[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘మనోనిగ్రహం ఆవశ్యకత’ అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]ధ[/dropcap]ర్మజుడు యక్ష ప్రశ్నల సమయంలో గాలి కన్నా వేగం కలిగినది ఏది అంటే మనసు అని సమాధానం ఇచ్చాడు. మనసు ఒక్క క్షణలో వెయ్యోవంతు కూడా పనిలేకుండా కూర్చోలేదు. నిరంతరం ఏదో ఒకదానిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇలాంటి మనస్సును ఎట్టి నియంత్రణ లేక స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియములకు ఆధీనమైపోతుంది. కామ క్రోధ, లోభాది అరిషడ్వర్గాల బారిన పడుతుంది. ఈ నేపధ్యంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి ఏది చేయకూడదో ఏది చేయవలెనో అన్న విచక్షణను కోల్పోతాడు. కూడని పనులు చేసి తనను నైతికంగా దిగజార్చుకుంటాడు. అధః పాతాళానికి క్రుంగిపోతాడు.
‘మనసు నిస్సందేహంగా చంచలమైనదే, దానిని నిగ్రహించడం కష్టసాధ్యమే అయినా అభ్యాస వైరాగ్యాలతో దాన్ని సులభంగా నిగ్రహించవచ్చు’ అని అర్జునుడికి ఉపదేశించాడు శ్రీకృష్ణ భగవానుడు. ముఖ్యంగా ఈ కలియుగంలో ఉరుకులు, పరుగులతో నిత్యం అశాంతిమయ జీవితం గడిపే మనందరం కూడా మనోనిగ్రహాన్ని సాధించడానికి సులభమైన మార్గం భక్తిపథంలో నడవడమే అని భగవానుడు పరోక్షంగా భగవద్గీత ద్వారా మానవాళికి దివ్యమైన సందేశం ఇచ్చారు.
మనోనిగ్రహం అలవడితే సాధారణ మానవులు దివ్యశక్తిస్వరూపులు అవుతారు. సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలను కలుగుతాయి. అంతటా, అన్నింటా సమదృష్టి అలవడుతుంది. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొనేలా చేస్తుంది. భగవంతునికి దగ్గరైతే ముక్తి కూడా సాధ్యమే అని ధ్రువుడు, మార్కండేయుడు వంటి దివ్య పురుషుల జీవితాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ కలియుగంలో ఆధ్యాత్మిక సాధనకు, లౌకిక విషయాల సాధనకూ మనోనిగ్రహం నిస్సందేహంగా అవసరం. చంచలమైన మనసును విషయ లోలత్వం నుండి మరల్చి ఆత్మకు అధీనమై ఉండేలా కఠోర సాధన ద్వారా చేసుకోవాలి. అందుకే, మనసును జయించిన వాడు ముల్లోకాలనూ జయించినట్లే అని మన పూర్వీకులు చెప్పారు!
మనోనిగ్రహం లేనివాని బుద్ధి తప్పుదారి పడుతుంది. ఆత్మచింతన, ఆత్మనిష్ఠ కూడా సాధ్యం కాదు, సరికదా నిత్య జీవితంలో ఎంతో అశాంతికి, ఆందోళనలకు గురవుతుంటాడు. ‘ఆత్మచింతన లేని వానికి శాంతి ఉండదు. శాంతి కరువైన వారికి సుఖమెట్లా కలుగుతుంది?’ అన్నాడు కృష్ణ పరమాత్మ. నిశ్చల బుద్ధి ఉండాలంటే మనసును నిగ్రహించుకోగలగాలి అన్న విషయం అందరూ మన మనస్సుల్లో పదిలపరచుకోవాలి.
మితంగా మాట్లాడటం, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమ ధర్మాలను సక్రమంగా నిర్వర్తించడం, ఉపవాస దీక్ష, సాత్వికాహారం తీసుకోడం, భగవన్నామ స్మరణం, ప్రాణాయామం వల్ల మనోనిగ్రహాన్ని సాధించవచ్చు. నిరంతరం భగవంతుడి గురించి చింతన చేస్తూ ఉంటే చాలు మనోనిగ్రహం అలవడుతుంది. అప్పుడు నేను, నాది అనే మమకారాలు వీడిపోతాయి. స్వార్థం నశిస్తుంది. భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. మనోనిగ్రహాన్ని సాధించిన వాళ్లే మహాత్ములుగా నిలుస్తారు. చిరస్మరణీయులు అవుతారు.