మనోమాయా జగత్తు-7

0
14

[box type=’note’ fontsize=’16’] పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది ఏడవ అధ్యాయం. [/box]

[dropcap]నీ[/dropcap]లాంబరి ధ్యానంలోంచి లేచి భక్తులకు దర్శనం ఇవ్వడానికి యథాప్రకారం దర్బారు హాల్లోకి వచ్చింది. ఒక చంటిపిల్లాడిని ఒళ్ళో పెట్టుకుని ఒక వృధ్ధురాలు ముందువరసలో కూచుని ఉంది. ఆవిడ కొడుకులాగా ఉన్న వాడు పక్కనే కూచునున్నాడు. అతను నీలాంబరిని చూడగానే అందరితో పాటు లేచి నిలబడి దండం పెట్టాడు. అలాగే జోడించిన చేతులతో నుంచుండిపోయాడు. ముసలావిడ చంటిపిల్లాడితో సహా లేవడం చేతకాక కూచునే ఉంది. నీలాంబరి అందరినీ పలకరించి యోగక్షేమాలు విచారిస్తూ అతని దగ్గరకొచ్చింది. అతను వంగి నీలాంబరి కాళ్ళంటుకుని “దేవీ, దేవీ, మాతా” అంటూ వలవలా ఏడవడం మొదలెట్టాడు.

“మా కోడలికి కేన్సరుట, ఏ మందులకీ కొంచెం కూడా ఉపశమనం కలగట్లేదు. ఎన్నాళ్ళో చెప్పలేం అనేసారు డాక్టర్లు. ఇదిగో వీడి కోసం బతకాలి” అంది వృధ్ధురాలు కళ్లు తుడుచుకుంటూ.

నీలాంబరి ‘అంతా పైవాడి దయ. మనం నిమిత్తమాత్రులం’ అన్నట్టు పైకి ఓసారి చూపించి నుదుటిమీద చూపుడు వేలుతో రాసుకుంది.

“పిల్లలే పుట్టరనుకున్న నా కోడలి కడుపు పండించిన దయగల తల్లివి. నువ్వే మాపాలిటి గౌరీదేవైనా లక్ష్మీ దేవైనా. నా కోడలిని బతికించి నువ్వు ప్రసాదించిన ఈ పసివాడికి తల్లిప్రేమ దక్కనియ్యి తల్లీ” ఒళ్ళో ఉన్న పిల్లాడితో సహా కూచునే వొంగి తన తల నీలాంబరి పాదాలకు తాకించింది వృధ్ధురాలు.

“ఏం భయం లేదు. నీ కోడలికొచ్చిన ఆపదేం లేదు” అంది నీలాంబరి గుమ్మం దగ్గర నుంచుని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న సెక్రటరీ స్వామి వైపు చూస్తూ.

“ఆ మాటన్నావు అదే పదివేలు నాతల్లి నా తల్లి” పైకి లేచి నీలాంబరి చెయ్యందుకుని కళ్లకద్దుకుంది ముసలావిడ. “కోడలు రోగంతో మంచాన పడుండి పిల్లాడికి నామకరణం కూడా చెయ్యలేదు. నీ చేతే పేరు పెట్టించాలని తహతహలాడింది. ఏదో పేరు చెప్పు చెప్పమ్మా. కోడలి చెవిలో వేస్తాను, సంబర పడుతుంది.” పిల్లాడ్ని నీలాంబరి పాదాలమీద ఉంచింది.

తలవంచి చంటివాడి వైపు చూసింది నీలాంబరి. సన్నగా నల్లగా ఉన్న వాడి శరీరం నీలాంబరి కళ్ళకి ఆనలేదు. వాడు పడుకునున్న పొత్తిగుడ్డ మీద నీలం రంగు దారంతో అందంగా కుట్టి ఉన్న కలువ పువ్వు ఆమె దృష్టినాకర్షించింది.

“లక్ష్మీ దేవి కమలం లోంచి పుట్టినట్టు నీ మనవడు ఆ నీలోత్పలం మీద పవళించాడు” అంది గజి బిజిగా. వాడు అలా పవళించడం ఏమైనా అపరాధమేమో అని భయంగా చూసింది నాయనమ్మ. “ఇంకే పేరు కావాలి? వాడి పేరు ఉత్పలదత్తుడు” అంది నీలాంబరి. ‘ఈ పేరెక్కడో విన్నట్టుందే!’ బుర్రగోక్కున్నాడు సెక్రటరీ శంకరభక్తానందస్వామి.

వృద్దురాలికి సరిగా అర్ధం కాలేదు కానీ భయం తగ్గింది. పిల్లాడి తండ్రి గబగబా చిన్నడైరీ తీసి ఆవిడ చెప్పిన పేరు రాసుకుంటుండగా వాళ్ళని దాటుకుంటూ సెక్రటరీ స్వామిని సమీపించి ఏమిటన్నట్టు కళ్ళెగరేసింది. వెనకాల ఆ రోజుకు దేవి పలకరింపుకు నోచుకోని భక్తులింకా ఉన్నారు. వారందరికీ దేవీ నీలాంబరి ఉదయ పూజ తీర్థప్రసాదాలు దండిగా అందజేసి సంతృప్తి పరుస్తున్నారు శిష్యగణం.

“చాలా జిల్లాల నుంచీ పార్టీ కార్యకర్తలు వచ్చారు. దర్శనం కోసం ఆఫీసు దర్బారు హాల్లో వేచి ఉన్నారు” చిన్న గొంతుతో చెప్పాడు.

“వస్తున్నామని చెప్పండి”.

అతను వెళ్ళాడు.

“భక్తులారా, మరో పదిహేను నిముషాల్లో చిన్నస్వాముల వారిచే రామాయణ పారాయణ ఉంటుంది. మరీ అత్యవసరమైన తప్పించుకోలేని పనులున్న వారు తప్ప సమయం ఉన్న వారు ఒక్క గంటసేపు సమయం వెచ్చించి రామాయణామృతపానం గ్రోలండి” కట్టడి చేస్తూనే కాస్తంత స్వేచ్ఛకు దారి వదిలింది నీలాంబరి. తమకేది అనువైతే ఆ దారినెంచుకుని దాన్ననుసరించి తరించారు భక్తగణం. అందరినీ ఆశీర్వదిస్తున్నట్టు రెండు చేతులూ ఎత్తి ఓ సెమీసర్కిల్ కొట్టి నిష్క్రమించింది నీలాంబరి.

సమావేశ మందిరంలో భక్తప్రజాబాహుళ్యపార్టీ అభ్యర్ధులతో కొలువుతీరిన దేవీ నీలాంబరి చిరునవ్వుతో అందరినీ పరికించింది. ఒక్కొక్కరూ తమతమ ఎలక్షన్ స్ట్రాటజీలు వివరించి చెప్తున్నారు.

“డబ్బుకి వెనకాడకూడదు. గెలుపే మన లక్ష్యం. డబ్బుకి వెనకాడే అభ్యర్ధికి టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదనే మిమ్మల్ని ఎంపిక చేసి టిక్కెట్లిప్పించాను. మరి మీమీ ప్రాంతాల్లో అవసరాలేమిటి కనుక్కోవడం, ఓట్లకు ఎంతెంత రేట్లు అన్నీ మీదే భారం. బాధ్యతగా చూసుకోవాలి. ఒకసారి బాధ్యత అప్పగించేసాక ఇంక నేను పెత్తనం చెయ్యను. మన పార్టీ గెలిచి తీరాలన్న పట్టుదల మీకే ఉండాలి” అభ్యర్ధులకు ఉత్సాహం కలిగిస్తూ చెప్పుకు పోయింది నీలాంబరి.

అందరూ శ్రధ్ధగా విన్నారు. “ఆయ్. మరంతే కదండీ. ఇంక బరిలోకి దిగాక ఎనక్కి సూసేది లేదండి. పెట్టడం మేమే పెడతావండి. ఎవరి ఎలక్షను కర్చు వాళ్ళే పెట్టుకుంటావండి వీలయినంత మటుకు కానీ మరి ఒకేళ అనుకున్నదానికన్నా లివిఁటు దాటిపోతే మటుకు తవఁరో సెయ్యెయ్యాల” అభ్యర్ధనకీ ఆజ్ఞకీ మధ్యస్తంగా గొంతు పెట్టి అన్నాడు సుబ్బరాజుగారు.

“ఆయ్. కాస్త ఆమాత్తరం తవఁరు దన్నుకాచుకుంటావంటే ఇంక ఆలోసించేదేం లేదండి బరిలోకి దిగిపోడవేఁ తవరి పేరు సెప్పుకుని” అన్నాడు రాయుడు.

చిరునవ్వుతో తలపంకించింది నీలాంబరి.

“మరో ఇన్నపవండి. మీరు అబ్బో మా ఊళ్ళల్లో సాలా పాప్పులరే గానీండి అబ్బెర్దులందరూ అంత పాప్పులర్ కాదుగదండీ అందరూ గెలుత్తారని ఎవరూ గ్రేరంట్రీ ఇవ్వలేరు గదండీ, తవరికి తెలీని దేవుందిలెండి గెల్పూ ఓటంలు దైవదీనాలంటారు గదండీ, మరి ఇంతా పెట్టుబడెట్టి తీరా ఓడిపోయేటోళ్లుకూడా ఉంటార్లెండి తవరికి తెలీన్ది లేదు. మరి ఓడినోళ్ళకి మళ్ళా పుంజుకునేందుకేదయినా కొంత తవరే ఏదయినా సూడాలండి. ఏదైనా సేర్మన్ గిరీ యో ఇంకట్టాంటిదేటయినా…. ఓడిపోయినంతమత్తరాన తవఁరి పాదాలు ఒదల్తావేటండి” చేతులు నలుపుకున్నాడు “అయ్యేటీ కుదరకపోతే హార్డు కేషు కొంత పరిహారం..” చేతులు నలుపుకుంటూనే నీళ్లు నములుతూనే ఉన్నమాట బయటపెట్టేసాడు వీరవెంకట సత్తెన్నారాయణ.

ఆ నలుపుకోడాలు, ఆ కనుబొమ విన్యాసాలు, ఆ దీనపు చూపులు, ముఖకవళికలు ముచ్చటగా చూస్తూ కూచుని అతన్ని మాటాడనిచ్చింది నీలాంబరి. అతను చెప్పిందంతా విని పకపకా నవ్వింది.

ఆ నవ్వు చూస్తూ తాము కూడా గౌరవంగా నవ్వాలో వద్దో తెల్చుకోలేకపోయారు రాజకీయ ప్రముఖులు. ‘ఈడి దుంపాదెగా! చేతులు నలిపి గొప్పఇరకాటంలో పెట్టేసాడెదవ. ఇప్పుడీవిడ నవ్వీనవ్వీ కూలుగా కొంపముంచుద్దో ఏంటో’ కళవళపడిపోయాడు రాయుడు.

తన నవ్వు ఆగాక, కాసిని మంచి నీళ్లు స్వీకరించింది నీలాంబరి. “ఎలక్షన్ పెట్టుబడికి మీకు ఇన్శూరెన్సో ఎంతో కొంత కాంపెన్సేషనో కావాలి అంతేనా?”

“ఆయ్ మరి రిస్కుగాదండీ. ఇప్పుడు అదేటో కొత్తగా సెమట.. సెమటకి ఇంగ్లీషు మాటేటటదీ?”

“స్వెట్టు” ఎవరో అందిచారు.

“ఆఁ స్వెట్టు. స్వెట్టు. స్వెట్టూను ఈక్వాలిటీ”

“కాదెశ! ఈక్విటీ ఈక్విటీ”

“ఆఁ. ఆం. అదేఅదే. స్వెట్టు ఈక్విటీ మా మేనల్లుడు నాకంతా చెప్పాడు. ఆ స్వెట్టీక్విటీ అంటన్నారు సూడండి. అట్టా ఏదైనా ఇప్పించాల. కొంచెం పార్టీ పనులుసెయ్యడం, పెచారం చెయ్యడం, పెట్టుబడెట్టడం కొంచెం ఇంచుమించు అట్టాంటిదే అనుకుంటున్నానండి. అట్టా అయినా పదవుల రూపంగానో మరో రూపంగానో మాకూ ఎంతోగొంత దక్కాల గదండీ మీకు సెప్పేంతటోణ్ణి కాదనుకోండి.”

“అఖండ మేధావులయ్యా మీరు” మళ్ళీ నవ్వింది దేవీ నీలాంబరి.

ఆవిడ తిడుతోందో మెచ్చుకుంటోందో తెలియలేదు రాజకీయ అనుయాయులకు. ‘ఆవిడేనాడో మీ పేగుల్లెక్కెట్టి మెడలో వేసుకుంది ఇంకెందుకయ్యా ఆవలిస్తారు. హుఁ’ మనసులో నిట్టూర్చాడు సెక్రటరీ స్వామీజీ.

“సరే భక్తుల మొరనెన్నడూ కాదనడు ఆ నీలమేఘశ్యాముడు. నేనెవరిని మీ విన్నపం కాదనడానికి? మీరన్నట్టే కానివ్వండి” ఎన్నికల భక్తులందరి ముఖాల్లోనూ రాజకీయానందం వెల్లివిరిసింది. ఉలిక్కిపడ్డాడు స్వామీ సెక్రటరీ.

“శ్రీ నీలమేఘశ్యామునికీ జై” “దేవీ నీలాంబరీ మాతకూ జై” నినాదాలతో ఆఫీసు దర్బారు దద్దరిల్లింది.

“ఆ నీల మేఘ శ్యాముని కృపా కటాక్షాలవలన ఇవాళ మన భక్తప్రజాబాహుళ్య పార్టీ ఒక కొత్తవొరవడిని భారతీయ రాజకీయాలలో ప్రవేశ పెడుతోంది. ఎలక్షను ఖర్చులకు ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది మన పార్టీలో నమ్మకస్తులకే పరిమితం. మీరీ విషయం ఎక్కడా బయటపెట్టవలసిన పనిలేదు. ఇంక మీరంతా దయ చేయవచ్చు”.

నీలాంబరి మాటలు విని అందరూ లేచి నిలుచున్నారు. వొచ్చిన పాతికమంది ప్రజానాయకులు దేవీ నీలాంబరి దగ్గర శలవు తీసుకుని లేచారు. కాస్త వయసులో చిన్నవాడొకాయన ముందుకు వచ్చి నీలాంబరి పాదాలు తాకి కళ్లకద్దుకుని నమస్కారం చేసుకున్నాడు. మిగలిన ఇరవై నలుగురూ లైనుకట్టి పాదవందనాలు మొదలు పెట్టారు. ‘గొర్రెలు’ కాస్త విషాదంగా అనుకున్నాడు సెక్రటరీ స్వామీజీ.

సరిగ్గా అదే ఆలోచన వచ్చి ‘గొర్రెలు!’ వెటకారంగా నవ్వుకుంది నీలాంబరి.

చేతులు ఆకాశం వైపు తిప్పి “శ్రీ నీలమేఘశ్యామార్పణం” అని, అందరినీ ఆశీర్వదిస్తున్నట్టు అవే చేతులు తలలమీద పెట్టింది. కొందరికి పాదవందనం చెయ్యడం ఇష్టం లేక పోయినా ఒకళ్ళు మొదలెట్టారు కాబట్టి తప్పలేదు. ఆ మాత్రం గ్రహించలేని వెర్రిదికాదు నీలాంబరి.

అందరూ వెళ్ళిపోయాక తన ఆఫీసు రూములోకి వొచ్చి విశ్రాంతిగా వెనక్కి వాలింది. వీరవెంకట సత్యనారాయణ కోరిక తలుచుకుని నవ్వుకుంది మళ్ళీ. తప్పులేదు. అన్నివ్యాపారాలకీ ఉన్నట్టే రాజకీయానికి మాత్రం గేరంటీ స్కీములూ ఇన్షురెన్స్ స్కీములూ ఎందుకుండకూడదు? రాజకీయం వ్యాపారం కాదుకాబట్టి అని సమాధానం చెప్పుకోవచ్చు ఎవరైనా. పార్టీ తరఫునించి ఆ మాత్రం ఇన్సూరెన్స్ లేకపోతే కొత్త కొత్త ఐడియాలతో కొత్త కొత్త ప్రజాసేవకులు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు, రిస్కు తీసుకుని పెట్టుబడెందుకు పెడతారు? ప్రజలకోసం ప్రజలనీ, దేశాన్నీ ఉధ్ధరించి అవినీతిని పారద్రోలడానికే పార్టీ పెట్టాం పోటీ చేస్తున్నాం అంటున్నవాళ్ళు కూడా కనీసం ఇన్ని కోట్లు ఎలక్షన్ ప్రచారం కోసం తెచ్చుకోగలిగిన వాళ్ళకే టికెట్లిస్తాం అని బహిరంగంగా ప్రకటిస్తున్న రోజులివి. ఎన్నికల ఖర్చుకి ఇన్సూరెన్స్ కోరడంలో తప్పేం లేదు. ప్రభుత్వాలు ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు కాబట్టి పార్టీలు ఆ మాత్రం బీమా సౌకర్యం కల్పించాలి అభ్యర్ధులకు. ఎవరో ఒకరు మొదలు పెట్టాలి తరవాత అదే అలవాటైపోయి అదే కరెక్టనిపిస్తుంది. పదుగురాడుమాట లాగా, అలవాటే వ్యసనమైన చందాన ఏదైనా మొదట్లోనే కొత్త.

క్రికెట్ మేచ్‌లు కార్పోరేట్ రంగంచేతిలో వ్యాపారంగా రూపొందుతాయనీ, కోట్లకొద్దీ లాభాలు ఆర్జించి పెడతాయని ఎవరైనా ఊహించారా? ఒక పక్కన సామాన్యుడికి ప్రాణం నిలబెట్టుకునేందుకు తినే తిండి కూడా విలాసవస్తువుల స్థాయిలో రేట్లు పెరిగిపోయి అవస్తలు పడుతుంటే ఆహార కొరత, పెరిగే ధరలను నియంత్రించని ప్రభుత్వం, కోట్ల మీద వ్యాపారం చేసే కార్పోరేట్ సంస్థలకు రకరకాల సబ్సిడీలు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తుందని ఎవరైనా ఊహించారా? రాష్ట్ర ప్రభుత్వాలు క్రికెట్ మేచ్‌లకు ఎంటర్టెయిన్‌మెంట్ టాక్స్ రద్దు చేసి చేసిన ప్రజా సేవ ఏముందని ఎవరూ ప్రశ్నించరు. ఆ మేచ్ లేవో పగటి పూట ఆడించి విద్యుత్తు ఆదా చెయ్యమని ఆందోళన చేసిన ప్రజాసేవకుడొక్కడు లేడు! ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల బాధల్లో విద్యుత్తు కొరత ముఖ్యమైనదని తెలినిదెవరికి?

రైట్ టు ఎడ్యుకేషన్ అని ఆర్భాటం చేసే ప్రభుత్వం పేద విద్యార్ధికి పరీక్షల సమయంలోనే కరెంటుకోత విధించి ఏడిపిస్తుంది. ఉన్నమ్మా ఉన్నమ్మకే పెడుతుంది. లేనమ్మ చేత కూడా ప్రభుత్వం ఉన్నమ్మకే పెట్టిస్తుంది. ఇలాంటి ప్రభుత్వాలు ఐడియా ఇవ్వాలే కానీ ఎలక్షన్ కేంపెయిన్ బినామీ ఖర్చులకు బీమా ఏర్పాటు చెయ్యడానికి పక్కా పథకాలు తయారు చేయిస్తాయేమో ఎవరికి తెలుసు. తన పార్టీలో ఈ ఎలక్షన్ కేంపెయిన్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆరంభిస్తుంది. ఇప్పుడు కాక పోతే మరో రెండు ఎలక్షన్ల తరవాతైనా ఇతర పార్టీలకూ ఇందులోని సబబు అర్థమవుతుంది. తరవాత తరవాత అది ప్రైవేటు రంగానికి పాకుతుంది. ఇంకా ముందుముందు ప్రభుత్వ పాలసీగా మారినా మారుతుంది. దేనికైనా ఎవరో ఒక ట్రెండ్ సెట్టర్ ఉండాలి. తరవాత అందరూ అదే అనుసరిస్తారు.

నవ్వుకుంది నీలాంబరి. ఆవిడ చూస్తున్న భావి భారతదేశం డబ్బు పిచ్చిపట్టిన రాక్షసుల రాజ్యంగా కళకళలాడిపోతూ కనిపించింది. ఆ రాజ్యాన్ని ఏలుకుని ఉధ్ధరించే మహారాణిగా తన కళ్ళముందు తనే దర్శనమిచ్చింది!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here