Site icon Sanchika

మరలి వచ్చిన వసంతం

[శ్రీమతి దాసరి శివకుమారి రాసిన ‘మరలి వచ్చిన వసంతం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]కా[/dropcap]ర్డియాక్ విభాగం హాస్పిటల్ బెడ్‍పై పడుకుని వున్నది లక్ష్మి. నర్సు వచ్చి ఇప్పుడే టాబ్లెట్స్ మింగించి వెళ్ళింది. హాస్పటల్ కాంటీన్‌లో తాను టిఫిన్ చేసి భార్యక్కూడా పార్సిల్ తెస్తానని భర్త శేషగిరి ఇప్పుడే వెళ్ళాడు. రూమ్‍లో ప్రస్తుతానికి ఒక్కతే వున్నది. నర్సులు అంటున్నారు – “ఆంటీ. మీతో పాటు అంకుల్ ఒక్కరే వచ్చారేంటి? వేరే ఎవరూ రాలేదా? ఇంకెవరినైనా తోడు పిలిపించుకోండి. అంకుల్ బయటికి వెళితే మీరొక్కరే వుండాల్సి వస్తుంది. మేము ఎక్కువ సేపు మీ దగ్గరే వుండటానికి కుదరదు గదా?”

“ఎవరికీ వీలుపడదు. అయినా ప్రయత్నం చేసి ఎవర్నో ఒకర్ని పిలిపించుకుంటాను. నా సంగతి డాక్టర్లు ఇవాళ చెప్తారేమో ఏమవుతుందో ఏమో?”

“ఏం కాదు, మీరేం భయపడకండి. మా హాస్పిటల్లో చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తారు. కరోనరీ హార్ట్ డిసీజ్ కదా. మీకు స్టెంట్ సరిపోతే అదే వేస్తారు. లేకపోతే బైపాస్ సర్జరీ చేస్తారు. దేనికైనా భయపడాల్సింది ఏమీలేదు. ధైర్యంగా ఉండండి. నేను ఇక్కడే వరండాలో కూర్చుంటాను. ఏ అవసరమైనా పిలవండి. వెంటనే వచ్చేస్తాను.” అంటూ నర్సు శ్యామల బయటికి నడిచింది.

ఇంట్లో అటూ, ఇటూ తిరిగి పనిచేసుకుంటుంటే బాగా ఆయాసంగా అన్పించింది. వీపు, భుజాలు అంతటా ఒకటే నొప్పి. బాగా నీరసంగా, చెమటలు కారిపోయాయి. ఒకసారి పరీక్ష చేయించుకుందామని గుండె డాక్టరు దగ్గరకొచ్చింది. యాంజియో తీసి, రక్తనాళాల్లో బ్లాకులున్నాయని చెప్పారు. ట్రీట్‍మెంట్ అవసరం కాబట్టి వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవమని చెప్పారు. ఇంటికెళ్ళి అవసరమైన డబ్బు, బట్టలు తీసుకుని వచ్చి జాయిన్ అయింది. తోడుగా భర్త మాత్రమే వున్నాడు. ఫోన్ రింగయితే తీసి మాట్లాడింది. పెద్ద కొడుకు శ్రీనివాస్ లైన్‍లో వున్నాడు. “డాక్టరుగారు ఏమైనా చెప్పారా అమ్మా!” అన్నాడు.

“ఇంకా ఏం చెప్పలేదు. ఈ రోజు చెప్తారు. నువ్వు వెంటనే వచ్చేసెయ్యి శ్రీనివాస్. డాక్టరు గారితో మాట్లాడాలి. నువ్వు వస్తేనే నాకు ధైర్యంగా వుంటుంది” అంది.

“వెంటనే బయలుదేరుతాను. నీకిబ్బందేం వుండదు” అంటూ ఫోన్ పెట్టేశాడు.

శ్రీనివాస్ కమీషన్ వ్యాపారం చేస్తూవుంటాడు. ధాన్యం, అపరాలు, పసుపు, మిర్చి ఆయా సీజన్‍లలో ఖరీదు చేస్తాడు. గవర్నమెంట్ యార్డులో నిల్వ చేసి రేటు వచ్చినప్పుడు అమ్ముతూ వుంటాడు. లారీలు, టిప్పర్లు ఉన్నాయి. వాటిని బాడుగులకు తిప్పుతూ వుంటాడు. ఏ వూళ్ళో బాడుగలుంటే ఆ ఊళ్ళో మకాంపెడుతూ వుంటాడు. ఎప్పుడూ సంపాదన ధ్యాసే. ఇంటర్మీడియట్ వరకే చదివాడు. చెన్నై చుట్టుపక్కల పనులు ఎక్కువగా వున్నాయని ఈ మధ్య ఎక్కువగా చెన్నైలోనే వుంటున్నాడు. నాలుగేళ్ళ క్రిందటి మాట. శేషగిరి మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. శ్రీనివాస్ ఈ మధ్య వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నాడు. ఊళ్ళో ఐదెకరాల పొలం కొన్నాడు. ఉన్న పెంకుటిల్లు పడగొట్టి రెండుస్థుల బిల్డింగ్ కట్టించాడు. బిల్డింగ్‌కి కావలసిన అధునాతన సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేశాడు. తల్లికి ఒంటినిండా నగలు అమర్చాడు. లక్ష్మి మనసుకు మెల్లమెల్లగా గర్వం చోటుచేసుకోసాగింది. మొదట్నించీ కట్నంతో వచ్చానన్న టెక్కు వుండనే వున్నది. ఈ మధ్య శ్రీనివాస్ కు ఒకటి, రెండు సంబంధాలు వచ్చినా లక్ష్మికి ఏమీ నచ్చటం లేదు. ముఖ్యంగా కట్నకానుకలు సరిపోవటం లేదు. ఇంకొంత సంపాదించిన తర్వాత పెళ్ళి చేసుకోవాలని శ్రీనివాస్ క్కూడా వున్నది. దానికి తోడు తల్లి వత్తాసు. అలా కాలం ముందుకు జరుగుతూవున్నది. ట్రాక్టరు మీదెక్కి కూర్చుని శేషగిరి కాలుజారి ట్రాక్టరు వెనుక చక్రం క్రింద పడ్డాడు. కాలుకు బాగా దెబ్బతగిలింది. నెలరోజులు హాస్పిటల్లో వుండాల్సి వచ్చింది. శేషగిరి మిత్రుడు అనంతయ్య ఎంతో సాయపడ్డాడు. మాటిమాటికీ శేషగిరిని చూడటానికి హాస్పిటల్ కొచ్చేవాడు. వీళ్ళ పొలం పనులన్నీ దగ్గరుండి చేయించాడు. ప్రక్క ప్రక్క ఇళ్ళు కావటం వలన అనంతయ్య కుటుంబం శేషగిరి కుటుంబానికి బాగా ఆసరాగా వున్నది. అనంతయ్య కూతురు పద్మావతి ఇంటర్మీడియట్ చదువుతున్నది. తనకు ఖాళీ వున్నప్పుడల్లా లక్ష్మికి చేదోడువాదోడుగా వుండేది. పద్మావతి ఇంటర్ పరీక్షలు పూర్తి చేసింది.

“లక్ష్మీ! మన శ్రీనివాసు, అనంతయ్య కూతరు పద్మావతిని చేసుకుంటే అన్ని విధాల బాగుంటుంది. ఆపద సమయములో మనకు ఎంతో అండగా నిలబడ్డాడు. మనం చెపితే అబ్బాయి కాదనడు. కట్నం చాలదని నువ్వు అనుకోవద్దు. పద్మ కూడా చాలా ఒద్దికైన పిల్ల” అన్నాడు శేషగిరి.

“చూడవయ్యా నువ్వు అట్లాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోబాకు. చేయించుకున్నదానికి నేను ఎప్పటికప్పుడు లెక్కగట్టి బదులు తీర్చుకుంటూనే వున్నాను. వ్యవసాయం ఖర్చులకని, పిల్లల చదువులకని అనంతయ్య మన శ్రీనివాస్ దగ్గర బాగానే చేబదుళ్ళు తీసుకుంటున్నాడు. మనమేం ఋణపడిపోవటం లేదు. అయినా శ్రీనివాస్‍కు గొప్పింటి సంబంధమేదన్నా వస్తది. మనబ్బాయి ఇంకా పొలం కొనబోతున్నాడు. బెజవాడలో పెద్ద ఇల్లొకటి తీసుకుంటానంటున్నాడు. అంతగా అయితే చిన్నవాడు కరుణాకరకు పెళ్ళి చేయాలనుకున్నప్పుడు పద్మావతి సంగతి ఆలోచిద్దాం. ఇప్పుడేం మాట్లాడవద్దు” అంది లక్ష్మి గట్టిగా,

భార్య మొండితనం శేషగిరికి తెలుసు. ప్రస్తుతానికి మౌనం వహించాడు. కాని తర్వాత శ్రీనివాస్‌కు మాత్రం గట్టిగా నచ్చచెప్పాడు. “చూడు శ్రీనూ, నువ్వేమో ఇంటిపట్టునుండవు. సంపాదన అంటూ పొరుగు రాష్ట్రాలకు పోతావు. నీ తమ్ముడికేమో బాధ్యత తెలియదు. చదువు కూడా అంతంత మాత్రంగానే చదువుతున్నాడు. పద్మావతిని నువ్వు పెళ్ళి చేసుకుంటే బావుంటుంది. అనంతయ్య నాకు పొలంపనుల్లో సహాయంగా వుంటాడు. వాళ్ళ కుటుంబంలోని వాళ్ళు మీ అమ్మకు తోడుగా వుంటారు. ఆలోచించు”.

“అమ్మకు ఇష్టమయితే నాకేం అభ్యంతరం లేదు. పద్మ కూడా కలిసిపోయే పిల్లే అనుకుంటాను”.

దగ్గరి బంధువులు కూడా నచ్చచెప్పటంతో లక్ష్మి పద్మావతిని కోడలుగా అంగీకరించింది. పెళ్లై పద్మ కాపురానికొచ్చింది. శ్రీనివాస్ ప్రయాణాల్లో ఏమీ మార్పు రాలేదు. భార్యను మాత్రం తన తల్లిదండ్రుల వద్దే వుంచాడు.

“ఇది ఏక్వాగార్డు, మామూలు నీళ్ళను మంచినీళ్ళుగా మారుస్తుంది. ఇది ఓవెన్, ఇదేమో గాస్ పొయ్యిమీదున్న చిమ్నీ. అప్పుడప్పుడూ వీటన్నింటినీ బాగా శుభ్రం చెయ్యాలి. ఇవి మీ ఇంట్లో లేవుగా, ఇక్కడికొచ్చాకే నీకు వీటి గురించి తెలిసుంటుంది. ఇవన్నీ వాడటంలో జాగ్రత్తగా వుండాలి. ఎ.సి.మాత్రం ఏం అలవాటుంది నీకు? శ్రీనివాస్ ఇంట్లో వున్నప్పుడు ఎ.సి. వేసుకుంటాడులే. నువ్వు వెయ్యొద్దు. ఫాన్ వరకు వేసుకో. ఇక్కడికొచ్చేటప్పుడు సన్నగా వున్నావు. ఇక్కడికొచ్చాక బాగా బరువు పెరిగినట్లు కనిపిస్తున్నావు. ఎంతైనా మా ఇంట్లో తిండి వేరుగా వుంటుంది గదా? ఇన్ని రకాల ఫ్రూట్స్ మీ ఇంట్లో ఎందుకుంటాయి? కొద్ది కొద్దిగా తిను. అలవాటు లేక వాతం చేస్తుంది” ఇలా వుండేవి లక్ష్మి మాటలు. ఎవరో పరాయి పిల్ల తమ సొమ్మంతా అప్పనంగా తింటానికి వచ్చిందని తెగ బాధపడిపోతూ వుండేది.

ఏడాది గడిచింది. లక్ష్మి ధోరణిలో ఏం మార్పులేదు. మేం జాగ్రత్త చేసి ఎవరో పరాయి వారికి మా సొమ్మంతా అప్పచెప్పాల్సివస్తుంది అన్న ఉద్దేశ్యం మాత్రం రోజు రోజుకూ ఎక్కువ కాసాగింది.

సంక్రాంతి పండగని శ్రీనివాస్ ఇంటిపట్టునే వున్నాడు. ధాన్యం ఇంటికొచ్చే రోజులు కాబట్టి కొన్నాళ్ళు ఇక్కడే వుండి కొనుగోళ్ళ వ్యాపారం చూసుకుంటున్నాడు.

“శ్రీనివాస్, మీరు ఎక్కువగా మన ఊరు రావటం లేదు. మీరు లేకుండా ఇక్కడ ఒక్కదాన్నే నేను వుండలేకపోతున్నాను. మీతో పాటే నేనూ వచ్చేస్తాను” అన్నది పద్మావతి.

“చూడు పద్మా, ఈ బిజినెస్ పనులమీద నేను తరచూ ఊళ్ళు తిరుగాల్సివుంటుంది. చెన్నైలో మనకొక ఫ్లాట్ వున్నది. కాని తెలియనిచోట నువ్వు ఒంటరిగా ఎలా వుండగలుగుతావు! తమ్ముడి పెళ్ళి కానివ్వు. మన కాపురం గురించి తర్వాత చూద్దాం. మీరంతా మా కుటుంబానికి తోడుగా వుంటారని కదా నాన్న ఆశపడింది. ఇక దీన్ని గురించి ప్రస్తుతానికి ఆలోచించేదేమీ లేదు.”

“సరే మీ ఇష్టం. నాకు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి. చిన్నప్పట్నుంచి నాకు టీచరవ్వాలన్న కోర్కె ఉన్నది. నేను డైట్ కాలేజీలో చేరి టి.టి.సి. ట్రెయినింగ్ పూర్తి చేస్తాను. బోయపాలెం డైట్ కాలేజ్లో నాకు తెలిసిన ఫ్రెండ్ చదువుతున్నది. తన ద్వారా వివరాలన్నీ తెలుసుకుంటాను. ఆ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదవగలిగినంత చదవాలని అనుకుంటున్నాను. నేను చదువుకోవటానికి అత్తయ్యని ఒప్పించండి.” అన్నది స్థిరంగా.

పద్మ చాలా గట్టి పట్టు మీదున్నదని శ్రీనివాస్‍కు అర్థమయింది, నీ బిజినెస్ నువ్వు చూసుకునేటట్లైతే నా చదువు నేను చదువుకుంటానని చెప్తున్నదనుకున్నాడు.

కాపురం వదలిపెట్టి కాలేజీకేంటి అని పెద్దవాళ్ళెవరూ పద్మ కాలేజీకి వెళ్ళటానికి అంగీకరించలేదు. ఇంట్లో చాకిరీ చేసి పెట్టే మనిషి పోతుందని లక్ష్మి బాధపడింది. నేనొకటి తలిస్తే మరొకటి జరుగుతుందని శేషగిరి బాధపడ్డాడు. ఎన్ని తర్జన భర్జనలు జరిగినా పద్మావతి చలించలేదు. డైట్ కాలేజ్లో చేరటానికే నిశ్చయించుకున్నది. చదువుకోవటానికి కావలసిన ఆర్ధిక సహాయం తనే చేస్తానన్నాడు శ్రీనివాస్.

“కరుణాకర్‍కు చదువూ లేదు, సంధ్యా లేదు ఊరికే కాలేజీకి వెళ్ళిరావటమే. ఈ బండి మార్చి, ఆ బండి కొనటం, స్నేహితులతో బలాదూర్ తిరగడం, ఇక్కడ ఊళ్ళో వుండి మాకు ఏం వుపయోగపడటం లేదు. నువ్వు చేసే వర్క్ దగ్గరకు తీసుకెళ్ళి వీడిక్కూడా పని నేర్పించు. ఇంట్లోవుంటే మీ అమ్మ గారాబంతో ఎందుకూ పనికిరాకుండా పోతాడు” అని శేషగిరి పెద్ద కొడుకుతో మాట్లాడాడు. దాని పర్యవసానం కరుణాకర్ అన్నతో పాటు కర్ణాటక కాపురస్థుడయ్యాడు.

ఇప్పుడు శ్రీనివాస్ లారీలు, టిప్పర్లతో పాటు, ప్రొక్లయినర్స్ కూడా తీసుకుని రైల్వే పనులు బాడుగల కోసం హుబ్లీలో వుంటున్నాడు. శ్రీనివాస్‌తో పాటు వెళతాడు సైటు దగ్గరకు కరుణాకర్ కూడా. ఏదో మొక్కుబడిగా వెళ్ళటం, రావటం. అన్నలాగా పనిలో అంకిత భావం మట్టుకు ఇంకా అబ్బలేదు. “అన్నయ్యా! ఏ.టి.ఎమ్. కార్డు తీసుకెళ్తాను. నా అకౌంట్‍లో డబ్బు వేయించు. ఫ్రెండ్స్ వచ్చారు. హంపీ చూడాలంటున్నారు. పనిలో పని తుంగభద్ర డామ్ కూడా చూపెడతాను. ఇంకా ఏమైనా చూస్తామంటే తీసుకెళ్తాను.” అంటూ వుంటాడు.

ఒకసారి లక్ష్మి శేషగిరి హుబ్లీ వచ్చారు. వాళ్ళకు కూడా హంపీ, ధర్మస్థలి, ఆ చుట్టుప్రక్కలున్న పుణ్యక్షేత్రాలన్నీ తిప్పి చూపించాడు శ్రీనివాస్. ధార్వాడలో దొరికే ఇల్కల్ శారీస్, వాటిమీదుండే కుట్టుపనీ అందంగా వుంటాయనీ తల్లికి చెప్పి మన బంధువులకు కూడా ఇవ్వమని కొన్ని చీరలు కొని తల్లికిచ్చాడు.

పనుల సంగతి ఎలా వున్నా కరుణాకర్‍కు అక్కడి రైల్వే కాంట్రాక్టర్లతో బాగా పరిచయాలు పెరిగినయ్యి.

“అన్నయ్యా, శివానందగౌడ గారమ్మాయిని నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను” అన్నాడు అకస్మాత్తుగా కరుణాకర్.

శ్రీనివాస్‌కు అది ఊహకందని విషయం. “కరుణాకర్ నిన్ను తీసుకొచ్చింది ఇందుకా? ఇక్కడే వర్క్‌లో తోడుంటావని. ఖర్చు మాత్రం విపరీతంగా పెడుతున్నావు. నాకు తోడుంటం కాదు. నిన్ను కాపలా కాసుకోవటం సరిపోతుంది నాకు. ఇక్కడి కర్ణాటక అమ్మాయితో పెళ్ళేమిటి? పెద్ద వాళ్ళు చూసి చేసేదాకా ఆగలేవా? అమ్మావాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకుంటారా? మనం ఎల్లకాలం ఈ కర్ణాటకలో వుండిపోతామా? రైల్వే కాంట్రాక్టు పనులు పూర్తికాగానే మన సామాగ్రితో మనం వెళ్ళిపోతాం. శివానందగౌడ కూతురు వచ్చి మనూళ్ళో వుంటుందా? ఇది జరిగే పని కాదు. నువ్వు వెంటనే ఆంధ్రా వెళ్ళిపో” అంటూ శ్రీనివాస్ సైటు దగ్గరికెళ్ళిపొయ్యాడు.

ఆ రోజు నాగపంచమి. కర్ణాటక అంతా చాలా ప్రముఖంగా జరుపుకునే పండుగ. దేవాలయాలన్నీ, పండుగ శోభతో అలరారుతూ వుంటాయి. శివానందగౌడ కూతురు సుగుణ, శ్రీనివాస్ తమ్ముడు కరుణాకర్ హుబ్లీలోని ఒక శివాలయంలో దండలు మార్చుకుని పెళ్ళి చేసుకున్నారు. ఆ రాత్రికి రాత్రే అమరావతి ఎక్స్‌ప్రెస్‍లో ఆంధ్రాకు బయలుదేరారు. కరుణాకర‌కు చాలా నమ్మకం. తనంటే తల్లిదండ్రులకు చాలా ఇష్టం. తన మాట కాదనరు అనే ఉద్దేశంతో సుగుణను సరాసరి ఇంటికి తీసుకెళ్ళాడు. శేషగిరికి, లక్ష్మికి పెద్ద షాక్ తగిలింది. ‘పెద్దవాణ్ణి నమ్మి తమ్ముడ్ని పంపిస్తే చిన్నవాడి బాగోగులు వాడేం చూశాడు? చూస్తే ఇలా జరుగుతుందా? వీడు కరుణాకర్ ఎంత ప్రేమించాను వీణ్ణి. నాతో మాట మాత్రం చెప్పకుండా వేరే రాష్ట్రంలోని పిల్లను పెళ్ళి చేసుకున్నానంటూ వెంటబెట్టుకొచ్చాడు. ఏం చెయ్యాలి నేను’ అంటూ లక్ష్మి కుప్పకూలిపొయ్యింది.

శివానందగౌడ్, అతని కొడుకు కలసి శ్రీనివాస్ మీద యుద్ధానికొచ్చారు. “ఏడీ, నీ తమ్ముడు? పన్లు కోసమని వచ్చి మా పిల్లను మాయ చేసి తీసుకెళ్ళాడు. నీ లారీలు రూట్లో ఎలా తిరుగుతాయో చూస్తాం. నీ పర్మిట్లన్నీ కాన్సిల్ చేయిస్తాం. మా ఎమ్.ఎల్.ఎ. చూసుకుంటాడు నీ సంగతి. ఇప్పుడు నీ తమ్ముడు కనపడితే మా హుబ్లీ సెంటర్లోని చెన్నమదేవి విగ్రహం దగ్గర పాతేసేవాళ్ళం వాడిని” అంటూ పెద్ద పెద్దగా అరవసాగారు.

“ఏం జరిగిందో నేను కనుక్కుంటాను. మీరు ఆవేశపడవద్దు. మీ అమ్మాయి కూడా ఇష్టపడితేనేగా తీసుకెళ్ళింది. ఏది ఏమైనా మీ అమ్మాయి కేం ఇబ్బంది వుండదు. నాది హామీ” అంటూ వాళ్ళను సమాధానపరచి తనూ ఆంధ్రా బయల్దేరాడు. ఊళ్ళో ఇంటిదగ్గర పరిస్థితి ఎలా వుందో అనుకుంటూ, ముఖ్యంగా అమ్మకు నచ్చచెప్పాలి అని నిర్ణయించుకున్నాడు.

తమ ఊళ్ళో వుండటం కరుణాకర్ దంపతులకే మాత్రం ఇష్టంగాలేదు. లక్ష్మి ఆదరణ కూడా దానికి తగ్గట్టే ఉన్నది. “బెంగుళూరు వెళ్ళి ఏదైనా వ్యాపారం చేస్తాను. శివానందగౌడ్ బంధువులున్నారు. వాళ్ళతో పార్టనర్‍షిప్ తీసుకుంటాను. డబ్బులివ్వండి” అంటూ పేచీకి దిగాడు కరుణాకర్.

“అంత దూరం వద్దు. దగ్గర్లోనే వుండు. టౌన్లో ఏదైనా ఒక ఫ్లాట్ తీసుకుందాం. కమీషన్ వ్యాపారమంతా నువ్వే చూసుకో. దానికితోడు ఏదైనా ఒక షాపు పెట్టుకో” అని అన్నా తండ్రీ ఇద్దరూ చెప్పారు.

“సుగుణ ఇక్కడ ఉండలేకపోతున్నది. బెంగుళూరు అయితే తనకు బాగా పరిచయమున్న ప్రదేశం. అటే వెళ్ళామంటున్నది” అని చెప్పుకొచ్చాడు. అదే చేశాడు. బెంగుళూరు కాపురం. ఆ సంవత్సరమే ఒక బిడ్డకు తండ్రయ్యాడు. ఆంధ్రాకు రాకపోకలు తగ్గించాడు. వచ్చినప్పుడు కూడా భార్యను, గురించీ బిడ్డను గురించి పెద్దగా చెప్పడు. తన కొడుకు శివానందగౌడ్ ఇంట్లోనే పెరుగుతున్నాడని చెప్తాడు. పెద్ద మొత్తాలలోనే డబ్బులు కావాలంటూ ఫోన్లు మాత్రం చేస్తాడు.

పద్మావతికి టి.టి.సి. ట్రెయినింగ్ పూర్తయింది. వెంటనే డి.ఎస్.సి.లో సెలక్టయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. చదువు కోసమని వచ్చిన దగ్గర్నుండీ పద్మావతికి, శ్రీనివాస్‍కు మధ్య రాకపోకలేం లేవు. వద్దని చెప్పినా వినకుండా కాపురం వదిలిపెట్టి చదువు వంకతో వచ్చేసిందని లక్ష్మికి గట్టిగా నమ్మకం. అదే ఇంటా, బయటా అంటుండేది. పద్మావతి తన మానాన తాను ఉద్యోగం చేసుకుంటున్నది. డిగ్రీ చదవటానికి ప్లాన్ చేసుకుంటున్నది.

ఇంతలో లక్ష్మికి ఇలా గుండెజబ్బని హాస్పిటల్లో చేరింది. ప్రస్తుతం భర్తా, ఆసుపత్రి నర్సులే కావల్సినవి అందిస్తున్నారు. శ్రీనివాస్ తప్పకుండా వస్తాడు. కరుణాకర్‍కి చెప్పినా, చెప్పకపోయినా ఒకటే. రావాలనిపిస్తే చెప్పాచెయ్యకుండా వచ్చేస్తాడు. ఇష్టం లేకుంటే రమ్మన్నా రాడు. ఖాళీగా, అనారోగ్యంగా మంచంమీద పడుకుని వుంటే గతమంతా లక్ష్మికి మనను నిండా పరుచుకుపోతున్నది. వద్దనుకున్నా అవే తలపులు మాటిమాటికి వస్తున్నాయి. ఎంతో ఆసరాగా వుంటారని తన భర్త కావాలని అందర్నీ ఒప్పించి పద్మావతిని తన ఇంటి పెద్ద కోడలుగా చేసుకున్నాడు. వాళ్ళది దిగువ మధ్యతరగతి కుటుంబం. అలాంటి ఇంటి పిల్ల తన ఇంటి కొచ్చి సర్వసౌఖ్యాలు అనుభవించటం తనకిష్టం లేకపోయింది. సౌకర్యాలు లేకుండా సాదాసీదాగానే మసలుకోమని చెప్పేది. ఈ విషయాలేమీ శ్రీనివాస్‌కు తెలియవు. ఎప్పుడూ తన పెద్దకొడుకు తన మాటకెదురు చెప్పి ఎరుగడు. ఇప్పుడు తన తమ్ముడి భార్యనో, చెల్లెలో దాని కూతుర్నో ఆస్పత్రిలో తనను చూసుకోవటానికి రమ్మని అడగాలి. అవసరమయితే బతిమాలుకోవాలి తప్పదు అనుకున్నది.

“ఆంటీగారూ ఏం చేస్తున్నారు! అంకుల్ టిఫిన్ తెచ్చిచ్చారా? తిన్నారుగా, ఈ టాబ్లెట్లు వేసుకోండి. ఏం ఆలోచించకుండా కళ్ళు మూసుకుని విశ్రాంతిగా పడుకోండి. ఇంకాసేపట్లో డాక్టరుగారు రౌండ్స్ కొస్తారు. ఏంజియో తీసారుగా, మీకే ట్రీట్‍మెంట్ చెయ్యాలో చెప్తారు. ఈ కిటికీ తెరలన్నీ బాగా పక్కకి లాగి వుంచండి. గాలి బాగా వస్తుంది. లేకుంటే మొత్తం మూసేసి ఎ.సి. వేసుకోండి. డాక్టరుగారు వచ్చేటప్పటికి నేను మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయింది నర్సు.

“మొత్తానికి ఈ నర్సమ్మలందరూ భలే చలాకీగావున్నారు. రోజుకు ముగ్గురు డ్యూటీలు మారుతున్నారు. మగాళ్ళకంటే ఆడవాళ్ళే ఎక్కువగా కనపడుతున్నారు” అన్నాడు శేషగిరి. డాక్టరుగారు రౌండ్స్ కొచ్చారు. “ఏమ్మా ఎలా వున్నారు? మిమ్మల్ని రెండు రోజులు అబ్జర్వేషన్‍లో వుంచుతాం. ఎక్కువ పూడిక వున్న దానికి స్టెంట్ వేస్తాము. మిగతావి రెండు చిన్న చిన్న బ్లాకులున్నాయి. మందుల్తో కరిగిపోతాయి. ఏం భయం లేదు. కాని తర్వాతైనా మీరు బాగా జాగ్రత్తగా వుండాలి. మందులన్నీ రెగ్యులర్‍గా వాడాలి. మీరు ఏమేం తినాలో మా డాక్టరు గారు చార్టు ఇస్తారు. రోజూ వ్యాయామం చెయ్యాలి. స్టెంట్ వేశాక మా వాళ్ళు అంతా వివరంగా చెప్తారులే” అంటూ ఆమె కేస్ షీట్ మీద వివరాలన్నీ వ్రాసిపెట్టి వెళ్ళారు.

లక్ష్మికి బాగా నీరసంగా అన్పిస్తున్నది. శారీరక బలహీనతో, లోపలి ఆందోళనో అర్థం కాలేదు. శేషగిరి కాంటీన్ నుంచి తెచ్చిన భోజనం అలాగే వున్నది. తినాలనిపించలేదు. ఫ్లాస్క్‌లో వున్న పాలు తాగి పడుకున్నది.

డ్యూటీ మారి శైలజ లోపలికొచ్చింది. “ఆంటీ గారూ! భోజనం చేశారా? టాబ్లెట్లు వేసుకోవాలి” అంది.

“తినలేదమ్మా, ఆకలి లేదని అలాగే పడుకున్నది” చెప్పాడు శేషగిరి.

“భోజనం చల్లారిపోతే అసలు తినలేరు. సాంబారు కలిపి మెత్తగా చేసి నేను తినిపిస్తాను” అంటూ ఒక బాక్సులోకి అన్నం తీసుకుని స్పూన్తో మొత్తగా చేసి దాంట్లో సాంబారు వేసి మెదిపింది. ఒక్కొక్క స్పూన్ అన్నం తీసి లక్ష్మి నోటికి అందించింది. “మీ అమ్మాయే పెడుతుందనుకోండి. వద్దనకుండా తినాలి.”

“అలాగే అమ్మా నేను తింటాలే” అంటూ లక్ష్మి తనే నాల్గు స్పూనులు సాంబారు అన్నం తిన్నది. మరలా అలాగే నాలుగు స్పూన్లు పెరుగన్నం కూడా తినిపించింది. ఆ తర్వాత టాబ్లెట్లు మింగించి వెళ్ళింది. రూమ్‍లో వున్నంత సేపూ ఏవో కబుర్లు చెప్తూనే వుంటుంది.

చాలా మంచి పిల్ల. ‘మీ అమ్మాయినే అనుకోండి. పిల్లలు తినిపిస్తుంటే బాగా రుచిగా వుంటుంది కదా ఆంటీ’ అంటూ మాటల్లో పెట్టి అన్నం తినిపించి వెళ్ళింది. నిజంగా ఇంట్లో పిల్ల ఒకరు తనను కనిపెట్టుకొని వుంటే తనకూ నిశ్చింతగా వుంటుంది. బాత్రూంకు వెళ్ళాలన్నా భయంగా వుంది ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతానో అని.

శ్రీనివాస్ వచ్చాడు. డాక్టరుగారితో మాట్లాడి విషయమంతా తెలుసుకొన్నాడు. ఊళ్లో ఒకరిద్దరు ఫ్రెండ్స్ వుంటే అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను. హాస్పిటల్‌కు రావాల్సి వుంటుందని చెప్పి వుంచాడు. తానే స్వయంగా వెళ్ళి తన పిన్నిని ఒప్పించి తీసుకొచ్చాడు అమ్మకు తోడుగా.

అనుకున్న రోజుకు లక్ష్మికి స్టెంట్ వేశారు. ఐ.సి.యూ.లో వుంచారు. వేళకు తినటానికి, తాగటానికి శ్రీనివాస్ గాని, శేషగిరిగాని తెచ్చి ఇస్తే ఐ.సి.యూ.లోని స్టాఫ్ తినిపించేవారు. మిగతా పనులన్నీ కూడా వాళ్ళే చూసుకునేవాళ్ళు. నాల్గు రోజుల తర్వాత లక్ష్మిని రూమ్‍కు పంపించారు. లక్ష్మి చెల్లెలుకు మోకాళ్ళ నొప్పులు. అంత ఫ్రీగా నడవలేదు. ఏదో తప్పక అక్కకు సాయం వచ్చింది.

నర్సు శైలజ డ్యూటీకి వచ్చినప్పుడల్లా ఎన్నో కబుర్లు చెప్పివెళుతూవుండేది. లక్ష్మిని వరండాలోనే అటూ, ఇటూ నడిపిస్తూ వుండే వాళ్ళు. “కాళ్ళ నొప్పుల్తో ఈ ఆంటీ గారేం తోడుంటారు మీకు! మీ అమ్మాయినో, కోడలినో పిలిపించుకోండి. మీరింకా తొందరగా కోలుకుంటారు. మేం చేసేది డ్యూటీనే. అదే మీ వాళ్ళయితే బాగా ప్రేమగా, ఆత్మీయంగా వుంటారు” అన్నది శైలజ.

డ్యూటీ చేస్తేనే ఇంత నిజాయితీగా చేస్తున్నారు, ఇంక స్వంత వాళ్ళు ఇరవై నాల్గు గంటలూ కనిపెట్టుకుని వుంటే ఎంత ఊరటగా వుంటుందో అనిపించసాగింది లక్ష్మికి.

చెల్లెలు కూడా అంటున్నది “అక్కా! ఇంటికెళ్ళాక కూడా నీకు మనిషి సాయం అవసరం. ఎంత పని మనుషులున్నా స్వంత వాళ్ళ దారి వేరు. ఎవరూ లేకపోతే లేదు. ఉన్న కోడళ్ళిద్దరినీ దూరం చేసుకున్నావు. అసలు నీకు ఎవరిపొడా ఎక్కువగా గిట్టదు. నేనిలా అంటున్నానని కోపం తెచ్చుకోవద్దు. పద్మావతి చాలా మంచిది కాబట్టి మీమీద ఇంతవరకు ఏ మహిళా కమీషన్‍కో ఫిర్యాదు చేయ్యకుండా తన మానాన తను బ్రతుకుతున్నది” అని, “శ్రీనివాస్ నీకైనా తెలియొద్దా? ఆ అమ్మాయిని అలా వదిలేశావు” అంటూ చివాట్లేసింది.

“తను ఏదో చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి అనుకున్నదిగా పిన్నీ”

“ఎప్పుడనుకున్నది ఆ మాట, మీ దగ్గర సరైన ఆదరణ లేక ఆ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. డబ్బు సంపాదన ఒక్కటే కాదు ముఖ్యం. ఇల్లూ, భార్యా, కుటుంబం కూడా కావాలి. మీ అమ్మకు ఇవేం పట్టవు. నువ్వైనా ఆలోచించుకోపోతే ఎలా?”

శేషగిరికి ఈ మాటలు ఆనందాన్ని కల్గించాయి. ఇన్నాళ్ళూ తన మాట లక్ష్మి వినిపించుకునేది కాదు. ఇప్పుడు తన మాటలకు వత్తాసు దొరికింది. ఈ టైమ్ లోనే శ్రీనివాస్‍కు బాగా తెలిసొచ్చేటట్లుగా మరదలి ద్వారా ప్రయత్నించాలి అనుకున్నాడు.

“ఈ కోడళ్ళ ఆలోచనలతోనే నాకు ఆరోగ్యం పాడవుతుంది. లేకపోతే నాదెంత మంచి ఆరోగ్యం? ఇంటెడు చాకిరీ అవలీలగా చేసుకునేదాన్ని” అంటూ తన తప్పేంలేదు, తప్పంతా కోడళ్ళదే అన్నట్లుగా మాట్లాడింది లక్ష్మి.

ఒకవారం వున్నాక హాస్పిటల్ నుండి ఇంటికొచ్చారు లక్ష్మీవాళ్ళు. ఆ రోజు శ్రీనివాస్ తన పిన్నితో కలసి పద్మావతి దగ్గరకెళ్ళాడు. ‘వీడికి వ్యాపార దక్షత అయితే వున్నది కాని, పెళ్ళాం దగ్గర ఎంత ప్రేమగా వుండాలో ఇంకా అర్థం కావటం లేదు. నేను పూనుకొని ఇద్దర్నీ కలపాల’ని నిర్ణయించుకున్నది పిన్ని.

పద్మావతి సాదరంగానే ఆహ్వానించింది ఇద్దర్నీ.

“ఉద్యోగం వద్దు, ఏమీ వద్దు. చేయాల్సిన అవసరమే లేదు. ఇంటికెళ్దాం వచ్చెయ్” అన్నాడు శ్రీనివాస్.

“మీ సహాయంతోనే నేను చదివి ఇటీవలే ఉద్యోగంలో చేరాను. మీ సహాయం నాకెప్పుడూ గుర్తుంటుంది. నేను ఉద్యోగంలో చేరి కొద్ది నెలలే అయినా నాకెంతో ధైర్యంగా, ఆనందంగా వున్నది. దాన్ని మానేసే ప్రసక్తే లేదు. నా ధైర్యాన్ని, నా ఆసరాను నేను పోగొట్టుకోలేను. మీ ఇంట్లో నా కాపురానికి స్థిరత్వం వుంటుందో, వుండదో, నేను చెప్పలేను. కాని నేను రిటైరయ్యే దాకా నాకు నా జాబ్ గారంటీ వుంటుంది. అలాంటి గారంటీని నేను వదిలిపెట్టుకునే తెలివితక్కువ పని చెయ్యను.”

ఏదో తనకు ఇంట్లో మనిషి అవసరమయ్యి తాత్కాలికంగా తనను పిలవటానికి వచ్చినట్లుగా భావిస్తున్నట్లు వున్నది. అది దూరం చేయాలనుకున్నాడు శ్రీనివాస్. “నువ్విక ఒంటరిగా వుండొద్దు. ఇక నుంచి ఇద్దరమూ కుటుంబ బాధ్యతల్ని పంచుకుందాం. కాంట్రాక్టులంటూ పరుగులు తీయటం నేనూ తగ్గిస్తాను. జాబ్ మానేయమని కూడా చెప్పను. నీ అంతట నువ్వే ఇంటికి తిరిగివస్తావని ఇన్నాళ్ళూ ఎదురుచూశాను. ఇకనైనా నీ ఇంటికి నువ్వు వచ్చెయ్” అన్నాడు మనస్ఫూర్తిగానే.

శ్రీనివాస్ పిన్ని కూడా పద్మావతికి చాలా రకాలుగా నచ్చచెప్పింది. “మా అక్క ప్రవర్తన నువ్వేం మనసులో పెట్టుకోవద్దు. నువ్వు బయటకి రావటం ఒకందుకు మంచిదే అయింది. చదువుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగావు. ఉద్యోగంతో పాటు ఆడపిల్లకి కాపురం కూడా చాలా ముఖ్యం కదమ్మా. మీ మావగారు కూడా నీ విషయంలో బాధపడుతున్నారు. బాగా ఆలోచించు పద్మా. అలనాటి శ్రీనివాస్, పద్మావతులే కొన్నాళ్ళు దూరంగా వున్నారు. మనం మానవమాత్రులం. ఇక మా శ్రీనివాస్ విషయానికొస్తే చాలా మంచివాడు. నీకు తెలియందేమీ కాదు. అక్క కాని, నువ్వు కాని ఎవరికి వారే తెలుసుకుంటారులే అని భావించాడు. తనూ ఇంటిపట్టునే ఎక్కువగా ఉండాలనుకుంటున్నాడు. నువ్వు ఆ యింటి పెద్ద కోడలివి. నీ స్థానం ఎప్పుడూ పదిలంగా, స్థిరంగానే వుంటుంది. పసుపూ, కుంకుమా ఇచ్చి నిన్ను నేనే మరలా కాపురానికి తీసుకెళతాను. నా మాట మన్నిస్తావుగా” అంటా పద్మ చెయ్యి పట్టుకుంటే, ఆవిడ చేతిలో తన చెయ్యి వేసింది పద్మావతి.

Exit mobile version