నేలకొరిగిన లక్ష్మీబాయిని రామచంద్రరావు దేశముఖ్ అనే వ్యక్తి తన కుటీరానికి తీసుకువెళ్తాడు. కొన ప్రాణంతో వున్న ఆమె తన శరీరం కూడా బ్రిటీష్ వారికి చిక్కకూడదని వేడుకుంటుంది. ఆమె మరణించిన తరువాత అతడు ఎవరి కంటపడకుండా ఆమె శరీరాన్ని కాల్చివేస్తాడు. ఇది 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఏ పుస్తకంలోనైనా దొరుకుతుంది.

మణికర్ణిక సినిమా చూసిన తరువాత కూడా 1857 ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం ఎందుకు జరిగిందో తెలియదు. ఇంతకీ, దానికీ రాణికీ సంబంధం ఏమిటో అర్ధం కాదు. బ్రిటీష్ వారు ఝాన్సీని ఆక్రమించిన తరువాత రాణి పచ్చడి రుబ్బుతుంటే విప్లవ సేనలు ఆడవారిని పిల్లలను చంపుతున్నాయి అని తెలియగానే గుర్రమెక్కి వచ్చేస్తుంది రాణి – నా ఝాన్సీ అంటూ… ఇంతే 1857కి ఈ సినిమాలో వున్న పాత్ర. ఇది చూస్తే, ఆనాడు రాజులకు విప్లవానికి సంబంధం లేదు అని కొందరు చేసే వికృత వాదన గుర్తుకువస్తుంది. మరో దృశ్యంలో హఠాత్తుగా రాణి ఆజాదీ ఆజాదీ అని అరుస్తుంది. మిగతా అంతా ఆజాదీ అంటూ అరుస్తూ యుద్ధరంగంలోకి దూకుతారు. హఠాత్తుగా వచ్చిన ఈ ఆజాదీ నినాదం వినగానే ఢిల్లీ పోలీసులు గుర్తుకువస్తే దోషం నాది కాదు. ఇంతకీ ఇది ఏ ఆజాదీయో తలాతోకా లేకుండా వచ్చేస్తుంది. మళ్ళీ తరువాత ఆజాదీ అన్నమాటే ఎవ్వరూ ఎత్తరు.

1857 పోరాటం జరిగిన తరువాత కలనల్ మల్లెసన్ అనే ఆయన కొన్నేళ్ళు పరిశోధించి ఆరు వాల్యూంలలో 1857 గురించిన పుస్తకం రాశాడు. వీర్ సావర్కర్ ఇంగ్లండ్‌లో ఆ పుస్తకం ఆధారంగా తన పుస్తకం రచించాడు. సావర్కర్ పరిచయం చేయకపోతే లక్ష్మీబాయితో సహా 1857 వీరులెవ్వరి గురించీ మనకు తెలిసేది కాదు. కనీసం, సినిమా కోసమయినా మల్లీసన్ పుస్తకాలు, సావర్కర్ పుస్తకం చదివి ఒక అవగాహన ఏర్పరచుకుని స్క్రిప్ట్ రాయాల్సింది. ఎందుకంటే, నిజంగా జరిగిన సఘటనల్లో వున్న డ్రామా సినిమాలో లేదు.

ఝాన్సీ కోటను బ్రిటీష్ వారు ముట్టడించినప్పుడు, రాణికి సహాయంగా తాతియా తోపె పెద్ద సైన్యం తీసుకువస్తాడు. అంటే బ్రిటీష్ సైన్యం ముందు ఝాన్సి వెనుక తాతియా అవుతారన్నమాట. అలాంటి విజయం ఎలా పరాజయంగా పరిణమించిందో చక్కని డ్రామా వున్న సంఘటన. ఝాన్సీ కోటలోనికి ప్రవేశించాలని బ్రిటీష్ వారు చేసే ప్రయత్నాలు, రాణి సైన్యంలోని ఆడా, మగా వారిని తిప్పికొట్టిన విధం… కోటను మూడువైపుల నుంచి ముట్టడించటం.. ఇవన్నీ గొప్ప యుధ్ధ వ్యూహము, డ్రామాలున్న సంఘటనలు. అలాగే, ఝాన్సీ వదిలి, తాతియా తోపేను అడ్డుకోవటానికి వెళ్ళమన్న ఆదేశాన్ని విస్మరించిన బ్రిటీష్ అధికారి ఝాన్సీని ముట్టడించటం 1857 యుద్ధ గతిని మలుపు తిప్పిన గొప్ప డ్రమాటిక్ సంఘటన. అలాగే, రాణీ, కొందరు సైనికులతో కోట వదిలిపోతూంటే ఆమెను వెంబడించటం చక్కని డ్రామా వున్న సంఘటన. పరాజితురాలయి కూడా రాణి అందరినీ కూడగట్టుకుని గ్వాలియర్‌ను గెలుచుకోవటం ఉప్పొంగించే వీరోచితమయిన సంఘటన. పీష్వాను రాజును చేసి ఝాన్సీని గెలవాలనుకోవటం గొప్ప సంఘటన… అంటే, లేనిపోని పాత్రలను సృష్టించి, వెర్రి మొర్రి సంఘటనలను సృష్టించి, డ్రామా పేరుతో అనౌచిత్యాలను, తర్కదూర వ్యర్థ సన్నివేశాలను సృజించి తాము అభాసుపాలవుతూ, ఆత్మాభిమానము, ఆత్మగౌరవము వున్న చారిత్రిక వ్యక్తులనూ అభాసుపాలు చేసే బదులు రీసెర్చ్‌పై కాస్త సమయం వెచ్చింది స్క్రిప్ట్ రచనకు ఉపక్రమిస్తే చిరకాలం తరతరాలకు మార్గదర్శనం చేయగల చక్కని సినిమాలు రూపొందుతాయి. కళాకారుల గౌరవం పెరగటమే కాదు, సమాజానికి చక్కని ఆదర్శం నిలిపిన వారవుతారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. సాంకేతికత పెరిగింది కానీ సృజనాత్మకత కొరవడింది. మార్కెట్ పెరిగింది కానీ నిజాయితీ కొరవడింది.

అయితే, ఇవేవీ పట్టించుకోకుండా చూసేవారికి, సినిమా అంటే కదిలే బొమ్మల కల్లబొల్లి విన్యాసాలు అనుకునేవారికి ఈ సినిమా నచ్చుతుంది. సినిమా సూపర్ హిట్ అయి, కంగనా రనౌత్‍కు అవార్డుల పంటపండితే ఆశ్చర్యమే లేదు. ఏ సమాజానికి వారికి తగ్గ కళ లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here