[dropcap]జ[/dropcap]నని సాంఘిక సాంస్కృతిక సంఘ వ్యవస్థాపకులు, ప్రధాన కార్యదర్శి, ట్రూ ఇండియన్ నేషనల్ పెరియార్ అవార్డు గ్రహీత గుడిమెట్ల చెన్నయ్య రచించిన కవితల సంపుటి ‘మనిషి కనబడుట లేదు’.
***
“ఆంధ్ర తమిళనాట ఆంధ్రభాషోన్నతి/ చాటి చెప్పినయట్టి సరసులైరి/ శీ కరంబుగ సభల సింహగర్జన తోడ/ప్రముఖ ప్రసంగుతా ప్రతిభులైరి” అని విద్వాన్ వినుకొండ లక్ష్మీనరసింహాచార్యులు ప్రశంసించిన సాహితీ సేవకుడు చెన్నయ్య అప్పుడప్పుడు రాసిన కవితల పుస్తకీకరణం ఇది.
“ఈ కవితలలో ఆర్తి ఉంది. హృదయం వుంది. మనిషి ఎక్కడికి పోతున్నాడు? నాగరికుడా, అనాగరికుడా అని ప్రశ్నిస్తూనే సమాజం పట్ల బాధ్యతతో మెదలుకొమ్మని హెచ్చరిస్తూ, మానవత్వం ఉన్న మంచి మనిషి కోసం వెతుకుతున్నారీ కవితల్లో” అని టి. రంగస్వామి ‘గుడిమెట్లవారి అక్షరార్చన’ అనే ముందుమాటలో రాశారు.
“చెట్లను గురించో, పూలను గురించో, మేఘాలను గురించో, నదులను గురించో వర్ణనలు నా కవిత్వంలో ఉండవు. సగటు మనిషి పడే ఆవేదన, సమాజంలో జరుగుతున్న దమనకాండలు, అలజడులు, అల్లర్లు, మానభంగాలు, దోపిడిలు, మానవత్వం లేని మనుషుల వికృతపు చేష్టలే నా కవితా వస్తువులు. మానవత్వం మంట కలిసిపోతున్న ఈ సమాజంలో నాకు మనిషి కనబడుట లేదు. ఆ మానవత్వం ఉన్న మనిషి కనబడే వరకూ నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది” అని కవి గుడిమెట్ల చెన్నయ్య తన స్పందన ‘అరవై ఎనిమిదిలో ఆశ’లో తెలియజేశారు.
***
ఈ సంపుటిలోని కవితలన్నీ సందర్భానుసారంగా రాసినవి. మరికొన్ని సంకలానల కోసం రాసినవి. తెలుగు కవితాభిమానులను ఆలోచింపచేసి, ఆనందింపజేస్తాయీ కవితలు.
***
రచన: గుడిమెట్ల చెన్నయ్య
పుటలు:54
వెల: ₹ 75/-
ప్రతులకు: 13/53, 2వ వీధి,
వాసుకీ నగర్, కొడుంగైయార్,
చెన్నై -600118