Site icon Sanchika

మనుషులు చాలా రకాలు

[dropcap]అ[/dropcap]వును మనుషులు చాలా రకాలు
అగ్నిని శోధించిన వాళ్ళు
అరణ్యాల్ని జయించిన వాళ్ళు
వానను వడిసి పట్టిన వాళ్ళూ
వడిసెలను కనిపెట్టిన వాళ్ళు
శిలలను మలిచిన వాళ్ళు
చరిత్రలను మార్చిన వాళ్ళు
మనుషుల కోసమే బతికిన వాళ్ళు
దేవతలై నిలిచిన వాళ్ళూ…
అవును ఒకప్పుడు మనుషులు చాలా రకాలు

ఇప్పుడూ మనుషులు చాలానే రకాలు
నిద్ర పోతున్న వాళ్ళు
నిద్ర నటిస్తున్న వాళ్ళు
నిద్ర లేవలేని వాళ్ళు
నిద్ర పుచ్చేందుకు కష్ట పడుతున్న వాళ్ళు
ఏడుస్తున్న వాళ్ళు
వారిని చూసి నవ్వుతున్న వాళ్ళు
నవ్వలేక ఏడుస్తున్న వాళ్ళు
ఏడ్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళూ
నోళ్ళు కొడుతున్న వాళ్ళు
నోళ్ళు నొక్కేయబడుతున్న వాళ్ళు
నోటితోనే బతుకుతున్న వాళ్ళూ
భయపడుతున్న వాళ్ళు
భయపెడుతున్న వాళ్ళు
రాక్షసులై పోయిన వాళ్ళూ
రక్షణ అంటే తెలియని వాళ్ళూ
ఆకాశాన్ని కూడా కొనేస్తున్న వాళ్ళు
అన్నానికి సైతం నోచుకోని వాళ్ళూ

అవును మనుషులెపుడూ చాలానే రకాలు!

Exit mobile version