[dropcap]భూ[/dropcap]మి నుంచి యాభై అడుగుల ఎత్తులో
సమాంతరంగా ఊగుతూ, చేస్తున్నా నేను, వాయుస్తంభనం
భూమ్మీద నా శవ ఊరేగింపు
డప్పులు చప్పుళ్ళు వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయినూ
ఒక్కసారిగా ఎంత తేలిక
బాధ్యతల బరువు తగ్గిందో
ఆలోచనల మోపు పోయిందో
రోడ్డు మీద పైసలు ప్యాలాల చల్లింపు
ఏడుపులు, అలసటలు, నిస్సహాయతలు
పులపొడుచుకుని ఆకాశం వైపు తదేకంగా చూస్తున్న
సూర్యుని వెళుతూ అతి తీవ్రం
తడి కళ్ళతో చూడలేనంత శ్వేతమయం
ఇంట్లో అంతా నిశ్శబ్దం
ప్రపంచ భారం తగ్గిందని సపత్నుల వినోదం
నేనే ప్రపంచం అని ఇతువులు విలపు
గాల్లో తేలుతూ శూన్యంలో చూస్తున్న నాకు
నా గతం, నా జ్ఞాపకాలు దొంతరలుగా వస్తున్నాయి
నాలో తెలీని సత్యానందం, ఏది నేను?
భూమ్మీద వున్న నా నిర్జీవ కాయమా , గాల్లో ఉన్న నా సర్వమా
ఏడు పేర్ల కర్రలు పేర్చి
కాటి కాపరి అంతిమ ‘మమ’ అనగానే
నిప్పు రవ్వల చిటపటలు ఉవ్వెత్తున శివాలెత్తాయి
ఒక్కసారిగా గాల్లో తేలుతున్న నా ఆత్మ
చిన్ని చిన్ని వజ్రపు చూరల్లా చీలి
ఆ విపరీతపు వెలుగుతో పాటు శూన్యంలో కలిసిపోయింది
ఆరు మూరల శరీరం
ఇప్పుడు ఏడు తరాల బూడిద
గంగ ఒడిలో సేద తీరాలన్న
తపనతో రాగి చెంబులో ఒదిగిపోయింది
ఇంతలోనే అందరికీ నేనొక మతి అయిపోయిన
నా ఉనికి మరోసారి చాటుకోడానికి దేవుడికి వినతి పెట్టుకున్న !