[box type=’note’ fontsize=’16’] “మొదటి రెండు కథలూ చాలా గొప్పవి. తర్వాతి రెండు కథలు పాఠకుడిలో వొక పర్స్పెక్టివ్ కోసం అల్లిన కథలు. కాని మంచి కథలే” అంటున్నారు పరేష్. ఎన్. దోషి ‘మంటోస్థాన్’ సినిమాని సమీక్షిస్తూ. [/box]
[dropcap]ఇ[/dropcap]వాళ మంటో ని కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. అయితే కొత్త తరం పాఠకులు మంటో ని చదివినా ఆ వచనంతో ప్రభావితులు అవుతారనేది అతన్ని చదివిన వారెవ్వరైనా అంగీకరిస్తారు. ఈ మధ్య మంటో జీవిత గాథ మరియు అతని కథల శకలాల ఆధారంగా నవాజుద్దీన్ సిద్దిఖి నటించిన మంచి చిత్రం “మంటో” వచ్చింది. మంటో జీవిత వివరాలు తగినంతగా లభ్యం కానప్పటికీ ఆ కథలు శకలాలుగానైనా ప్రవేశ పెట్టడం ద్వారా ఆ కథకుని అంతరాత్మను ప్రకటించినట్ట్లైంది.
అయితే ఇప్పుడు ఈ చిత్రం మంటోస్థాన్ అతని జీవితాన్ని తడమదు. కేవలం అతను వ్రాసిన నాలుగు కథలు “ఖోల్ దో”, “ఠండా గోష్త్”, “ఆఖరీ సల్యూట్”, “అగ్రీమెంట్” ఆధారంగా తీసిన చిత్రం. నాలుగు కథలూ గొప్ప కథలు కావడమే కాకుండా ఆ కాలంలో బాగా వివాదాస్పదమైన కథలు కూడా. తీక్ష్ణమైన వచనం లో మామూలుగా ప్రారంభమైన్ వొక క్రెసెండో కు తీసుకెళ్తాయి కథలు. అది చదువుతున్న పాఠకుని భావోద్వేగాలను తోడు తీసుకుని. వొక్కసారిగా అబధ్ధపు తెరలు తొలగించి జీవిత నిజ దర్శనం కలిగిస్తాయి. ఆత్మ పరిశీలనకు బలవంత పెడతాయి. కళ్ళు తెరిపిస్తాయి, తడిపిస్తాయి. వొక్కో కథ వొక్కో ఆణి ముత్యం.
అన్ని కథలూ 1947 చుట్టూ జరిగిన మారణకాండ లో మనుషుల నిజ స్వరూపాలు బయట పెట్టవే.
ఠండా గోష్త్ లో వొక జంట ఇషర్ (సొహెబ్ షాహ్), కుల్వంత్ (సోనల్ సెహ్‌గల్). విభజన సమయంలో జరిగిన హింస, లూటి, పరారీ వగైరాలు జరుగుతున్నాయి. ఇషర్ కూడా సిటీలో వొక ఇంట్లో దోపిడి చెయ్యడానికి వెళ్తాడు. అడ్డం వచ్చిన వాళ్ళను నరికేస్తాడు. అక్కడ వో యువతి ఇది చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది. దొరికిన నగలు మూట గట్టుకుని ఆ అమ్మాయిని కూడా భుజానేసుకుని బయలుదేరుతాడు. ఇంటికొచ్చి నగలు కుల్వంత్ కిస్తాడు. ఆమె సంబరపడిపోతుంది. వాళ్ళ ఆంతరంగిక భాషలో పేకాడుదా పద, ముక్కలు కలుపుతా అంటాడు పక్కమీదకు తీసుకెళ్ళి. అతనికి ఆమె అంటే పిచ్చి వ్యామోహం. కాని ఈ సారి యేదో తేడా. నుదుటన చెమటలు పట్టేస్తాయి. ముక్కలు కలిపింది చాలుగాని, ముక్క వెయ్యి అంటుంది. అలాగే పక్కకు వాలిపోతాడు నిరాశగా. ఆమెకు పిచ్చి కోపం వస్తుంది. చెప్పు నువ్వు యే ఆడదాని దగ్గరికెళ్ళి వచ్చావు, నిన్ను పూర్తిగా పిండి పిప్పి చేసిన ఆ సవతి యెవరో చెప్పు లేదా నీ అంతు చూస్తానంటుంది. అతనేమీ చెప్పకపోయేసరికి అంతపనీ చేస్తుంది. చివరి ఘడియల్లో అతను జరిగింది చెబుతాడు. తను మోసుకెళ్ళిన అమ్మాయి అమ్మాయి కాదని అప్పటికే చనిపోయిందని, తను రమించబోతే చల్లని మాసం లా తగిలి తనూ బిక్కటిల్లి చల్లబడిపోయానని చెబుతాడు.
ఖోల్ దే లో సిరాజ్ (రఘుబీర్ యాదవ్) అతని భార్య, కూతురు సకీనా (సాక్షి భట్) విభజన కాలంలో కట్టుబట్టలతో పారిపోజూస్తారు. దుండగులు భార్యను పొడిచి చంపేస్తారు. తండ్రీ కూతుళ్ళు పరుగు కొనసాగిస్తారు. దారిలో ఆమె దుపట్టా జారి పడిపోతుంది. శీలానికి, పరువుకి సంకేతమైన దాన్ని తేవడానికి తండ్రి వెనక్కి వెళ్తాడు. కాని ఆ చున్నీ చేతికి తీసుకుని వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోతాడు. సకీనా మాయం అవుతుంది. ఇక పిచ్చివాడిలా తన కూతురి కోసం అన్ని రెస్క్యూ కేంపుల్లో తిరిగి వెతుకుతూ వుంటాడు. చివరికి స్ప్రుహ లేని స్థితిలో ఆమెను కొందరు తీసుకొస్తారు. డాక్టర్ ని పిలిపిస్తారు. ఆ చీకటి గదిలో, మంచం మీద వున్న ఆమెను పరీక్షించడానికి వెలుతురు కోసం కిటికీ తెరను తొలగించమని (ఖోల్ దో) అంటాడు. అప్పటికీ మత్తులో వున్న సకీనా తన సల్వార్ బొందు విప్పదీసి సల్వార్ ను కిందకి దించుతుంది. కుప్పకూలిపోతాడు సిరాజ్.
అసైన్మెంట్ కథ కశ్మీరులో జరుగుతుంది. మిలన్ సాహబ్ (వీరెంద్ర సక్సెనా) వో విశ్రాంత జడ్జి. కూతురు, కొడుకు జరుగుతున్న అల్లర్లకు భయపడి మనం కూడా ఈ వూరొదిలి వెళ్ళిపోదాం అంటున్నా వొప్పుకోడు. నా నివాసం వదిలి వెళ్ళాసిన ఖర్మ లేదు, నువ్వూ భయపడొద్దు అంటాడు. ఈ లోగా అతనికి పక్షవాతం వస్తుంది. డాక్తర్ని పిలుచుకురావడానికి బయట అల్లర్లకు యెవరూ వెళ్ళలేని నిస్సహాయత. ఈద్ నాటి రాత్రి ఇంటి తలుపు తడతారెవరో. కూతురు సంశయిస్తుంది. పర్లేదు తీయమంటాడు తండ్రి. అతను వొక కేసు లో న్యాయం కలిగించి ప్రాణాలు కాపాడిన వొక సిక్ఖు ప్రతి సంవత్సరం తప్పకుండా ఈద్ కి వచ్చి మిఠాయి ఇవ్వడం రివాజు. అతనే అయి వుంటాడని అతని నమ్మకం. కాని వచ్చింది అతని కొడుకు. క్రితం నెల చనిపోయిన ఆ తండ్రి కొడుకు దగ్గర మాట తీసుకుంటాడు : పదేళ్ళుగా తను చేస్తున్న పనిని నిరాటంకంగా కొడుకు కొనసాగించాలని. అందుకే బయట తనకోసం మృత్యువు కాచుకుని వున్నా, మాటకోసం మిఠాయి తీసుకుని వస్తాడు కొడుకు. మనుషుల్లో ఇదొక పార్శ్వం.
మొదటి రెండు కథలూ చాలా గొప్పవి. తర్వాతి రెండు కథలు పాఠకుడిలో వొక పర్స్పెక్టివ్ కోసం అల్లిన కథలు. కాని మంచి కథలే.
మంటో గురించి కొత్తగా చెప్పడానికి యేమీ మిగలలేదు. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా పాఠకుడిని తనతో పాటే తీసుకు వెళ్ళగలుగుతున్నాయి అంటే అంతా చెప్పేసినట్టే. ఇక సినెమా గురించి. వొకందుకు మంచిది. మంటో పరిచయం లేని యువతరపు పాఠకుడిని అతని వైపు మళ్ళిస్తుంది. అంతవరకే. మిగతా విషయాలన్నీ దుఃఖకారణాలే. యే కథకు ఆ కథ వరసగా చెప్పి వుంటే చాలా ప్రభావ వంతంగా వుండేవి. అలాంటి చిత్రాలు యెన్ని రాలేదు, చక్కగా. కాని ఇందులో అన్నీ కలిపేసి వొకే నేరేటివ్ లో అల్లడం అటు కథలకూ న్యాయం జరగలేదు; ఇటు ప్రేక్షకుడినీ వొక భావావేశంలోకి తీసుకెళ్ళడంలో విఫలమవుతుంది. వొక కథ క్రెసెండో వరకూ వచ్చే లోగా కట్ చేసి ఇంకో కథ, మోటు గా చెప్పాలంటే ఇషర్ కు కలిగిన శారీరిక మానసిక అనుభవమే పాఠకుడికీ కలుగుతుంది. ఇది మంటో పట్ల అన్యాయమే. పోనీ నటన గురించి చెబుతామన్నా రఘుబీర్ యాదవ్, వీరెంద్ర సక్సేనాలు బాగా చేసినప్పటికీ నిరాశ మిగిల్చారు. సోహెబ్ షాహ్, సోనల్ ఇతర నటులు పర్లేదు. ఇంతకంటే మించి చెప్పుకోవడానికి యేమీ లేదు.
పైన నేను చెప్పిన వొక్క పని చేయగలదు కాబట్టి ఈ చిత్రానికి కొంత క్రెడిట్! ఇది చూసినా చూడకపోయినా మంటో పుస్తకాలు తెచ్చుకుని చదవండి.