మనోవీధిలో..

0
2

[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ రచించిన ‘మనోవీధిలో..’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]బ్యాం[/dropcap]క్‌లో క్యాష్ కౌంటర్‌లో కూర్చుని టోకెన్‌లు తీసుకుని డబ్బు ఇవ్వటం, డిపాజిట్‌కి వచ్చిన వారి దగ్గర డబ్బు తీసుకుని జమ వెయ్యటం చేస్తున్నాను. ఇక ఈ రోజుకి ఆఖరి టోకెన్. ఇది ఇచ్చేస్తే లావాదేవీలు జరిపే సమయం కూడా ముగిసిపోతుంది అనుకుంటూ “టోకెన్ నంబర్ థర్టీ ఫోర్” అని పెద్దగా పిలిచాను.

క్యాష్ అందుకోవటానికి తెల్లటి గాజుల చెయ్యి ముందుకు వచ్చింది. డబ్బు కౌంటింగ్ మిషన్‌లో లెక్కించి ఆ చేతిలో పెట్టి, పాస్ బుక్‌లో ఎంట్రీస్ వేయటానికి తలొంచుకున్నాను. “ఎక్స్‌క్యూజ్ మీ!” సన్నటి గొంతు వినబడి, తలెత్తి చూసాను.

“మీరు.. మీ పేరు వంశీకృష్ణ కదూ!” ఎదురుగా నిలబడిన ఆమె అడిగింది.

“అవును. మీరు..” ఒక్క క్షణం సందేహంగా ఆగాను. వెంటనే ఫ్లాష్ లాగా వెలిగింది. “సుమధుర. అవునా!” నవ్వు ముఖంతో అడిగాను. ఆమె చెంపమీద గడ్డంకి దగ్గరగా ఉన్న పుట్టుమచ్చ చూడగానే గుర్తొచ్చింది.

“అవును. బాగున్నారా!” అడిగింది.

“బాగున్నాను. మీరు ఏం చేస్తున్నారు?” అడిగాను.

“లెక్చరర్‌గా చేస్తున్నాను. మావారు కాలేజ్ ప్రిన్సిపాల్. మేం ఇద్దరం ఒకే కాలేజ్‌లో చేస్తున్నాం. మాకు ఈ మధ్యనే ఈ ఊరు ట్రాన్స్‌ఫర్ అయింది” చెప్పింది.

“ఐ.సీ” అన్నాను.

“మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. బ్యాంక్ టైం అయిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు నలుగురికీ ఇబ్బంది అవుతుంది” అన్నది సుమధుర.  సరేనని చెప్పాను.

“నేను కాల్ చేస్తాను. నా నంబర్ సేవ్ చేసుకోండి..” అన్నది. ఆమె కాల్ చేయగానే కట్ చేసి, ఆ నంబర్ నా ఫోన్‌లో సేవ్ చేసుకున్నాను. వెళ్లి వస్తాను అన్నట్లు చూసి వెళ్ళిపోయింది.

సాయంత్రం ఇంటికి వచ్చాను. స్నానంచేసి కూర్చున్నాను. నా భార్య ప్రణవి టీ అందించి, “డాడీ కాసేపు రెస్ట్ తీసుకుంటారు. మనం అటువెళదాం రా నాన్నా!” ఆరేళ్ళ బాబుని తీసుకుని పక్కగదిలోకి వెళ్ళింది. టీ సిప్ చేస్తూ ఆలోచనలో మునిగిపోయాను.

సుమధుర పుట్టుమచ్చ గుర్తు పట్టిఇచ్చింది కానీ, ఆమెను మర్చిపోయిన క్షణం ఉన్నదా! విడిపోయి పద్దెనిమిది సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలు నా గుండెలో పదిలంగా ఉన్నాయి. కాకపోతే విడిపోయినప్పుడు కలిగినంత బాధ ఇప్పుడు కలగటం లేదు.

అప్పుడు నాకు పద్దెనిమిదేళ్ళు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నాను. కాలేజీ తెరిచిన కొత్త. ఆ రోజు క్లాస్‌లో లెక్చరర్ ఇంకా రాలేదు. అందరూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. పక్కన ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న నేను గుమ్మంలో కిలకిల నవ్వులు వినిపించే సరికి తలతిప్పి చూసాను. ఫ్రెండ్స్‌తో కలిసి లోపలి వస్తూంది సుమధుర. బంగారురంగు చాయతో కళ్ళు జిగేలుమనేటట్లు ఉంది. వాళ్ళందరి మధ్య చూస్తుంటే చెలికత్తెల మధ్య రాకుమారిలా ఉంది. చూడగానే ఆకట్టుకునేది ఆమె చెంపమీద ఉన్న పుట్టుమచ్చ. చంద్రబింబానికి దిష్టి చుక్క పెట్టినట్లు ఉంది.

మా బ్యాచ్‌లో మగవాళ్ళు అందరూ అమ్మాయిల దృష్టిలో పడాలని అనేక ప్రయత్నాలు చేసేవారు. వాళ్ళు పట్టించుకోకపోయినా వెంటబడి న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు ఇచ్చేవారు. చీటికీమాటికీ ఏదో ఒక వంకతో పలకరించేవారు. వాళ్ళ ప్రయత్నాలు నాకు ఎందుకో అసహజంగా ఉండేవి. సుమధుర పట్ల నాకు కల ఆరాధన నాలోనే దాచుకున్నాను. ఆమెని చూడగానే కవిత్వం రాయాలనిపించేది, బొమ్మ గీయాలనిపించేది. ఆమెని దృష్టిలో పెట్టుకుని కథలు, కవితలు రాసేవాడిని. అవి కాలేజీ మ్యాగజైన్‌లో ప్రచురించారు.

నా కథ చదివి ప్రెండ్స్ అందరూ మెచ్చుకున్నాను. “హీరోయిన్‌ని వాడు వర్ణించటం ఎంత బాగుంటుందో! యండమూరి వీరేంద్రనాథ్‌కి కూడా అలా రాదేమో అనిపిస్తుంది” అనేవారు. ఆ కథలే నన్ను సుమధుర దృష్టిలో పడేటట్లు చేసాయి. “మీ కథ చాలా బాగుంది. చదువుతుంటే ఆ మనుషులు, ఆ సంఘటనలు కళ్ళముందు మెదులుతున్నట్లే ఉంది. ఈ కథలు పత్రికకు ఎందుకు పంపించకూడదూ!” అన్నది ఒకసారి.

“పత్రికకా! ఇప్పటివరకు నాకు ఆ ఆలోచనే లేదు. నా కన్నా బాగా రాసేవాళ్ళు ఎందరో ఉంటారు. తీసుకుంటారో, లేదో!” అన్నాను.

“పోనీ ఒక పని చేద్దాం. నన్ను అందరూ లక్కీ అంటూ ఉంటారు. మీ కథ నా చేతులతో ఫెయిర్ చేస్తాను. మీరు పంపండి” అన్నది. సరే నన్నాను.

సుమధుర నేను చెబుతుంటే తల వంచుకుని రాస్తూ ఉండేది. పక్కనుంచీ అత్యంత సుకుమారంగా కనబడే ఆమె చెంపలను, చెవులమీద కప్పేసిన జుట్టును, భుజం మీదకు జారిన సన్నజాజి పూలను అతి దగ్గరగా తనివితీరా చూసేవాడిని. చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించేది. సుమధురని దృష్టిలో పెట్టుకునే నా కథల్లో హీరోయిన్‌ను వర్ణించేవాడిని.

నా మొదటి కథ పత్రికలో చూడగానే కొండంత సంతోషం వేసింది. సుమధుర కూడా అభినందనలు చెప్పి స్వీట్ నా నోటికి అందించింది. ఆమె చేతి వేళ్ళు నా పెదవులకి తగులుతుంటే ఝుమ్మని షాక్ కొట్టినట్లయింది.. తర్వాత నేను చెప్పటం, ఆమె రాయటం, అవి పత్రికల్లో అచ్చవటం వెంటవెంటనే జరిగిపోయేవి. సంవత్సరం గడిచేసరికి చాల క్లోజ్ అయింది. నేను ఆమె ఇంటికి వెళ్ళటం, అక్కడే భోజనం చేయటం, ఒక్కోసారి ఇద్దరం సినిమాకి వెళ్ళటం జరిగేవి. తను కూడా అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. ఇద్దరి మధ్య మొహమాటం పోయి సాన్నిహిత్యం పెరిగింది.

ఒకసారి మాటల సందర్భంలో “నిన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరో చాలా అదృష్టవంతుడు అయిఉంటాడు” అన్నాను. “ఎందుకు?” అన్నది.

“ఇంత అందాన్ని సొంతం చేసుకోబోతున్నాడు కదా!”

“నిన్ను చేసుకునే అమ్మాయి కూడా అదృష్టవంతురాలే!” అన్నది.

“ఎందుకు?” అడిగాను తనకిలాగే.

“నువ్వు బుద్ధిమంతుడివి. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. పైగా పేరున్న రచయితవి” అన్నది.

“అయితే ఒక పనిచేద్దాం. ఆ అదృష్టవంతురాలివి నువ్వు అయిపో! ఆ అదృష్టవంతుడిని నేను అవుతాను” అన్నాను నవ్వుతూ.

“అంటే..?” కళ్ళు రెపరెప లాడించింది. “నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను” అన్నాను. లోలోపల గుండె దడదడ కొట్టుకుంది.

“యూ నాటీ!” జడకుప్పెలతో నా చెంపమీద సుతారంగా కొట్టి వెనుదిరిగి పరుగెత్తింది. నా మనసు సుమధుర పరిమళంలో చిక్కుకుపోయినట్లు అయింది.

సరిగ్గా నెలరోజుల తర్వాత తన పెళ్లి శుభలేఖ తెచ్చి, తనకి వివాహం నిశ్చయమైందనీ, చదువు ఆపేసి వెళ్ళబోతున్నాననీ చెప్పింది. ఆ మాట విని నివ్వెరపోయాను. “అదేమిటి? మనం వివాహం చేసుకుందాం అనుకున్నాం కదా!” అన్నాను. “ఎప్పుడు?” కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అన్నది.

ఆ రోజు మేము అనుకున్న మాటలు గుర్తుచేసాను. “ఓస్! అదా! నువ్వేదో జోక్‌గా అన్నావని అనుకున్నాను. ఆ మాటలు పట్టించుకోలేదు. పైగా నీ మీద నాకు అలాంటి ఉద్దేశం ఏమీలేదు. నీ కథలకు పాఠకురాలిగా నీ మీద అభిమానం. అంతే!” అని వెళ్ళిపోయింది. నా మనసు మూగబోయినట్లు అయింది. ఆ మర్నాటి నుంచీ కాలేజీకి రావటం మానేసింది. నేను ఆ షాక్ నుంచీ తేరుకోకముందే ఆమె పెళ్లి తేదీ కూడా దాటిపోయింది. పెళ్ళికి నేను వెళ్ళలేదు.

ఆరోజు నుంచీ మూడీగా అయిపోయాను. ఏ పని చేయలన్నా నిరాసక్తిగా ఉండేది. రెండునెలలు గడిచినా మామూలు మనిషిని కాలేకపోయాను. నాకు తల్లీదండ్రీ లేరు. అన్నావదినల దగ్గర ఉంటున్నాను. ఎంత దగ్గర బంధువులైనా, ఎంత అభిమానమున్నా కొంతకాలం వరకే మనల్ని ఆదరిస్తారు. వాళ్ళు గుదిబండగా భావించకముందే మన దారి మనం చూసుకోవాలి. ఇలా టైం వెస్ట్ చేసుకుంటే ఎలా? అనుకుని, బలవంతాన చదువు మీద మనసు లగ్నం చేసాను. చదవటం ముగించి, పుస్తకం మూయగానే సుమధుర గుర్తు వచ్చేది.

కథలు రాయాలని విశ్వప్రయత్నం చేసేవాడిని. అదేమిటో చిత్రంగా ఒక్క ఆలోచన కూడా వచ్చేదికాదు. ఒక్క అక్షరం కూడా పేపర్ మీద పెట్టలేక పోయేవాడిని. ఎన్నో రాత్రుళ్ళు పక్కమీద అస్థిమితంగా దొర్లి, దొర్లి ఎప్పటికో నిద్రపోయేవాడిని.

నా డిగ్రీ చదువు పూర్తి అయింది. పి.జి. కూడా అయింది. బ్యాంక్‌లో క్యాషియర్ గా జాబ్ వచ్చింది. అన్నయ్య, వదిన నాకు పెళ్లి చేసారు. ప్రణవితో పెళ్లి అయింది. ఒక బాబు పుట్టాడు. మాకు పెళ్లి అయి ఏడేళ్ళు అయింది. నా భార్యకు నాకు మధ్య మనస్పర్ధలు ఏమీ లేవు, అలాగని ప్రేమా లేదు. ఇద్దరి మధ్య ఓ అండర్‌స్టాండింగ్, సదవగాహన. అంతే!

అప్పుడప్పుడు సుమధుర గుర్తుకు వచ్చేది. శరీరం పురుషత్వం సంతరించుకుంటున్న తొలిరోజుల్లో నా మనసులో కలిగిన వలపు, ఆ అనుభూతి అలా ముద్ర పడిపోయాయి. ఆ విధంగా మరో వ్యక్తిని ప్రేమించలేనేమో అనిపిస్తుంది.

డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న సెల్ ఫోన్ రింగ్ అయింది. ఆలోచనలలో నుంచీ బయటపడి, లేచి ఫోన్ అందుకున్నాను. “హలో! వంశీకృష్ణ గారూ! నేను సుమధురని” అని వినిపించింది.

“మీరా!” అన్నాను.

“ఏం చేస్తున్నారు?” అడిగింది.

“టి.వి.లో యన్.టి.రామారావు పాత జానపద సినిమా చూస్తున్నాను” అప్రయత్నంగా అన్నాను. ఆమె గురించి చెబితే ఆ వయసులోనే పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంకా అవే విషయాలు అలోచిస్తున్నానంటే ఎబ్బెట్టుగా ఉంటుంది.

“అవునా! పాత సినిమాలు నాకు కూడా ఇష్టం. చూసే తీరికే ఉండదు. అది సరే! రేపు ఆదివారం సెలవే కదా! మా ఇంటికి రండి. మనం మాట్లాడుకున్నట్లు ఉంటుంది. మా వారిని కూడా పరిచయం చేస్తాను. అడ్రెస్ మెసేజ్ పెడతాను”

“సరే!” అన్నాను. ఇంకేమైనా మాట్లాడుతుందేమో అని ఒక్కక్షణం ఎదురుచూసాను. ఫోన్ పెట్టేసిన సౌండ్ వినబడింది.

ఆ మర్నాడు రెడీ అయి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ సుమధుర చెప్పిన అడ్రస్ చూసుకున్నాను. ఊరు నాకు తెలిసిందే కాబట్టి అడ్రెస్ తేలికగానే దొరికింది. అదొక అపార్ట్‌మెంట్. కారు ఆపి, నాలుగో ఫ్లోర్‌కి వచ్చి, కాలింగ్ బెల్ కొట్టాను. సుమధుర వచ్చి తలుపు తీసింది. నన్ను చూడగానే చిరునవ్వుతో “రండి!” అన్నది. లోపలి వచ్చి సోఫాలో కూర్చున్నాను. బ్యాంక్‌లో కనబడినప్పుడు గమనించలేదు గానీ, ఆమె చాలా మారిపోయింది. బాగా లావు వచ్చింది. అప్పటి పొడవాటి జడ పొట్టి జడ అయింది. నల్లటి చీర మీద చుక్కలు నక్షత్రాల్లా తళుకు మంటున్నాయి. చెంపమీద పుట్టుమచ్చ ఒక్కటే మారలేదు. పనిమనిషి వచ్చి ట్రేలో జ్యూస్ ఉన్న గ్లాస్ అందించింది.

“అప్పటికీ, ఇప్పటికీ మీరేమీ మారలేదు. కాకపోతే కొంచెం ఒళ్లుచేసి, హుందాగా ఉన్నారు. కళ్ళజోడు వచ్చింది ” ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ అన్నది.

“మీరేమిటో చాలా మారినట్లు ఉన్నారు. చెప్పండి. ఏమిటి సంగతులు? అప్పుడు వెళ్ళిపోయారు. మళ్ళీ పద్దెనిమిదేళ్ళ తర్వాత కనిపిస్తున్నారు.” అన్నాను.

సుమధుర నవ్వింది. “మా పేరెంట్స్ హఠాత్తుగా నా పెళ్లి సెటిల్ చేసారు. భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయాను. మొదట్లో చాలా దిగులు పడ్డాను. తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ సడన్‌గా మాయమయ్యారు. ఎందుకు చేసుకున్నాను వెధవ పెళ్లి! అనుకుని ఏడ్చేదానిని. కానీ మావారు తన ప్రేమతో అన్నీ మరపించేశారు. ఆయనకి నేనంటే ప్రాణం. మళ్ళీ చదువుకోమని ఎంతో ప్రోత్సహించారు. అర్ధంకాని పాఠాలు మావారే చెప్పేవారు. నాకు ఉద్యోగం వచ్చేటట్లు చేసింది కూడా ఆయనే! నా డెవలప్‌మెంట్ కి కారణం మావారే!” పరవశంగా అన్నది. ఇల్లు కట్టించటం, తన కిష్టమైన ఫర్నిచర్ ఏర్పాటు చేయటం అన్నీ ఆయనే చేసాడట.

మాట్లాడిన ఆ కొద్దిసమయంలోనే “మావారు.. మావారు” అని పదిసార్లు అయినా చెప్పిఉంటుంది. అబ్బా!  కొద్దిసేపు అయన గురించి మాట్లాడకపోతే బాగుండు అనుకున్నాను.

“మీ విషయాలు ఏమిటి? మీ మిసెస్ కూడా జాబ్ చేస్తున్నారా! పిల్లలు ఎంతమంది?” అడిగింది.

“లేదు. తను హౌస్ వైఫ్. ఒక్కడే బాబు. ఆరేళ్ళు” చెప్పాను.

“అవునూ! అప్పట్లో మీరు ఏవో కథలు, కవితలు రాస్తూండేవారు. ఇప్పుడు కూడా రాస్తున్నారా!” అన్నది సుమధుర.

“లేదు. ఆపేశాను”

“అంతేలెండి! పెళ్ళయి, పిల్లలు పుట్టిన తర్వాత ఏం వీలవుతుంది?” క్యాజువల్‌గా అన్నది.

“అదేంకాదు. నా కథలకు స్ఫూర్తి నువ్వు. నిన్ను చూసే కథలు రాశాను. నిన్ను చూసే కవితలు అల్లాను. నువ్వు దూరమైన నాడే నా కలం మూగబోయింది” అని చెబుదామనుకున్నాను. మాటలు పెగిలిరాలేదు.

“అదిగో! మావారు వచ్చారు” సుమధుర సడెన్‌గా లేచి నవ్వుతూ ఆయనకి ఎదురు వెళ్ళి చేతిలో బ్యాగ్ అందుకుంది. సుమధుర అంత అపురూపంగా చెప్పే అతను నల్లగా, పొట్టిగా ఉన్నాడు. పెద్ద పొట్ట ఉంది. తలంతా బట్టతలతో గుండుచెంబులా మెరుస్తూంది.

నన్ను చూపించి “నా క్లాస్‌మేట్. వంశీకృష్ణ. బ్యాంక్‌లో జాబ్ చేస్తున్నారు” అని పరిచయం చేసింది. “గ్లాడ్ టు మీట్ యు” నవ్వుతూ చేయి జాపాను. అతను గండుపిల్లిలా చూసి, అంటీ ముట్టనట్లు షేక్ హ్యాండ్ ఇచ్చి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.

“ఇక నేను బయలుదేరతాను” అన్నాను. లోపల గదిలో నుంచీ వాళ్ళ అమ్మాయి, అబ్బాయి బయటకు వచ్చారు. అమ్మాయికి పదహారేళ్ళు, అబ్బాయికి పన్నెండు, పదమూడు ఏళ్ళు ఉండవచ్చు. వాళ్ళు కూడా తండ్రి లాగే బొద్దుగా, గుండ్రంగా ఉన్నారు. మందపాటి గుండ్రటి కళ్ళద్దాలు పెట్టుకున్నారు.

“ఈసారి వచ్చేటప్పుడు మీ భార్యాపిల్లలను తీసుకురండి” అన్నది.

“అలాగే!” అని చెప్పి లిఫ్ట్‌లో నుంచీ కిందకి వచ్చేసాను. కారు డ్రైవింగ్ చేస్తుంటే ఇందాక వెళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదనిపించింది. కాలేజీ రోజులు గుర్తుచేసుకుని, ఎన్నో చెప్పుకుందామని అనుకున్నాను. సుమధుర అసలు ఆ విషయాలే ఆలోచించటం లేదు. ఆడవాళ్ళు పెళ్ళయితే చాలు! అన్నీ మర్చిపోతారు. భర్త, పిల్లలు, సంసారంలో మునిగిపోతారు. మగవాళ్ళు అలా కాదు. కొన్ని కొన్ని జ్ఞాపకాలు అలా మనసులో ముద్రించుకుని ఉండిపోతాయి. అంత త్వరగా మర్చిపోలేరు. పెళ్ళయి, పిల్లల తండ్రులైనా ఆ జ్ఞాపకాలు అలా మనోవీధిలో కదలాడుతూనే ఉంటాయి అనుకున్నాను.

కారు రద్దీగా ఉన్న వీదుల్లోనుంచీ ట్రాఫిక్‌ను చీల్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here