మనో వాక్కాయ కర్మ

31
2

[dropcap]“ఒ[/dropcap]రే మనో! నాన్నగారికి గుండెల్లో మంటగా ఉందట రా! దగ్గర్లో ఏదైనా హాస్పిటల్‌కి వెళదాం” అంది సుశీల కొడుకు మనోహర్‌తో.

“వేరే హాస్పిటల్‌కి ఎందుకమ్మా? మన విశోద హాస్పిటల్ ఉండగా. అక్కడైతే స్కానింగ్, ఎక్స్‌రే, అన్ని రకాల టెస్టులు అందుబాటులో ఉంటాయి. అందుకోసం వేరే ఎక్కడికీ వెళ్లనవసరం లేదు. మనం అక్కడికే వెళ్దాం!” అన్నాడు మనో.

“సరే! అలాగే చేద్దాం! నాన్నని త్వరగా రెడీ అవ్వమని చెప్తా” అంటూ సుశీల లోపలికి వెళ్ళింది.

“ఏవండీ! షర్ట్ వేసుకుని రండి. మనం విశోద హాస్పిటల్‌కి వెళ్తున్నాం” అంది సుశీల.

“ఎందుకే? ఈ మాత్రం దానికి. వీనో ఉందిగా. కడుపులో ఉబ్బరాన్ని, గుండెల్లో మంటనీ ఇట్టే మాయం చేస్తుంది. వీనో ఆన్ అసిడిటీ గాన్!” నింపాదిగా చెప్పాడు ఉత్తమ్.. అదే.. పురుషోత్తం.

“ఇదిగో ఈ నిర్లక్ష్యమే వద్దనేది. అబ్బాయి తీసుకెళ్తానంటుంటే మీకేం? పదండి త్వరగా” అంది సుశీల.

“ఇంకా పళ్ళు కూడా తోమలేదే. ఆ క్లోజ్ డౌన్ టూత్ పేస్ట్ అందుకో. దాంతో పళ్ళు తోముకుంటే పళ్ళు మిల మిలా మెరుస్తాయి. పైగా శ్వాస కూడా తాజాగా ఉంటుంది.” చెప్పాడు పురుషోత్తం.

“అది కాదండీ.. పళ్లొక్కటే కాదు చిగుళ్లు కూడా బలంగా ఉండాలంటే మాల్గెట్ టూత్ పేస్ట్ ఎంతో మంచిది. పైగా ఇప్పుడు అదే ధరకే పది శాతం ఎక్స్‌ట్రా కూడా ఇస్తున్నారు. అందుకే అదే తెప్పించాను.” చెప్పింది సుశీల.

“లేవండీ, త్వరగా కానీయండి. ట్రాఫిక్ జామ్ పెరిగి పోతుంది మళ్ళీ. అసలే విశోద హాస్పిటల్ చాలా దూరం అనుకుంటా!” అంది సుశీల.

“అమ్మా! మరేం పర్లేదు. మనకోసం ఇప్పుడు మనకు చేరువలోనే మలక్‍పేట జంక్షన్ దగ్గర కొత్తగా మరో బ్రాంచ్ ఓపెన్ చేసారు విశోదా వారు. మెయిన్ హాస్పిటల్ లోని అన్ని సదుపాయాలూ ఇక్కడా అందుబాటు లోనే ఉన్నాయి. పైగా ఆన్‌లైన్ లోనే కన్సల్టేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు.” అన్నాడు మనో.

“మరింకెందుకు ఆలస్యం! వెంటనే బయల్దేరుదాం. ఏమండీ పళ్ళు తోమడం అయ్యిందా! మనో రెడీగా ఉన్నాడు.” అంది సుశీల.

“వస్తున్నానే. షర్ట్ వేసుకున్నా. కంఫర్టబుల్‌గా ఉంటాయని మొన్నే సారెగాన్ స్లిప్పర్స్ కొన్నా కదా, వాటికోసం వెతుకుతున్నా. అయిపోయింది. మనోని కార్ తియ్యమని చెప్పు.” అన్నాడు ఉత్తమ్.

“అదేంటండీ.. మళ్ళీ అదే పాత షర్ట్ వేసుకున్నారు? చర్మాస్ వారు మొన్న బై టు గెట్ వన్ ఆఫర్ పెట్టారు కదా.. మీకు మనోకి ఇద్దరికీ ఉంటాయని కొన్నాను కదా, అది వేసుకోండి” అంది సుశీల.

“ఒరే మనో! కారు తియ్యి. నాన్నగారు రెడీ అయ్యారు. పెట్రోల్ కొట్టించాలంటావు మళ్ళీ”

“మనం ఇప్పుడు సారుతి – ముజుకి వారి గ్రాండ్ సితారా కదమ్మా వాడుతోంది. లీటర్‌కి 16.7 కి.మీ. మైలేజ్ వస్తుంది. తక్కువ ఖర్చు ఎక్కువ మైలేజ్ అనే కదా కొన్నది. పదండి వెళదాం. నాన్నను తీసుకుని కిందకి వచ్చేయి. నేను కార్‌ని తీసి ఉంచుతాను” అన్నాడు మనో.

***

ఎలాగైతేనేం అందరూ కార్లో బయల్దేరారు.. హాస్పిటల్‌కి.

మధ్యలో సిగ్నల్ దగ్గర ఆగారు.. రెడ్ లైట్ పడడంతో. సుశీల, ఉత్తమ్ వెనుక సీట్లో కూర్చున్నారు. జ్వరంగా ఉందేమో అని చెయ్యి పట్టుకుని చూసింది సుశీల. పల్స్ బాగా వేగంగా ఉన్నట్టుంది ఉత్తమ్‍కి.

“ఎందుకు టెన్షన్ పడుతున్నారు. మరేం పర్లేదు. విశోద హాస్పిటల్ వాళ్లు బాగా చూస్తారట. మీరేం కంగారు పడొద్దు. అంతా వాళ్ళు చూసుకుంటారు.” అంది సుశీల.

“టెన్షన్‌గా ఉందా నాన్నా. గుండె దడ, ఆందోళన, ఒత్తిడి.. సమస్య ఏదైనా మీ గమ్యం ఒక్కటే.. సూర్య మైండ్ క్లినిక్. ఆందోళన మటుమాయం. ఆనందం మీ సొంతం.. వస్తూ వస్తూ అక్కడికీ వెళ్ళొద్దాం..” అనునయించాడు మనో.

ఇంతలో విశోదా హాస్పిటల్ రానే వచ్చింది. ఆన్‌లైన్ లోనే టోకెన్ తీసుకుని ఉండడంతో త్వరగానే అయ్యింది. మామూలు అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ అని టాబ్లెట్ రాసి ఇచ్చారు. హమ్మయ్య అనుకుంటూ బయటపడ్డారు అందరూ.

***

వస్తూ వస్తూ టిఫిన్ చేసి వద్దామని ముందే అనుకుని ఉండడంతో.. ఎక్కడికి వెళదామా అని అనుకుంటున్నారు.

“ఇంతకీ మీ అసిడిటీకి కారణం ఏమయ్యుంటుంది? ఆఫీస్‌లో ఏం తిన్నారేమిటి? బిర్యానీ లాంటివి లాగించుంటారు. అందుకే ఇలా. చెపితే వినరు. వయసు మీద పడుతోంది బయట తిండి తగ్గించమంటే తగ్గించరు. అయినా నా మాట ఎప్పుడు విన్నారని. అదే అత్తయ్య చెప్తే మాత్రం తూ.చ. తప్పక పాటిస్తారు” గడ గడా ప్రశ్నలు, జవాబుల శర పరంపర సంధిస్తోనే ఉంది సుశీల.

“అచ్చు నీ పోలికేనే.. మన మనో గాడికి. వాగుడు కాయ. మీ వైపు వారంతా ఇంతే. అందుకే మా తమ్ముడు అదే నీ మరిది వీణ్ణి వాక్కాయ అని పిలుస్తుంటే ఉడుక్కుంటావు కానీ దాని బారిన పడే మాకు మాత్రమే తెలుసు.. అందులో బాధేమిటో. అయినా నేను తిన్నది మామూలు బిర్యానీ కాదు. క్యారడైస్ బిర్యానీ. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, నాణ్యమైన బాసుమతి బియ్యం, ఎంపిక చేసిన మసాలా దినుసులతో తయారైనది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచికరమైన బిర్యానీ. తెలుసా..?” సుశీలకి ధీటైన జవాబు ఇచ్చానని ఉత్తమ్ గర్వపడేంతలో..

“అద్దీ సంగతీ.. ఆ మళ్ళీ మళ్ళీ తినడమే కొంప ముంచింది.. ఎంత రుచిగా ఉంటే మాత్రం తినెయ్యడమే.. వయసు, ఆరోగ్యం చూసుకోనక్కర్లేదూ..?” లా పాయింటు లాగింది సుశీల.

చేసేదేం లేక కిక్కురుమనకుండా.. ఉండిపోయాడు ఉత్తమ్.. నిశ్శబ్దంగా…

“అమ్మా ఏంటి? తన వాక్చాతుర్యంతో అందరినీ ఉతికేసే నాన్న.. ఎమ్జీ వాషింగ్ మెషిన్‍లా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆటోమాటిక్‌గా నీళ్లు తీసుకోవాలి గదా.. పోనీలే కొంచం నీళ్లియ్యి పాపం” అన్నాడు అమ్మని ఎగదోస్తూ.. నాన్నని ఉడికిస్తూ.

“అవునురా.. నేను ఎమ్జీ వాషింగ్ మెషిన్‌లా నిశ్శబ్దంగానే ఉంటాను.. కానీ పని చేస్తూ..! మీలా వాగుతూ కాదు.” అన్నాడు ఉత్తమ్ ఒకింత ఉక్రోషంతో.

***

ఇంతలో మనో కార్ స్లో చేస్తూ.. “అమ్మా దగ్గర్లోనే కరోమ్ కర రెస్టారెంట్ ఉంది. అక్కడే ట్రిపుల్ హార్స్ మినప గుళ్ళతో తయారు చేసే మెత్తని ఇడ్లీలు, అలాగే స్వచ్ఛమైన సి.బి.ఆర్ వారి పూస పూసల నెయ్యితో చేసే కరకరలాడే దోశలూ, 48 మంత్ర వారి ఆర్గానిక్ అట్టాతో చేసే పొంగిన పూరీలు ఇంకా చాలా ఉంటాయమ్మా.. అక్కడికి వెళదాం.” అన్నాడు.

“సరే రా.. మనో. అక్కడికే వెళదాం.. అసలే మీ నాన్న అసిడిటీతో బాధ పడుతున్నాడు. మంచి ఇడ్లీలు తింటే బావుంటుంది. మనం కావలిస్తే దోశ పూరితో సరి పెట్టుకుందాం.. ఏం చేద్దాం మరి. మీ నాన్న కోసం ఆ మాత్రం చేయలేమా” అంది సుశీల.

“నా కోసం మీరేం త్యాగాలు చెయ్యక్కర్లేదు. ఆ పక్కనే ఉన్న ఓ.ఎం.ఆర్. షాపింగ్‌కి వెళ్లొచ్చని మీ ఐడియా. నాకు తెలియదా? ఆషాడం సేల్ ఉందని ఎఫ్.ఎమ్.లో అంతలా చెప్తుంటే నిశ్శబ్దంగా ఉన్నానని అనుకున్నారా.. నిశ్శబ్దంగా ఉంటూ కూడా పని చేస్తూనే ఉంటాడు ఈ ఉత్తమ్.. ఎమ్జీ వాషింగ్ మెషీన్‌లా.. నీళ్లు కూడా చాలా తక్కువగా తీసుకుంటాడు పొదుపుగా.. కావాలంటే నువ్వు తాగొచ్చు సుశీలా.. నీళ్లు..” అంటూ బాటిల్ అందించాడు. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది సుశీలకి.

మనో మాత్రం ఏమీ ఎరగనట్టు డ్రైవింగ్ చేస్తున్నాడు.. ఒక పక్క అమ్మతో పాటు తానూ జీన్స్, టీ షర్ట్ తీసుకోవచ్చని పెట్టుకున్న ఆశ అడియాస అయ్యిందని బాధ పడుతూ లోలోపలే గొణుక్కుంటున్నాడు. తననయితే ఏమీ అనలేదుగా నాన్న.. దొరికిపోనందుకు సంతోషపడిపోతూ.. అమ్మ దొరికి పోయినందుకు జాలి పడుతూ.. ఉన్నాడు.

ఇంతలోనే.. అందుకున్నాడు ఉత్తమ్.

“అవునురా మనో.. ఓ.ఎం.ఆర్. అంటే గుర్తొచ్చింది.. నీ బ్యాంకు ఎగ్జామ్ వచ్చే వారమే కదా.. ఇంట్లో కూర్చొని ఓ.ఎం.ఆర్. షీట్ పెట్టుకుని ప్రాక్టీస్ చెయ్యమని చెప్పాను.. చేసావా లేదా..?! “

ఈసారి ఎమ్జీ వాషింగ్ మెషిన్‌లా నిశ్శబ్దంగా ఉన్నది మనోహర్. కానీ ఉతుకుతోంది మాత్రం ఉత్తమ్.

ఈ దెబ్బకి కరోమ్ కర రెస్టారంట్ దాటి వెళ్లిపోయింది కూడా గమనించలేదు ఎవ్వరూ.

***

మొత్తానికి బయట టిఫిన్ ఏమీ చెయ్యకుండానే ఇల్లు చేరుకున్నారు. పొద్దున్నే బయల్దేరడంతో ఎవ్వరూ స్నానాలు కూడా చెయ్యలేదు. ఇంట్లో మనోహర్ వాళ్ళ నానమ్మని వదిలి వెళ్లారు. ఆవిడ ఆ రోజు ఉపవాసం ఉండడంతో తనకీ టిఫిన్ చేసి పెట్టలేదు.

కాలక్షేపానికి టీవీ ఆన్ చేసి ఏదో భక్తి ఛానల్ పెట్టి వెళ్లారు, ఆవిడ అది చూస్తూ ఉంటుందిలే అని. రాగానే ఆవిడ “అమ్మా సుశీలా, భగవంతునికి భక్తునికీ అనుసంధానమైన జగదాంబిక అగరుబత్తీ కోసం ఇల్లంతా వెతికాను దేవుడికి పూజ చేసుకుందామని. కనబడనే లేదు. ఎక్కడ పెట్టావు?”

“అది కాదత్తయ్యా! ఒకే రకం కాకుండా మూడు సుగంధ పరిమళాలు ఆస్వాదించొచ్చని ట్రింగల్ దీప్ అగరుబత్తీలను తెప్పిద్దామని ఆగాను అత్తయ్యా..! ఈ రోజే ఆర్డర్ పెట్టి తెప్పిస్తాను.” అంది సుశీల.

“అది సరే గానీ, అగరుబత్తీల కోసం ఆ గూట్లో చూద్దామని వంగి వెతికానా.. బాగా నడుం నొప్పిగా ఉంది.. అదేదో ఆహ్ నుండీ ఆహా వరకు అని ఆయింట్మెంట్ ఉందట గదా! కాస్త ఇవ్వమ్మా రాసుకుంటా!” అంది పెద్దావిడ.

‘అయ్య బాబోయ్! ఇంట్లో ఏదో టీవీ పెట్టిస్తే భక్తి కార్యక్రమాలు చూస్తుందిలే అంటే ఇదా ఈవిడ చేసే నిర్వాకం’ అని తనలో తాను గొణుక్కుంటూ లోనికి వెళ్లి ఆయింట్మెంట్ తెచ్చి ఇచ్చింది సుశీల.

“పసుపు చందనము గుణాల కలయిక వింతూర్ మాత్రమేనా… నా కోసం, అంటే కేవలం మగవాళ్ళ కోసం తయారు చేసిన సార్క్ అవెన్యూ సోప్ లేదా?  పొద్దున్నుంచి స్నానం చెయ్యక పోయేటప్పటికీ చికాగ్గా ఉంది సుశీ!” అడిగాడు ఉత్తమ్.

“మీ కోసమే, మీ శరీర కాంతి కోసమే కొత్త నెక్స్ సోప్ ఉందిగా..”

“ఒరే మనో, నాన్నగారికి కొత్త నెక్స్ సోప్ ఒకటి ఇవ్వు.. అల్మెరాలో ఉంది. త్వరగా స్నానం చేసి వస్తారు. నువ్వూ స్నానం చేసి వస్తే.. స్వచ్ఛమైన గోధుమలు మరియు మల్టీ విటమిన్లతో తయారు చేసిన గాంబినో వెర్మిసెల్లితో ఉప్మా చేస్తాను, అసలే ఆకలి మీదున్నారు పాపం. పైగా అసిడిటీ కూడా. పొట్ట లైట్‌గా ఉంటుంది, పైగా బలం కూడా” అంటూ సుశీల వంటింట్లో దూరింది.

***

అందరి స్నానాలు అయ్యాక, సుశీల మనోకి, భర్త ఉత్తమ్‌కి ఉప్మా వడ్డిస్తూ “మన మనో గాడి వల్ల మనకు మాత్రమే అంటుకుందనుకున్నా గానీ, అత్తయ్య గారు కూడా బాగానే అంటించుకున్నారు బ్రాండ్ల పిచ్చి. ఏదో భక్తి కార్యక్రమాలు చూస్తారని టీవీ పెట్టిస్తే, ఆధ్యాత్మిక విషయాలేమో గానీ మధ్యలో వచ్చే ప్రకటనల్ని మాత్రం బాగా ఫాలో అవుతున్నారండోయ్ మీ అమ్మగారు.” అంటోంది సుశీల.

“అదేం లేదమ్మాయ్! ప్రకటనల మధ్యలో అప్పుడప్పుడూ బ్రేక్ ఇస్తూ భక్తి కార్యక్రమాలు కూడా చూపిస్తున్నారు ఈ మధ్య బోరు కొట్టకుండా. అంతేగా మరి టీవీ ఉన్నదే ప్రకటనల కోసం. ఎప్పుడూ అవే చూపిస్తే జనాలు చూడరని మధ్యలో మన అభిరుచికి తగినట్లు అవీ ఇవీ చూపిస్తుంటారు. ఏం చెయ్యగలుగుతాం మనం.” అని లోపల్నుంచి చెపుతున్న అత్తయ్య గారి లోకజ్ఞానాన్ని చూసి విస్తుపోయారు మనో, ఉత్తమ్, సుశీల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here