[షేక్ కాశింబి గారు రచించిన ‘మనుషులంటే’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]కొం[/dropcap]డంత ప్రేమని గుమ్మరించే తేనె పలకరింపు
తోడుగా గుబాళించే ఆప్యాయతా పరిమళం
కూడా నడిచే కీర్తికిరీటాల సోకులే కాదు
గుండె కోత కోసే కరుకు మాటల ఈటెలు కూడా!
జల్లుగా కురిసే ప్రశంసల వర్షం
వెల్లువై సాగే స్నేహపు హర్షం
బాధించక అలరించే ఆమోద ముద్రలే కాదు
భేదించే ఈర్ష్యా శూలపు పోట్లు కూడా!
అక్షయంగా సాగే క్షమాభిక్ష
అనుక్షణం కాపాడే గుర్తింపు కవచపు రక్ష
చుట్టూ పారే వాత్సల్యపు యేటి జాలే కాదు
చుట్టుముట్టి భస్మం చేసే అహంకారపు జ్వాలలు కూడా!
సంభాషణల్లో సన్నజాజుల కోమలత్వం
సంతోషాల్లో సరిగమల సంగీతాలు
భయపడ వద్దనే అభయ హస్తపు ఇంపైన ఊరడింపులే కాదు
బలి తీసుకునే పన్నాగపు వంచనా కందకాలు కూడా!
సయోధ్యలో పరస్పరం చూపుకునే ఆదరాభిమానాలు
సఖ్యతలో ఒకరికొకరు చేసుకునే బాసటా బాసలు
ఎప్పుడూ మురిపించే ఓదార్పు ఊటలే కాదు
ఎప్పుడో ఒకప్పుడు కాటువేసే ద్వేషపు కాలనాగులు కూడా!
చూడగానే కళ్ళలో మెరిసే మతాబుల వెలుగులు
చెయ్యందించ గానే పెదవులపై విరిసే నవ్వుల పువ్వులు
కనబడే మర్యాదా మన్ననల జలతారు మెరుపులే కాదు
కనిపించకుండా కబళించే స్వార్థపు మొసళ్ళు కూడా!