Site icon Sanchika

కాలంతో నడిచే అక్షరం చందలూరి కవిత్వం

[శ్రీ చందలూరి నారాయణరావు గారు రచించిన ‘మనిషి గుర్తుల్ని బతికించుకుందాం’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు ఎన్. లహరి.]

[dropcap]నా[/dropcap]రాయణ రావు గారి కవిత్వం మొదటగా పేపర్లో చూసి స్పందించాను.

ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఆయన రాసే కవిత్వం కొత్త కొత్త పద ప్రయోగంతో ఆకట్టుకుంటుంది. చాలా లోతైన భావనతో ఉండి తన రచనలు ఏకబిగిన చదివిస్తాయి. ఆయన వాడిన పదాల శైలి కొత్తగా అనిపిస్తాయి. నేర్చుకొనే వాళ్లకి ఒక మంచి పుస్తకంగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

ప్రతి కవితలో పరిపక్వత, మంచి సందేశం ఇవ్వాలని ఆశపడే కవి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే దాకా ఎన్నో కవితలకు అక్షరార్చన చేస్తుంటారు. అవన్నీ కూడా చదివిస్తాయి.

ఉపాధ్యాయుడిగా ఎంతో మంది పిల్లల మంచి భవిష్యత్తుకు దిశా నిర్దేశనం చేసిన ఆయన కవిత్వంలో మునిగి తేలే సాధకుడు. తన కవిత్వంతో చాలా మందిని తన వైపుకు తిప్పుకున్న శ్రేయాభిలాషి. నారాయణ రావు గారి శైలి చదివే వారికి కొత్తగా అనిపిస్తుంది. సరికొత్త సులువైన పదాలతో, ఆకట్టుకోగల మేటి.

కొత్త అంశాలు కొత్త కోణంలో చాలా అలవోకగా కవితను అల్లుతారు. ఈ పుస్తకంలోని ప్రతి కవిత చుట్టు ఉన్న అంశాలను తనదైన దృష్టితో, ఆయన శైలిలో ఆకట్టుకుంటారు. పరివారం, పల్లెపూల స్థితిగతులు, పేదల ఇరుకు సందు, ఇవన్ని ‘మనిషి గుర్తుల్ని బ్రతికించుకుందాం’ లో కనిపిస్తాయి. వ్యవసాయం చేయక పోయినా, వాటిని అవగాహన చేసుకొని రాశారు. ఒక కవితని తక్కువ పదాలలో రాయడం తెలుస్తుంది ఈ పుస్తకం చదివాక.

అక్షరాలనే విత్తనాలను పండిస్తూ తన కలంలో సరికొత్తగా అక్షరాలను లిఖిస్తూనే సమాజ ముఖచిత్రాన్ని తన ధోరణిలో రాస్తూ ముందుకెళుతున్నారు.

“రండి కాసేపు తనివి తీరి

మనిషి గుర్తుల్ని బతికించుకుందాం” లోకి

పరకాయ ప్రవేశం చేద్దాం.

చెప్పాలి అంటే ప్రతి కవితను సమీక్షించాల్సిందే.

కాని కొన్నింటిని మాత్రమే నేను సాహసం చేయగలిగాను. వాటిలోనే కొన్నింటిని మీరు చూడండి. మొట్ట మొదటి కవితలోనే

“దేవుడితో సమానులని పిలిచి

అమ్మనాన్నలను తక్కువ చేసుకోలేను

దేవుడి స్వరూపాలని తలచి

దేవుడిని ఎక్కువ చేయలేను!.” అంటారు.

ఇక్కడ చూడండి ఏ రకంగానూ అమ్మ నాన్నలు, దేవుడి కంటే గొప్పవారే అనే భావాన్ని పలికించారు.. కన్నవారికి ఇంత గొప్ప స్థానాన్ని కట్టబెట్టిన కవి ప్రతిభను కొనియడాల్సిందే..

ఉత్తరం ఒక కలలో ఊరు తనకి, తన బాధ చెప్పుకుంటూ ఉత్తరం వ్రాసిందని ఒక్క ఒక్క దాని గురించి ఎంతో ఆర్ద్రతతో చెప్పారు.

“ఒక్కరు తొంగి చూడక గ్రంథాలయం అక్కడ ఒంటరిగా ఉండలేనంటుందని” అనే ఈ వాఖ్యలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. పుస్తకాలు చదివేవారు కరువు అయి ఒక్కరు కూడా తొంగి చూడటం లేదు అని, ఒకప్పుడు కనీసం నువ్వన్నా వచ్చేవాడివి. ఇప్పుడు నువ్వు లేక నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేక పోతున్న అంటూ.. చాలా గొప్పగా రాశారు.

‘ఆ పాత మధురం’లో అల్మర్లో దొరికిన ఆల్బమ్‌ని చూసుకోని, పడిన వేదన, గత స్మృతుల్లోకి తీసుకొని వెళ్లిన ఆలోచలతో వ్రాసిన కవిత ప్రతి ఒక్కరు తమని తాము తడిమి చూసుకుంటారు.

“గుండెను నిమిరిన గతం

వర్తమానాన్ని చూసి జాలిపడితే

గతంలో గంతులు వేసిన వర్తమానం

భవిష్యత్తును చూసి బెంగపడింది.”

నిజమే. ఎంతటి జీవిత సత్యమో కదా! గుండె లోతుల్లో ఉండిపోయిన గతం వర్తమానాన్ని చూసి జాలి పడితే. గతంలో నాకు ఏమి తక్కువ అంటూ గంతులు వేసిన వర్తమానం భవిష్యత్తును చూసి బెంగపడింది అంటూ ఎంతో చక్కగా చెప్పారు.

రహస్య భాషలో పోతూ పోతూ అంటూ ఆ కవితలో మనిషి ఎంత సంపాదించుకున్న పడేసుకొని “తన చావు ‘పుట్టినరోజు’కు బహుమతి చేసి ‘కేవలం మనిషి’ నంటూ మౌనంగా మట్టిలో కలుస్తాడు. నిజమే. ఎంత కూడబెట్టుకొన్న ఎన్ని ఉన్న ఏకాకిని అంటూ ఒంటరిగా ఉన్నంత కాలం ఆనందాన్ని మాత్రమే పోగేసుకోవాలి.

‘విశాలంగా పారేదే కన్నీరు’ కవితలో ఇరుకుగా బ్రతికే వాళ్లు లాగానే, ఏమి లేకుండా ఇరుకు ఇరుకుగా బ్రతికే వాళ్లు ఎందరో ఉన్నారు సమాజంలో. ఏమీ లేని వాళ్లను ఆదుకోవడం ఏమోగానీ, వారిని ఇంకా బాధ పేట్టే వాళ్లేనే ఎక్కువై పోతున్నారు లోకంలో.

“వానోస్తే తడవని కళ్ళులేవు. తడపని బాధలేదు” అంటారు, ఎంత దుర్బరమైన జీవనం. ఇలా ఎంతో ఆర్థంగా సాగిపోతుంది ఈ కవిత.

‘చాలా బాగుంటది’ కవితలో “బయటి మనిషి లోపలి మనిషిని అనుభవించడం నిజంగా చాలా బాగుంటుంది” అంటారు. బయట మనిషి లోపలి మనిషి యొక్క ఆలోచనలను, అనుభవిస్తే ఆనందమే కదా..

‘ఉప్పెన గీతం’ కవితలో

“రాలిన ఒక్కో కన్నీటి చుక్క

ఆవేదనగా పొంగి పొరలి అక్షరాలలో మరిగి మరిగి

ఏకాంతానికి ఎడారికి పుట్టిన

ఉప్పెన గీతంలా ఉంది జీవితం”

అంటూ ఎంతో ఆర్ద్రంగా కవితలో రాసుకొచ్చారు. ఏకాంతానికి, ఏడారికి మధ్య పోలిక నాకు ఎందుకో కొత్తగా అనిపించింది. ఆ శైలి ఆకట్టుకుంటుంది.

నడిచే దేవుడు నాన్న అంటూ..

“ఎనభై ఏళ్ళ వయసులోనూ

ఆ చేతులు చల్లగా మాట్లాడతాయి.

బిడ్డలు ఎంత ఎపుగా ఎదిగినా

ఇంకా తేమనందించాలని తపిస్తాయి”

నిజమే నాన్నకు ఎంత వయసొచ్చినా తన పిల్లలు చిన్నవారిగానే కనిపిస్తారు. తన వంశాన్ని తడిమి తడిమి చూసుకుంటుంది. ఏదో చెప్పాలనే ఆత్రుత కనిపిస్తూనే ఉంటుంది. తన శరీరంలో సత్తువ లేకున్నా ప్రేమగా మాట్లాడితే పరివళించే గొప్ప సహృదయుడు నాన్న..

‘పచ్చని వెలుగు’ కవితలో అమ్మ గొప్పతనాన్ని వివరిస్తూ..

“ఎముకల గూడైనా శరీరంలోనూ

నేటికీ పచ్చని వెలుగు

మా అమ్మ” అంటారు.

అమ్మ మొదటి నుండి ఎంతో కష్టపడుతుంది. చివరి దశకు చేరుకున్న అమ్మ ముఖంలో పచ్చని వెలుగు అంటారు. ఎంతో చక్కగా ఉంటుంది.

‘ఒకే ఒక్కడు’ కవితలో

“చేతికి మట్టి చుట్టం

కాలికి మట్టే బంధం నేలకతడే నేస్తం.

పుడమికతడే ప్రాణం”

అంటూ రైతు గొప్పతనాన్ని ఆకాశంలో నిలబెట్టాడు. నిజమే రైతు కష్టం లేకుంటే మనం ఎక్కడ. మట్టిని నమ్ముకొని అతడు సాగించే ప్రయాణంలో మన ప్రాణాలు నిలిచివున్నాయి కదా..

‘ఆ నలుగురే అతని వెలుగు’ కవితలో

“మౌనంగా రోదిస్తు బీరువాలో పుస్తకాలు

కవి ఆస్తులం మేమేనంటూ గర్వంగా చింతిస్తున్నాయి.

అట్ట, కలం, కాగితం, పుస్తకం ఆ నలుగురితో

అతని అంతిమయాత్ర ముగిసింది.”

అంటూ, నిజంగానే ఒక కవి మరణించినప్పుడు అతడు ప్రేమగా చూసుకున్న ఆస్తులు కలం, కాగితం, పుస్తకాలే.. నలుగురు స్నేహితులు చూడటానికి వస్తారో, లేదో తెలియదు. బాధపడతారో లేదో కూడా చెప్పలేం. కానీ, ఇవి చివరికంట తోడుగా వస్తాయి. చివరికి కవి అంతిమ యాత్ర వాటితోనే ముగుస్తుంది.

‘ఈ చెదలు పట్టని సంపద’ లో

ఈ చివరి లైన్స్ ఆకట్టుకుంటాయి.

“పదేళ్ళ వయస్సులో పేదరికమిచ్చిన సౌందర్యమే

నూరేళ్ళ పాటు శ్రీమంతుణ్ణి చేసిన సౌభాగ్యం”

అంటూ, పేదరికాన్ని అనుభవిస్తేనే శ్రీమంతుడిగా మారిన సాభాగ్యాన్ని తనివి తీరా ఆస్వాదిస్తాం, ఒక రాయి కూడా ఎన్నో దెబ్బలు తింటేనే గుడిలో శిల్పంగా మారి అందరి మొక్కులని తీసుకుంటుంది.

‘మనిషి కనిపిస్తాడు’ అనే కవితలో చిట్టి పాదాలకు మట్టి స్పర్శను చూపించండి, మట్టిలో కలిగే అనుభూతిని మనసారా ఆస్వాదించనివ్వండి అప్పుడు..

“నేల ఆనందిస్తుంది.

పచ్చిక పులకరిస్తుంది.

మనసు వికసిస్తుంది.

మనిషి కనిపిస్తాడు” అంటున్నారు.

ఎంత చక్కటి కవిత, పిల్లలు ఎక్కడ కందిపోతారో అని నాలుగు గోడల మధ్య బంధిస్తున్నాం. ప్రకృతితో మమేకం అవ్వడాన్ని నిషేధించి చక్కటి బాల్యాన్ని వారికి ఇవ్వకుండా పెంచుతున్నాం.

‘గుండె గూటిపై పిడుగు మాటకు’ కవితలో

“అక్షరాన్ని తలవాలంటే ఆవేదన

అక్షరాన్ని పిలవాలంటే ఆవేశం” అంటారు.

బాధలో ఉన్నప్పుడు, మెదడు మొద్దు బారిపోయినప్పుడు ఆలోచనలు మసక బారినప్పుడు అక్షరాలని తలవాలి అంటే కూడా ఆవేశం, ఆవేదన అంటూ ఆర్ద్రంగా వ్రాసారు.

‘కవితల చెట్టు’ కవితలో కవిత గురించి ఎంత బాగా చెప్పారు. అందుకే ఈ చెట్టు

నాలో మొలిచిన ‘కలల చెట్టు’

నాతో నిలిచిన ‘కవితల చెట్టు’

నాకై విరిసిన ‘నవ్వుల చెట్టు’

నాచే తలచే ‘తీయని చెట్టు’

అంటూ చాలా బాగా రాశారు.

‘గట్టి మనిషినై.. గట్టి మనసునై’ అనే కవితలో జీవం ఉన్నంతవరకు అన్నింటిని భరించాలి. కష్టాల్ని, సుఖాల్ని ఒకే రీతుగా తీసుకోని జీవించాలి. భూమికి బరువయ్యే దాకా కంఠంలో ఊపిరి ఉండేదాక పోరాడాలి అంటూ..

“మోయాలి భూమికి బరువయ్యే దాక

కాలానికి చివరయ్యే దాక” అంటూ ఎంతో బాగా వ్రాసారు.

మనిషి గుర్తుల్ని బ్రతికించుకుందాం. అసలు వేటిని బ్రతికించుకోవాలి. మనిషి గుర్తులు అంటే ఏమిటి? తరువాత అసలు మనిషి అనేవాడు ఉండడా లాంటి ప్రశ్నలు వేధిస్తాయి. అన్నింటికి సమాధానం అన్ని కవితల్లో తేటతెల్లం అవుతుంది. మంచి మాట్లాడుతునే విషం కక్కుతున్న ఈ కాలంలో, నైతిక విలువలను మరిచిపోతూ, బ్రతుకుతున్న బ్రతుకుకు మనిషి గుర్తులు బ్రతికించాలి అని వేడుకుంటున్నాడు.

మొదటి పుస్తకానికి, రెండో పుస్తకానికి వ్యవధి నాలుగేళ్లు. ఈ నాలుగేళ్ల ప్రయాణంలో నారాయణ గారి ఆలోచనలకు అక్షర రూపమైన ‘మనిషి గుర్తుల్ని బతికించుకుందాం’ పుస్తకాన్ని మనం కూడా ఆస్వాదిద్దాం రండి.

***

మనిషి గుర్తుల్ని బతికించుకుందాం (కవిత్వం)
రచన: చందలూరి నారాయణరావు
ప్రచురణ: సాహితీ స్రవంతి
పేజీలు: 133
వెల: ₹ 100
ప్రతులకు:
విశాలాంధ్ర బుక్ హౌస్, అన్ని శాఖలు
ప్రజాశక్తి బుక్ హౌస్, అన్ని శాఖలు
రచయిత: 9704437247

 

Exit mobile version