Site icon Sanchika

మనిషికి మనిషి సాయం

[డా. మజ్జి భారతి రచించిన ‘మనిషికి మనిషి సాయం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]రా[/dropcap]త్రి భోజనమయ్యాక మేడమీద పడకగది ముందున్న బాల్కనీలో కాస్సేపలా పచార్లు చేయడం అలవాటు రాజ్యలక్ష్మికి. అటుయిటు తిరుగుతుంటే, ఆ నిశివేళలో మనిషిని మృదువుగా స్పృశించే చల్లగాలిలో సేద తీరడంతోపాటు, ఆ కాలనీలో ఉన్న భవనాల కిటికీల నుండి వెలువడే విద్యుద్దీపాల వెలుగులు చూడడమనేది ఆమెకు ఇష్టమైన వ్యాపకం. భవనాల ముందు గేటుకు ఇరువైపులా ప్రహరీగోడలపై అమర్చిన విద్యుద్దీపాల ఆకృతులు చూడడమంటే మరీ ఇష్టం. అలా తిరుగుతుంటే పక్కింటిమీద దృష్టిపడింది రాజ్యలక్ష్మికి. ఈ ఆఫీసర్స్ కాలనీకి దిష్టిబొమ్మలా ఈ యిల్లొకటి. నొసలు చిట్లించుకుంది.

కాలనీలో వున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యోగులే. ఇంటిని ఆధునీకరించడంలో గాని, ఇంటిముందున్న ఖాళీస్థలంలో పూలమొక్కలు పెంచడం గాని.. ఎవరింట్లోనూ లేనివి.. అవేవైనా, తమ ఇంట్లో ఉండాలన్న ఆలోచనలోగాని.. ఒకరిని మించి ఒకరు పోటీ పడుతుంటారు. ఆ భవనాలన్నీ రెండంతస్తుల భవనాలే. ఇదిగో ఈ దిష్టిబొమ్మ తప్పించి.. ‘మా ఖర్మకొద్ది మా ఇంటిప్రక్క తగలడింది’ చిరాకుగా అనుకుంది రాజ్యలక్ష్మి.

పునాదులు వేసి ఇల్లు కట్టించే సమయంలో, మంచి ఉద్యోగమే చేస్తున్న తండ్రి చనిపోతే, అప్పటికి డిగ్రీ పూర్తయిన కొడుకుకి యుడిసిగా ఉద్యోగమిచ్చింది ప్రభుత్వం. తండ్రి చనిపోతే వచ్చిన డబ్బులేవో పెట్టి ఇద్దరు కూతుర్ల పెళ్లి చేశారు. ఇల్లు కట్టించే స్తోమత లేక చాలాకాలం పునాదులనలాగే వదిలేసి, ఈ మధ్యనే మొత్తమంతా స్లాబ్ వేసి, ఉన్న డబ్బులతో రెండు పడకగదులు వేసుకొని మిగిలిన స్లాబునలా ఉంచారు, ఎప్పుడు డబ్బు కూడితే అప్పుడు గదులు వేసుకోవచ్చని. రాత్రి భోజనాలయ్యాక అక్కడ కూర్చుంటారు తల్లి, కొడుకు, కోడలు, పిల్లలు చదువుకుంటుంటే. వాళ్లను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది రాజ్యలక్ష్మికి.

అన్ని భవనాల ప్రహరీగోడలు ఉన్నతంగా, లోపల ఉన్నవాళ్లు బయటకు కనిపించనంత ఎత్తులో, యజమానుల స్తోమతలను తెలిపేటట్లు రకరకాల డిజైన్లతో ఉంటే, వీళ్ళ ఇంటిముందు వొంటిబెడ్డ ఇటుకతో కట్టిన ఐదడుగుల గోడ, దాని మీద నలభై వాల్టుల బల్బు, కాలనీకి దిష్టి తీసేటట్టు.. పక్కిల్లు చూడగానే మూడ్ చెదిరిపోయిన రాజ్యలక్ష్మి లోపలికెళ్ళింది ‘టీవీ శబ్దం వినిపించడం లేదు, ఈయనేమిటి చేస్తున్నారబ్బా’ అనుకుంటూ.

పడకగదిలో మంచంమీద గుండెలు పట్టుకొని మెలికలు తిరిగిపోతున్నాడు బాధతో మహేశ్వరరావు, రాజ్యలక్ష్మి భర్త, బ్యాంకు ఆఫీసర్. ఒళ్లంతా చెమటతో తడిచిపోతుంది.

“అయ్యో! ఇదేమిటండి. ఇంతవరకు బాగానే ఉన్నారుకదా! ఇంతలోనే ఏమైంది” అని ఏడ్చుకుంటూ దగ్గరికెళ్ళింది. నోటమాట సరిగ్గా రాక సైగ చేస్తున్నాడు ఫోను చెయ్యమని. భర్తనలా చూస్తున్న కంగారులో ఆయనేమి చెప్పబోతున్నాడో అర్థం కాలేదు వెంటనే. అర్థమయ్యాక డ్రైవరుకు ఫోన్ చెయ్యబోతుంటే, గుర్తుకొచ్చింది అతను రెండురోజులు సెలవు పెట్టాడని. పోనీ అతను లేకపోతే ఎవరినన్నా పంపిస్తాడేమోనని ఫోనుచేస్తే, కనెక్టవ్వడం లేదు. ఎక్కడున్నాడో! పిల్లలకు చేసింది. కూతురు, కొడుకు ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. ఇద్దరి ఫోన్లూ కలవలేదు. కంగారులో మర్చిపోయింది గాని, పిల్లలకు సెలవులని ఒకరు ట్రెక్కింగుకు, ఇంకొకరు అంటార్కిటికా వెళ్లారనే విషయమిప్పుడు గుర్తుకొచ్చింది. ఫోన్లు ఒక వారంరోజుల వరకు ఉండవు కంగారుపడొద్దని, వెళ్లినప్పుడే చెప్పారు. మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, గొప్పగా బ్రతుకుతున్నారని చెప్పుకోవడంలోని ఆనందం ఇప్పుడేమీ కనిపించడం లేదు.

భర్త చూస్తే బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. తనకీ చెమటలు పట్టేస్తున్నాయి. ఫోను చెయ్యబోతుంటే చేతులు వణికిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఆరోగ్య తనిఖీలకు వెళ్లే ఆసుపత్రి నెంబరు ఎక్కడో రాసిన విషయం గుర్తుకొచ్చి తీసి ఫోను చేసింది. ఉన్న రెండు అంబులెన్సులు, రోగులను తీసుకురావడానికి వెళ్లాయి, రాగానే పంపిస్తామని చెప్పారు. ఈయనను చూస్తే అంతవరకు ఆగేటట్టు అనిపించడం లేదు. తన స్నేహితురాళ్ళిద్దరూ టూర్లలో ఉన్నారు. ఆ కంగారులో యింకెవరికి ఫోను చెయ్యాలో కూడా తెలిసి చావడం లేదు.

ఇంతలో కాలింగుబెల్. ఈ సమయంలో ఎవరబ్బా అని బాల్కనీకి వచ్చిచూస్తే, ఎత్తైన గేటు బయట పక్కింటబ్బాయి “ఏమైందంటూ?”. ఒక్కసారిగా ప్రాణంలేచి వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్లి గేటుతీసింది. ఆ అబ్బాయితో పాటు వాళ్ళమ్మ, సుమిత్రగారు “ఏమైందమ్మా? బాబుకి బాగాలేదా!” అంటూ. ఎప్పుడైనా, లేవగానే క్రిందనున్న ఆవిడ కనిపిస్తే ‘విధవరాలు, ఈవిడ కనిపించింది ఈ రోజేమవుతుందో..’ అని చిరాకుపడే రాజ్యలక్ష్మికి, ఈ సమయంలో ఆవిడను చూడగానే ఆత్మబంధువును చూసినట్టనిపించింది

“బాధతో విలవిల్లాడిపోతున్నారండి. ఏం చెయ్యాలో తోచడం లేదు” దాదాపు ఏడుస్తూ అంది. మహేశ్వరరావుని చూసిన ఇద్దరికీ అర్థమయింది, ఆయనకి గుండెపోటు వచ్చిందని, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని.

“ఆంటీ, కారు తాళం” కారు తీద్దామని అడిగాడు పక్కింటబ్బాయి గార్గేయ.

‘ఈ అబ్బాయికి కారు డ్రైవింగ్ వచ్చో! లేదో! యిరవైలక్షలు పెట్టి ఈ మధ్యనే కొన్నారు కొత్త కారు. అసలే ఆయన ప్రాణంగా చూసుకుంటారు. దానికేమైనా ఐతే!’ కారు తాళాలు ఇవ్వాలా వద్దా అన్న సందేహంలో పడ్డ రాజ్యలక్ష్మిని చూసి, “పిల్లల ఆటోకి ఫోను చెయ్యి” అన్న అమ్మ మాటతో ఫోను చెయ్యడం, ఆటో రావడం జరిగిపోయాయి. “బాబుని మేము ఆటో ఎక్కిస్తాము. నువ్వు తలుపులవీ జాగ్రత్తగా వేసుకో. ఒక జతబట్టలు, తువ్వాళ్లు, ఫ్లాస్కు.. కొంతడబ్బు కూడా పట్టుకో” అని మహేశ్వరరావుని ఆటో ఎక్కించారు ఆ ముగ్గురు.

***

ఒక ప్రక్క మహేశ్వరావుని తనిఖీ చేస్తూనే, “ఏమిటి బాధ? ఎప్పటినుండి? రక్తపోటు, చక్కర వ్యాధి ఉన్నాయా? మానసిక ఆందోళనలేమైనా ఉన్నాయా? ఇదివరకు ఎప్పుడైనా ఇలా వచ్చిందా? మీరెప్పుడు గమనించారు? గమనించిన వెంటనే ఆసుపత్రికి ఎందుకు తీసుకురాలేదు?” ఇలా ప్రశ్నలు వేస్తూనే, ఇంకో ప్రక్క ఇవ్వవలసిన వైద్యాన్ని అందిస్తున్నారు డాక్టరుగారు.

ఈ వయసులో గుండెజబ్బులవీ వస్తాయని, అవి రాకుండా ఉండాలంటే ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఉదయాన్నే జాగింగ్ చేస్తాడు. సాయంకాలం టెన్నిస్ ఆడుతాడు. కొవ్వు పదార్థాలను దగ్గరకు రానీయడు. ఆరోగ్యం విషయంలో అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు. అటువంటి భర్తకు గుండెపోటంటే నమ్మలేకపోతుంది రాజ్యలక్ష్మి. గుండెల్లోని బాధ ఆయన ముఖంలో కనిపిస్తుంటే.. భర్తనలా చూస్తుంటే గుండెల్లో మెలితిప్పినట్టు అవుతుంది రాజ్యలక్ష్మికి. తెలిసిన దేవుళ్లందరికీ మొక్కుకుంటుంది, ఆయనకేమీ కాకూడదని, తన పసుపు కుంకుమలు కాపాడాలని. నిలువుదోపిడి ఇస్తానని వెంకన్నకు, రుద్రాభిషేకం చేయిస్తానని శివయ్యకు, ఏడువారాలు భజన చేయిస్తానని షిరిడిసాయికి, లలితా పారాయణం చేయిస్తానని లలితమ్మకు మొక్కుకుంది.

చూస్తుండగానే ఆయన ముఖంలో రక్తాన్ని ఎవరో తోడేసినట్టు తెల్లగా పాలిపోతుంది. అంతే క్షణంలో నిశ్చలంగా అయిపోయింది శరీరం. ‘కార్డియాక్ అరెస్ట్’ గాభరాగా అన్నాడు డాక్టరు.

“బ్యాంకు వాళ్లకెన్ని ఆందోళనలో.. లోను రికవరీల దగ్గర..” ఎవరో అంటుంటే గుర్తుకొచ్చింది.. తెలిసినవాళ్లేకదా.. పెద్ద వ్యాపారస్తులని, పేపర్లవీ సరిగ్గా లేకపోయినా.. పెద్దమొత్తం బ్యాంకురుణం మంజూరు చేసి, ఇప్పుడు వాళ్లు రుణం చెల్లించకుంటే, యెలా వసూలు చెయ్యాలా అని, ఈమధ్య.. ఆయన సరిగ్గా తిండి తినకపోవడం, నిద్ర పోకపోవడం గమనిస్తూనే ఉంది. పెద్దవాళ్లతో పరిచయాలని.. తానుకూడా వాళ్లతో షికారులని, షాపింగులని.. యిందులో తన తప్పుకూడా.. ఆయన తటపటాయిస్తుంటే లోను యిమ్మని తన ప్రోత్సాహం.. చేజేతులా తామే.. ఇప్పుడదే ఆయన ప్రాణాలు తీసింది.. బయటకనలేక లోపల్లోపలే కుమిలిపోతుంది రాజ్యలక్ష్మి.

“ఒక్క అరగంట ముందు తెచ్చివుంటే బాగుండేదమ్మా! ఏమైనా చెయ్యగలిగేవాళ్ళం” తన ప్రయత్నం తాను చేస్తూ డాక్టరుగారన్న మాటలు, చెంపమీద ఛెళ్ళున కొట్టినట్టనిపించింది రాజ్యలక్ష్మికి. కారులో తెచ్చివుంటే.. అరగంట ముందు వచ్చివుండేవాళ్లు.. వెధవ కారు గురించి చూసుకున్నాను.. ఇప్పుడా కార్లు.. పెద్ద పరిచయాలు.. ఆస్తులు, అంతస్తులు.. తన పిల్లల అమెరికా ఉద్యోగాలు.. ఆయనను తనకు తెచ్చిస్తాయా? తమ గొప్పలు, లోభం తమనే ముంచేశాయి. పక్కింటామెను విధవరాలని తనన్నట్టు, రేపు తననూ విధవరాలంటే.. వెక్కివెక్కి ఏడుస్తుంది రాజ్యలక్ష్మి. అలా ఎంతసేపుందో!

“ఆంటీ చూడండి అంకుల్‌కి ఏమీ కాలేదు” గార్గేయ మాటలతో కళ్ళువిప్పి చూసింది. ఇందాక పాలిపోయి నిశ్చలంగావున్న శరీరం, మరల జీవాన్ని సంతరించుకుంది. ఊపిరి తీసుకుంటున్న సూచనగా ఛాతి కిందకు మీదకు కదులుతుంది. తన పసుపుకుంకుమలు కాపాడిన కనిపించని దేవుళ్లందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంది. నీ భర్తను కాపాడింది మేమా? అని ముక్తకంఠంతో దేవుళ్ళందరూ అడుగుతున్నట్టనిపించింది. నిజమే.. గార్గేయ, వాళ్ళమ్మగారు.. చెప్పకపోయినా తన కష్టాన్ని తెలుసుకొని వచ్చి, సమయానికి వైద్యమందేలా చేసి తన భర్తను కాపాడారు. “మీ రుణం తీర్చుకోలేను” గార్గేయ రెండుచేతులు పట్టుకొని కన్నీళ్ల పర్యంతమైంది రాజ్యలక్ష్మి.

“మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? నేనదే చేశాను” సింపుల్‌గా అన్నాడు గార్గేయ.

సిగ్గనిపించింది రాజ్యలక్ష్మికి గార్గేయ మాటలు వింటుంటే. ఏరోజూ వాళ్ళని పక్కింటివాళ్ళలా, మనుషుల్లా మర్యాదతో చూడలేదు తను. ఆఖరికి తన ఇంట్లో శుభకార్యం చేసిన రోజుకూడా, మిగిలిన అందరితోపాటు సమానంగా రిటర్న్ గిఫ్ట్ కూడా వాళ్లకివ్వలేదు. అటువంటిది, ఈరోజు వాళ్ళు లేకపోతే తన పసుపు కుంకుమలేమయ్యేవి? తన ఏడుపు వినిపించి అడగకుండానే వచ్చి సాయమందించారు. అదే తనలాంటి వాళ్లైతే, వాళ్ల బాధలేవో వాళ్లే పడతారులే మనకెందుకొచ్చిన తద్దినమని, వాళ్ల ఏడుపు వినిపించకుండా ఏ టీవీనో పెట్టుకుని కూర్చుంటారు. తన ఆలోచనలకు, జీవితంలో మొదటిసారి సిగ్గుపడింది రాజ్యలక్ష్మి

***

పడకగది కిటికీ తెరిస్తే కనిపించిన పక్కింటిని చూసిన మహేశ్వరరావుకు రాజ్యలక్ష్మి మాటలు చెవిలో గింగురుమంటున్నాయి. “గార్గేయ, వాళ్ళమ్మగారు లేకపోతే ఏమి జరిగేదో ఊహించుకోడానికే భయమేస్తుందండి. ఆ రాత్రంతా హాస్పిటల్లో తనే మిమ్మల్ని కనిపెట్టుకొనివున్నాడు. ఏమి చేస్తే వాళ్ళ రుణం తీర్చుకోగలం?” తనను చూడడానికి వచ్చినపుడు అవే మాటలు తనంటే ‘మనిషికి మనిషి సాయమని’ ఎంత తేలిగ్గా చెప్పాడు.

అదే తనలాంటివాళ్లు, చెయ్యగలిగిన స్థితిలో ఉండికూడా.. ఆస్తులు అంతస్తులతో మనుషులను కొలిచి.. అనర్హులకు బ్యాంకు రుణాలిచ్చి.. వున్న హామీలు చాలవని అర్హులకు మొండిచెయ్యి చూపి.. మిగిలిన గదులు వేసుకోవడానికి రుణం మంజూరు చేయమని తననడిగినప్పుడు “గార్గేయా! నువ్వు తీసుకున్న బ్యాంకు రుణం తీర్చకుండా ఇంకొక రుణమివ్వడం కుదరదు. మా పక్కింటివాడవని నేను రూల్స్ దాటలేను” అని ఎంతో నిబద్ధత కలవాడిలా మాటలు చెప్పి, అదే నోటితో “ఫర్వాలేదు సార్! మీ మాటే హామీ” అని కోట్ల రుణం ఆ నాయుడుకివ్వబట్టి కదా! తనకీ మానసిక ఆందోళన.. దాని ఫలితం గుండెనొప్పి.. సాయం చెయ్యగలిగి ఉండికూడా తనే సాయం చెయ్యలేదు వీళ్ళకి. వాళ్లది మనసులో పెట్టుకోకుండా అవసరానికి తమకి ఆసరా అయ్యారు. ఇప్పుడర్థమైంది మనిషి విలువ డబ్బుతో కాదు, మంచితనంతో కొలవాలని. ఇన్నాళ్లూ దిష్టిబొమ్మలా కనిపించిన ఆ ఇల్లు పర్ణశాలలా తోచిందిప్పుడు. “రాజీ! టేబుల్ మీద లోను అప్లికేషన్ ఫారం ఉంటుంది. తీసుకురా! పక్కింటికెళ్దాం” అన్నాడు రాజ్యలక్ష్మినుద్దేశించి మహేశ్వరరావు.

Exit mobile version