Site icon Sanchika

మంత్రాలకు చింతకాయ

[dropcap]స[/dropcap]ముద్రంలో ఉప్పునూ, అడవిలోని ఉసిరికాయనూ సృష్టించింది దేవుడే ఐనా కలిపింది మాత్రం మనిషే! పేరు తెలిస్తే ఆ మనిషిని థామస్ ఆల్వా ఎడిసన్ని లాగానే కలకాలం గుర్తుంచుకుని తీరాలి.

కానీ అలాంటి వాళ్లకు గుర్తింపుండదు.

అందుకేనేమో మా వీధిలో జగన్నాధానికీ గుర్తింపు లేదు. లేకుంటే పనిమనిషి రంగమ్మనీ, ప్రొఫెసర్ విశ్వాన్నీ అతడు కలిపిన తీరుకి ఎలాంటి సత్కారం లభించాలి?!

రంగమ్మకు ముప్పైఏళ్లుండొచ్చు. కానీ ఇరవైఏళ్లదానిలా చిలకలా ఉంటుందని – హుషారుగా మగాళ్లూ, అసూయగా గృహిణులూ చెప్పుకుంటూంటారు.

రంగమ్మకి ఒక్కడే కొడుకు. వాడంటే ప్రాణం దానికి. అలాగని వాడి భవిష్యత్తు కోసం అదేం కృషి చెయ్యదు.

కడుపునిండా తిండి పెడుతుంది.

కట్టుకుందుకు గుడ్డ ఇస్తుంది.

చదువుసంధ్యలు లేక ఆగమ్మకాకిలా తిరుగుతూంటే చూస్తూ ఊరుకుంటుంది.

సదుద్దేశంతోనే అయినా సరే, వాడి స్వేచ్ఛకు ఎవరడ్డొచ్చినా దానికి నచ్చదు.

రంగమ్మకు క్రమశిక్షణ నచ్చదు. రేపటి గురించిన ఆలోచన నచ్చదు. చేసే పనులమీద దృష్టి ఉండదు.

మనుషులు దొరికితే ఒకటే కబుర్లు.

టీవీ కనబడితే కళ్లప్పగించేయడం. దగ్గర అదనంగా నాలుగు డబ్బులుంటే సినిమా హాల్లో దూరడం. అదే బాలకృష్ణ బొమ్మయితే టిక్కెట్టు బ్లాకులోనయినా కొనేయడం – ఇదీ దాని ప్రవృత్తి.

రంగమ్మ బాలకృష్ణకి వీర ఫాన్!

అది తన కొడుక్కి బాలకృష్ణ అని పేరు పెట్టడానికి మగడితో విడాకులకి కూడా సిద్ధపడింది.

కొడుకుని ముద్దుగా బాలయ్యా అని పిలుస్తుంది.

వాడు బాలయ్యలా ఉంటాడన్నవాళ్లకు ఉత్తినే పనిచేస్తుంది.

వాణ్ణి వేళాకోళం చేసినవాళ్లు కొత్త చీరిచ్చినా విసుక్కుంటుంది.

బాలయ్యకిప్పుడు పదేళ్లు. వాడు ఆటలాడతాడు. పాటలు పాడతాడు. బండపనులు చేస్తాడు.

వాడేంచేసినా అందరికీ అల్లరిలాగే ఉంటుంది.

తల్లి మాత్రం చాలా ముచ్చట పడి, “సినిమాల్లో హీరోలంతా చిన్నప్పుడింతే – పెద్దయ్యాక నా బాలయ్యా, బాలయ్యంత హీరో అవుతాడు” అంటుంది.

కొడుకు విషయంలో మూర్ఖంగా ఉన్నా రంగమ్మ సెన్సాఫ్ హ్యూమర్ తక్కువేంకాదు. అది చెప్పకపోతే చాలామంది ప్రొఫెసర్ విశ్వం ప్రత్యేకతని గుర్తించగలిగేవారు కాదు.

విశ్వానికి నలబైఏళ్లుంటాయి.

ఆయనా, భార్య కాదంబరీ, కొడుకు భూషణ్ – ఒకే చోట ఉంటే ఆ కుటుంబం చూడ ముచ్చటగా ఉండొచ్చని అంతా అనుకుంటారు.

కానీ అది ఊహకే పరిమితమైపోయింది.

ఆ ఇంట్లో ముగ్గురివీ మూడు దార్లు.

విశ్వం, కాదంబరీ ఒకే కాలేజీలో పని చేస్తున్నారు. విశ్వం ప్రొఫెసరైతే కాదంబరిది అకౌంట్ సెక్షన్. భూషణ్ చదివే స్కూలు కాలేజీ పక్కనే.

కానీ వాళ్లెప్పుడూ కలిసి బయలుదేరరు.

విశ్వానికి స్కూటరుంది. ఆయన తన భార్యకు తప్ప రోజూ విధిగా ఇంకెవరికైనా లిఫ్టు ఇస్తాడు. అదీ మగాళ్లకి.

కాదంబరీ, ఆమె సహోద్యోగి జానకీ నెలవారీ డబ్బులకి ఆటో కుదుర్చుకుని వెడతారు.

భూషణ్‌కి సైకిలుంది.

భూషణ్ తలిదండ్రులతో కలిసి కనపడడు. అసలు తలిదండ్రులే కలిసి కనపడరు.

వాళ్లెప్పుడైనా ఇంట్లోంచి ఒకే సమయంలో బయటపడినా పక్కపక్కన నడవరు. ఒకరు ముందూ, ఒకరు వెనకా.

బస్సెక్కితే ఒకరు ముందు సీట్లో ఒకరు వెనక సీట్లో. వాళ్లను బయట చూసినవారెవరికీ భార్యాభర్తలని స్ఫురించదు.

ఆ కుటుంబం ఏ పార్టీకి వెళ్లినా ఒకరికీ ఒకరికీ మధ్య, కనీసం అయిదు నిముషాల వ్యవధి ఉంటుంది.

“ఆ ఇంట్లో వాళ్లెప్పుడూ మాట్లాడుకోవడం చూడలేదమ్మా” అందిట రంగమ్మ శ్రీమతితో.

“మరేం చేస్తారే?” అనడిగిందట శ్రీమతి.

“ఎప్పుడూ చెరో కుర్చీలోనూ కూర్చుని ఏవో పుస్తకాలు చదువుకుంటూంటారు. అదైనా ఎడమెహం, పెడమెహం! పుస్తకం ఒళ్లో పెట్టుకుంటే ఆయనకి కుడివైపు గోడ, ఆవిడకి ఎడమవైపు గోడ కనిపిస్తుంది. కుర్చీలు ఎదురెదురుగా వేసుకుంటే తప్పేంటంమ్మా అని ఓసారి నేనడిగేను కూడా!” అందిట రంగమ్మ.

దానికి కాదంబరేమందో చెప్పలేదు కానీ, విశ్వం విశేషాలు మాత్రం ఇంకా చాలా చెప్పింది రంగమ్మ.

భార్య లేనప్పుడు, ఇంటికెవరైనా ఆడవాళ్లొస్తే పలకరించడట.

మెహమాటం కాదుట. ఎప్పుడూ తిన్నగా మొహమైనా చూసుండకపోతే పెళ్లామైతే మాత్రం, ఎలా గుర్తుంటుంది? ఆ వచ్చింది తన పెళ్లామే ననుకుంటాట్ట!

మాట్లాడుకుందుకెవరూ లేక ఇంట్లో భూషణ్ నిత్యం చదువుతూనే ఉంటాడుట. అందుకే క్లాసులో ఫస్ట్.

అంతే కాదు – భూషణ్ రకరకాల విద్యలు నేర్చుకుంటున్నాడు.

ఆ కుర్రాడు మ్యాజిక్ ఎంతో బాగా చేస్తాడు. అది చాలాసార్లు రంగమ్మకు చూపించాట్ట.

చూడ్డానికి రంగమ్మ కాక – వాడికి ఇంకెవరున్నారు కనుక!

అప్పుడప్పుడు ఆ కుటుంబం ముగ్గురూ కలిసి టివి చూస్తారుట.

ముగ్గురూ మూడు కుర్చీల్లో దూరదూరంగా కూర్చుంటారు. అప్పుడు వాళ్ల ముఖాలు గంభీరంగా ఉంటాయి.

హాస్యం గుప్పించే సీరియల్ నడుస్తున్నా, పంతం పట్టినట్లు ఒక్కరూ నవ్వరు.

అదే విడిగా ఐతే పుస్తకంలో జోక్ చదివినా పగలబడి నవ్వుతారు – పిచ్చివాళ్లా అని అనుమానం కలిగేటంతలా!

రంగమ్మ హాస్యస్ఫూర్తి గొప్పదే కానీ – విశ్వం, కాదంబరి ఒకరితో ఒకరు మాట్లాడుకోరన్న విషయాన్ని మాత్రం నిజంగా నిజమని నమ్ముతుంది.

ఇలా ఉండగా బాలయ్యకు అల్లరి వల్లనో, దురదృష్టం వల్లనో కాలికి దెబ్బ తగిలింది.

వాడికి నిర్లక్ష్యం, అది పట్టించుకోదు. కోతిపుండు బ్రహ్మరాక్షసయింది.

వాడు నడవలేని స్థితికి వచ్చాడు.

డాక్టరుకి చూపిస్తే, “ఇది మామూలు పుండు కాదు. రాచపుండు” అన్నాట్ట, బహుశా విసుగ్గా.

రాచరికాన్ని కాంగ్రెస్ పార్టీ నేతృత్వానికే కాదు, అనారోగ్యానికి జతపర్చినా మన దేశపౌరులు మురిసిపోతారు.

తన కొడుక్కి రాచపుండని రంగమ్మ మురిసిపోయింది.

నేను మాత్రం కంగారు పడి, “రాచపుండైతే కుర్రాడు బతికి బట్టకట్టే అవకాశముండదు. ఇది మామూలు పుండు. దీనికి డ్రస్సింగ్ చేయాలి. పరిశుభ్రత పాటించాలి. మందు పూయాలి. అప్పుడు తగ్గడానికి వారం కూడా పట్టదు” అని శ్రీమతికి చెప్పాను.

శ్రీమతి ఆ మాట చెబితే, “మట్టిలో పుట్టి మట్టిలో పెరుగుతూ, మట్టిని నమ్ముకున్నవాళ్లం. మాకు మట్టి అపరిశుభ్రం కాదు” అని ఒక్కమాటలో కొట్టిపారేసింది రంగమ్మ.

అలాగని అది మట్టిని నమ్ముకున్నదనీ కాదు.

పరిశుభ్రత పాటించడం దానివల్లా కాదు, కొడుకువల్లా కాదు. క్రమశిక్షణ అంటేనే దానికి ఏవగింపు.

ఇలాంటివాళ్లను దార్లో పెట్టాలంటే మూఢనమ్మకాలొక్కటే మార్గం.

ఇంటికో బైరాగి వస్తే విషయం చెప్పాం.

వాడు కాస్త ఓవరాక్షన్ చేసి, “దేవతలు నీమీద అలిగారు. ఈ పుండునే పూజాపీఠంగా భావించి, శుభ్రం చేసి మంత్రాలకు రాలిన చింతకాయతో మందు రాస్తే వారం రోజుల్లో తగ్గిపోతుంది” అనేసి వెళ్లిపోయాడు.

“మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని సామెత. అంటే నాకా చింతకాయలు దొరకవు. నా కొడుక్కి పుండు తగ్గదు” అని నీరసపడింది రంగమ్మ.

“బైరాగినే అలా చింతకాయని రాలగొట్టి ఇమ్మందాం” అంది శ్రీమతి.

“బైరాగోడి నోట సత్యం పలుకుతుంది కానీ వాడి చేతలు మాత్రం కనికట్టే” అని కొట్టిపారేసింది రంగమ్మ.

దాని ఆలోచనలేవో దానివే తప్ప, వాస్తవంలో కొడుక్కి జరిగే ప్రమాదం గురించి దానికి పట్టడంలేదు.

శ్రీమతి చెప్పిందంతా విన్నాక నేను కలవరపడి, విషయాన్ని జగన్నాధానికి చెప్పాను.

జగన్నాధం గొప్ప జ్ఞాని, లోకజ్ఞాని – అని అప్పటికే స్వానుభవం వల్ల నాకు నమ్మకమేర్పడింది.

“నీలో పరోపకారగుణముంది. అందుకే నా తెలివి నీకుపయోగపడుతోంది” అంటూ జగన్నాధం నన్నూ, తననూ కూడా తెలివిగా మెచ్చుకుని, “రంగమ్మ కొడుకుని నా ఇంటికి పంపు. మంత్రానికి రాలిన చింతకాయతో మందు పూయిస్తాను” అన్నాడు.

“ఎలా?”

“మంత్రంతో చింతకాయను రాలగొట్టడం ఇంద్రజాల విద్య. అది నాకు చికెలమీద పని. ఎటొచ్చీ చింతకాయ నిజంగా మంత్రానికే రాలిందని రంగమ్మని నమ్మించాలి. అందుకు కాస్త లోకజ్ఞానం కావాలి” అన్నాడు జగన్నాధం.

“అదే, ఎలాగో చెప్పు” అన్నాను.

“అదప్పుడే చెప్పకూడదు. బాలయ్యకు నయం కానీ – అప్పుడు చెబుతాను” అన్నాడు జగన్నాధం.

ఆ తర్వాత వారంరోజుల్లో బాలయ్య పుండు చేత్తో తీసినట్లు మాయమైంది. నా ఆశ్చర్యమింతా అంతా కాదు.

బాలయ్యకు జరుగుతున్న వైద్యం గురించి శ్రీమతికి చెప్పలేనంత కుతూహలం.

రంగమ్మ ద్వారా రాబట్టాలని ఎంతో ప్రయత్నించింది.

కానీ రంగమ్మ, “అమ్మో! వైద్యం పూర్తయ్యేదాకా అంతా రహస్యంగా ఉంచాలి. లేకపోతే దేవతకి కోపమొస్తుంది” అంది.

ఇది విన్నాక నాలోనూ కుతూహలం పెరిగిపోయింది.

ఏమైతేనేం – బాలయ్య పుండు మానేక, ఇక రంగమ్మనడిగేదేంటిలే అని నేను జగన్నాధాన్నే కలిశాను.

“దేవత మీద నమ్మకం కదా, రంగమ్మ పరిశుభ్రతను పాటించింది. పుండు మానకేం చేస్తుంది?” అన్నాడు జగన్నాధం.

“మరి చింతకాయ సంగతి?”

“బైరాగులు నర్మగర్భంగా మాట్లాడతారని రంగమ్మకూ తెలుసు. సోది చెప్పేవాళ్లు పెట్ట అంటే ఆడపిల్లనీ, పుంజు అంటే మగవాడనీ అర్థం చేసుకోమూ – చింతకాయనూ రంగమ్మ అలాగే అర్థం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే నేను అర్థం చేసుకునేలా చేసాను”

“ఎలా?”

“భూషణ్‌కి మ్యాజిక్కొచ్చుగా, మంత్రం చదివి చింతకాయను రాలగొట్టడానికి అతడినెన్నుకున్నాను…”

“దానికి భూషణ్ ఎందుకూ? ఏ బైరాగినైనా పిలవొచ్చుగా! రంగమ్మ మ్యాజిక్కుని హర్షించదు” అన్నాను.

జగన్నాధం నవ్వి, “మ్యాజిక్కుతో చింతకాయను రాలగొట్టడం ఓ వంక. లేకపోతే నువ్వే ఆ చింతకాయవు సుమా అని భూషణ్‌కి చెప్పడం బాగుంటుందా?” అన్నాడు.

ఉలిక్కి పడ్డాను. కానీ నాకు అర్థం కాలేదు.

“పూర్వం ఋషిపత్నులు మంత్రప్రభావంతో గర్భం దాల్చేవారని పురాణాల్లో చదివాం. అది అసత్యం కాదని విశ్వం దంపతుల్ని చూశాక చాలామందికి అనిపించింది. నిజమేనని గాఢంగా నమ్మిన వాళ్లలో రంగమ్మ ఒకతె!” అన్నాడు జగన్నాధం.

కథారంభంలో జగన్నాధం గురించి నేను చెప్పింది అతిశయోక్తి కాదని ఇప్పటికి మీకూ అర్థమై ఉంటుంది….

Exit mobile version