మనోమాయా జగత్తు-8

0
3

[box type=’note’ fontsize=’16’] పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 8వ అధ్యాయం. [/box]

[dropcap]“ఈ [/dropcap]ఊరికేదో శని పట్టిందంటన్నారండి అందరూ” అన్నాడు కాంపౌండరు కనకరత్నం తెల్లారుతుండగా ఊరు చేరిన యోగిని చూసి, వచ్చి సూట్ కేసులందుకుంటూ.

ఆవెనకే వంటసూరయ్య చేరి “ఆయ్” అని కన్ఫర్మ్ చేసాడు. సూరయ్య ఆస్పత్రి కాంపౌండులోనే ఉన్న డాక్టర్స్ క్వార్టర్స్‌లో యోగితోబాటు అతనికి వంటచేసిపెట్టి ఇల్లు చూస్తుంటాడు. కాంపౌండరు కనకరత్నం అక్కడే ఉన్న మరో చిన్నక్వార్టర్‌లో ఉంటాడు.

“ఏం? ఏం జరిగింది?” షూస్ విప్పుకుని గీజర్ ఆన్ చేసుకుంటూ అడిగాడు యోగి. కాఫీ పట్టుకొచ్చి ఇచ్చి మళ్ళీ వంటింట్లోకెళ్ళాడు సూరయ్య.

“ఏంటోనండి ఈ వారం రోజుల్లోనూ ఊళ్లో ఇద్దరు చనిపోయారండి!” అన్నాడు కనకరత్నం వింతగా.

యోగికి కాస్త నవ్వొచ్చింది. ‘ఇతనికి దేశం మొత్తం మీద రోజువారీ మరణాల స్టాటిస్టిక్స్ చూపిస్తే ఇంకెంత విస్తుపోతాడో’.

“మన ఆస్పత్రిలో మొక్కలేసి ఆటిసంగజ్జూడమని గార్డినరుగా ఉద్యోగమిచ్చి అపాయింట్ చేసారు చూడండి వీరేశం? ఆళ్ళతాత సుబ్బన్ననీ.. మీ రెళ్ళిన మర్నాడే పోయాడండి. దుక్కలా ఉండేవోడు ముసిలోడు. ఆ తరవాత మర్నాడే నండి సర్పంచి గారి పాలేర్లేడాండీ మీ దగ్గరికి తల్లికి మందు కోసం వొచ్చేవోడు? ఆడూ పోయాడండి నడుస్తున్నోడు నడుస్తున్నట్టే విరుచుకు పడిపోయాడని చెప్పుకుంటున్నారండి. ఎంత బలంగా ఉండేవోడండీ!”

“సరే నేను స్నానానికి వెళ్ళొస్తాను. స్వీపరొస్తున్నాడా? ఆస్పత్రి తలుపులు అసలు తీస్తున్నారా?” అంటూ తువ్వాలు తీసుకుని బాత్ రూములోకెళ్ళి పోయాడు.

“సూరయ్యా! అయ్యగోరికి టిఫిన్ రెడీ చేసావా?” అని వంటింటి పెత్తనం చేసి కాస్త టీ కల్పించుకు తాగి తన డ్యూటీ ఎక్కాడు కనకరత్నం.

యోగి అక్కడ ఉధ్యోగంలో చేరాక ఆస్పత్రికి జనం రావడం అధికం అయింది. కుర్రడాక్టరు ఇక్కడే ఉంటాడు. ఇదివరకటి వాళ్ళల్లా పక్కనున్న పట్నంలో కాపరం పెట్టి వారానికొకసారో రెండుసార్లో ముఖం చూపించడంకాక అక్కడి క్వార్టర్ లోనే ఉండి టైమ్ ప్రకారం ఓ.పి. ఓపిగ్గా నడిపిస్తాడు. పైగా ‘ఉత్తి ఎమ్.బి.బి.ఎస్సే కాదు మానసిక జబ్బుల్లో స్పెషలిస్టుట’ అని ఆనోటా ఆనోటా ఆ చుట్టుపక్కల గ్రామాలు, కుగ్రామాలు అన్నిటా పాకింది. అందుకని డాక్టరు ఓపి నడిపే టైములు ప్రజానీకానికి బాగా అలవాటై ఆ టైముకే వొచ్చి చూపించుకుంటున్నారు.  మంత్రాలు, భూతవైద్యాలు మోజు చాలా మటుకు తగ్గింది. యోగి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యునిగా సేవలందించాలని అనుకోవడంలో ముఖ్య ఉద్దేశం కూడా అదే. గ్రామ ప్రజలు మానసిక రోగాన్ని దెయ్యంగా కాక రోగంగా గుర్తించి వైద్యం చేయించుకోవాలని. ఆ లక్ష్యం కొంత వరకూ సాధించగలిగాడనే చెప్పుకోవచ్చు.

సూరయ్య వంట పూర్తి చేసి క్వార్టర్స్ మెట్లమీద కూచుని ఆస్పత్రి లోకి వచ్చేపోయే జనాన్ని చూస్తున్నాడు. ఇంక జనం పల్చబడ్డారు ‘ఓ అరగంటలో అయ్యగారు భోజనానికి వచ్చేస్తారు’ అనుకుంటూ లేచి వొళ్ళు విరుచుకుంటూ నిలబడ్డాడు. ఇంతలో ఒక్కసారి జనం గట్టుతెగి ఉరికిన గోదావరిలా వచ్చి పడ్డారు.

ఆఖరి పేషెంటు కూడా వెళ్లిపోయాడని యోగి వాష్ బేసిన్ దగ్గర  చేతులు కడుక్కుంటున్నాడు. దడదడా పరుగుపెడుతూ కొందరు మనషులు హాస్పిటల్ ప్రవేశించారు. అందరూ ఆ పల్లెకు అవతలున్న అడవి లోని కోయగూడెం లోనివాళ్లే.  ఆ గుంపు వెనకే కొందరు రెండు నులకమంచాల మీద ఇద్దరు మహిళలను మోసుకు వస్తున్నారు. ఆ మహిళలు స్పృహ లేనట్టు పడున్నారు.

“డాట్రుగారో! డాట్రుగారో!” గాభరాగా అరుస్తూ ఆస్పత్రిలోకి వచ్చారు. మోసుకొచ్చిన రెండు మంచాలూ దించి “సూడండి డాట్రుగారో! ఉన్నట్టుండి ఆడోళ్ళిద్దరూ నుంచున్నోళ్ళు నుంచున్నట్టే ఇరచుకు పడిపోయారు డాట్రు బాబో! ఏటయిందో ఏటో తవరేసూడాల తవరే రచ్చించాల” ఆడమగా గోడుగోడున ఏడుస్తూ గోల చేస్తున్నారు. “మీరంతా అవతల కూచోండి నేను చూస్తాను”. యోగి మాటలు విని జనాన్ని అదుపు చెయ్యడానికి కనక రత్నానికి సాయంగా వంటసూరయ్య కూడా లేచి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ అందరినీ కాంపౌండులోపల సద్ది కూచోబెట్టేసరికి యోగి ఆ రోగులను పరీక్ష చెయ్యడం అయిపోయింది పరీక్ష చేసేందుకు ఏమీలేదు. వాళ్ళ ప్రాణాలు అప్పటికే గాల్లో కలిసిపోయాయి. చిన్నచిన్న ప్రథమ చికిత్సలేవో చేసి ఆఖరి ప్రయత్నం చేసాడు యోగి. కానీ తీసుకువచ్చేటప్పటికే మరణించి ఉన్న వారికి ఏ వైద్యం పనిచేస్తుంది?

ఆ ఇద్దరిలోనూ ఒక యువతిని యోగి గుర్తు పట్టాడు. ఆ అమ్మాయి పేరు రంగరాణి. మతిస్థిమితం లేని రంగరాణికి తల్లి ఒక భూతవైద్యుడి చేత మంత్రం వేయిస్తుండేది. వైద్యంలో భాగంగా వేపమండలతో చితకబాదే వాడా భూతవైద్యుడు. ఆ దెబ్బలకు విపరీతంగా రక్తస్రావం అవుతూంటే వైద్యానికి తన దగ్గరకు తీసుకొచ్చారు. తరవాత ఇంక మళ్ళీ వాళ్లు ఆ భూతంవైద్యుడి దగ్గరకు వెళ్ళలేదు. ఆ అమ్మాయిలో స్కీజోఫ్రేనియా లక్షణాలు గుర్తించి యోగి వైద్యం ప్రారంబించిన కొద్దికాలానికే ఆమెలో మంచిమార్పు కనబడింది. ఇతరగ్రామాల్లో కూడా ఈ డాక్టరు మామూలు జలుబు దగ్గులాంటి వాటికే కాక భూతవైద్యుడు కూడా వదలగొట్టలేని దెయ్యాలు వదిలించి కేవలం మందులతో నయం చేసేస్తున్నాడని ప్రచారం వచ్చింది.  దాంతో మానసిక రోగాల బారిన పడ్డవారిని కూడా నిస్సంకోచంగా తీసుకువస్తున్నారు పల్లెజనం. భూతవైద్యుల మాట దాదాపు మూలపడి పోయింది.

“మరి హఠాత్తుగా ఇదేమిటి, ఏమయింది దాచకుండా చెప్పండి. ఏ పురుగుల మందైనా తిన్నారా వీళ్ళు?” గట్టిగా అడిగాడు యోగి. “ఉన్నవిషయం చెప్పండి నాకు. లేకపోతే పోలీసులకి కారణం లేకుండా ఇద్దరు అమ్మాయిలు  ఉన్నట్టుండి చచ్చిపోయారని తెలిసిందంటే హత్య జరిగిందని అనుమానించి  మీ గూడేలమీద పడి మీ బతుకులు నరకం చేస్తారు” బెదిరించాడు.

వాళ్ళంతా ముఖాలు చూసుకున్నారు. “మాకేం తెల్దు బాబూ ఇద్దరూ గూడెం నూతి కాడికి ఎల్లొస్తాం అనిచెప్పి నీళ్లట్టుకు రాడానికి ఎల్లారండి. అక్కడిదిగో సూరాయమ్మ, కొండమ్మ కూడా ఉన్నారంటండి.”

“సూరాయమ్మెవరూ?” అడిగాడు యోగి.

“ఇదిగోండి ఇదేనండి”

ఓ నడివయసుస్త్రీ ఏదో అపరాధం చేసినట్టు జంకుతూ లేచింది. “ఆయ్. నేనూ ఈ కొండమ్మా మాటాడతానే ఉన్నావండి. ఇంకో నలుగురు, మావోళ్ళే, నీల్ళకోసం వొచ్చీరండి మాటాడతా మాటాడతానే మరేటయిందో దబ్బున కిందడిపోయేరండి ఇద్దరూ ఒకేసారి” చెప్పేసి కొంగడ్డం పెట్టుకుని ఏడుపు మొదలెట్టింది. ఆడవాళ్ళందరూ ఘొల్లున ఏడుపందుకున్నారు. వాళ్ళ ఏడుపు కాస్త తగ్గే వరకూ ఊరుకున్నా డు. ఇంకా ఏదో ఉంది. చెప్పట్లేదు  యోగి ఆలోచించాడు.

“ఉన్నట్టుండి పడిపోయారా?”

“ఆయ్.”

తన మాటలు నమ్మినందుకు కొంత భారం దిగినట్టు ముఖం పెట్టింది సూరాయమ్మ. ఆలోచిస్తూనే రెండు డెడ్ బాడీస్‌నీ అస్పత్రి వెనక ఉన్న చిన్న మార్చురీ గదిలో పెట్టించాడు.

“పోలీసులు అనుమానించి దండెత్తి రావడం కంటే మనమే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం” జరిగిందంతా రాసి కనకరత్నం చేతికిచ్చి, అతనితో పాటు సూరయ్యనీ మృతులిద్దరికీచెందిన పెద్దలు ఓ పదిమందినీ పోలీస్ స్టేషన్‌కి పంపించాడు. గత రెండున్నరేళ్ళుగా ఇక్కడ పని చేస్తున్నాడు. ఇటువంటి సంఘటన లేవీ జరగలేదు. ఈ పరిస్థితినెలా డీల్ చెయ్యాలో తెలియలేదు. పోలీసులొస్తే వాళ్ళే చూసుకుంటారు అనుకుని ఎదురు చూస్తూ కూచున్నాడు.

రంగారాణి తల్లి వెంకమ్మ దగ్గర కూచుని ఆడవాళ్ళు కొందరు ఓదారొస్తున్నారు. ఓ నలుగురు మగవాళ్ళు గేటు పక్కన చెట్టుకింద కూచుని జరిగినవన్నీ చర్చిస్తున్నారు. “నువ్వెళ్ళి లోపల కాసేపు పడుకోమ్మా. ఏం జరగాలో మీ మగవాళ్ళు చూసుకుంటారు. లోపల బెడ్డు మీద పడుకో ఫరవాలేదు” వెంకమ్మ లోపలున్న ఏకైక మంచం మీద పడుకుంది. తలుపు దగ్గరగా వేసి ఇవతలకొచ్చాడు.

అరుగులమీద కూచునున్న ఆడవాళ్ళని “ఆ రెండో అమ్మాయి ఎవరూ?” అనడిగాడు.

“గంగానమ్మండి. చెంగయ్య కూతురు. ఆడూ ఎల్లాడండి పోలీసోళ్ళకాడికి” కొండమ్మ చెప్పింది.

“మరి గంగానమ్మ తల్లి ఎవరూ?” అడిగాడు.

“లేదండి దీని పురిట్లోనే పోయిందండి. ఇప్పుడేమో ఇదిలా” కాస్త విచారం ప్రదర్శించారు వాళ్ళు.

“ఏం జరిగింది నిజం చెప్పండి. వీళ్ళని మళ్ళీ భూతవైద్యుడి దగ్గరికి పంపారా నేను లేనప్పుడు? భయపడకండి నేనెవరికీ చెప్పను. చేతనైతే సాయం చెయ్యడానికే ప్రయత్నిస్తా” అన్నాడు.

“అయ్యో డాట్రారూ! మాకు తెల్దా ఏటండి తవరిసంగతి?” అన్నారే కానీ మళ్ళీ మాటాడలేదు.

రూటు మార్చాలనుకున్నాడు. “ఎలక్షన్లొస్తున్నాయి కదా. సిటీలో నేనొచ్చేరోజున మోగిపోతున్నాయ్ పార్టీలు. మనూళ్ళో ఇంకా ప్రచారం మొదలెట్టలేదా?” అన్నాడు.

“మొదలెట్టకేవండి. తీర్త పెజల్లా వొచ్చి పడ్డారు కదండీ రెండ్రోజులుగా! ఇయ్యాల పక్క పల్లెకెల్లినట్టున్నారండి. రేపటికి మల్లా ఒత్తారు.”

“ఏ పార్టీ వాళ్ళొచ్చారు?” చాలా ఆసక్తి చూపిస్తూ అడిగాడు.

“ఇంకే పార్టీ మిగిలిందండి. ఆ యమ్మెవరో దేవీమాతంట. నీలంగ సీరసుట్టబెట్టుకని మహత్తేలు సూపిస్తది. ఆ యమ్మని గెలిపించమని  అడిగేటందుకు ఒచ్చారండి.”

“ఏవైనా ఇచ్చారా?” అందరూ ముఖాలు ముఖాలు చూసుకుని గుంభనంగా కూచుండిపోయారు.

“ఏటుంది బాబూ ఇందుట్లో రహస్సెం అందరికీ తెలిసిందే. నీలంరంగు చీరలిచ్చారండి ఆడోళ్ళకి. అదే రంగు పెంచలేవోఁ మగోల్లకి. ఏం గట్టుకుంటావండీ అందరం ఒకేరంగువి” చీదరింపుగా అంది ఓ ముసలావిడ.

దేవీ నీలాంబరి మనషులు మూలమూలలా పల్లెటూళ్లలో ప్రచారాలు ముమ్మరం చేసారని పేపర్లో చదివినది గుర్తుకొచ్చింది. “అలా వచ్చిన వాళ్ళలోఎవరైనా రంగారాణితో ఎక్కువగా మాటాడేవారా?”

“ఆయ్. ఇదో ఎర్రిది కదండీ! ఎవరైనా పలకరిత్తే చాలు నమ్మేసి ఆళ్ళకన్నీ చెప్పేస్తదండి. ఆ గంగానమ్మా అంతేనండి, స్నేయితురాళ్లిద్దరూ మరీ ఎర్రి బాగులోళ్ళండి. ఆళ్ళతో తనకి దెయ్యం పట్టిందనీ, డాట్రు బాబు మందిచ్చి వొదిలించాడనీ, ఏటేటో వాగిందండి మేం ఇంటండగనే ఓ పాలి. మరాళ్ళేం చెప్పారో ఏటో! ఆళున్న నాల్రోజులూ ఆళ్ళెంటే తిరిగే వోరండి ఈ కుంకలిద్దరూ.” ముసలావిడ చెప్పుకుపోతోంది.

“ఇప్పుడయ్యన్నీ ఎందుకు? నువ్వు పల్లకుండవే ముసిల్దానా!” ఆడవాళ్లందరూ కేకలేసారు.

యోగి ఇంకేం రెట్టించకుండా ఊరుకున్నాడు. వాళ్ళకి ఇష్టమై వాళ్ళంతటవాళ్ళే సమాచారం ఇవ్వాలి. రెట్టించి అడిగితే అనుమానం వచ్చిందంటే అసలు మాటాడరు పల్లెజనం.

సిటీలో తన అనుభవం గుర్తొచ్చింది. అక్కడనించి ఇక్కడ దాకా అనుమానాస్పదపు చావులు తనని వెంబడిస్తూనే ఉన్నాయి. వింతగా ఉంది. విమల్ గుర్తుకొచ్చాడు. జేబులోంచి సెల్ తీసాడు.

***

దేవీ నీలాంబరి ఎన్నికల ప్రచారానికి స్వయంగా రథయాత్ర ప్రారంభించబోతోందన్న వార్త రాష్ట్రంలో గొప్ప సంచలనం సృష్టించింది. మారుమూల పల్లెటూర్లను కూడా వదలకుండా ఊరూరా ప్రయాణించి ప్రచారం చేసేందుకు బిపిబిపి పార్టీ ప్రముఖులు మహావ్యూహం తయారుచేస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. ఎలెక్ట్రానిక్  మీడియా సంగతి చెప్పనే అక్కరలేదు. పోటీ పడి నీలాంబరి విజువల్స్ పాతవీ కొత్తవీ ఆపకుండా ప్రదర్శించారు. అదంతా నీలాంబరీ ట్రస్టునుంచి కోట్లకొద్దీ నోట్లు ఆయా ఛానెల్సు గుమ్మాలవద్ద గుమ్మరించడం వల్ల లభిస్తున్న పెయిడ్ న్యూస్ కవరేజి అని ప్రతిపక్షాల వాళ్ళు ఆరోపించారు. నీలాంబరి లాంటి ఆధ్యాత్మిక గురువు రాజకీయాల్లోకి రావడం వల్ల దేశానికి మేలే గాని కీడు జరగదని ప్రగాఢంగా విశ్విసించిన సామాన్య ప్రజానీకం మాత్రం ప్రతిపక్షాల హోరు పట్టించుకోలేదు. ‘ఆవిడకి కనీసం దైవ భక్తి ఉంది. ఈ కరుడుగట్టిన పాత పార్టీలకు దైవ భక్తీ లేదు దేశ భక్తీలేదు’ అని చెప్పుకున్నారు. వోటేసే మాటెలా ఉన్నా నీలాంబరి నిర్వహించే బహిరంగ సభలకు వెళ్ళి తీరాలనుకున్నారు. దేవీ నీలాంబరిని దర్శించుకుంటే చాలు ఎంతో మందికి జీవితసమస్యల నుంచి పరిష్కారం లభించింది. ఆవిడ దర్శన భాగ్యం కోసమైనా ఆవిడ సభలలో పాల్గొనాలి అన్నతపన పెరిగిపోయింది జనంలో.

రాష్ట్రమంతా ఒకే రకంగా ఎన్నికల జ్వరంతో వేడెక్కిపోయింది. నీలాంబరి యాత్రకోసం ప్రత్యేకమైన వేన్ అన్ని సౌకర్యాలతోను తయారైంది. దానిని ఇండస్ట్రియలిస్ట్ రాజేశ్వరరావు ప్లాన్ చేసి చేయించాడని చెప్పుకున్నారు. కొడుకు పోయిన దుఃఖాన్నించి మరిచి పోయేందుకు రాజేశ్వరరావు, సుమతి దంపతులను తనతో పాటు ప్రజాసేవ యాత్ర చెయ్యమని నీలాంబరీదేవి వాళ్ళని అడిగిందని, యాత్రలో తనకు తీరికైనప్పుడల్లా వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రబోధలు చేసి ఉపశమనం కలిగించే ఉద్దేశంతోనే వాళ్ళని రమ్మని నీలాంబరీదేవి అడిగిందని వార్తలొచ్చాయి. ఒక శుభముహూర్తాన దేవీ నీలాంబరి భక్తి ప్రచార జైత్ర యాత్ర ప్రారంభించింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here