[box type=’note’ fontsize=’16’] “ముప్ఫై లక్షల జనాభాగల మణిపూర్‌లో సినిమాల కొచ్చిన ఇబ్బందేమిటంటే, ప్రేక్షకుల కొరత. అందుకని మణిపురి సినిమాలు చలన చిత్రోత్సవాల బాట పట్టి పోయి అక్కడ పురస్కరాలు పొందుతూంటాయి” అని మణిపురి సినిమాల గురించి విశ్లేషిస్తున్నారు సికందర్ “ప్రాంతీయ సినిమా – 12: పురులు విప్పిన మణిపురి” వ్యాసంలో. [/box]
[dropcap]రా[/dropcap]ష్ట్రావతరణతో బాటు సినిమా ఆవిర్వాభావం ఒకేసారి జరిగిన రాష్ట్రం ఏదైనా వుందంటే అది మణిపురే. అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక ప్రాంతీయ సినిమాలు నిర్మిస్తున్న రాష్ట్రం కూడా ఇదే. అత్యధిక జాతీయ, అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకునే రాష్ట్రం కూడా ఇదే. దేశంలో డిజిటల్‌లో మొట్ట మొదటి సినిమా తీసింది కూడా మణిపూర్‌లోనే. 1972లో మణిపూర్ రాష్ట్రంఏర్పడిందో లేదో అదే సంవత్సరం తెలుపు – నలుపులో ‘మాతం – గి మణిపూర్’ (నేటి మణిపూర్) అనే తొలి మణిపురి సినిమా వెలువడింది. దీనికి చాలా కాలం ముందు, 1948లోనే తొలి సినిమా ప్రయత్నం జరిగింది గానీ అది అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఆ సంవత్సరం తలపెట్టిన ‘మైను పెంచా’ నిధులు సమకూరక మధ్యలోనే నిర్మాణం ఆగిపోయింది. నిర్మాతలు మణిపూర్ మహారాజాని ఆశ్రయించారు. కానీ అప్పటి రెండో ప్రపంచ యుద్ధపు పరిస్థితుల్లో మహారాజా ఆర్థిక సాయం చేయలేకపోయాడు. తిరిగి 1972 వరకూ మణిపురి సినిమా ఆలోచన ఎవరూ తలపెట్టలేదు. అయితే 1949లో మణిపూర్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేయడంతో దీన్ని వ్యతిరేకిస్తూ తీవ్రవాద బీజాలు అప్పుడే పడ్డాయి. తర్వాతి కాలంలో ఈ పరిణామం మణిపురి సినిమాలు నిర్మించుకోవడానికి మంచి మేలే చేసింది.
‘మాతం – గి మణిపూర్’ ని కె. మన్మోహన్ నిర్మిస్తే, దేవ్ కుమార్ బోస్ దర్శకత్వం వహించాడు. అంటే తొలి మణిపురి సినిమాకి బెంగాలీ అతను దర్శకత్వం వహించాడన్న మాట. ఆరంబం సమరేంద్ర రాసిన ‘తీర్థ్ జాతర’ అనే నాటకం ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. ఇందులో అందరూ మణిపురి స్టేజి నటులే నటించారు. దీనికి జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి పతకం లభించింది.
మణిపూర్‌లో హిందీ సినిమాల ప్రదర్శనలు మణిపురి సినిమాలకి ప్రతిబంధకంగా మారాయి. హిందీ సినిమాలకి అలవాటు పడిన ప్రేక్షకులు మణిపురి సినిమాలని పెద్దగా ఆదరించలేదు. 1990లలో కూడా ఇదే పరిస్థితితో ఒకటీ అరా సినిమాలు మాత్రమే నిర్మించే దశలో వుండిపోయారు. 1999లో నిషేధిత తీవ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కొత్త అవతారం, రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ రాష్ట్రంలో సాంస్కృతిక దాడిని నిరసిస్తూ హిందీ సినిమాల్ని, హిందీ సినిమాల సంబంధిత కార్యక్రమాలనీ నిషేధించింది. దీంతో మణిపురి సినిమాల నిర్మాణాలు జోరందుకున్నాయి. 2000 నుంచీ క్రమ క్రమంగా ఏడాదికి 70 – 80 సినిమాలు నిర్మించే స్థాయికి చేరుకుంది ఇంఫాల్‌వుడ్. అన్ని ప్రాంతీయ సినిమా రంగాలకి వున్నట్టే మణిపురి సినిమా రంగానికి కూడా ‘వుడ్’ని తెచ్చుకుని ‘ఇంఫాల్‌వుడ్’గా నామకరణం చేసుకున్నారు. సినిమాల నిర్మాణాలకి మణిపూర్ రాజధాని ఇంఫాల్‌ని కేంద్రంగా చేసుకున్నారు.
ఒకప్పుడు నిర్మాణానంతర కార్యక్రమాలకి కోల్‌కత, ముంబాయి, చెన్నైల దాకా వెళ్ళాల్సి వచ్చేది. సాంకేతికుల కొరత కూడా బాగా వుండేది. డిజిటల్ యుగం ప్రారంభమయ్యాక కష్టాలన్నీ తొలగిపోయాయి. 2002లో యువదర్శకుడు ప్రేంజిత్ నరైబమ్ ‘లమ్మీ’ అనే యువకథా చిత్రం డిజిటల్‌లో తీయడంతో మణిపురి సినిమా ఇక డిజిటల్ బాట పట్టిపోయింది. అదే సమయంలో ‘లమ్మీ’ దేశంలో మొదటి డిజిటల్ సినిమాగా సార్ధకమైంది. డిజిటల్‌లో నిర్మాణ వ్యయం బాగా తగ్గిపోవడంతో నిర్మాతల రాక పెరిగింది. నిర్మాణానంతర కార్యక్రమాలకి ఎక్కడికీ వెళ్ళనవసరం లేకండా ఎడిటింగ్, డబ్బింగ్ మొదలైన వసతులతో కూడిన స్టూడియోలన్నీ ఇంఫాల్ లోనే ఏర్పాటు చేసుకున్నారు. ఒక సినిమా తీయాలంటే 15 లక్షలకి మించి వ్యయం కావడం లేదు.
అయితే మణిపూర్ ప్రజలు స్వాభావికంగానే కళాకారులు. గానం, నృత్యం, నటన వంటి కళలు పుట్టుకతోనే వచ్చేస్తాయి. అందుకని కళల్లో ప్రతిభని కోరుకుంటారు, కనబరుస్తారు కూడా. పదిహేను లక్షలతో సినిమాలు తీసినా వాటి ముందు మన తెలుగులో తీసే కోటి రెండు కోట్ల సినిమాలు ఎందుకూ పనికి రావు – వస్తుపరంగా గానీ, సాంకేతికంగా గానీ. ఇంకోటేమిటంటే, నష్టాలొచ్చినా వెనక్కి తగ్గరు. సినిమా కళ మీద అవాజ్యమైన ప్రేమ కొద్దీ నిర్మిస్తూనే వుంటారు. జాతీయ, అంతర్జాతీయ అవార్డుల పంట కళాపిపాసులైన వారిలో నిత్యం ఉత్సాహాన్ని నింపుతూనే వుంటుంది.
మణిపూర్‌లో హిందీ సినిమాలు నిషేధించి రెండు దశాబ్దాలు కావొస్తోంది. చివరికి మణిపూర్ క్రీడాకారిణి అయిన మేరీ కోమ్ మీద తీసిన హిందీ సినిమా కూడా అక్కడ విడుదల కాలేదు. నిషేధం విధించిన కొత్తల్లో ప్రదర్శనలకి సినిమాలు లేక థియేటర్ల యజమానులు విలవిల్లాడారు. హాలీవుడ్ సినిమాలు, తమిళ సినిమాలు ప్రదర్శించు కుంటూ కాలక్షేపం చేశారు. ఇంతలో డిజిటల్ యుగం కలిసి వచ్చి సినిమా నిర్మాణాలు పెరగడంతో తిరిగి థియేటర్లు పుంజుకున్నాయి.
ఈ సంరంభంలో కొత్త తరం దర్శకుల రాకతో సినిమాల తీరు మారింది. సామాజిక సమస్యల్ని పక్కనబెట్టి, కాల్పనిక కథల్నే సహజ వాతావరణంలో తీయడం మొదలెట్టారు. బాలీవుడ్ అనుకరణల జోలికి పోకుండా ప్రేమ కథలు, కామెడీ కథలు, యాక్షన్ కథలు మొదలైనవి తమవైన శైలుల్లో రూపొందించుకోవడం మొదలెట్టారు. ప్రతీ సంవత్సరం జాతీయ – అంతర్జాతీయ ఏదో ఒక అవార్డు పొందడం నిత్యకార్యక్రమమై పోయింది.