Site icon Sanchika

మనోమాయా జగత్తు-5.1

[box type=’note’ fontsize=’16’] పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది ఐదవ అధ్యాయం రెండవ భాగం. [/box]

[dropcap]“అ[/dropcap]లా అన్ని ఏంగిల్సూ ఆలోచిస్తాం డాక్టర్లన్నాక. నితిన్ నీళ్ల సంపులో దూకి ఆత్మహత్య చేసుకునే ముందు అతని ఆలోచనలూ గట్రా తెలుసుకోడం అబ్బో.. చాలా…” ఆర్భాటంగా మొదలెట్టిన సుబ్బారావుకు వాక్యం ఎలా ముగించాలో తెలియక తికమక పడ్డాడు.

‘ఈ అమ్మాయి తెలివితేటల్ని ఈయన తక్కువ అంచనా వేస్తున్నాడు’ మనసులోనే నవ్వుకున్నాడు యోగి. మసిపూసి మారేడుకాయతో అవస్థ పడడం కంటే అసలు విషయం చెప్పడమే మంచిది అనుకున్నాడు. ఈ కాలం తెలివైన స్టూడెంట్లతో వ్యవహరించేటప్పుడు వాళ్ళని చిన్నపిల్లలుగాకాక మనతో సమానమైన వాళ్ళుగా

 ట్రీట్ చేసి గౌరవించాలి, అప్పుడే వాళ్ళు మన దగ్గర ఏదీ దాచకుండా మాటాడతారు అని తెలిసిన ఆధునికుడు యోగి.

“నీకు ఆటాప్సీ అంటే తెలుసా విరీ?” సౌమ్యంగా అడిగాడు యోగి.

“తెలుసు సర్, పోస్ట్ మార్టెమ్ అంటారు. ఎవరైనా చచ్చిపోయినప్పుడు వాళ్ళ డెత్‌కి కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఆ డెడ్ బాడీని ఎగ్జామిన్ చేస్తే కారణం తెలుస్తుంది” బుధ్ధిగా పరీక్షలో ఎగ్జామినర్ ప్రశ్నకి జవాబు చెప్పినట్టు చెప్పింది విరి.

“రైట్. సైకలాజికల్ ఆటాప్సీ అని ఒకటి ఉంది తెలుసా?” అడిగాడు. తెలీదన్నట్టు తలూపి, “నెట్‌లో చూస్తాను.” అంది తక్షణం వెళ్ళి చూసేందుకు ఉత్సాహపడుతున్నట్టు ముఖం పెట్టి.

“నేను సింపుల్‌గా చెప్తాను. డీటెయిల్స్ కావాలంటే తరవాత ఇంటర్నెట్ చూద్దువుగానిలే. సైకలాజికల్ అటాప్సీ అంటే మరణించిన వ్యక్తి మానసిక స్థితి అతను చనిపోయే ముందు ఎలా ఉంది అని ఖచ్చితంగా ఒక అంచనా వెయ్యడానికి చేసే మానసిక విశ్లేషణ. సైకో ఎనాలిసిస్. దానివల్ల అతను ఆత్మహత్య చేసుకున్నట్టయితే దానికి దారితీసిన కారణాలేవిటో మనం తెలుసుకోడానికి వీలవుతుంది. నువ్వు చెప్పే జవాబుల బట్టీ అంచనా వేసుకోడానికి వీలవుతుంది. నువ్వంటే నువ్వొక్కత్తివే కాదు, నితిన్‌తో పరిచయం ఉన్న కొంతమందితో మాటాడ్డం వల్ల అతని మరణానికి కారణం తెలుసుకోడం కాస్త తేలికవుతుంది” ఓపిగ్గా వివరించాడు యోగి.

అతను చెప్తున్నది శ్రధ్ధగా విని ఏమడుగుతాడో అన్నట్టు నిటారుగా కూచుని ఎదురుచూసింది.

“నితిన్‌కి ఎవరైనా బాబాలు, స్వామీజీలు, గురువులు మీద నమ్మకం ఉన్నట్టు ఎప్పుడైనా నోటీస్ చేసావా? అతను వాళ్ళ గురించి మాటాడ్డం కానీ ఏదో హింట్ ఇవ్వడం కానీ….. మాటిమాటికీ వాళ్ళ దర్శనానికి వెళ్ళడం కానీ… నిన్నెందుకడుగుతున్నానంటే ఇలాంటివి టీనేజర్స్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేస్తుంటారు. తెలిస్తే వద్దంటారన్న సంకోచమో అసలు వాళ్లకెందుకు తెలియాలి అన్న తిరుగుబాటు తత్వమో ఉంటుంది. అందుకని తనతోటి స్నేహితులకే ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. అతను నీతో డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఎవరైనా నోటీస్ చేసి చెప్పుకుంటుంటారు కదా?”

విరి ఆలోచించకుండానే చెప్పింది. “బాబాలు గురువులు ఏమో గానీ ఇప్పుడు ఒక మాతాజీ పాలిటిక్స్‌లో ఉంది చూడండి, నీలాంబరీ దేవి. ఆవిడంటే నితిన్‌కి భక్తి అన్నట్టు అబ్బాయిలు జోక్ చేస్తుండేవారు. అది నిజమో కేవలం బోయ్స్ నితిన్ మీద జోక్‌గా కల్పిస్తున్నారో నాకు కరెక్ట్‌గా తెలీదు గానీ నితిన్‌ని కొందరబ్బాయిలు నీలన్, నీలాంబరన్ అని నిక్ నేమ్స్ పెట్టి పిలిచి నవ్వేవారు. బిపిబిపి పార్టీ లీడర్ అని ఆటపట్టించేవారు. ఒక్కోసారి తనూ నవ్వేసేవాడు నితిన్. ఒక్కోసారి కోపంగా పోట్లాడేవాడు. మాకు ప్రిపరేషన్ హాలీడేస్ మొదలయ్యే ముందు ఒకరోజు ఈ విషయం గురించే తనమీద జోక్ చేసాడని నితిన్ ఒకబ్బాయిని కొట్టాడు. చాలా పెద్ద గొడవైంది. నితిన్ని అబ్బాయిలు ముగ్గురు నలుగురు కలిసి కొట్టారు. బాగా గొడవవుతుంటే గర్ల్స్ కొంతమందిమి వెళ్ళి ఓ పక్క ఫైనల్ ఇయర్ లోకి వచ్చేసాం, ఇంకెన్నాళ్ళో కలిసుండం, ఈ గొడవలేమిటి అని వాళ్ళ పోట్లాట ఆపి పంపించాం.”

విరి చెప్తున్న మాటలు ఆశ్చర్యంగా వింటున్నాడు రామారావ్. “ఈ సంగతి నాకు తెలియదే! వాడు తనకి నీలాంబరి మీద గురి ఉందని మాతో ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడీ అమ్మాయి చెప్తుంటే గుర్తొస్తోంది ఒంటి నిండా దెబ్బలతో వచ్చాడొకరోజు. ఏంట్రా ఈ దెబ్బలంటే పడ్డానన్నాడు. దగ్గర్లో డాక్టర్‌కి చూపించాను. ఆయన కాస్త పెద్ద దెబ్బలకి రాయడానికి ఆయింట్‌మెంట్ ఇచ్చి పెయిన్ కిల్లర్సేవో టాబ్లెట్స్ ఇచ్చాడు. అవేసుకుని పడుకుని రెండు రోజులు ఇల్లు కదల్లేదు” ఆనాటి జ్ఞాపకాలతో రామారావు కళ్ళల్లోంచి జలజలా కన్నీళ్ళు రాలాయి.

అది చూసి విరి “అంకుల్” అంటూ ఆయన చెయ్యిపట్టుకుని ఏడ్చింది. వాళ్ళిద్దరూ కాస్త తేరుకుని సద్దుకునే వరకూ ఆగాడు యోగి. లోపల్నుంచి సీతమ్మ “విరెమ్మా ఏంటమ్మా తప్పు” అంటూ మంచి నీళ్ళు తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. ఇద్దరూ తేరుకున్నారు.

“నీలాంబరిదేవిని చూడడానికి ఎప్పుడైనా వెళ్ళినట్టు చెప్పాడా?” మళ్ళీ ప్రశ్న సంధించాడు యోగి.

‘అలా ఎప్పుడూ చెప్పలేదు. సురేష్ నడిగితే తెలుస్తుందేమో” అంది.

“నేనింకో విషయం అడుగుతాను బాగా గుర్తుతెచ్చుకుని చెప్పు విరీ. నీకు తెలిసినంత మటుకు నితిన్‌కి ఏవైనా డ్రగ్ ఎడిక్షనుందా. అంటే తెలుసుకదా ఆల్కహాల్ గానీ, లేకపోతే కొకెయిన్ లాంటి డ్రగ్ గానీ దేనికైనా అలవాటు పడ్డాడని నువ్వు అబ్సర్వ్ చేసావా లేకపోతే ఎవరైనా నీతో అన్నారా గుర్తు చేసుకుని చెప్పు. మన సిటీలో ఈ మధ్య టీనేజర్స్ చాలామంది పబ్స్ లోనూ అక్కడా ఈ డ్రగ్స్ బాగా వాడుతున్నారని వింటున్నాం.”

“నాకు మరి తెలియదు. అబ్బాయిల్లో ఎవరికైనా తెలుసేమో. మా క్లాస్‌లో సురేష్ అనీ ఒకబ్బాయున్నాడు. అతను కాస్త ఫ్రెండ్షిప్ చేసాడు నితిన్‌తో. అతనికేమయినా తెలుసేమో. అలా ఏదైనా డ్రగ్ తీసుకుని ఆ మత్తులో సంపులో పడిపోయుంటాడా?” ఆత్రంగా అడిగింది.

“అలా కూడా జరిగుండచ్చు. కానీ ఇవాళ వచ్చిన పోస్ట్ మార్టెమ్ రిపోర్ట్‌లో అతని బాడీలో ఏవో అన్నోన్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి. మరణం వాటి వల్ల సంభవించింది అని ఉంది. డ్రౌనింగ్ వజ్ నాట్ ది కాజ్ ఆఫ్ డెత్ – నీళ్ళల్లో మునిగిపోవడం వల్ల నితిన్ చనిపోలేదు అని ఉంది” అన్నాడు నిగమ్.

“వాట్?” ఆశ్చర్యంతో నోరు తెరిచింది విరి.

విరి ముఖం మీది ఆశ్చర్యాన్ని గమనిస్తూ ఆలోచిస్తున్నాడు నిగమ్ తనకి తెలిసిన మరో విషయం చెప్పాలా వద్దా అని. అనవసరంగా రామారావునూ అతని భార్యను బాధపెట్టిన వాడినవుతానేమోనని ఆలోచిస్తున్నా డతను. ఇప్పటి దుఃఖంలో ఆ సంగతి వాళ్లకి తెలియకపోయినా పరవాలేదు అని తీర్మానించుకున్నాడు.

“నీకంటే మీ క్లాసులో అబ్బాయిలకెవరికైనా ఎక్కువ వివరాలు తెలిసే అవకాశం ఉందేమో కదూ” అనడిగాడు.

“పాసిబుల్” తలూపింది విరి.

“అబ్బాయిలవెవరివైనా ఫోన్ నంబర్లున్నాయా నీ దగ్గర?” అడిగాడు

“సురేష్‌దీ ఇంకో ఇద్దరు ముగ్గురివీ ఉన్నాయి నా సెల్లో. సెల్ పట్రానా ఇంటి దగ్గరుంది?” లేచింది విరి.

“మేమూ వస్తాం మీ ఇంటికి అక్కడినించే ఫోన్లు చెయ్యచ్చు అవసరమైతే. పక్కిల్లేగా మీది?”

నిగమ్‌తో పాటు యోగి, విమల్ లేచారు విరితో వాళ్ళింటికి వెళ్ళడానికి. సుబ్బారావు నేను రాను అన్నట్టు సైగచేసి కూచుండిపోయాడు. రామారావు లోపలికెళ్లిపోయాడు.

అనుకోని అతిథుల్ని చూసి సిరి ఆశ్చర్యపోయినట్టే తలుపు తీసిన సిరిని చూసి అబ్బురపడ్డారు అతిథులు. “మరీ ఇంత అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్న కవలలని సినిమాలో తప్ప నిజంగా చూడ్డం ఇదే మొదటిసారి” అన్నాడు నిగమ్. అందరి మనసులోనూ అదే మాట మెదిలింది.

“మోనోజైగోటిక్ ట్విన్స్” అన్నాడు విమల్ ఇద్దరినీ చిరునవ్వుతో చూస్తూ. వాళ్లందరినీ సిరికి పరిచయం చేసి, ఎందుకొచ్చారో చెప్పింది విరి. సిరి లోపలి కెళ్లి సెల్ తీసుకొచ్చింది. అందులో ఉన్ననంబర్లు తన ఫోన్‌లో ఎక్కించుకున్నాడు నిగమ్.

“సురేష్ అనే కుర్రాడితో కాస్త స్నేహంగా ఉండేవాడన్నావుకదూ” అంటూ సురేష్ నంబర్ కాల్ చేసాడు నిగమ్. తను విరి ఇంటినించి మాటాడుతున్నానని చెప్పి అతనుండేదెక్కడో అడిగి తెలుసుకున్నాడు.

“దగ్గరే కాబట్టి ఒకసారి మాటాడదాం విరి ఇంటికి వస్తావా?” అని అడిగాడు.

“వస్తాడ్ట” సెల్ మూసేస్తూ చెప్పాడు నిగమ్.

“లేటెస్ట్ రిపోర్ట్ పూర్తిగా నేనింకా చెప్పలేదు రామారావుగారు బాధపడతారేమోనని. నితిన్‌కి బ్లడ్ కేన్సర్ ఆరంభ దశలో ఉన్నట్టుగా ఫొరెన్సిక్ ఎక్స్‌పర్ట్ రిపోర్ట్‌లో రాసాడు.”

“కేన్సరా?” విరి,సిరి భయంగా ముఖాలు పెట్టారు.

“దానిమూలాన పోయాడా?” ఏడుపుగొంతుతో అడిగింది విరి.

“కాదు కాదు కేన్సర్ ప్రారంభ దశలో మాత్రమే ఉంది. అదికాదు మరణానికి కారణం” అని ఊరుకున్నాడు నిగమ్. మరేది కారణం అడిగే ధైర్యం చెయ్యలేదు విరి.

“విరీ” లోపలున్న కొత్త ముఖాలను చూసి బిక్కుబిక్కుమంటూ పిలిచాడు సురేష్ గేటు దగ్గర నుంచుని.

“ఓ సురేష్. కమిన్. దా కూచో” పిలిచింది సిరి.

అతను అందరివైపూ అనుమానంగా చూస్తూ వచ్చి కూచున్నాడు. వాళ్లంతా ఎవరో ఎందుకొచ్చారో విరి సురేష్‌కి చెప్తుండగా మళ్ళీ గేటు చప్పుడై అందరూ అటు చూసారు. గేటుతీసుకుని వస్తున్న సుశీల కనిపించింది.

“మా అమ్మ” అందరికీ కలిపి చెప్పింది సిరి.

వరండా మెట్లెక్కుతూ హాల్లో సమావేశమై ఉన్న కొత్తవాళ్ళను చూసి ప్రశ్నార్ధకంగా కూతుళ్లవైపు చూస్తూ లోపలి కొచ్చింది సుశీల. అందరూ లేచి నిలబడ్డారు. “మా అమ్మ. లెక్చరర్.” క్లుప్తంగా చెప్పి,వాళ్ళని ఒక్కొక్కరినీ పరిచయం చేసింది సిరి. వాళ్ళెందుకొచ్చారో తెలిసాక కొంచెం రిలాక్సయింది సుశీల. సుశీల రావడం గోడమీంచి చూసింది కాబోలు సీతమ్మ తనుకూడా వచ్చి వంటింటి గుమ్మం ముందు నిలబడి అందరికీ కాఫీలు పెట్టనా అన్నట్టు సైగ చేసింది. పెట్టమన్నట్టు తలూపింది సుశీల.

“ఇప్పుడు చెప్పు సురేష్, నితిన్ నీతో ఎలా ఉండేవాడు?” అనడిగాడు నిగమ్.

సురేష్ కొంచెం ఇబ్బందిగా ముఖంపెట్టాడు. “ఎలా ఉండేవాడంటే నార్మల్‌గా మాత్రం ఉండేవాడు కాదు సార్” అన్నాడు తొలిపలుకులాగా.

‘నార్మల్ అంటే నీ ఉద్దేశం ఏంటి?’ అని పెద్దలు ఎవరూ అతన్నడగలేదు. ఆలోచించుకుని అతనే చెప్తాడ్లే అన్నట్టు ఎదురుచూసారు.

“నార్మలంటే నా ఉద్దేశం ఏంటంటే సర్, మామూలుగా ఫ్రెండ్సన్నాక కబర్లు చెప్పుకుంటాం, కలిసి కేంటీన్ గట్రా తిరుగుతాం. స్టడీస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. కాస్త చనువుగా ఉంటాం. కానీ నితిన్‌తో నాకలాంటి చనువుండేదికాదు. అతనివాళ బాగా క్లోజ్‌గా ఉంటే మర్నాటికల్లా ఎవరో కొత్త వాళ్లని చూసినట్టు చూసేవాడు. తనిష్టం. తన మూడ్స్. అంతే. ఎందుకో కాస్తో కూస్తో నాతో అందరికంటే ఎక్కువ మాటాడేవాడు అందుకేనేమో మా క్లాసులో అందరూ మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటుటారు. నిజానికి నాక్కూడా అతనితో క్లోజ్‌నెస్ అనేదేం ఉండేది కాదు” ఇంకెలా చెప్పాలో తెలియనట్టు ఆగిపోయాడు సురేష్.

ఇందాక విరి నడిగినట్టే “అతనికి బాబాలు స్వామీజీలు ఎవరిపట్లయినా విశ్వాసం ఉండేదా?” అనడిగాడు యోగి.

“స్వామీజీలు కాదుగానీ ఆ పొలిటికల్ ఫిగర్ నీలాంబరీ దేవి లేదూ ఆవిడంటే చాలా ఎడ్మిరేషన్ ఉండేదనుకుంటా. ఆవిడ గురించి టీవీలోగానీ పేపర్లో గానీ ఏ వార్త వచ్చినా ఏదో ఎగ్జైటెడ్‌గా దాని గురించి డీటెయిల్డ్‌గా నాలాంటి వాడెవడైనా దొరికితే లెక్చరిచ్చి వాయించేసేవాడు” సురేష్‌కి నవ్వొచ్చింది. ఆ సందర్భంలో నవ్వడం బావుండదనేమో ఆపుకున్నాడు. “ప్చ్! పాపం పూర్ ఫెలో!” జాలిగా అన్నాడు.

“ఆల్కహాల్ గానీ వేరే డ్రగ్స్ కానీ ఎడిక్షనేమయినా ఉండేదా?” నిగమ్ అడిగాడు.

“షైజోఫ్రేనిక్స్ చాలా మందిలో డ్రగ్ ఎబ్యూజ్ ఉంటుంది కదండీ?” ఉత్సాహంగా అన్నాడు సురేష్.

“నితిన్‌కి షైజోఫ్రేనియా అని తెలిసినప్పు డు నేను గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ చూసాను. వాళ్ళకి డెల్యూషన్స్ ఉంటాయి, హాల్యూసినేషన్స్ ఉంటాయి. డ్రగ్స్ కలవాటుపడతారు” ఏకరువు పెట్టాడు సురేష్.

‘ఇంటర్నెట్ విజ్ఞానం వల్ల ఏదీ కొత్తకాదు కుర్రాళ్లకి’ ఆలోచిస్తూ వింటోంది సుశీల.

“ఇంతకీ ఆ లక్షణాల్లో ఏమేమున్నాయి నీ ఫ్రెండుకి?” నిగమ్ ప్రశ్నతో సురేష్ వాక్ప్రవాహం టక్కున ఆగి పోయింది. ఆలోచించాడు. “ఆల్కహాల్ తీసుకోడం నేనెప్పుడూ చూడలేదుకానీ….. అదేంటో చిన్న ఆకులో లేహ్యం లాంటిదేదో తింటుండేవాడు. అదేంటని అడిగితే ఏదో మందనేవాడు. ఒకసారి ఇది సర్వరోగ నివారిణి. నాకున్న జబ్బులన్నీ పోతాయి దీంతో. అన్నాడు. చాలా సార్లు ఈ మందెవరిచ్చారు నీకని అడిగాను” ఆ సంఘటన గుర్తుతెచ్చుకుంటూ ఆలోచనలో పడ్డాడు సురేష్.

యోగి,విమల్, నిగమ్ ఊపిరి బిగబట్టి వింటున్నారు.

“కొన్నిసార్లు ఏ ప్రశ్నకీ సరిగ్గా జవాబు చెప్పేవాడుకాదు. ఒక్కసారి మాత్రం ఆ మందు ఒక దేవత ఇచ్చిందన్నాడు. చాలా బతిమాలాను ఆ దేవత ఎవరో చెప్పమని. ఊఁహుఁ. చెప్పలేదు.”

‘నేనూహించగలను ఆ దేవతెవరో’ అనుకున్నాడు నిగమ్.

విరి, సిరి వింతగా వింటున్నారు సురేష్ మాటలు.

“అన్నిమాటలు మాటాడేవాడా సురేష్? మేం చాలాకాలంగా పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నా, రోజూ ఒకే చోట కాలేజ్ బస్సెక్కి దిగుతున్నా మాతో ఈ టూ ఇయర్స్ లోనూ అతను మాటాడిన మాటలు వేళ్లమీద లెక్కెట్టచ్చు” అంది సిరి.

“తెలుసుకదా వాడికి మూడ్స్. ఒక్కోసారి నన్నే ఎప్పుడూ పరిచయం లేని వాడిని చూసినట్టు చూసేవాడు” సురేష్ అన్నాడు.

వీళ్ళందరి మాటలు వింటూ, సీతమ్మ తెచ్చిన కాఫీ తాగుతూ ఆలోచిస్తోంది సుశీల ‘పిల్లాడు పోనే పోయాడు ఎంత విశ్లేషణ చేసినా తిరిగిరాడు. వైద్యశాస్త్రం ఇంత అభివృధ్ధి చెందిందంటున్నారు. అయినా పెద్దగా మార్పు కనబడట్లేదు’ నిట్టూర్చింది.

“నితిన్‌కి వైద్యం సరిగా జరిగినట్టులేదు. జరిగినదంతా ఆలోచిస్తుంటే. అసలు మెడికల్ ఫీల్డ్ ఇంత ఎడ్వాన్స్ అయింది. మానసిక వ్యాధులకు మంచి మందులు కనిపెట్టలేదా?” అంది.

సుశీల మాటలువిని ఆమెవైపు తిరిగాడు యోగి.

“కేవలం మందులొక్కటే సమస్యను తీర్చవు మేడమ్. మానసిక రోగాల్లోనే కాదు. మామూలు శారీరక రోగాల్లోనైనా అంతే. ట్రీట్‌మెంట్ ఎంత ముఖ్యమో మేనేజ్‌మెంట్ అంతే ముఖ్యం. ఉదాహరణకి డయాబిటీస్‌నే తీసుకోండి. అది శారీరకమైన జబ్బే. మందులు వేస్తే కంట్రోలవుతుంది. పూర్తిగా క్యూర్ అయిపోదు. మందులు వేసుకుంటున్నాం కదా అని డైటింగ్ చెయ్యకపోతే అసలు అదుపులో ఉండదు. అటు మందులు ఇటు ఇతర జాగ్రత్తలు జీవితాంతం పాటించాల్సిందే. అలాగే మానసిక రోగాలూను” అన్నాడు.

‘అయ్యుండచ్చు’ అనుకుని తన వాదన ఇంక పొడిగించలేదు సుశీల. వీళ్ళిద్దరి మాటలు శ్రధ్ధగా వింటూనే తనకు పనికొచ్చే పాయింట్స్ మనసులో నిక్షిప్తం చేసుకుంటున్నాడు నిగమ్.

“కానీ సార్, నాకొక డౌటు. అతనికి మానసిక రోగం ఉందికదా, మరి చదువెలా వచ్చింది? మరీ ఫస్టు మార్కు లొచ్చెయ్యకపోయనా అసలంటూ పాసవుతున్నాడు కదా?” సిరి అడిగింది.

“షైజోఫ్రేనియా ఉంటే తెలివితేటలుండవు అని రూలేం లేదు. తెలివితేటల స్థాయిని సూచించే ఇంటెలిజెన్స్ కోషంట్ (intelligence quotient) – ఐక్యూ అంటూంటామే ఆ ఐక్యూ లెవెల్స్ బాగుంటే చదువురావడం పెద్ద సమస్యకాదు. కొంతమంది షైజోఫ్రేనిక్స్‌లో చాలా హై ఐక్యూ ఉంటుంది కూడానూ”.

యోగి చెప్తున్న విషయం ఆకళింపు చేసుకోడానికి శ్రోతలకి కొంచెం సమయంపట్టింది.

“అంటే ఇలా కొంచెం పిచ్చి ఉన్నాకూడా వాళ్లకి తెలివితేటలు ఉంటాయా?” ఆలోచించింది సిరి.

తను చెప్పింది సరిగా అర్ధం కావట్లేదని గ్రహించాడు యోగి.

“నేను దాన్నే మార్చి చెప్తాను అప్పుడు మీకర్ధం అవుతుందేమో. చాలా తెలివైన వాళ్లు కూడా షైజోఫ్రేనియా వ్యాధి బారిన పడడానికి అవకాశం ఉంది. ఆ వ్యాధి వచ్చాక కూడా వాళ్ళ తెలివి తేటలకు భంగం కలగదు”. ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతున్నట్టు అనిపించింది సిరికి.

“ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పమంటే చెప్పగలను మీకు టైముండి, విసుగు లేకుండా ఉంటే” అన్నాడు యోగి టీనేజర్స్ ముగ్గురి ముఖాలలోను కనిపిస్తున్న కుతూహలం గమనిస్తూ.

“షూర్ సర్. చెప్పండి.” సురేష్ అన్నాడు ఆత్రంగా.

“నితిన్ పోయాడని విన్నప్పటినించీ ఎందుకో గానీ చాలా గిల్టీగా ఫీలవుతున్నాను. అతని ప్రాబ్లెమేంటో అర్ధం చేసుకోకుండా అతన్ని కొంచెం లోకువగా చూసానేమోనని. దాదాపు మా క్లాస్‌లో బోయ్స్ అందరం అలాగే చేసాం. మేం ఫ్రెండ్లీగా, కొంచెం ఎఫెక్షనేట్‌గా ఉండుంటే అతను మాతో ఓపెన్ అప్ అయ్యేవాడేమో అతన్ని ఆత్మహత్య చేసుకోకుండా ఆపగలిగే వాళ్ళమేమో అనిపిస్తోంది”.

“ఇంకిప్పుడు తెలుసుకుని మాత్రం ఏం చేస్తాం” విచారంగా అంది సిరి.

“ఇకముందైనా అలా పొరబాటు చెయ్యకుండా ఉంటాం కదా ఇలాంటి సమస్యల గురించి తెలుసుకునుంటే” అన్నాడు సురేష్.

“రైట్. నేనుకూడా చాలామందికి అదే చెప్తుంటాను. ఈ వ్యాధి గురించి తెలిసుండడం మంచిది. ముఖ్యంగా టీనేజ్‌లో చాలామందికి ఈవ్యాధి మొదలవుతుంది. అవగాహన ఉండడం ఎప్పుడూ మంచిదే. ఇందాక షైజోఫ్రేనియాకి తెలివితేటలకు సంబంధం లేదని చెప్పాను. ఆ పాయింట్‌ అర్థం అవ్వాలంటే కొన్ని ఉదాహరణలివ్వగలను. ప్రపంచంలో చాలా మేధావులుగా గుర్తింపు పొందిన వాళ్లలో కూడా షైజోఫ్రేనిక్స్ ఉన్నారు. వాళ్ళల్లో నొబెల్ ప్రైజ్ విన్నర్స్ కూడా ఉన్నారు తెలుసా”.

“మెంటల్ పేషంట్స్ కి నొబెల్ ప్రైజ్ ఇచ్చారా?” ఆశ్చర్యంగా చూసింది సుశీల.

“మెంటల్ పేషంట్స్ అని అందరినీ ఒక త్రాటిని కట్టెయ్యకండి.” నవ్వాడు యోగి.

“ముఖ్యంగా మన షైజోఫ్రేనియా పేషెంట్లు చాలా డిఫరెంట్. మీలో ఎవరైనా ‘బ్యూటిఫుల్ మైండ్’ అనే మూవీ చూసారా?” అందరినీ కలయ చూస్తూ అడిగాడు యోగి.

“చూసాం. మేం థియేటర్లో చూసాం. మా స్కూల్ వాళ్లు స్కూల్ ఆడిటోరియమ్‌లో షో వేయించి హైయర్ క్లాసెస్ వాళ్లందరికీ చూపించారు. అప్పట్లో మాకు మరీ పూర్తిగా అర్థం కాలేదు. తరవాత అమ్మకి డివిడి రెంటుకి తీసుకొచ్చి చూపించాం” విరి చెప్పింది ఉత్సాహంగా.

‘ఆ మూవీ చూసాక అమ్మ చాలా అప్‌సెట్ అయింది ఎందుకోగానీ’ మనసులో సిరి అనుకుంది. మౌనంగా ఆ జ్ఞాపకాలలో మునిగిపోయింది రెండుక్షణాల పాటు. విరికి కూడా సిరి ముఖం చూసి ఆ రోజు గుర్తొచ్చింది. ‘అమ్మ ఏదో బాధపడింది. ఏమీ చెప్పలేదు. మళ్లీ ఎప్పుడూ ఆ మూవీ గురించి మాట్లాడలేదు. తనుగాని సిరిగాని ఆసంగతి ఎత్తితే మాట మార్చేసేది. తరవాత అందరూ దాని గురించి మర్చిపోయారు.’ ఆ సంగతులు గుర్తొస్తుంటే తల్లి ముఖంలోకి కుతూహలంగా చూసింది విరి. సుశీల ముఖంలో విరికి ఏభావమూ కనబడలేదు. ఆ సినిమా గురించి అమ్మ మర్చిపోయిందేమో అనుకుంది.

“హెచ్.బి.ఓ.లోను,స్టార్ మూవీస్‌లో కూడా చాలాసార్లు వచ్చింది. నేనూ మన ఆడిటోరియమ్‌లో చూపించినప్పుడు చూసాను. టెన్త్ క్లాస్‌లో ఉండగా కదూ. అప్పటికే అది కొంచెం పాత సినిమా అనుకుంటా” అన్నాడు సురేష్.

“అది రియల్ లైఫ్ స్టోరీ తెలుసా?” అడిగాడు యోగి.

“అవును అప్పుడలాంటిదే ఏదో చెప్పారు మా మేథ్స్ సర్”. గొణిగింది సిరి.

“ఎవరి జీవితం ఆధారంగా ఆ మూవీ కథ తయారుచేసారో తెలుసా?” యోగి ప్రశ్న.

సుశీల కళ్ళల్లో ఏదో ప్రగాఢమైన వేదన కనపించింది సిరికి. ‘అమ్మ కేమీ కాదుకదా’ అనుకుంది. సుశీల లేచి వెళ్ళి ఫ్రిజ్ లోంచి నీళ్ళు తీసుకుని వచ్చి సిప్ చేస్తూ కూచుంది.

“జాన్ నేష్ (John Forbes Nash) అని మేథమెటీషియన్. పంతొమ్మిదివందల తొంభైనాలుగులో అయనకు నొబెల్ ప్రైజొచ్చింది. ఆయన లైఫ్ స్టోరీతో ఆ సినిమా తీసారు. ఆయనకి షైజోఫ్రేనియా వ్యాధి ఉండేది. ఆ వ్యాధితో బాధపడుతూనే ఆయన గణితశాస్త్రంలో ఎన్నో విజయాలు సాధించాడు. ఆ సినిమా తీయడంలో ఉద్దేశం అదే షైజోఫ్రేనియా ఉన్నంత మాత్రాన వాళ్లు పిచ్చివాళ్ళు కారు. వైద్యం, సైకోథెరపీ ఇలాంటివన్నీ జరగవలసిన పధ్ధతిలో జరిగితే వాళ్ళ మేధాశక్తికి గుర్తింపు వస్తుంది. సరిగ్గా అలాగే షైజోఫ్రేనియా జబ్బుతో బాధపడిన గణితశాస్త్ర మేధావి మన దేశంలోకూడా ఉన్నాడొకాయన. కానీ ఆయన జీవితం విషాదంగా మిగిలిపోయింది. మనదేశంలో చాలా మందికి ఆయన పేరే తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా అసలు ఆయన గురించి మరిచే పోయారు”.

అందరూ ఆసక్తిగా యోగివైపు చూసారు.

“వసిష్ఠ నారాయణ సింగ్ అని మేథమేటిక్స్ జీనియస్ ఉండేవాడు. నాసా సైంటిస్ట్‌గా కూడా చేసాడు. అటువంటి మేధావికి భారతదేశంలో ట్రీట్‌మెంట్ సరిగా జరగక, ప్రభుత్వనిర్లక్ష్య వైఖరి, కొంత రాజకీయం ఇలాంటి శతకోటి కారణాలవల్ల అసలు మనిషే అయిపులేకుండా పోయాడు. షైజోఫ్రేనియా పేషంట్లకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయే లక్షణం ఉంటుంది. సరైన వైద్యం జరగక ఆయన హాస్పిటల్ నించి పారిపోయాడు. చాలాకాలం ఎక్కడున్నాడో తెలియలేదు. ఆ తరవాత కొన్నేళ్ళకి రోడ్లమీద చిత్తు కాయితాలేరుకుంటూ కనిపించాడన్నారు. గుర్తుపట్టిన వాళ్ళు ఇన్‌ఫామ్ చేస్తే ఆయన కుటంబ సభ్యులు వెళ్లి తీసుకొచ్చారు కానీ ఆయన వ్యాధికి వైద్యం జరగలేదు. అంతటి మేధావీ అయోమయావస్థలో పిచ్చివాడుగా ముద్ర పడి జీవితం గడుపుతున్నాడు. ”

వింటున్న శ్రోతల హృదయాలు బరువెక్కాయి. సుశీల లేచి లోపలికెళ్ళి పోయింది.

“నిజంగా అలాంటి ప్రొఫెసరున్నాడా సార్? మనదేశంలో ఇలా జరిగిందా!” సురేష్ నమ్మలేనట్టు చూసాడు. “అదే మనదేశపు దౌర్భాగ్యం. అలా మానసిక వైద్యం పట్ల అవగాహనలేక, సదుపాయం ఉన్నా ఉపయోగించుకోలేక ఎందరు మేధావులు మటుమాయం అవుతున్నారో! ఆనందంగా గడిచిపోవాల్సిన ఎన్ని జీవితాలు నాశనమవుతున్నాయో.!” అన్నాడు యోగి. నిట్టూర్చాడు సురేష్.

సిరి నెమ్మదిగా లేచి తల్లి ఏం చేస్తోందో చూడడానికి వెళ్ళింది. ముఖం కడుక్కుని తువ్వాలుతో తుడుచుకుంటున్న సుశీల తలెత్తి సిరి వైపు చూసి నవ్వింది.

“నాకేంకాలేదు లే. రాగానే బట్టలైనామార్చుకోకుండా అక్కడే కూచునున్నాకదూ కాస్త అలసట అనిపించింది. చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటే ఇప్పుడు హాయిగా ఉంది. పద నేను కూడా అటే వస్తా” అంది చకచకా తల దువ్వుకుని బొట్టు పెట్టుకుంటూ.

మనసు కాస్త తేలికపడింది సిరికి.

“వెళ్ళి అందరికీ మరో రౌండు కాఫీ కావాలేమో కనుక్కుని సీతమ్మకి చెప్పు.”

సిరి హాల్లోకి వెళ్ళే సరికి ఇంకా భారత దేశంలో మానసిక జబ్బుల గురించి అవగాహన లేదన్న విషయం గురించే మాటాడుకుంటున్నారు.

“మళ్ళీ ఇంకో రౌండ్ కాఫీ కావాలా అని అడగమంటోంది అమ్మ.”

పెద్దలు ముగ్గురూ కావాలన్నట్టు తలూపారు.

సురేష్,“కూల్ డ్రింక్సేవీ లేవా?” అన్నాడు. సిరి ఫ్రిజ్ తీసి విరికీ సురేష్‌కీ కోక్ కేన్స్ అందించి వంటింట్లో సీతమ్మకి మళ్ళీ నలుగురికి కాఫీలు చెయ్యమని చెప్పివచ్చి కూచుంది. కాఫీలు తయారై వచ్చేటప్పటికి సుశీల కూడా నీటుగా తయారై వచ్చి కూచుంది.

“అన్నట్టు ప్రపంచ ప్రసిధ్ధ చిత్రకారుడు పికాసో కూడా షైజోఫ్రేనియా బాధితుడే తెలుసా?” అన్నాడు యోగి. “వాట్?” అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం.

“అంటే మహా మేధావులకే వస్తుందా ఏంటి ఈ జబ్బు?” నిగమ్ అడిగాడు.

యోగి చిన్నగా నవ్వాడు. “వీళ్ళు మహా మేధావులు కాబట్టి మనం వీళ్ళకీ ఈ జబ్బుందీ అని చెప్పుకుంటున్నాం. సామాన్య జనం ఎందరో కూడా బాధపడుతుంటారు. ఈ జబ్బులో కూడా రకాలున్నా యి. మైల్డ్ షైజోఫ్రేనియా అయితే అంత తొందరగా బయటపడదుకూడా” యోగి మాటలు వింటూ కాసేపు అందరూ ఆలోచనలో పడ్డారు.

“అయితే మీరు ముగ్గురూ స్కూల్ లెవెల్ నించీ క్లాస్‌మేట్సే అన్నమాట.” అన్నాడు నిగమ్.

“ఒకే కాలనీ వాళ్లం కదా సార్, అప్పట్లో కాస్త దగ్గరగా ఉన్న స్కూల్లో వేసేసారు మా పెద్దవాళ్లు. ఈ కాలనీలో మా స్కూల్లో చదివిన మా బేచ్ వాళ్ళు ఇంకో పది మంది దాకా ఉన్నారు. అయితే సేమ్ కాలేజ్‌లో చేరింది మేం ముగ్గురమే. వాళ్ళంతా వేరేవేరే కాలేజీలు.”

“నితిన్ కూడా మీ స్కూలేనా?” నిగమ్ ప్రశ్న.

“కాదు కాదు. వాళ్ళు ఈ కాలనీకొచ్చి రెండేళ్ళు కూడా అవలేదు. అంటే, మేమంతా ఫస్ట్ ఇయర్‌లో చేరినప్పుడు వచ్చారు. వయసు ప్రకారం చూస్తే నితిన్ మా కంటే దాదాపు రెండేళ్ళు పెద్ద కానీ చదువులో మాతో సమానం” అన్నాడు సురేష్.

“మీ కాలేజ్‌లో అతని స్కూల్ డేస్‌లో ఫ్రెండ్సెవరైనా ఉన్నారా?” మరో ప్రశ్న వేసాడు నిగమ్.

పిల్లలు ముగ్గురూ ముఖాలు చూసుకున్నారు. తెలియదన్నారు విరి,సిరి.

సురేష్ కొంచెం ఆలోచించాడు. “మా కాలేజ్‌లో ఎవరూ లేరనే అనుకుంటున్నాను. కానీ, మా కాలేజ్ పక్కనే ఒక ఓల్డ్ డిగ్రీ కాలేజ్ ఉంది మీకూ తెలిసే ఉంటుంది. ఆ కాలేజ్ స్టూడెంట్ ఒక అబ్బాయితో రోడ్డుమీద నిలబడి నితిన్ మాట్లాడుతూండడం చాలాసార్లు చూసాను.”

“అతను నితిన్ కోసం వచ్చేవాడా? నితినే అతన్ని పిలిచేవాడా?” నిగమ్ ప్రశ్న విని కొంచెం తెల్లబోయాడు సురేష్.

‘రెండూ ఒకటే కదా. ఎవరు ఎవరికోసం వచ్చినా వాళ్ళిద్దరూ ఫ్రెండ్సని అర్ధం చేసుకోవచ్చుగా?’ అనుకున్నాడు. “నేనేం నిన్ను తికమక పెట్టడానికి అడగట్లేదు. రెండిటికీ తేడా ఉంది. అతను మీ కాలేజి ముందు కాపు కాసి నితిన్‌తో హస్క్ వేసుకునేవాడా? లేకపోతే నితినే అతనెప్పుడొస్తాడా అని కాలేజి గేటు దగ్గర వెయిట్ చేసే వాడా?” అడిగాడు నిగమ్ సురేష్ మనసులో సందేహం కనిపెట్టినట్టు.

సురేష్ కిప్పుడు నిగమ్ ప్రశ్న అర్థమయింది. కాసేపు గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించాడు.

“నాకు గుర్తున్నదేమంటే మొదటమొదట్లో అతనే నితిన్‌ని వెతుక్కుంటూ వచ్చేవాడు. తరవాత తరవాత నితిన్ మా గేటు దగ్గర నిలబడి ఎదురు చూసేవాడు.”

‘యా దట్సిట్’ మనసులో థంబ్స్ అప్ చేసుకున్నాడు నిగమ్.

“అతను తన స్కూల్ టైమ్ ఫ్రెండని చెప్పాడా నితిన్?” మళ్ళీ ఆలోచించాల్సొచ్చింది సురేష్‌కి.

“అలా ఏం చెప్పలేదు. అసలు ఏమడిగినా స్ట్రెయిట్‌గా సమాధానం చెప్పేవాడు కాదుకదా. బస్సొచ్చేసినా ఎక్కకుండా అతని కోసం ఎదురుచూస్తుంటే నేను నాలుగయిదు సార్లు అడిగాను. ఒక్కసారి మాత్రం నా ఫ్రెండ్ అని చెప్పాడు కానీ ఎలాంటి ఫ్రెండో చెప్పలేదు. అతను కూడా నితిన్ కన్నా పెద్ద వాడిలా బాగా ముదురుగా ఉండేవాడు. ఎప్పుడూ ఫెయిలయిపోతూ ఏదో టైమ్ పాస్‌కి కాలేజీకొచ్చే బాపతులాగా కనపడేవాడు నాకైతే”.

“వాళ్ళేం మాటాడుకునేవారో ఏమయినా తెలుసునా?” నవ్వేసాడు సురేష్.

“ఆ ఫ్రెండు రాగానే వాళ్ళిద్దరూ కలిసి రోడ్డుపక్క ఏదో గోడ చాటుకి చేరిపోయేవారు. ఏం మాటాడుకునే వారో ఏంటో ఎవరికి తెలుసు”

“ఆ కుర్రాడి పేరు, ఏం చదువుతున్నాడు, ఇలాంటి డీటెయిల్స్ ఏవైనా తెలుసా?” బులెట్లా మరోప్రశ్నవచ్చింది “అస్సలేం తెలియదు. రెండు మూడుసార్లు అతనా కాలేజ్ లోంచి అక్కడి స్టూడెంట్లతో కలిసి రావడం చూసాను. అందుకని అతను కూడా ఆ కాలేజ్ స్టూడెంటే అనుకుంటున్నాను. ఇప్పుడాలోచిస్తే డౌటొస్తోంది. అసలు స్టూడెంటా కాదా అని. ఊరికే అక్కడ తెలిసిన వాళ్లని పట్టుకుని సొల్లు కబుర్లేసుకోడానికి వచ్చే రకం అయ్యుండచ్చు” అన్నాడు.

“ఇంకెవరైనా ఆ డిగ్రీ కాలేజ్ కుర్రాళ్ళు నీకు తెలిసిన వాళ్లున్నారా?”

“తెలుసు ఈ కోలనీలోనే ఉన్నాడొకతను రాకేష్ అనీ”

“ఓకే. మనం రాకేష్ దగ్గరకెడదాం.” లేచాడు నిగమ్.

“ఆల్రైట్ నాకూ ఇంక టైమైంది” విమల్ లేచాడు.

“డాక్టర్ యోగీ, మీరు ఉంటున్నారా కాకినాడ వెళ్ళిపోతున్నారా?” అడిగాడు నిగమ్.

“రేపు తత్కాల్‌లో టికెట్ దొరికింది. వెళ్ళాలి” అన్నాడు.

“ఓకే మేడమ్ నమస్తే. థేంక్స్ ఫర్ ఎవ్విరిథింగ్. సిరీ అండ్ విరీ థేంక్సే లాట్” అందరికీ వీడ్కోలు చెప్పి “పద సురేష్” చకచకా కారు వైపు దారితీసాడు.

ఒక క్షణం ఆగి, వెనక్కి తిరిగి “మేడమ్ ఏదైనా అవసరమైతే మళ్లీ మీ అందరి సహకారం తీసుకుంటాను.” సుశీలకి చిరునవ్వుతో చెప్పి వెళ్ళిపోయాడు నిగమ్. అతని వెనకే సురేష్ వెళ్ళి కారెక్కాడు.

యోగి విమల్ కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.

(సశేషం)

Exit mobile version