[box type=’note’ fontsize=’16’] “అతని జీవితంలోని ఘటనలు, అతని కథలూ కలిపి కుట్టిన ఈ చిత్రం గుర్తుండిపోతుంది. ముఖ్యంగా మంటో గా చేసిన నవాజుద్దిన్ సిద్దిఖి నటన కారణంగా” అంటున్నారు పరేష్ ఎన్. దోషి “మంటో” చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]
కాలానికి నిలబడ్డ రచనలు అతనివి. దేశ విభజన చూడని వాళ్ళు కూడా అతని కథలు చదివి చలించిపోతారు. అతని కథల్లో అన్ని రకాలుగా అణిచివేయబడ్డ ఆడ మనుషుల కథలు సైతం కదిలించి వేస్తాయి. వొక కథ చదివేక మరో కథ చదవడానికి కొంత విరామం అవసరం, తేరుకోవడానికి. మానసిక దౌర్బల్యం వుంటే అక్కడితోనే ఆఖరు. స్వాతంత్ర్యం వచ్చిన కాలానికి దగ్గర్లో వున్న గొప్ప రచయితల్లో మంటో, ఇస్మత్ చుగ్తై, కిషన్ చందర్, ఫైజ్ లాంటి వాళ్ళు చిరస్మరణీయులు. అప్పుడు ప్రొగ్రెసివ్ రచయితల సమాఖ్య కూడా బలంగా వుండింది. మంటో చదువరులు నందితా దాస్ చిత్రం “మంటో” గురించి ఇష్టంగా యెదురుచూశారు.
అతని కథల ద్వారా అతని అంతరంగం మన మనసులో రూపు కట్టుకుంటుంది. కాని అతని జీవితం యెలా వుండేది, వగైరా కుతూహలాలు పూర్తిగా తృప్తి చెందలేదు ఈ చిత్రంలో. బహుశా అతని జీవితం గురించిన వివరాలు తగినంతగా అందుబాటులో లేవేమో. అయితే రెండు గంటల నిడివి గల ఈ చిత్రంలో నందితా దాస్ అతని అయిదు కథలను స్పృశించింది. కొన్ని దారంలో పూసల్లా, కొన్ని ప్రత్యేకంగా పొదగబడ్డట్టు కలిసిపోయాయి. వొక రకంగా ఆ కథలు కూడా అతని అంతరంగాన్ని ప్రేక్షకుడి ముందు పరుస్తాయి.
అతని జీవితంలోని ఘటనలు, అతని కథలూ కలిపి కుట్టిన ఈ చిత్రం గుర్తుండిపోతుంది. ముఖ్యంగా మంటో గా చేసిన నవాజుద్దిన్ సిద్దిఖి నటన కారణంగా. పాత్రలో అంతగా లీనమవడం సాధ్యమా అనిపించేలా చేశాడు. యెన్ని అవార్డులు వచ్చినా తక్కువనిపించేలా. అంతే చక్కగా చేసినది రసికా దుగల్. ఠండా గోష్త్ కథలో నటించిన దివ్యా దత్తా, రణవీర్ షోరేలు; మరో కథలో పరేశ్ రావల్ బ్రోకరుగా, తిలోత్తమా శోం వేశ్యగా బాగా నటించారు. అప్పటి కాలానికి తగ్గ ప్రాపర్టీలు, అలంకరణ, ఇవన్నీ రీటా ఘోష్ బాగా డిజైను చేస్తే, అంతే చక్కగా చిత్రీకరించాడు కార్థీక్ విజయ్. “ఫిరాక్” చూసినవారికి నందితా దాస్ నుంచి యెలాంటి దర్శకత్వం ఆశిస్తారో అంతే గొప్పగా వుంది. పసి పిల్లలను మన ముందుకు నెట్టిన నందితా దాస్ ప్రజ్ఞ ను చూడండి. ఆవేశంగా గట్టిగా మాట్లాడుతున్నప్పుడల్లా రసికా పిల్లలు నిద్ర పోతున్నారు, నెమ్మదిగా మాట్లాడమంటుంది. యెలాంటి ఆవేశాల్లో వున్నా మంటో దగ్గరికి పిల్లలు రాగానే మేజిక్ చేసినట్టు అతని ముఖకవళికలు మారిపోయి పిల్లలను ముద్దు చేయడం, కథలు చెప్పడం చేస్తాడు. ఆవేశ కావేషాల ప్రపంచానికీ పసివాళ్ళ ప్రపంచానికీ మధ్య రసికా వో గోడలా నిలబడి బేలేన్స్ చేస్తుంది. చివరికి మంటో కూడా నిద్రపోతున్న పిల్లల మీద చేయి వేసి నిమురుతూ క్షమాపణలు కోరుకుంటాడు.
వొక సన్నివేశం నుంచి మరో సన్నివేశంలోకి ప్రయాణం కూడా చూడండి యెలా చేస్తుందో. గత కొద్ది రోజులుగా నిద్రకు కూడా దూరమైన వేశ్య తిలోత్తమ ఆకలిని కూడా లెక్కచేయక నిద్రపోతుంటుంది. వో విటుడిని తీసుకొచ్చిన బ్రోకర్ పరేశ్ రావల్ ఆమెను బలవంతంగా నిద్ర లేపుతాడు. ఇద్దరి మధ్యా జరిగే కొట్లాటలో పరేశ్ పడిపోయి మంచం కోడు తలకు తగిలి రక్తమోడుతుండగా నేలమీద సాగిలపడిపోతాడు. కెమెరా అతనిమీదనుంచి పక్కనే వున్న మనంచం మీద మూడంకె వేసుకుని పడుకున్న తిలోత్తమ తలనుంచి పాదాలవరకూ ప్రయాణించి మరో సన్నివేశంలోకి కట్. అక్కడ సమాధుల మధ్య నడుస్తున్న పాదాల జంట. మంటో అతని భార్య మంటో తల్లిదండ్రుల సమాధుల ముందు మోకరించి అగరొత్తులు వెలిగించి ప్రార్థన చేయాలి. నేను అమ్మ కోసం చేస్తాను, నాన్న కోసం చేయనంటాడు. ఈ చిత్రంలో మంటో తల్లిదండ్రులతో వున్న సంబంధ బాంధవ్యాలు చూపలేదు కాని ఇలా కొంత వ్యక్తమవుతుంది. రెండు గంటల నిడివిలో మంటో లాంటి వొక వ్యక్తి జీవితం ఇమడదు గాని, నందితా దాస్ చిత్రం తప్పకుండా చూడాల్సిన చిత్రం. ఇది ప్రేక్షకులను కదిలించి, ఇదివరకు చదివి వుండకపోతే మంటో రచనలవైపుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రం చూశాక అతని రచనలకోసమే కాదు అతని జీవితం గురించిన వివరాలకోసం కూడా ప్రేక్షకుడు మనసు సారిస్తాడు. కోర్టులో ఫైజ్ “ఠండా గోష్త్” అసభ్యంగా లేదు కాని ఉన్నత సాహిత్యపు ప్రమాణాలు కల కథ కూడా కాదు అంటాడు. అప్పట్లో అతని విమర్శకుల వైఖరి, ముఖ్యంగా eliteలో యెలా వుండేది, శ్యాం లాంటి మిత్రుల ఆహ్వానం, సమర్థన, అండ వున్నా మంటో తిరిగి భారత దేశానికి రాక పోవడం, అతని తల్లిదండ్రులతో సంబంధాలు యెలా వుండేవి ఇలాంటివన్నీ కుతూహలాన్ని పెంచుతాయి. యెలాగూ వొక చిత్రంతో అయ్యేది కాదు గాని ప్రేక్షకుడు యెన్నో పుస్తకాలలో తనకు కలిగే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సుంటుంది.