మనిషి

0
1

[dropcap]అ[/dropcap]మృత ఒక టీచర్. పిల్లలకి చక్కగా పాఠాలు చెపుతోంది. వృత్తిని దైవంగా భావిస్తుంది. వంటవార్పూ అన్నీ పద్థతిగా చేస్తుంది. అతిథి అభ్యాగతి. ఇవన్నీ ఆమె సొంతము. బంధువులెక్కువ మంది, ఉన్న ఊళ్ళోనే ఉన్నారు. చిన్న తోరణం కట్టినా వంద ఆకులు లేస్తాయి. వంట మనిషిని రప్పించి కూడా ఉండి  వంట చేయిస్తుంది. ఆత్మీయంగా పలకరిస్తుంది. అభిమానంగా చూస్తుంది.

బంధువులంతా ఎంతో ఇష్టపడతారు. భర్త బ్యాంక్ ఉద్యోగి. ఇద్దరూ రెండు చేతులా సంపాదన, అందుకే ఏ శుభకార్యం చేసినా ఘనంగా చేస్తారు. పిల్లలిద్దరూ బెంగుళూరులో సెటిల్ అయ్యారు. ఒక్కసారి మనస్సు గతంలోకి వెళ్ళిపోయింది.

వేసవికాలం వచ్చిందంటే ఇల్లంతా సందడి – ఇంచుమించు ఓ వందకాయ ఆవకాయ రెండువందల కాయల తోడు మెంతికాయ పెడుతుంది. ఇంటికి వచ్చిన ‘సిటీ’ బంధువులు మాకు చీరలు, గిఫ్ట్స్ వద్దు ఒక సీసా ఊరగాయ ఇయ్యి అని పట్టుకెడతారు. అంత ఫేమస్‍గా ఊరగాయలు పెడుతుంది.

కూతుర్ని ఎలాగైనా డాక్టర్ని చదివించాలన్నది అమృత ద్యేయం. మొదటిసారి ఆరతికి మెడికల్ సీటురాలేదు. రెండవసారి లాంగ్‍టర్మ్ కోచింగ్ ద్వారా సక్సెస్ అయింది. ఈలోగా గ్రహాలు, జాతకాలు, జపాలు, వ్రతాలు అన్నీ చేయించి సీట్ తెప్పించింది. పర్సంటేజ్ బాగా వచ్చింది. మంచి ర్యాంక్ వల్ల మెరిట్ వల్ల, మెడికల్‍లో కాకినాడలో సీటు వచ్చింది. ఇంక ఐదేళ్ళ వరకు బాదరబందీ లేదు. చదువు పూర్తయ్యాక పి.జియా? పెళ్ళా అన్నది నిర్ణయించుకుందాము.

కాలగమనంలో మెడిసిన్ పూర్తి అయ్యింది. ఈలోగా నాయనమ్మ పిల్లకి పెళ్ళి చెయ్యరా? అంటూ రోజూ చెపుతూ ఉండేది.

అమృతకి అత్తగారి కోరిక తీర్చడము మంచిదని అభిప్రాయము. భర్తతో రెండుమూడు సార్లు అన్నది. సరియైన సంబంధం దొరకాలి శాఖ మారడం అత్తగారికి ఇష్టం ఉండదు. అందుకే భార్య భర్త సరే అని ఊరుకుంటున్నారు. పిల్లని అడుగుతా అత్తగారు అని ఊరుకుంటుంది.

ఆవిడ పల్లెలో ఉంటుంది. వంట మనిషి, పనిమనిషి ఉంటారు. పెద్ద లోగిలి. ధాన్యం పంట, పాలేళ్ళు వస్తారు. అన్నీ చేసి వెడతారు.

ఆవిడ సిటీకి రాదు. అమృత వాళ్ళ అత్తింటికి వెళ్ళీ సెలవల్లో ఉండి వస్తారు. బ్యాంక్‍కి ఓ వారం సెలవుపెట్టి వెళ్ళి అక్కడి వ్యవహారాలు చూసుకుంటారు. అక్క అన్న హైదరాబాద్‍లో స్థిరపడ్డారు. వాళ్ళ పిల్లలు విదేశాలో ఉన్నారు. అందుకని ఫ్లైట్ కన్వినియన్స్ కోసం హైదరాబాద్‍లో ఉంటారు. తల్లిని చూడ్డం కోసం అంతా కార్లలో వచ్చి వెడుతూ ఉంటారు. ధనం మూలం – ఇదం జగత్ అన్నట్లు వారి జీవన సరళి ఉన్నది.

అత్తగారి ఆరోగ్యం మంచిది. అఖరికోడలు. అందుకని కొంచెం గారం ప్రేమ ఎక్కువ. ప్రస్తుతం వారి ఆలోచనల్లో ఆరతి మీదే ఎక్కువ. ఒక్కసారి ఆరతిని కదిపితే ఏమంటుంది? సెలవులకి వస్తుంది. అంతా ఆలోచిద్దాము సరేలే అనుకుంది.

అత్తగారు మాటల్లో ఒకసారి దూరపు చుట్టం రామేశ్వరమ్ కొడుకు డాక్టర్ చదివి హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీలో పనిచేస్తున్నాడు. మన ఆరతిని చెపితే మంచిదని చెప్పింది.

అతను గదా గతంలో రెండు మూడుసార్లు వారి ఇంటికి వెళ్ళినపుడు విషయం చెప్పారు. ఆరతి కూడా ఏవో పుస్తకాల కోసం వాళ్ళింటికి వెళ్ళి అతనితో మాట్లాడానని చెప్పింది. అప్పుడు పెళ్ళి ఆలోచన లేదు.

ఇప్పుడు ఒకసారి కదిపితే సరి. అత్తగారు ఈ సంవత్సరం చేసెయ్యాలని పట్టుదలగా ఉంది. వేసవికాలం విదేశాల వాళ్లు వస్తారు. సెలవల్లో మంచిది. ఆవిడ ద్వారానే కదిపితే మంచిది.

వేసవికాలం రానే వచ్చింది. ఆరతిని పెళ్ళి విషయం చెపితే “అమ్మా మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా? ఎందుకంత ఆలోచన?” అంది. నిజమే తమ పిల్లలు తమ మాట ఎప్పుడూ కాదనరు.

ఎటొచ్చీ సంబంధం మాటలన్నీ జరిగాయి.

“అయ్యో మా పిల్లకి కట్నం ఏమిటి? పిల్లని చేస్తే చాలు. పెళ్ళి గ్రాండ్‍గా చెయ్యండి” అన్నది.

“ఆడబడుచుకి లక్ష, అత్తగారికి లక్ష, పిల్లాడికి బ్రాస్‍లెట్, చైన్, ఉంగరము, మంచికారు ఇవ్వండి. మేము ఎలాగో ఇల్లు కొనిస్తామని చెప్పాం” ఆరతి వాళ్ళ మాటలకు నవ్వింది. “ఇప్పటికి చదువుకి ఓ పదిహేను లక్షలయింది. పెళ్ళికి ఇంకా పదిహేను లక్షలవుతుందని లెక్కలేశారు. అమ్మానాన్న మీ సంపాదన మాకేగా, ఒకసారి పెట్టుబడి పెడితే ఆడపిల్ల అత్తింటికి వెడుతుంది. అత్తిల్లే కాదు మంచి అత్తిల్లు అని మీరంతా డిసైడ్ అయ్యారు కనుక డబ్బుకి వెనుకాడటమెందుకు?”

ఆరతి మాటల్ని బట్టి చూస్తే ఈ సంబంధం నచ్చింది అనుకుని శుభస్య శీఘ్రం అన్నారు.

పెళ్ళయింది. పెళ్ళయి నాలుగేళ్ళయినా సరే. ఎమ్.డిలో సీటు రాలేదు. చివరకు బెంగుళూరు దగ్గర యూనివర్శిటీలో సీటు వచ్చింది. హైదరాబాద్ నుంచి ఆరతి భర్త కశ్యప్ బెంగుళూరులో జాబ్ చూసుకుని అక్కడి హాస్పిటల్స్‌లో చెయ్యడానికి వెళ్ళాడు.

చదువు ఖర్చు తల్లిదండ్రులే భరించాలన్నది పెళ్ళి కండిషన్. ఆ ప్రకారం చదివించారు. రెండేళ్ళు ఇట్టే గడచిపోయాయి.

ఆరతికి కూడా బెంగుళూరులోని కశ్యప్ హాస్పిటల్‍లోనే జాబ్ వచ్చింది. దాంతో అక్కడే సెటిల్ అయ్యారు. హైదరాబాద్‍లో కొనాలనుకున్న ఇల్లు వద్దని బెంగుళూరులో ఇల్లు కొన్నారు. అక్కడే ఆల్‍ సెటిల్‍మెంట్ అని నిర్ణయించుకున్నారు.

అమృత జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది. పల్లెలో అత్తగారు, సిటీలో కూతురు. తను మధ్యరకం ఊరిలో, టీచర్ అంటే అంతేకదా! అందుకే పిల్లాడిని కూడా బెంగుళూరులోనే సెటిల్ చేశారు. భర్త రిటైర్ అయ్యాక – వాలంటరీ రిటైర్‍మెంట్ తీసుకుని పల్లెలో ఉన్న అత్తగారి దగ్గరికి వెళ్ళిపోయారు.

ఆరతి పిల్లల్ని చూడటానికి బెంగుళూరు వెళ్ళింది. మూడునెలలు కాగానే ఒక్కరోజు కూడా ఉండలేదు. తన భర్త, తన ఇల్లు అంటూ వచ్చేసింది.

ఆడది జీవించినంత కాలం భర్త వద్దనే ఉండాలి. ఎన్ని సుఖాలున్నా ఎంత కూతురిల్లు అయినా ఉండలేకపోయింది. వియ్యంపురాలు వియ్యంకుణ్ణి రమ్మని వాళ్ళ మనుమల్ని వాళ్ళే పెంచుకుంటే మంచిదని చెప్పి వచ్చేసింది. వాళ్ళంతా డబ్బు మనుష్యులు. తన కూతురు కూడా వాళ్ళ మాటలే ఒప్పుకుంటుంది. అల్లుడూ కేవలం డబ్బు మనిషే. తన పిల్ల కూడా ఇప్పుడు వారి మనిషే అందుకే వచ్చేసింది. ఆడపిల్ల ఎప్పుడూ ఆ ఇంటి మనిషే, అత్తవారి పద్దతులకి అలవాటు పడకపోతే జీవితం లేదు. అందుకే ఆడపిల్ల అన్నపేరు సార్థకం అవుతుంది.

డబ్బు చుట్టూ మనుష్యులు తిరుగుతున్నారు. మనీయే – ‘షీ’ కావాల్సింది. ఒక ‘షీ’ ఎదగాలన్నా పెళ్ళి అవాలన్నా ‘మనీయే’ మూలము. అందుకే మనిషిలో మని+షీ ఉన్నాయి. అమృత ఆలోచనలు పరిపరివిధాల సాగుతుండగా – ‘నానాటి బ్రతుకు నాటకము’ అన్నమయ్య కీర్తన వినిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here