Site icon Sanchika

మనిషే ఋషి

[dropcap]ప్ర[/dropcap]తి వ్యక్తిలోనూ ఓ ప్రతిభ వుంది
ఆ ప్రతిభను గుర్తించి
వెలికి తీసి, పదును పెడితే
అపుడే నీ జీవితానికి అర్థం, పరమార్థం
లేదంటే
జీవితం అర్థం కాని లిపిలా,
కల్లోల కడలిలా ఉంటుంది.

కెరటాలు లేని సంద్రానికి అందం లేనట్టే
లక్ష్యం లేని జీవితానికీ విలువ లేదు.
గొప్ప స్థాయికి ఎదగాలంటే
ఓ లక్ష్యాన్ని ఎంచుకో.
దానితో ఉన్న స్థితినుండి
ఉన్నత స్థితికి ఎదుగు.
ఈ క్రమంలో వైఫల్యమొచ్చినా
అలసిపోక, ఆగిపోక
ఓటమిని చూసి కుంగిపోక
రాలిపోయేది చిగురించేందుకే
ఓడిపోయేది గెలిచేందుకే
అన్న గెలుపు సూత్రాన్ని
మదిలో తలచి ప్రయత్నించు.

సమస్యను చూసి
పారిపోయే భీరువులా కాకుండా
పోరు చేసే ధీరుడిలా ఉండు.

ఓపికున్నంత వరకూ కాదు
ఊపిరున్నంత వరకూ పోరాడు
విజయం వస్తుంది నీవెంట
ఆనందక్షణాలు నీ ఇంట.

తెలిసిన విషయాన్ని
తెలివిగా వాడుకునే జ్ఞానిలా ఉండు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసే
ప్రజ్ఞావంతుడిగా మారు
అసలు నిర్వచనమే లేని
“జీవితానికి” నీ వరుస
విజయాలను చూపి
సరికొత్త నిర్వచనం చెప్పు.

అపుడు అపజయం చూడదు నీవంక
అవుతావు నీవే నింగిలో నెలవంక
జీవితం అర్థంకాని లిపి కాదు
అందమైన దస్తూరి
అణువణువూ పరిమళించే కస్తూరి
అని నిరూపించు.

Exit mobile version