మనోమాయా జగత్తు-10

0
3

[box type=’note’ fontsize=’16’] పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 10వ అధ్యాయం. [/box]

[dropcap]నీ[/dropcap]లాంబరి తను సరాసరి కాకినాడ వెడుతున్నానని మీడియా వాళ్ళకి సమాచారం ఇచ్చి, రాజమండ్రిలో హాల్టేసిందని తెలిసిన (భ్రమించిన) జనం ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ వెల్లువై వచ్చారు. “తనకి పార్ట్‌నర్‌షిప్ ఉన్న ఒక్కరెండు ఛానెల్స్ వాళ్ళకి సరైన సమాచారం ఇచ్చి తనతో పాటు తీసుకువెడుతోంది నీలాంబరి” అని ప్రచారం విస్తృతంగా జరిగింది. “ఆ రెండు ఛానెల్స్‌లోనే ఆవిడ రాజమండ్రి పరిసర ప్రాంతాల పర్యటన లైవ్ కవరేజ్ వస్తుంది” అనుకున్నారు అభిమానజనం, భక్తగణం. కానీ రాజకీయ నాయకుల ఎత్తులు ఊహించడం సామాన్యజనానికి సాధ్యం కాదు కదా.

చాపకింది నీరులా పాకిన ‘పెయిడ్ న్యూస్’ పధ్ధతి అప్పటికింకా ప్రజలకు తెలియదు. ఎడ్వర్టైజ్‌మెంట్లకి ఇచ్చినట్టే డబ్బిచ్చి తమకి అనుకూలంగా వ్రాయించుకుని దానిని మామూలు వార్తలతో పాటుగా ఒక వార్తలా అచ్చువేయించుకోడం, ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే న్యూసులో విజువల్స్ చూపించేలా చేసుకోడం కొత్తగా కాకపోయినా, ప్రభుత్వానికీ, ప్రజలకూ తెలియకుండా ఆచరణలోకొచ్చేసిన ఎన్నికల ప్రచారపధ్ధతి. ఈ పధ్దతి వల్ల ఇటు ప్రచారం చేసుకుంటున్న అభ్యర్ధులు, అటు మీడియా వారు కూడా లాభం పొందుతారు. ఎలాగంటే ఈ ఖర్చు అభ్యర్ధి తన ప్రచారపు ఖర్చులో చూపించడు. వార్తా పత్రికలే తమంతతామే ఈ వార్తలను ప్రచురించాయన్న ఇంప్రెషన్ కలుగుతుంది. పత్రిక, లేక ఛానెల్ వారు కూడా ఈ ఆదాయాన్ని చూపించనవసరం లేదు. ఎదుకంటే మామూలుగా ప్రసారమయ్యే వార్తల్లోనే ఇది ప్రసారమై పోతుంది –స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ గా కాక. మూడోకంటి వాడికి అసలు రహస్యం తెలియకుండా గడిచి ఉభయతారకంగా ఉండే పెయిడ్ న్యూసు పధ్ధతి ఇది. దీన్లో లెక్క చూపకుండా కోట్లకొద్దీ డబ్బు చేతులు మారిన వ్యవహారం తరవాత బయటపడింది. కానీ నీలాంబరి ప్రచారం చేసుకుంటున్న సమయానికి ప్రజలకు ఇది తెలియదు.

దాదాపు అన్ని ప్రాంతీయ ఛానెల్స్‌లోను నీలాంబరి ఎన్నికల ప్రచార పర్యటన ప్రత్యక్షప్రసారాలు వస్తుంటే ప్రజలంతా అది ఆవిడ మహత్యంగాను దైవలీలగాను చెప్పుకున్నారు. దర్శనం కోసం ఎగబడ్డారు.

ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లోను మెరికల్లాంటి యువకులని సిధ్దం చేసి ఇరవైనాలుగ్గంటలూ అప్రమత్తంగా ఉండేలా హెచ్చరికలిచ్చారు టీవీ ఛానెల్స్ వారు. దాంతో నీలాంబరి ఉపన్యసించిన చిన్నాపెద్దా సభలు, రోడ్డు పక్క ప్రజలతో అనుకోని ముఖాముఖీలు అన్నీ ఛానెల్సన్నిటిలోను ప్రత్యక్ష ప్రసారాలొచ్చేసాయి.

ఆవిడతో మాట్లాడగలిగిన వాళ్ళు, కరచాలనచేసినవాళ్ళు, ఆవిడ విసిరిన దండ అందుకోగలిగిన వాళ్లు తమ ఆనందాన్ని కెమెరాలముందు అఖిలాంధ్ర ప్రజానీకంతో పంచుకున్నారు.

నీలాంబరి ఊరి పొలిమేరలు దాటేవరకూ అదో సంబరం, అదే సందడి. ఆ కార్ల నల్లద్దాల్లోంచి ఆవిడ గాని శిష్యులుగాని ఎవరూ ఇవతలున్న వాళ్ళకి కనపడే వారుగాదు. కానీ జనం ఆ కార్ల వరస కంటికి కనపడకుండా పోయేవరకూ చూస్తూనే నుంచునేవారు.

కొంతమంది ఔత్సాహికులు పక్క ఊరికి కూడా వచ్చి ఆవిడ ఉపన్యాసం వింటామంటే అలాంటి వాళ్ళకోసం ట్రక్కులేర్పాటు చేసి బి.పి.బి.పి. కార్యకర్తలే తీసుకువెళ్లే వారు. ఓపికలేని వృధ్ధులు, కాస్త పనున్నవాళ్ళు, పిల్లలు ఊళ్ళో మిగిలేవారు. పనీపాటా లేని వాళ్ళందరూ నీలాంబరి కాన్వాయ్ వెనకే జేజేలు కొట్టుకుంటూ ఊరూరా తిరిగడమే. ఇది ఎన్నో ఎన్నికల సందర్భంగా జరుగుతున్నదే. ఇప్పుడు తేడా – ఏవో తాయిలాలు ఇస్తామని వాగ్దానాలు చెయ్యకపోయినా కేవలం నీలాంబరి మీద భక్తితో వచ్చేస్తున్నారు జనం.

ఊరూరా ఈ లారీల కాన్వాయిల్లో జనం పెరుగుతూనే ఉన్నారు. ఒకటిరెండు ఊళ్ళు తిరిగి కొందరు వెనక్కెడితే అంతకు రెట్టింపుమంది చేరుతున్నారు. జనాభా సంఖ్యఎంతపెరిగినా బిపిబిపి వారికి వాహనాల సంఖ్యకు లోటు లేదు.

అయితే మామూలు కంటికి కనపడనిది నిగమ్ ఏర్పాటు చేసిన సిఐడిలకు స్పష్టంగా కనిపిస్తోంది. నీలాంబరి ప్రచారయాత్రలో తగులుతున్న ప్రతి ఊళ్ళోను, నీలాంబరితో ప్రయాణిస్తున్న కార్యకర్తలు కొందరు ఆగిపోతున్నారు. నీలాంబరి విజిట్ చేసిన ఊరు మరీ చిన్నదైతే ఇద్దరు, ఓ మోస్తరు జనాభా ఉన్నదైతే నలుగురైదుగురు వరకూ అక్కడే ఓ నాలుగురోజులపాటు ఉండిపోతున్నారు. కొందరు ఒకటి రెండురోజులు ఊళ్లోంచి ఎటైనా వెళ్లినా తిరిగి వారు మొదట ఏ ఊళ్ళో దిగారో అక్కడికే తిరిగి వస్తున్నా రు. కానీ వాళ్ళు పార్టీ కార్యకర్తల్లాగా తెల్లపేంటు, నీలం చొక్కాగానీ, నీలాంబరి శిష్యుల్లాగా నీలపు పంచలుగానీ ధరించట్లేదు. మామూలు ప్రజానీకం లాగానే ఉంటున్నాయి వాళ్ల వేషభాషలు.

తన ప్రత్యేక గూఢచారులు అందిస్తున్న సమాచారం చదివి నిగమ్ పెద్దగా ఆశ్చర్యపడలేదు. ఇలాంటివి జరుగుతాయని తన అనుభవం తనకు నేర్పింది. అయితే వీళ్ళు నీలాంబరిని అనుసరించకుండా ఆగిపోయిన ఊళ్ళల్లో ఏం చేస్తున్నారు? అక్కడే ఉండి ఎన్నికల రోజువరకూ అధికారికంగాను అనధికారికంగాను ప్రచారం చెయ్యడమేనా వీళ్ళ పని? లేకపోతే ఇంకే రహస్యపు కార్యకలాపాల కోసమైనా ఉండి పోతున్నారా? ఇది తన డిపార్ట్‌మెంటు డిటెక్టివులు కనిపెట్టవలసిన విశేషం.

రాజమండ్రి చుట్టూ ఉన్న ఊళ్ళు తిరుగుతూ చిన్నచిన్న గ్రామాలు కూడా వదలకుండా ప్రచారం చేస్తోంది నీలాంబరి. అర్ధరాత్రి అపరాత్రి అయినా లెక్కచెయ్యకుండా తమ గ్రామంలో ఎప్పుడు అడుగుపెడుతుందా అని పడిగాపులు పడి ఎదురుచూస్తున్నారు ప్రజలు.

తనమీద ప్రజలు కురిపిస్తున్న అభిమానం చూసి ఉప్పొంగిపోతోంది నీలాంబరి. తండ్రి వెంకట్రావు, అనుంగు శిష్యులు దేవభక్తానంద స్వామి, పురాణానంద స్వామి కంటినిండా నిద్ర, భోజనసుఖం లేని ఇంతింత ప్రయాణాలు, ఎండనబడి ప్రసంగాలూ చేస్తుంటే నీలాంబరీమాత ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని ఆదుర్దా పడిపోతున్నారు. ఈ ప్రయాస తట్టుకోడం వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. సెక్రటరీ స్వామి మాత్రం కుటీరంలోనే ఉండి రోజువారీ వ్యవహారాలు నడిపిస్తున్నాడు నీడ పట్టున చల్లగా. టీవీలు చూస్తూ ప్రచార బృందంవారి ప్రోగ్రెస్ తెలుసుకుంటూ అప్పుడప్పుడు ఎవరైనా స్వామికి ఫోన్చేసి కుటీర సమాచారం అందిస్తున్నాడు.

***

“జై నీలాంబరీ మాతాకీ” అని నినాదాలిచ్చుకంటూ తెల్లవారు జామున బయలుదేరిన లారీలో రంజిత్ కూడా ఉన్నాడు. అతను నిగమ్ పంపిన సిఐడి ఏజెంటు. మరీ తెల్లవారుజాము మూడుగంటలకే బయల్దేరిపోయిన ఆ లారీలో నిద్రకి జోగుతున్న వాళ్ళే అందరూ. లారీ కదలగానే కళ్ళు మూతలు పడిపోయి ఒకరి భుజాల మీదొకరు వాలి జోగుతున్నారు. లారీ కుదుపులకు ఒళ్ళు హూనమవుతున్నా మెలుకువ రావట్లేదు కొందరికి. అదే లారీలో శిష్యపరమాణువు సుందరం కూడా ఉన్నాడు. అది గమనించే ఆ లారీలో ఎక్కాడు రంజిత్. నిద్రకి ఆగలేక తూలిపోతున్నట్టు తలవాల్చి కూచున్న రంజిత్ మీద ఎవరికీ అనుమానం రాలేదు. సుందరానికి కూడ. సుందరం ఎదురుగా కూచున్న కుర్రాడొకతను కళ్లు తెరుచుకుని నిద్రపోతున్న వాళ్ళను చూస్తూ దిగులుగా అప్పుడప్పుడు నిట్టూరుస్తున్నాడు. అతను సన్నగా పొట్టిగా చూడగానే హైస్కూలు పిల్లాడిలా ఉన్నాడు కానీ పరికించి చూస్తే ముఖం ముదురుగా ఉండి కనీసం పాతికేళ్లయినా నిండిన వాడిలాగా ఉన్నాడు.

సుందరం కాసేపు అతన్ని పరిశీలించి చూసి, ఓసారి చుట్టూ చూసాడు ఎవరైనా తనని చూస్తున్నారేమోనని అనుమానం వచ్చి అందరూ నిద్రపోతున్నారు తనని పట్టించుకుంటున్న వాళ్ళెవరూ లేరని నిర్ధారించుకున్నాడేమో లేచి నిలబడి నిద్రతో వాలిపోతున్న వాళ్ళని తప్పించుకుని కష్టంమీద ఎదురుగా ఉన్న కుర్రాడి పక్కన చోటుచేసుక్కూచున్నాడు.

“ఏం బ్రదర్, అందరూ నిద్రకాగలేక ఎలా ఉన్నవాళ్ళలాగే సోలిపోతుంటే నువ్వు మాత్రం కళ్ళు తెరిచే ఉన్నావ్? రాత్రి సభలో కూడా నిన్ను గమనించాను. అర్ధరాత్రి వరకూ నీలాంబరి నించి లోకల్ నాయకుల వరకూ ప్రతి ఒక్కరి స్పీచ్ వింటూనే ఉన్నావ్. కొంతమంది మీటింగు మధ్యలోనే కండువాలు పరుచుకుని ఓ కునుకు తీసి లేచారు. నువ్వేమో అప్పటినించీ ఇప్పటి వరకూ అలాగే కళ్ళు పత్తికాయల్లా తెరిచి పెట్టుక్కూచున్నావ్. నీకు రెప్పలు మూతపడవా ఏంటి?”

సుందరం ప్రశ్నవిని అతనివైపు కళ్ళుతిప్పాడే కానీ వెంటనే జవాబు చెప్పలేదు. ఆ కుర్రాడి పక్కనే ఉన్న పెద్దావిడ సుందరం గొంతు విని కళ్లు తెరిచి, “వాడికి రెండేళ్లుగా నిద్ర పట్టని జబ్బట్టుకుంది బాబూ. అమ్మ కరుణిస్తే జబ్బు తగ్గుతుంది అని మావాళ్ళందరూ చెప్పడంతో పొద్దున్ననగా వీడినేసుకొచ్చి పడిగాపులు పడ్డాను. అబ్బే జనం తోపిడికి ఒళ్ళు హూనమయింది కానీ అమ్మ మా వైపు చూసే అవకాశమే దొరకలేదు. ఇప్పుడిలా ఆవిడతో పాటే ప్రయాణంచేస్తే పొద్దున్నకల్లా మాకు దర్శనం దొరికితే కాస్త మా బాధలు చెప్పుకుందావని బయల్దేరాం. ఆవిడ ఒక్కసారి ఆశీర్వదిస్తే చాలు రోగాలన్నీ తీరిపోతాయని నమ్మకంగా చెప్పారండి. మాచుట్టాలబ్బాయికి జరిగింది కూడానూ” అంది.

“అవునమ్మా నీలాంబరీ మాత మహత్యాలు అనేకం. మాత మూలికావైద్యంలో కూడా నిష్ణాతులమ్మా. మాత తయారుచేసిన లేహ్యం ఉంది నాదగ్గర. నిద్రపట్టని వాళ్లకి మహబాగా పట్టేస్తుంది. కాస్త తిని చూడు బాబూ” సుందరం జేబులోంచి ఆకుతో కట్టిన పొట్లం ఒకటి తీసాడు. మళ్ళీ పెద్దావిడవైపు తిరిగి, “దేవి మహత్యం అంటే ఇదేనమ్మా. అనుకోకుండా నేను మీ బాబు నిద్రపోవట్లేదని చూడడం, అతనికి నిద్రపట్టని జబ్బుందని మీరు చెప్పడం, సమయానికి నా దగ్గర దేవీమాత తయారుచేసిన లేహ్యమే ఉండడం కాకతాళీయం అనుకోకండమ్మా. దేవీ మహత్యమే నన్నూమిమ్మల్నీ కలిపింది.”

పెద్దావిడ కూచునే ముందుకు వంగి, “బాబ్బాబు నిజంగా దేవీమాత పంపింది నిన్ను. ఇదే మరి మహత్యం అంటే” అంటూ సుందరం కాళ్ళు కళ్ళకద్దేసుకుంది.

“ఏమిటి బాబూ నీ పేరు?” అతుక్కుపోయిన రెండు పొట్లాలు విడదీస్తూ అడిగాడు సుందరం.

“గోవిందు” బొంగురు పోయిన గొంతుతో చెప్పాడు.

“ఆడి పేరు గోవిందండి నా పేరు శేషమ్మండి” అంది గోవిందు తల్లి.

తన చేతిలోని పొట్లం విప్పి “ఇదిగో బాబూ, మొదట కుంకుడుగింజంత తీసుకు నోట్లో వేసుకో” అని ఇంకో పొట్లం తీసి, “ఇది మీ దగ్గరుంచండమ్మా. ఈ పొట్లం అయిపోయాక అది విప్పచ్చు. బాబూ, ఇది ఇప్పుడు తీసుకున్నావు కదా మళ్ళీ భోజనం తరవాత ఒకసారి, రాత్రి భోజనం తరవాత ఒకసారి. రోజుకు మూడుసార్లన్నమాట. వారంలో నీకు జబ్బు తగ్గిపోయి మందవసరం లేకుండానే టైముకి నిద్రొచ్చేస్తుంది” అన్నాడు.

ఆ అబ్బాయి లేహ్యం నోట్లో వేసుకున్నాడు. శేషమ్మ, సుందరం నీలాంబరి మాత మహత్యాలు గురించి కబుర్లు కలబోసుకున్నారు. మాటాడుతూండగానే శేషమ్మకు కునుకు పట్టేసింది. ఓ గంటసేపు నిద్రపోయాక ఆవిడ చెవిలో సింహగర్జనలాంటి శబ్దాలు వినపడడం మొదలైంది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన తల్లి ఆశ్చర్యానికి అంతు లేదు. తన కాళ్ళ ముందు ఉన్నకాస్త ఖాళీ చోటు లోనే కొడుకు ముడుచుకు పడుకుని గట్టిగా గుర్రుపెట్టి నిద్ర పోతున్నాడు. రెండేళ్ళ తరవాత తన కొడుకు నిద్ర – అదీ గాఢంగా గుర్రుపెట్టి మరీ నిద్ర పోవడం చూసిన తల్లి ఆనందంతో పులకించిపోయింది.

“బాబూ! నిన్ను నిజంగా నీలాంబరీ మాతే నాకోసం పంపింది” అంటూ అంతకు ముందు సుందరం కూచున్న చోటు వైపు చూసింది. అక్కడ సుందరం లేడు. లారీలో కూచున్న అందరినీ పరకాయించి చూసింది. ఎక్కడాలేడు. “ఆ నీలాంబరీమాతే ఆ కుర్రవాడి రూపంలో నాపక్కన కూచుని నా కొడుకు సమస్యతీర్చింది. అందరూ అనుకుంటున్నది నిజమే. మహత్యం గల తల్లి” చేతులు పైకెత్తి దండం పెట్టుకుంది. అప్పటికి తెలతెలవారుతూ లారీలు కార్లు ఏదో ఊరు పొలిమేరల్లోకి వచ్చాయి.

***

“అమ్మా, తాతగారింటికి కాకినాడ వెడదామే. ఆరోజు సిరి ఇంటర్నెట్టుండదు ఇదీ అదీ అని ఏదేదో చెప్తే బెదిరి పోయాను. తాతగారికంటే ఇంటర్నెట్ ముఖ్యమేంటీ? అయినా నాలుగురోజులు ఇంటర్నెట్ లేకపోతే ప్రాణం పోతుందేంటి? కాకపోయినా, ఇప్పుడు పరమ పల్లెటూళ్ళలోకూడా వీధికి నాలుగు నెట్ కేఫ్‌లుంటున్నాయి. కాకినాడేం పల్లెటూరుకాదు. మహాపట్నం. ఏం మిస్సవ్వం. పోదాం అమ్మా” విరి గారాలు పోతూ తల్లిని బతిమాలుతోంది.

సిరి మాటాడకుండా విరినే కన్నార్పకుండా చూసింది. ‘ఉన్నట్టుండి ఏమిటీ ప్లేటు ఫిరాయింపు. ఏదో కారణం లేకుండా ఈవిడగారిన్ని విన్యాసాలు చూపించదు.’

“ఏయ్ ఏంటా చూపు. మొన్న నేనడిగినప్పుడు అమ్మ తీసుకెడతానంటే నువ్వే మాయమాటలు చెప్పి బుట్టలో పడేసావ్ మా ఇద్దరినీ. ఇంక నీ మేజిక్కులేం కుదరవు. నాకూ అమ్మకీ తాతగారిని, అమ్మమ్మ నీ చూడాలని ఉంది. నువ్వురాకపోతే ఫో. మేం వెడతాం” తల్లి మెడకు చేతులేసి “మేం ఇద్దరం ఒకపార్టీ” అంది.

“అంతగా లేనిపోని ప్రేమలు తెచ్చిపెట్టకోక్కర్లేదు కానీ, వెళ్లి చూడు. తత్కాల్‌లో ముగ్గురికీ దొరికితే నెట్‌లో బుక్ చేసెయ్. ఎలాగూ ఇవాళరేపూ సెలవే. ఇంకో రెండురోజులు లీవుపెట్టేస్తాను” అంది సుశీల. కాస్తోకూస్తో మార్పు కావాలి అని తహతహలాడిపోతోందీ మద్య. “హుర్రే!” ఛెంగున ఒక్కదూకులో కంప్యూటర్ ముందు వాలింది విరి.

కంప్యూటర్ టేబుల్ పక్కనే నిలబడింది సిరి. కన్నార్పకుండా విరి ముఖంలోకి చూస్తూ కదలకుండా నుంచుంది. విరి తనకేం లెక్కలేదన్నట్టు అపస్వరాలతో ఏదో కూని రాగం తీస్తూ నెట్ ఓపెన్ చేసి చూడసాగింది. సిరి కదల్లేదు. రెండు నిముషాలయ్యాక “ఏయ్ ఇక్కడెందుకు నుంచున్నావ్? పో. పని చూసుకో. నన్ను డిస్టర్బ్ చెయ్యకు” అంది. సిరి మాటాడలేదు. కళ్ళు తిప్పలేదు. “ఇదిగో ఎసి త్రీటైర్ లోనే ఉన్నాయ్ బుక్ చేసెయ్య మంటుందేమో అడుగు అమ్మని. వెళ్ళి అర్జంటుగా అడిగిరా. లేటయితే అవికూడా బుక్కయిపోతాయ్” తొందరపెట్టింది. సిరి కదల్లేదు. బుక్ చేయ్యడం అయ్యాక, సిరి మీదమీదకి కొట్ట బోతున్నంత దూకుడుగా వెళ్ళి “అసలేంటి నీ ఉద్దేశం? నేనేదో అమ్మని మోసం చేసాననా? ఏంటి? ఏంటి చెప్పు. నీ లిటిగేషను బుర్రలో ఉన్నదంతా కక్కేయ్” అంది అక్కసుగా. సిరి మాటాడలేదు. అలాగే చూసింది.

విరి కళ్లల్లో నీళ్ళు తిరిగిపోయాయి. “నాకు తెలుసు నేనేదో పేద్ద విలన్నని నీ ఉద్దేశం” ముఖం మీద చేతులు కప్పుకుంది.

‘ఇంక చాల్లే దొంగేడుపులూ నువ్వూనూ. ఇంత హఠాత్తుగా అమ్మమ్మా వాళ్ళమీద నీకు ప్రేమ ముంచుకొచ్చిందంటే నేను నమ్మను చెప్పు. ఏదో ఉంది. ఏదో ఈ మెయిలో ఇంకేదో వొచ్చింది నీకు. అవునా? దాన్ని నమ్ముకుని కాకినాడ ఎగురుకుంటూ పోదామని ప్లాను. అవునా? అక్కడికెళ్ళాక ఇప్పుడే ఫ్రెండిండికెళ్ళొస్తా అని మాకెవరికీ తెలీని చోటికి పోదామని మాస్టర్ ప్లాను అవునా?”

“అవును అవును అవును. కానీ చెప్పకుండా పోదామనీ కాదు ఏం కాదు. అక్కడ తాతగారిని అన్ని వివరాలూ అడిగి తెలుసుకున్నాకే ముందడుగు వేద్దామని. మీ ఇద్దరికీ ఇప్పుడేం చెప్పినా నా ఆత్రం అర్ధం కాదు మీకు. ఈ మాత్రం దానికి చదువు ఎగ్గొట్టి వెళ్ళాలా అని నన్ను కదలనియ్యరు” నిజంగానే బొటబొటా విరి కళ్ళల్లోంచి నీళ్ళు కారి పోయాయి.

చటుక్కున విరి చుట్టూ చేతులేసి కూచోబెట్టింది. “ఎందుకంత బాధ? నువ్వెవరితో కరెస్పాండ్ చేస్తున్నావో ఏం చేస్తున్నావో దాచకుండా చెప్తే నేనిలా మాటడి ఉండేదాన్ని కాదుకదా” అంది సిరి.

కాస్త సద్దుకుని కళ్ళుతుడుచుకుంది విరి. “నేను చెప్పేదంతా పూర్తిగా విని నాతో సహకరించాలి. ఊరికే అమ్మకు ఏదేదో చెప్పి భయపెట్టేసి నన్ను అష్టదిగ్బంధనం చేసెయ్యకూడదు. అసలు నేను ముందూ వెనకా ఆలోచించకుండా మూర్ఖంగా ఏదో ప్రమాదం నెత్తిమీదికి తెచ్చుకుంటానని ఎందుకనుకుంటావు?” “నువ్వంటే నాకు అంతులేని ప్రేమ కాబట్టి” శాంతంగా చెప్పింది సిరి.

“నేనూ నా వాళ్ళు సురక్షితంగా ఉండాలని నాకూ ఉంటుంది. నేనేం బ్రహ్మ రాక్షసిని కాను”ఉక్రోషంగా అంది విరి.

“సారీ” అనేసి ఇంక మాటాడకుండా కూచుంది సిరి.

“సర్లే సారీలు చెప్పడం మటుకువచ్చు అనేవన్నీ అనేసి” కోపం తగ్గిపోయినా ఇంకా కోపంగా ఉన్నట్టు బుంగమూతి పెట్టుకుని లేచి తన మెయిల్ ఓపెన్ చేసి చూపించింది.

“ఇదిగో ఇది చూడు” సిరి జాగ్రత్తగా చదివింది.

“ప్రియమైన సోదరి, మీరు షైజోఫ్రేనియా అనే మానసిక వ్యాధి గురించి తెలుసుకోవాలని ఎంతో కుతూహలముతో ఎన్నో వెబ్ సైట్లు తెరిచి చదువుతూ మాచే తయారు చేయబడుతున్న మందుల గురించి కూడా చదవడం మేము గమనించాము. దేవీ నీలాంబరిమాత మూలికావైద్యములో ఎన్నో ప్రయోగాలు చేసి మానసిక వ్యాధులకు సరికొత్త మందులు కనుగొని యున్నారు. మీకు ఆసక్తి యున్నచో కాకినాడలోని మా ఆశ్రమమును సందర్శించండి. మీ వంటి యువతీ యువకులకు శిక్షణనిచ్చి మూలికా మరియు ఆయుర్వేద వైద్యులుగా తీర్చిదిద్దుటకు మేము సిధ్ధముగా ఉన్నాము. ఇంటరు విద్యార్హత చాలును. ఇంటరు పూర్తిచేయకపోయిననూ ఫరవాలేదు. మీరు ఆయుర్వేద మానసిక వైద్యశాస్త్రము మొదలు పెట్టవచ్చును.”

అది ఈమెయిల్ సందేశం. దానికింద ఎడ్రసులు ఒక ఫోన్ నంబరు ఉన్నాయి.

“అయితే ఇంటరు కూడా పూర్తి చెయ్యకుండా, మానసికవైద్యురాలివి అయిపోదామని ఆత్రంగా ఉన్నావన్న మాట” సిరిమాటలకు గుర్రుగా చూసింది విరి.

“నేనేం అలా అనుకోవట్లేదు. అసలదేంటో చూద్దామని కుతూహలం. క్యూరియాసిటీ. అంతే” “క్యూరియాసిటీ కిల్డ్ ద కేట్ అన్న సామెత వినలేదా?”

“విన్నాను కానీ నేను పిల్లిని కాదుకాబట్టి నాకేం ప్రమాదం లేదు.”

“ఆల్రైట్. కానీ నువ్వెక్కడికీ ఒంటరిగా వెళ్ళకూడదు. నన్నూ నీతో పాటు తీసుకెళ్ళాలి. అసలింకో ముఖ్య విషయం. మనం ప్రతి విషయం తాతగారితో థరోగా చర్చించి ఆయన సలహా ప్రకారమే నడుచుకుందాం. ఆయన నోర్మూసుకోండి ఇవన్నీ మోసాలు అంటే మానెయ్యాలి. ఆయనకి తెలియకుండా ఇంకెవరూ ఇంట్లో వాళ్ళకీ తెలియకుండా ఏమీ చెయ్యకూడదు. సరేనా?”

“సరే. నేనేదో దొంగల ముఠాతో చేతులు కలపడానికెడతానన్నట్టు మాటాడుతున్నావ్!” లేని కోపం నటిస్తూ మూతి తిప్పుకుంటూ అంది విరి.

“నువ్వు దొంగలముఠాతో చేతులుకలుపుతావని నేను భయపడట్లేదు. హంతకులు, స్మగ్లర్లకు నాయకురాలివేమోనని నా అనుమానం.”

“చంపుతా”. చెయ్యెత్తింది విరి.

“చెప్పానా హత్యలేనని?” ఇద్దరి మధ్యా మంచం అడ్డొచ్చేలా పారిపోతూ అంది సిరి. ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు.

ఈ మెయిల్లో ఉన్న అడ్రసు, ఫోన్ నంబరూ చిన్న డైరీలో నోట్ చేసింది సిరి.

“ఎందుకలా రాసుకోడం. సెల్లులో పెట్టేసుకుంటే పోలా?” నిర్లక్ష్యంగా అంది విరి. “అసలు సెల్లులో కూడా అక్కర్లేదు కాకినాడ వెళ్ళాక నా మెయిల్ ఓపెన్ చేసి చూస్తే పోలా?” అని కూడా అంది. సిరి క్లుప్తంగా “నా చాదస్తం నాది”. అంది.

“ముసలమ్మ!” సిరి తల మీద మొట్టికాయ్ వేసింది విరి.

***

ఏసీ కార్లో ప్రయాణం చెయ్యడం కూడా చాలా అలసటైన పనే అని కనిపెట్టాడు రాకేష్. ప్రయాణం మధ్యలో ఎప్పుడో రాకేష్ నిద్రకాగలేక ముందుకు పడిపోతుంటే కారాపి అతన్నివెనకసీట్లో పడుకోమన్నాడు సంజీవ్. వెళ్ళి పడుకున్నాడే కానీ తనెప్పుడు వెనక్కెళ్ళాడో ఎప్పుడు సుఖంగా నిద్రపోయాడో గుర్తేలేదు. ఉన్నట్టుండి మెలుకువ వచ్చి బధ్ధకంగా లేచికూటున్నాడు. క్షణం పాటు తనెక్కడున్నాడో అర్ధం కాలేదు. అయ్యాక సంజీవ్‌ని చూసి ఆశ్చర్యపోయాడు. సంజీవ్ విరామం లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు. అతనికి అలసట లేదా? ఒకవైపే కనిపిస్తున్న అతని ముఖలోకి చూసాడు రాకేష్.

“నిద్ర బాగానే పట్టినట్టుందే” అన్నాడు సంజీవ్.

రాకేష్ మొహమాట పడిపోయాడు. “సారీ సర్” అన్నాడు.

“మరేం ఫరవాలేదు.” నవ్వాడు సంజీవ్.

తెల్లవారిపోయినట్టుంది. “కాకినాడ దగ్గర పడిందా సార్?” అన్నాడు రాకేష్.

సంజీవ్ మాటాడలేదు. తల తిప్పి అతనివైపు చూసాడు. కాస్త దూరంలో రోడ్డుపక్కగా ఆగి ఉన్న వేన్ వైపు చూస్తున్నాడు సంజీవ్. ఆ వేన్ లోంచి దిగిన వాళ్ళు కాబోలు దానిచుట్టూ చేరి మాటాడుకుంటున్నారు. ఒక అరడజను మంది దాకా ఉన్నారు. ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళందరూ నీలం చొక్కాలు, తెల్ల పాంట్లు వేసుకుని ఉన్నారు. వేన్‌కి బేనర్లు కట్టి ఉన్నాయి. దూరానిక్కూడా ఆ బేనర్లమీది నీలాంబరి బొమ్మ స్పష్టంగా కనిపిస్తోంది.

“కేంపెయిన్ కోసం వెడుతున్న వేన్ ఆగిందే!” దానివైపు చూస్తూ అన్నాడు రాకేష్.

“బ్రేక్ డౌన్ అయినట్టుంది. అందరూ దిగారు” సంజీవ్ అక్కడదాకా కారు పోనిచ్చి ఆపాడు.

“ఎనీ హెల్ప్?” అన్న సంజీవ్ గొంతు విని ఇటు తిరిగారు అక్కడున్నవాళ్ళు.

“హాయ్ గీరూ!” సంతోషంగా అరిచాడు రాకేష్. వెతకబోయిన తీగ కాలికే తగిలింది సంతోషమే మరి.

“హల్లో రాకేష్. వాటె సర్ప్రైజ్!” గీరూ నిజంగానే నోరెళ్ళబోట్టాడు.

“ఇరుగో నేను చెప్పానే మా సెకండ్ అంకుల్” సంజీవ్‌ని చూపించాడు రాకేష్.

గీరూ ముందుకొచ్చి చేతులు కలిపాడు. “యు ఆర్ లక్కీ. మీరడిగిన మెడిసిన్ కావలిసినంత ఉంది మా దగ్గర. ఇప్పుడు భక్తుల్లో డిస్ట్రిబ్యూషన్ కోసం పట్టుకెడుతున్నాం” గొప్ప శుభ వార్త మోసుకొచ్చిన వాడిలా ఊరిస్తూ అన్నాడు గీరూ.

“ఏమైంది వేన్‌కి?” సంజీవ్ అడిగాడు.

“ఏమో ఏదో బ్రేక్ డౌన్. మా కార్యకర్త ఒకరు లిఫ్ట్ తీసుకుని వెళ్ళాడు – మెకానిక్‌నీ, మాకోసం మరో వెహికిల్ నీ తీసుకురావడానికి. నీలాంబరి మాత రాజమండ్రి లో విశ్రాంతి తీసుకోడానికి నైట్ హాల్ట్ వేసింది. ఇంకో గంటలో కాకినాడ రీచ్ అయిపోతుంది. ఈ లోపల మేం అక్కడికెళ్ళి ఎరేంజ్‌మెంట్స్ చూద్దామనుకుంటే ఇలా అయింది” అటూ ఇటూ చూస్తూ అన్యమనస్కంగా మాటాడుతున్నాడు గీరూ. నెమ్మదిగా రోడ్డు మీద నడుస్తూ మాటాడుతున్న గీరూతో పాటు సంజీవ్, రాకేష్ కూడా నడుస్తున్నారు. వేన్ చుట్టూ ఉన్న మనుషులనించి కొంచెం దూరం నడిచాక ఎవరికీ వినబడదని నిశ్చయించుకుని, “మీరు మీకు కావాల్సిన మందులు తీసుకుని ఇట్నించిటే వెళ్ళిపోతారా? నీలాంబరి మాత సభలక్కూడా వస్తారా?”. అనడిగాడు సంజీవ్ వైపు చూస్తూ.

“వస్తాం.” క్లుప్తంగా అన్నాడు సంజీవ్.

“అయితే నేను కూడా మీ కార్లోనే వస్తాను. మనం ముందు పోదాం. వీళ్ళు వేన్ రిపేర్ చేయించుకుని వస్తారు. చూపిస్తా మేం ఎంత మాల్ తీసుకుపోతున్నామో” వేన్ దగ్గరకెళ్లాడు గీరూ.

నీలం చొక్కాలవాళ్లల్లో కొంచెం పెద్దవాడిలా కనిపిస్తున్న ఒక బట్టతలాయన దగ్గరకెళ్ళి సంజీవ్ కారుని చూపిస్తూ ఏదో చెప్పాడు. ఆయన సరేనన్నట్టు తలూపాడు. గీరూ వేన్ లోంచి తన సూట్ కేసుతో పాటు ఇంకో పెద్ద సంచీకూడా తీసి, సంజీవ్ కారు వైపు నడిచాడు.

బట్టతలాయన గబగబా గీరూని ఆపి, “అదెక్కడికి. ఇక్కడే ఉండనీ” అన్నాడు.

“మీరెప్పటికొస్తారో. దీనికోసం అడిగితే ఏంచెప్పాలి?” అన్నాడు.

బట్టతలాయన కాసేపు ఆలోచించి సరేకానిమ్మన్నట్టుగా తలెగరేసాడు. గీరూ వచ్చి సూట్ కేసు, సంచీ డిక్కీలో పెట్టాడు.

“రాకేష్, కాసేపు వెనక సీట్లో పడుకుంటారా. ఆ వేన్ బాగాలేదు ఒళ్ళు హూనమైంది” అని వెనకాలెక్కి వీలైనంత సౌకర్యంగా సద్దుకుని విశ్రమించాడు.

“అంకుల్, నీలాంబరి మాత ఇంకో గంటలో బయల్దేరి కాకినాడ వెడుతుంది. కాకినాడలో ఇప్పుడు బహిరంగసభ లేదు. కాకినాడలో లేండ్ అవుతూనే మల్లిప్రోలు అనే గ్రామానికి కాన్వాయ్‌తో వెళ్ళిపోతుంది. మనమూ డైరెక్ట్‌గా మల్లిప్రోలు వెడదాం, ఇక్కడనుంచి కాకినాడ టచ్ చెయ్యకుండానే వెళ్ళిపోవచ్చు” అన్నాడు.

“ఆ రూట్ తెలుసు” అన్నాడు సంజీవ్.

నిశ్చింతగా కళ్ళుమూసుకుని ఆవలించాడు గీరూ.

(మల్లిప్రోలు అనే గ్రామం ఏదీ లేదు. కేవలం రచయిత కల్పన)

***

“మల్లిప్రోలు దగ్గరపడుతోంది. ఇక్కడ చెరువు దగ్గర ముఖాలు కడుక్కనే వాళ్ళు కడుక్కోవచ్చు. అదిగో అటు పాక హోటలు కనిపిస్తోందికదా అక్కడ టీలు తాగే వాళ్ళు తాగచ్చు. ఏమీ తాగాలనుకోకపోయినా కాసేపు దిగి విశ్రాంతి తీసుకోండి. డ్రైవర్లిద్దరూ రాత్రంతా మార్చిమార్చి ట్రక్కు నడుపుతూనే ఉన్నారు. వాళ్ళు కాస్త ఆగుదామంటున్నారు” ఒక కార్యకర్త ప్రకటించాడు.

అందరూ దిగారు. శేషమ్మ కూడా దిగి ముఖం కడుక్కుని టీ గ్లాసు పుచ్చుకుని మళ్ళీ ట్రక్కు దగ్గరకొచ్చి చూసింది. ఖాళీ ట్రక్కులో పడీ పడీ నిద్రపోతున్న గోవిందుని ముచ్చటగా కాసేపు చూసుకుంది.

“ఒరే గోవిందూ, గోవిందూ” లేపాలని లేకపోయినా పిలిచింది.

“కాస్త టీ తాగేసి మళ్ళీ పడుకో. ఆకలేస్తుందేమో” అంది. వాడు మూలిగి ఇంకో వైపు తిరిగి పడుకున్నాడు. “పోన్లే పాపం” అనుకుని తను మళ్ళీ టీ కొట్టు వైపు నడిచింది.

టీ పాకలో బెంచిమీద ఇడ్లీ తింటూ కనిపించిన సుందరాన్ని చూసేసరికి ఆత్మీయుడిని చూసినంత ఆనందం కలిగింది. “సుందరం బాబూ, మావోడు గుర్రెట్టి మరీ నిత్రోతున్నాడు చూసావా” అంది చేటంత ముఖం చేసుకుని. సుందరం ఈమె ఎవరితో మాటాడుతోందా అన్నట్టు తన వెనక, చుట్టుపక్కలా ఓ సారి చూసి తలొంచుకుని తినడం మొదలెట్టాడు.

“సుందరంబాబూ, నిన్నే మా గోవిందు రాత్రంతా నిద్దరోయాడు. ఇంకా నిద్దరోతున్నాడు” సుందరం పక్కనే బెంచి మీద కూచుంది శేషమ్మ.

సుందరం వింతగా చూసి “ఎవరమ్మా మీరు?” అన్నాడు.

శేషమ్మ బిత్తరపోయింది. “అదేంటిబాబూ మర్చిపోయారా? నిన్నరాత్రి మావోడికి పొట్లం మందిచ్చారుకదూ.”

సుందరం చుట్టూరా చూసాడు ఇదెక్కడి విడ్డూరం! అన్నట్టుగా. “నేను పొట్లం మందివ్వడమేంటమ్మా? మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో” అన్నాడు.

“అయితే తవరు సుందరంబాబు కాదా?” జంకుతూ అడిగింది శేషమ్మ.

“నా పేరు సుందరమే. కానీ ఈ పొట్లం మందివ్వడం ఏంటో నార్థం కావడంలేదు” మొహమాటంగా నవ్వుతూ చుట్టూ ఉన్నవాళ్లవైపు ఇబ్బందిగా చూస్తూ అన్నాడు.

శేషమ్మ ఇంక మాటాడలేదు. ఆవిడ మనసులో ఒకటే ఆలోచన. అయితే అందరూ నిద్రపోతున్న సమయంలో తనకొడుక్కి మందు ఇచ్చినది నీలాంబరి మాతే! సుందరం రూపంలో వచ్చి తన కొడుకును కరుణించింది! ఎంత మహత్యం గల తల్లి! ఆ విష్ణుమూర్తి పది అవతారాలెత్తాడు లోకాన్ని ఉధ్దరించడానికి. గజేంద్రుడికి మోక్షం ఇవ్వడానికి పరుగు పరుగున వచ్చాడ్ట. అలాగే నీలాంబరీమాత. మనసు ఆనందపారవశ్యంతో తరించిపోతుండగా మళ్ళీ ట్రక్కు వైపు నడిచింది శేషమ్మ.

శేషమ్మ, సుందరాల మధ్య జరిగిన సంభాషణ మూల బెంచీమీది కూచున్న వ్యక్తి శ్రధ్ధగా విన్నాడు. శేషమ్మ వెళ్ళి పోయేవరకూ ఓపికగా కూచున్నాడు. శేషమ్మ మళ్ళీ ట్రక్కు దగ్గరకెళ్ళి పోయాక సుందరం జేబులోంచి సెల్లు తీసి మాటాడడం చూసాడు. మెల్లిగా లేచి సుందరం దగ్గరకు వెళ్ళాడు.

సుందరం చాలా మెల్లిగా మాటాడుతున్న మాటలేమీ ఆ వ్యక్తికి వినపడలేదు. సుందరం మాటలాపి సెల్లు జేబులో పెట్టుకోగానే, దగ్గరకెళ్ళి, “కారు మల్లిప్రోలు ఖాళీగా పోతోంది వస్తారా?” అడిగాడు. సుందరం కాస్త ఆలోచించి “ఎంత? నేనెక్కువ ఇవ్వను”.

“అసలేమీ వొద్దు. ఖాళీగా పోతోందని కంపెనీ ఉంటుందని అడిగా”.

“మీ ఓనరేమీ అనరా?” అడిగాడు అతను డ్రైవరై ఉంటాడు, ఏదో పని మీద ఎవరికోసమో కారు పంపుతుంటే మధ్యలో ఇతను బేరాలు కుదుర్చుకుంటున్నాడనుకుని.

“ఏం అనడు. తెలీదు. పదండి.” అన్నాడు. మారు మాటాడకుండా తన సంచీ కాస్త బరువుగా ఉన్నా తనే మోసుకుంటూ కారు దగ్గరకెళ్ళాడు. అప్పటికే ముందు సీట్లో ఇంకో పొడుగాటి వాడున్నాడు. ‘ఈ డ్రైవరుగాడు బానే సంపాదిస్తాడల్లే ఉంది’ అనుకుంటూ వెనకసీట్లో కూలబడ్డాడు. ట్రక్కులో హూనమైన వీపుకి కారు సీటు మెత్తగా ఒత్తింది. ఏసి చల్లదనం ఒంటికి చుట్టుకుని హాయిగా కునుకుపట్టేసింది.

కారు బయల్దేరగానే నిద్రలో కూరుకుపోయిన సుందరాన్ని చూసి నవ్వుకున్నాడు డ్రైవ్ చేస్తున్న సిఐడి రంజిత్. పక్కనే ఉన్న అతని కొలీగ్ అశోక్ థమ్సప్ చూపించి నవ్వాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here