Site icon Sanchika

మనోగీతిక

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘మనోగీతిక’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]చి[/dropcap]న్నప్పుడు లేలేత అడుగులతో
ఇల్లంతా తిరుగుతూ ఆడుకున్నప్పుడు
అరుగులపై చేరి నేస్తాలతో
ముచ్చటించుకున్న శుభసమయాలు
నాన్న చేతి కిచ్చిన బొమ్మేదో
ప్రాణమై దాచుకుని పదే పదే చూసుకుంటూ మురిసిపోతూ
మిత్రుల దగ్గర ఆటబొమ్మ ప్రత్యేకతలు వల్లెవేసిన రోజులు
పసిడి ప్రాయంలో అమ్మ కొంగు చాటున దాగి
దాగుడుమూతల భలే భలే ఆటపాటలు..!
పచ్చగా మెరుస్తున్న చెట్లతో జతకట్టేస్తూ
ఉయ్యాలాటలు, కోతికొమ్మచ్చి అల్లర్లు..
అందంగా పరుచుకున్న వెండి వెన్నెల్లో
మంచాలపై చేరి ఇష్టంగా
చెప్పుకున్న కమ్మనైన కథలు..
ఎప్పుడు గుర్తొచ్చినా పెదవులపై
చిరునవ్వు తొణికిసలాడుతుంది!
మళ్ళీ అలాంటి రోజులు తిరిగొస్తే
బాగుంటుందని మనస్సు పలవరిస్తుంది!

Exit mobile version