[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘మనోభావాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]“మీ[/dropcap]రంటే చానా గౌరవం పంతులు గారూ, కానీ మా పిల్లకాయల మనసు గాయపడ్డదండీ, అందుకే..”
మర్నాడు పేపర్లన్నీ తాటికాయంత అక్షరాలతో వేశారు, ప్రముఖ ఉపన్యాసకులు, భక్తివేదాంతపురాణ ప్రవచనశిరోమణి శ్రీ పూర్ణప్రజ్ఞ గారు, తూర్పుగోదావరి జిల్లా, ముక్కామల గ్రామ రజక సంఘానికి క్షమాపణ చెప్పి లెంపలేసుకున్నారని!
ఆ వార్త చూసి చాలా మంది వివరమేవిఁటా అని అప్పుడు చూశారూ, విన్నారూ!
ఇంతకీ ఈయన ఏమన్నాడు, వారి మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయా అని తెలుసుకోవటానికి!
ఏదో పురాణం కథ చెప్తూ, ఆ ఫ్లోలో, ఆయన అన్నది ఏమిటంటే- “జోలె పట్టి అడుక్కున్న వాడికి ఆరు కూరలు, చెంబు పెట్టి ఇస్త్రీ చేసేవాడికి నాల్గు చొక్కాలు, సామెత చందాన” అని!
అది ఆయన సొంతగా పుట్టించిన మాటగా తోచింది గానీ, ఎవరికీ అట్లాంటి సామెత ఉన్నట్టు, విన్నట్టు గుర్తు రాలేదు!
అసలు ఉంటేగా, వింటేగా గుర్తు రావటానికి!
జనాదరణ పెరగగానే, వారికి అలవడిన కొత్త వైనమిది!
ఏదో ఒకటి అనటం, సామెత లేదూ.. అని రాగం తీయటం!
ఏం చేస్తాం, అన్ని రంగాల లాగే, బ్రాండ్ వాల్యూ పెరగగానే, సరుకు నాణ్యత తగ్గి, ప్యాకేజింగ్ హడావిడి పెరగటం మామూలేగా, అని అందరూ సర్దుకున్నారు!
కానీ ఏ మూల ఎవడి మనోభావం, తాను వాడే మాటల వల్ల దెబ్బతింటుందో గుర్తించలేకపోయారు ఆవేశంలో ఆ రోజు, పూర్ణ గారు!
ఓ మారుమూల గ్రామంలో, దెబ్బ తిననే తిన్నాయి, క్షమాపణ చెప్పే వరకూ, తీసుకొచ్చినాయి, ఆ మాటలు!
లేకపోతే, రాష్ట్రవ్యాప్త ఉద్యమం లేవదీస్తామని బెదిరించారట వారు, దాంతో వీరు శరణన్నారని, విశ్వసనీయ వర్గాల భోగట్టా!!
***
ఈ మనోభావాలు, మహానుభావాలు సుమండీ, చాలా జాగ్రత్తగా ఉండాలి వాటితో!!
వెనకటికి ఒక మినిస్టర్ గారు, ఆఁ ఇదేముంది అనుకున్నాడు, తన పదవి పోగొట్టుకున్నాడు!
***
ఆ కథా క్రమం బెట్టిదనిన—
విజయనగరం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన పైడితల్లి, నవ యువకుడు, మాంఛి లక్ష్మీపతి కావటంతో, పార్టీకి అండగా ఉండి, కావల్సినంత తైలం గోనె సంచుల్లో నైనా (సూటుకేసులైతే మరీ అందరికీ తెలిసిపోతుందని) చేరవేయగలడని, ఓ జూనియర్ ర్యాంకు మంత్రి పదవిచ్చారు, ముఖ్యమంత్రి శేషావతారం గారు, ఉదారంగా!!
***
ఒక వివరణ ఇవ్వనవసరం లేదు, అయినా ఇచ్చేయడం మంచిది!
ఈ తైలం సంచుల్లో, సూటు కేసుల్లో పట్టే ప్రత్యేక తైలం!
ధారగా కారేది కాదు, దొంతరలుగా పేర్చబడేది!
ఉన్న కొద్దీ ఇంకా ఇంకా అని దాహం పుట్టించే మహా దాహకారి! దాహకకారి!
శాసిస్తే పడి ఉండేది, దాసుడివై పోతే నెత్తి మీద కూచుని నిన్నాడించేది!
***
ఓ సంవత్సరం బాగానే వెలగబెట్టాడు, కానీ తిరిగే కాలు, వాగే నోరూ ఊరుకోగలవా, ఎక్కువకాలం?!
సొంతూరు లోనే, ఓ పెద్ద, కొత్త మిఠాయి దుకాణం ప్రారంభోత్సవానికి పిలిస్తే వెళ్ళాడు.
అది పెట్టింది వాళ్ళ సామాజిక వర్గం వాడే అయినా, ఈయన అన్న మాటతో తంటా వచ్చి పడింది.
రిబ్బన్ కట్ చేసి, తాపీగా, దర్జాగా బాదుషా తింటూ, “మొత్తానికి తెలియని మొహాలకు కూడా ‘కమ్మ’దనం రుచి చూపించావయ్యా, బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్ని స్వీట్లు”, అని నోరు జారాడు.
ఆ ఏరియాలో ఓడిపోయిన క్యాండిడేట్ ఆ ‘రుచి’ సంబంధిత సామాజిక వర్గం వాడు కావటంతో, అక్కసుతో నానా యాగీ చేయించాడు ఈ మాట మీద!
“మినిస్టర్ కెంత తల పొగరు, మా వోళ్ళకు తీపి రుచే తెలియదా, ఎట్టా?! ఎంత మాటన్నాడు?! క్షమాపణ చెప్పాల్సిందే లేదా రాజీనామా చేయాల”, అని ఉద్యమం లేవదీశాడు!
ఆ వర్గం వారందరూ వారి నాయకుడి వెనకాలే ఉన్నారు, రోజూ ర్యాలీలు, అరుపులు, నిరసనలు దుకాణం చుట్టూ, ఊళ్ళో ఉన్న అన్ని సెంటరులలో!
ఈయనేమో, పార్టీకి ఇంత కట్టబెట్టాను, ఆ మాత్రం సపోర్టు చేయదా, నేను చెప్పను గాక చెప్పను ‘క్షమాపణ’ అని భీష్మించుకు కూచున్నాడు!
నాలుగు నెలల్లో ఎలక్షన్లు ఉండటంతో, ఈయన్నే బలి ఇచ్చేశారు ముఖ్యమంత్రి గారు, అన్ని సమీకరణాలు సరి జూసుకుని!
ఒక మొత్తం వర్గాన్ని వదులుకోవడం, అదీ ఎలక్షన్ల సీజనులో, రాజకీయ విజ్ఞతగా తోచలేదు వారికి!
రాజకీయం అంటే తన, పర ఉండదు మరి!
బలి ఇవ్వటానికి ఏదైనా, మేక కింద లెక్కే!
కుర్చీ మహిమ-ఏమీ అనలేం, అంతే!
ఏది ఏమైనా, పాపం పైడితల్లికి, తీపి కాస్తా చేదై కూచుంది.
ఉన్న ఉద్యోగం ఊడింది!!
***
ఇక కాలాన్ని బట్టి కూడా మారిపోతున్నాయ్ మనోభావాలు!
ఒకప్పుడు, అత్తమామలు ఏమనుకుంటారో అని కోడళ్ళ జాగ్రత్తలు కోకొల్లలు!
నేడు అబ్బాయి సుఖ పడాలని, కోడలి మనోభావాలకే అగ్ర తాంబూలం, ఏ విషయమైనా!
కోడళ్ళను వంట చేయమని అడగటం మరిచిపోండి, చేసి పెట్తే, వంకలు రాకుండా అత్తలు బయటపడితే, అదే పదివేలనుకునే రోజులు!
కొడుకుల కాపురాలు నిలపటం, గోపుర విమానం ఎక్కించినంత ఘన కార్యం ఈ రోజుల్లో!
లేదంటే, మావిడాకులు విడివిడి అయిపోయి, ‘విడాకుల’ గలగలలే!
అయ్యో ఇవి గోదారి గలగలలు కాదండీ, వేరేవి!
సంసారాన్ని ఎండించేవి, కడుపులు మండించేవీనూ!
అట్లాగని అత్తలు సతీ సుమతులని కాదు చెప్పొచ్చేది, అందరిలో అన్ని రకాల మతులూ ఉన్నారన్నది గుర్తించాలని!
కూతురి మనోభావాలలో లేని పోనివి జొప్పించి, మనసులో వైమనస్యం ఎక్కించేసి, “ఏవిఁటట గొప్ప, నువ్వూ సంపాదిస్తున్నావు నెలకు లక్షా, వచ్చేసెయ్యమ్మా,సూట్ కేసు సర్దుకుని”, అని బోధించే మంథర తల్లులను బోల్డు మందిని చూస్తున్నాం, ఈ రోజుల్లో!
మనసులో చొరబడేవన్నీ మనోభావాలంటే ఎట్లా?!
నా ఇష్టమొచ్చినట్టు నేనుంటా, ఏమన్నా అంటే మనోభావాల ట్రంప్ కార్డు తీస్తానంటే, నూరేళ్ళు, కనీసం – అరవయ్యో, డెభ్భయ్యో ఆ యేళ్ళ జీవనం సాగేదెట్లా?!
కాస్త విచక్షణా, అవతలి మనసు నర్థం చేసుకొని, సర్దుకుని పోయే గుణం ఉండొద్దూ!!
***
ఇక మనోభావాలతో కావాలని, పని గట్టుకుని ఆడుకునేవాళ్ళూ ఉన్నారు, మనచుట్టూ!
వేరే మతం వాళ్ళ దేవుడి బొమ్మలు చెప్పుల మీద, చెప్పులలో చిత్రించడం, లేదా ఏదో ఒక వికృతాకారంగా గీయటం, వగైరాలు!
వారు గ్రహించాల్సిందంతా, అవతలి వారి లోనూ కళాకోవిదులుంటారనీ, వారూ ఈ మాత్రం చేయలేని వారు కాదని తెలుసుకోవటమే!
ఆ రకంగా ఎడాపెడా తోచింది గీసుకుంటూ ముందుకెళ్తే, అందరి మనోభావాలకు ముప్పే!
కంటికి కన్ను, పంటికి పన్ను, ఎవడికి లాభం?!
సమిష్టిగా అందరికీ నష్టమే!
అందుకే నోరా వీపుకు తేకే అని లోగడ వారు అన్నదీ, మనసా ఆట్టే గింజుకోకే ప్రతిదానికీ, మనోభావాలని ఇప్పుడూ, అంటోంది!!
***
మనోవిశ్లేషకులూ, సైకాలజీలు చదివినవారు ఎంత బాగా మానవ నైజాన్ని, అంటే మనోభావాలను చదువుతారో చెప్పలేం గానీ – ఒక తెగ ఉన్నది, వారి లాగా మనోభావాలలో పీహెచ్.డీలు, సృష్టిలో లేరు గాక లేరు!
అన్నట్టు, ఈ ఇంగ్లీషు ‘సైకాలజీ’ తో జాగ్రత్తగా ఉండాలండోయ్!
p ఉంటుంది, అయినా పలక కూడదట!
ఉంచటం ఎందుకు, పలకద్దు అనటం ఎందుకు?!
ఆ తెల్లవాడికే తెలియాలి, ఈ అక్షరాలకు నోటి పట్టీ వేసే రివాజు ఏమిటో?!
సరే ఇది దారి తప్పిన ఇంగ్లీషు చర్చ అవుతోంది, మన భావాలు – అవే మనోభావాల దగ్గరకు వస్తే, ఆ ప్రత్యేక ప్రతిభావంతులు ఎవరో కాదు, రాజకీయ నాయకులే అనక తప్పదు.
***
వీరిని చూడండి, ఎన్ని సార్లు వాగ్దానాలు చేసి నిలబెట్టుకోక పోయినా, మళ్ళీ మళ్ళీ వోటర్లు వీరి వలలో పడిపోతారు.
ఎందుకనీ?!
ఎప్పటికప్పుడు, ప్రజల మనోభావాలకు ప్రాముఖ్యం ఇచ్చినట్టు వారు మాట్లాడటమే!
మనుషులు – మాటలకు ఎంత పడిపోతారో, మనోభావాలకు దగ్గరగా మాట్లాడితే ఎంత అమాయకంగా నమ్మేస్తారో ‘రాకీ’లను చూస్తే తెలిసిపోతుంది.
(రాకీ అనగా రాజకీయ నాయకులు! మీకు తెలియదని కాదు, ఏదో చెప్పటం ధర్మం అని ఈ కుండలీకరణం)
డ్యాములు కట్టిస్తానంటాడు, ఉచితంగా ఇళ్ళు, ఇళ్ళ పట్టాలంటాడు, పింఛన్ల పెంపు లంటాడు, స్త్రీ సౌభాగ్యం స్కీములంటాడు, విద్యార్ధి ప్రతిభ అంటాడు, వృధ్ధబాంధవి అంటాడు, ఇంకా సవాలక్ష పేర్లతో కొత్తకొత్త స్కీములు తెచ్చి మిమ్మల్ని ఉధ్ధరిస్తానంటాడు!
హాయిగా నమ్మేస్తారు, వారికి కావల్సిన ఓట్లు వేసేస్తారు.
ఎందుకూ?!
కొంత చేతిలో పెట్టే తైలం మహిమ అయినా, ముఖ్యంగా వీరి కేవి అవసరమో, అవే మాట్లాడుతాడు.
అనగా మనోభావాలు గుర్తెరిగి మసలుకుంటాడన్న మాట!
అనగా, మనోభావాలకు రాజ్యాధికారం కట్టబెట్టే ప్రభావం కూడా ఉందన్నమాట!
మీ ఖాతాల్లో డబ్బు వేస్తాం అంటారు, మీకు ఉచిత వైద్యం, అంటారు! మీ పంటికి పన్ను, మీ కంటికి కళ్ళజోళ్ళు, మీ కాళ్ళకు పాదరక్షలూ, ఓహ్ స్వర్గానికి నిచ్చెనలు అంటాడు.
రాండి నా గోడౌన్‌లో కొని, అటకల మీద సిద్ధంగా ఉంచాను, నిచ్చెనలు చూడొచ్చంటాడు.
అవి మీ కివ్వటానికి మాత్రం, నాకు కుర్చీ కావాలి, ఆ కుర్చీ ఎక్కించే శక్తి మాత్రం మీ దగ్గరే ఉందంటాడు!
అన్నీ హాయిగా నమ్మేస్తారీ జనం, ఓట్లు గుద్దేస్తారు, అతన్ని గెలిపించేస్తారు.
ఇదంతా దేని వల్ల జరిగింది?!
కేవలం వారి మనోభావాలకు అనుగుణంగా మాట్లాడటం వలన!
అంత ప్రభావవంతాలు ఈ మనోభావాలని ఘంటాపథంగా ఋజువు చేస్తారన్న మాట ‘రాకీ’లు.
తరువాత నిచ్చెనల ఊసెత్తితే, “ఇంకా అనుమానమే, ఏం మనుషులయ్యా మీరు! మీరే నాకు ఆ ‘నిచ్చెనలు’, తెలియలా?!” అని, ‘ఎట్టా బతుకుతారో పాపం’, అన్నట్టు ఓ చూపు చూసి చక్కాపోతాడు!!
నా విజయమే, నాకు స్వర్గం!
మీరే ఇప్పిచ్చారు, థాంక్స్ అని అతను అనకపోయినా, అన్నట్టు అనుకొని,”పోనీలే ‘ధాంక్స్’ చెప్పాడు, బలే పెద్దమనిషి” అని సర్దుకోవడమే!
నిచ్చెన నిలువెల్లా కుంచించుకు పోవాల్సిందే!
ఏం చేస్తాం, రాజనీతీ, లోకరీతీ అది!!
***
ఇదివరకు కాలంలో, మొట్టికాయలు మొట్టి, తొడపాశాలు వడ్డించి, పిల్లల్లో భయమో భక్తో పుట్టించి, చదువులు చెప్పేవారు.
అప్పటి పిల్లలకు మనో భావాలే ఉండేవి కావు! పెద్దలు, ఏది చెబితే అదే మనోభావం, వినే వేదం!
కనుక ఆ పంతుళ్ళ అధికారాలూ, శిక్షలూ, చెల్లుబాటు అయినై!
ఇప్పుడు బోల్డు ప్రగతి సాధించాం!
పిల్లల మనోభావాలు దెబ్బ తినకుండా పెద్దలు మెలగాలి!
టీచర్లూ అంతే స్కూళ్ళలో!
దెబ్బ పడటానికి అసలే లేదు!
కార్పోరల్ పనిష్మెంట్ ఈజ్ బ్యాన్డ్, యూ నో!!
కోర్టులే చెప్పాయట పిల్లల మనోభావాలను కించపరిచేలా టీచర్లు బెత్తాలు, గిత్తాలూ వాడి వారిని హింసించరాదని!
పిల్లల ‘మనోభావ సంరక్షణా కమిటీలు’ కూడా ఏర్పాటు చేయాలట, పాఠశాలల్లో!
“ఇదేవిఁటీ విడ్డూరం”, అనకండి వెంటనే!
మనోభావం సర్వాంతర్యామి! అంతటా ఉంటుంది, అన్నిటినీ చూస్తుంది.
కాకపోతే ఇది పిల్ల మనోభావం!
పెద్దలు పాటించి, మన్నించాల్సిందే!!
ప్రభుత్వ ఆదేశం నెంబరు…..
కోర్టు ఆర్డరు నెం…………..
చూపించమంటారా?!
అట్లాగే, కనుక్కొని రేపు చెప్తాను!
***
ఏతావాతా, తేలిందేమిటీ అంటే, ఈ మనోభావాలు, బహు తియ్యగా దెబ్బతీసే రకాలు, అని!
జారి పడే నునుపు పాలరాయి బండలు, సర్రున నీటి లోకి లాగేసి మొసలి పట్టులు, ఎక్కడ పడితే అక్కడ తలలెత్తే మష్రూమ్‌లు, కాలికి, చేతులకు బిగిసే నల్లగుళ్ళు, పరువు గంగలో కలిపే కనబడని మహాశక్తులు!
ఏనుగు వంటి బలం, కత్తి లాంటి పదును, బాణం లాంటి మొన, ఒక్కటేమిటి, ఈ అన్నీ కలిపితేనే అది!
అంత పవర్‌ఫుల్ మరి, ఏమనుకున్నారో!
మనసులూ జాగ్రత్తగా ఉంచుకోండి!
మనోభావాలూ గౌరవిస్తూ ఉండండి!!
ఎవరివి?!
అవతలి వాళ్ళవి!
మీరు గౌరవిస్తే, వారూ తప్పక గౌరవిస్తారనే ఆశ మరి!
తప్పదు, ‘మనిషి సమాజ జంతువు’ అని ఏదో అంటూంటారుగా!
ఏదో విన్నది అంటున్నా, అంతే!
నా పూచీ, నా సొంతం-ఒక్క అక్షరం లేదు.
నిఝంగా!
కావాలంటే, మీ అందరి మనోభావాల మీదా, గోదారి గట్టంత ఒట్టు!