[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]
[dropcap style=”circle”]ఈ[/dropcap] మధ్య డాక్టర్‍గారి దగ్గరికి వెళ్ళాల్సొచ్చింది. నేను వెళ్ళేసరికే అక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. సరి, ఏం చేస్తాం అనుకుంటూ అక్కడే కుర్చీలో కూలబడ్దాను. నా అదృష్టమో దురదృష్టమో కానీ ఆ కుర్చీ సరిగ్గా డాక్టర్ కన్సల్టేషన్ టేబిల్‌కి కూతవేటు దూరంలో ఉంది. ఆ డాక్టర్ కన్సల్టేషన్ టేబిల్‌కీ నాకూ మధ్యలో ఒక్క ప్లైవుడ్ వుడెన్ పార్టిషన్ మాత్రమే ఉందన్నమాట. మనుషులు కనిపించరు కానీ మాటలు మటుకు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
“అంటే డాట్రుగారూ, పొద్దున్న లేచినప్పుడు బానే ఉంటుందండీ. కాసేపటికి మొదలౌతుందండి మోకాలునెప్పి. పాపం నేనింక చెయ్యలేనని టిఫిను ఈయన బైట్నించే తెచ్చేస్తారండి. టిఫిన్ తిన్నాక బానే ఉంటుందండి. ఓ గంటాగి వంట మొదలుపెడతానాండీ… పావుకిలో కూర తరిగేసరికి వేళ్ళు నెప్పెట్టేస్తాయండి. కాసేపు వాటికి క్రీమ్ రాసుకుని, ఓ అరగంట కూర్చుని అన్నం, కూర కుక్కర్‌కి ఎక్కిస్తానండి…” ఎవరిదో ఒకావిడ వాక్ప్రవాహం అలా అలా వెళ్ళి ఆఖరికి రాత్రి టిఫిన్ తిని, టేబ్లెట్ వేసుకుని పడుకునేవరకూ వెళ్ళింది.
ఎదురుగా కూర్చున్న డాక్టర్ మాటేమోకానీ పరోక్షంగా వింటున్న నాకు మటుకు మతిపోయింది. ఇవన్నీ కూడా డాక్టర్‌కి చెప్పాలా… ఇంతలో మళ్ళీ ఆవిడే..
“మరి డాట్రారూ, అసలు నెప్పి ఎప్పుడెప్పుడొస్తుందో చెపితేకానీ డాట్రు మంచిమందులు ఇవ్వలేడని అమెరికాలో ఉన్న మా బాబు ఫోన్‌లో చెప్పేడండి. ఇప్పుడు మీకు తెలిసింది కదండీ… ఇలా గొంతు దిగ్గానే అలా నెప్పి తగ్గిపోయే బిళ్లలు రాయండి. ఎంత కాస్టైనా పర్లేదండి. ఏదో ఆ దేవుడు ఓ నాలుగురాళ్ళు ఇచ్చేడులెండి..” అనడం వినిపించింది.
ఓర్నాయనో, ఇంకాసేపుంటే ఈవిడ ఇంకే పురాణం చెపుతుందో అని భయపడుతూ, అసలు ఈ సుత్తంతా ఆ డాక్టరు అంత ఓపిగ్గా ఎలా విన్నాడా అని ఆశ్చర్యపోయేను. డాక్టరు తెలివైనవాడే అయుండాలి ఎందుకంటే ఏవీ అడక్కుండానే ఇంత రామాయణం చదివిన ఆవిడ ఇంకా ఏమైనా ప్రశ్నలేస్తే ఇంకేం భారతం చదువుతుందో అనుకున్నాడో ఏమో, మాట్లాడకుండా ఆవిడకి ప్రిస్క్రిప్షన్ రాసేసుంటాడు. ఎందుకంటే తర్వాత ఇంకో పది నిమిషాలు ఆ మందులు ఎప్పుడెప్పుడు ఎలా వేసుకోవాలో మధ్యలో వచ్చిన ఆవిడ అనుమానాలన్నీ తీర్చుకుంటూ చెప్పిన తీరు విని అనుకున్నాను. హమ్మయ్య, వచ్చింది బైటికి, ఆవిడా, ఆవిడ వెనకాల ఆవిడ పతిదేవుడనుకుంటాను బహు వినయంగా ఆవిడ హాండ్‍బేగ్ పట్టుకుని వస్తున్నాడు. హూ, హండ్‍బేగ్ కూడా మోయలేనట్లున్న ఆ సుకుమారికి తగిన భర్తే అనిపించింది.
మళ్ళీ లోపల ఇంకో పేషంట్ మాటలు మొదలయ్యాయి.
“ఎప్పట్నించి?” అని డాక్టరడిగిన ప్రశ్నకి “ఎప్పట్నించంటేనండీ, మరండీ, మా తమ్ముడి కొడుక్కి పంచె కట్టించేరు సూడండి, అప్పట్నించండి…” అని వినిపించింది.
నాకు మతిపోయినట్లైంది. డాక్టర్ ఏమంటాడా అని చెవులు రిక్కించాను.
“అబ్బ, అదికాదు బావా, ఆయన ఎన్నాళ్లనుంచీ నీకిలా ఉంటోందని అడుగుతున్నారు…” పక్కన బామ్మరిదేమో అన్నాడు.
“అదేరా, నీకు తెల్దా.., ఆ మర్నాడే కదా మరదలు కూతురికి ఓణీ పంక్షను కూడా సేసింది…”
“అబ్బా, బావా, ఆయన డేట్ అడుగుతున్నారు…”
“అదే సెపుతున్నానుకదా, మన ఆచారిగారి కోడలికి పురుడురాలా… అప్పుడే…”
“హూ, బావా,..”
“ఏందిరా, అల్లా గింజుకుంటావూ… గప్పుడే గదా, నువొచ్చినప్పుడు మీ అక్క పాలకూర పప్పు సేస్తే మూడుమార్లు ఒడ్డింపించుకున్నావ్… అదీ గుర్తు లేదా…”
ఆ బామ్మరిదికి గుర్తొచ్చిందో లేదో కానీ వింటున్న నాకు మటుకు నవ్వాపుకోడం కష్టమైంది. పాపం డాక్టర్…
ఎలాగైతైనేం… ఆ ఫంక్షన్ల సంగతులన్నీ ఓపిగ్గా వింటూ, మధ్యలో చాలా తెలివిగా ఆ డాక్టరు వాళ్ళ దగ్గర్నించి తనక్కావల్సిన విషయాలు తెల్సుకున్నాడు.
ఆ తర్వాత ఇంకో ఆవిడ వెళ్ళింది. ఈవిడకి కాస్త ప్రపంచ జ్ఞానం ఉన్నట్టుంది, రిపోర్ట్స్ చూపించుకుని, మందులు రాయించుకుని అయిదు నిమిషాల్లోనే బైటకి వచ్చేసింది. ఆవిడ వెళ్ళిపోతుంటే వెనకాల్నించి ఆవిడకి దండం కూడా పెట్టుకున్నాను. ఈ మధ్యలో ఇంకో ఆవిడ లోపలికి వెళ్ళిందనుకుంటాను. మాటలు వినిపించడం మొదలైంది.
“చెప్పండమ్మా…” అన్న డాక్టర్ మాటలకి,
“ఏం చెప్పమంటారండీ. ఈ బిపి మాత్రలు, సుగర్ మాత్రలు వేసుకోడం చాలా కష్టంగా ఉందండీ. ఏదైనా తిన్నాక వేసుకోమంటారు. ఏం తినాలండీ పొద్దున్నే…”
“అదేంటమ్మా, ఇడ్లీ తినొచ్చుగా,.,”
“ఇడ్లీ అయితే సరేనండీ… కానీ ఇడ్లీ లోకి పచ్చడి లేకపోతే చప్పగా ఏం బాగుంటాయి చెప్పండి. పల్లీ పచ్చడి చేసుకుందామంటే పల్లీలు తినకూడదుట. కొబ్బరిపచ్చడి చేసుకుందామంటే ఉండేది ఇద్దరు మనుషులం… ఒక కొబ్బరికాయ కొడితే అంతా తినలేం కదా! వేస్టయిపోతుంది…“
“పోనీ, అల్లం పచ్చడి చేసుకోండి…” ఈ డాక్టర్ మెడిసిన్ చదివాడా లేక హోమ్ సైన్సా అనిపించింది నాకు ఒక్క క్షణం.
“ఏం అల్లం పచ్చడండీ. దాన్లో ఇంత పులుపూ, బెల్లం వెయ్యాలి. చింతపండు తింటే అల్సరూ, బెల్లం తింటే సుగరూ అంటూంటే ఏం తినాలండీ..”
“పోనీ సాంబార్ లాంటిది చేసుకోండి. “
ఆహా.. ఏమి సలహా..
“ఇద్దరు మనుషులం… గిన్నెడు సాంబారేం చేసుకుంటావండీ… అందుకే ఇంక ఇడ్లీ చెయ్యడం మానేసి గోధుమ రవ్వతో ఉప్మా చేసేస్తున్నాను…”
నేను హమ్మయ్య అనుకున్నాను. బహుశా లోపల డాక్టర్ కూడా అదే అనుకునుంటాడు.
కానీ, ఆవిడ మళ్ళీ మొదలెట్టింది. “పొద్దున్నే టిఫిన్ కంటూ ఏదో ఉప్మా కలియబెట్టేస్తున్నాను కానండీ, భోజనమైతే బైట్నించి తెప్పించేసుకుంటావండి… ఏదో… ఓ రోజు చప్పగా, ఓ రోజు ఖారంగా నడిచిపోతోంది. ఒక్కటే లాభమేంటంటే నూనెలు ఎక్కువ వెయ్యట్లేదు వాళ్ళు. అది బాగుందండి… కానీ, సాయంత్రం అయ్యేప్పటికి మళ్ళీ సమస్యే నండి..”
“సమస్యేముందండీ?” నా మనసులో కొచ్చిన ప్రశ్న డాక్టర్ అడిగారు.
“అదేనండీ, ఒంటిగంటకల్లా లంచ్ తినేస్తామా… నాలుగ్గంటలనించీ ఆకలేస్తుందండీ. రాత్రి ఏడుగంటల దాకా ఆకలితో ఉండలేం కదండీ… అప్పుడు ఏం తినాలన్నదే పెద్ద ప్రశ్నండి..”
హాసి నీ అసాధ్యం కూలా. నీకేమందు వాడాలో డాక్టర్ చెప్తాడు కానీ నువ్వేం తినాలో ఆయనేం చెప్తాడే, ఇవతల ఇంతమంది పేషంట్స్ వెయిట్ చేస్తుంటే నువ్వక్కడ ఆయనతో ఆహార ప్రణాళికా పథకం రచిస్తావే… నీ ఇల్లు సంతకెళ్ళా… అని మనసులో నాకొచ్చిన తిట్లన్నీ తిట్టేసుకుంటున్నాను.
కానీ ఆ డాక్టర్ మహానుభావుడనుకుంటాను…
మధ్యాహ్నం ఏమేం చేసుకు తినొచ్చో కొత్తగా కాపరాని కెళ్ళిన అమ్మాయికి ముఫ్ఫైయేళ్ళు కాపురం చెసిన ఇల్లాలు చెప్పినట్టు చెప్తున్నాడు.
“ఇడ్లీపిండి ఫ్రిడ్జ్‌లో ఉంటుంది కదండీ, దాన్ని రెండుల్లిపాయిలు తరిగి వేసుకుని ఊతప్పంలా వేసుకోండి, లేకపోతే ఆ ఇడ్లీపిండిలోనే కాస్త బియ్యంపిండి కలుపుకుని దోశెలు వేసుకోండి, లేదూ నాలుగు పల్లీలు వేయించుకుని ఉప్పూకారం చల్లుకుని పంటికింద పడేసుకోండి. అదీకాదూ హోల్ వీట్ బ్రెడ్ తెచ్చుకుని, టోస్ట్ చేసుకుని, ఏ అల్లం పచ్చడో రాసుకుని తినండి. ఇంకా కావాలంటే ఓ ఆలూ ఉడకబెట్టుకుని, చిదిమేసి, ఉల్లిపాయిలు, పచ్చిమిరపకాయిలు కలిపి మధ్యలో పెట్టుకుని సాండ్‍విచ్ చేసుకోండి. అదీ కాపోతే అటుకులుప్మా చేసుకోవచ్చు. ఇంకా….”
ఓర్నాయనో… ఈ డాక్టర్ సామాన్యుడు కాదు. వీళ్ళావిడ ఈయనతో ఎలా వేగుతోందో… పాపం వాళ్లవిడని తల్చుకుంటే నాకు పొగిలి పొగిలి దుఃఖం వచ్చేస్తోంది. ఇంక లాభం లేదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి అక్కణ్ణించి బైటకొచ్చేసేను…