మరవాలి మానవత్వం..

1
3

[శ్రీమతి షామీర్ జానకీదేవి రచించిన ‘మరవాలి మానవత్వం..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]పొ[/dropcap]ద్దున్నే త్వరగా లేవలేని వసంత, రోజూ ఏడున్నర, ఎనిమిది గంటల మధ్యలో లేస్తుంది.. పదవీ విరమణ అయిన తర్వాత రకరకాల రుగ్మతలు కారణంగా, వాటికి సంబంధించిన మాత్రలు వేసుకోవడం వలన కొన్ని మత్తుగా కూడా ఉంటాయి.. అందుకే ప్రొద్దున్నే లేవలేకపోతోంది.. లేవగానే, పనిమనిషి ఇంటి ముందు ముగ్గు వేసిందా లేదా చూసుకోవడం తన ముఖ్యమైన దినచర్య.. ముగ్గు వేసి ఉంటే ‘హమ్మయ్య! పనిమనిషి వచ్చింది’ అనుకొని, తన పనులు మొదలుపెడుతుంది.. అప్పటికే లేచిన శ్రీవారు మోహన్, పాలు కాచి, కాఫీ కలుపుకొని తాగుతూ పేపర్ చూస్తూ ఉంటారు.. “వసంత! గుడ్ మార్నింగ్” అంటూ చిరునవ్వుతో పలకరిస్తాడు మోహన్.. గిల్టీగా ఫీల్ అవుతూ తను కూడా గుడ్ మార్నింగ్ చెప్పి ఫోన్ అందుకుంటుంది..

వసంత, మోహన్ ఇద్దరూ అనేక సంవత్సరాలు ఉద్యోగాలు చేసి రిటైర్ అయి ఉన్నారు.. వారికి ఒక్కడే కొడుకు.. తను సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నాడు.. ఈ మధ్యనే అతనికి పెళ్లి చేశారు.. తమను సింగపూర్ రమ్మన్నా కానీ, “మీరిద్దరూ హాయిగా ఉండండి.. మేము ఇప్పుడే రాలేము.. కొన్ని ప్రదేశాలు, యాత్రలు తిరిగి రావాలి..” అంటూ మృదువుగా తిరస్కరించాడు మోహన్..

పనిమనిషి రోజూ తమ ఇంటి ముందు ఊడ్చి, ఇంకో ఇంటికి వెళుతుంది.. ఆ తర్వాత తీరిగ్గా వచ్చి తమ ఇంట్లో పని చేస్తుంది.. తన బాధలు అవీ ఇవీ చెబుతూ, వసంతతో ఎంతో క్లోజ్‌గా మాట్లాడుతుంది.. అసలే జాలిగుండా తనది.. ఇట్టే కరిగిపోతూ ఉంటుంది.. అంత మానవత్వం, మంచి మనసు, ప్రస్తుత సమాజంలో ఉండకూడదు అంటూ మోహన్ హెచ్చరిస్తూనే ఉంటాడు.. కానీ తనలో అంత త్వరగా మార్పు రాదు కదా..

“ఏమండీ! పాపం నాగమణి భర్త రోజూ తాగి వస్తాడటండీ.. ఈమె దగ్గర నుంచి డబ్బులు బలవంతంగా లాక్కుంటాడట.. ఇవ్వకపోతే ఆమెని కొడతాడట.. ఇద్దరు కొడుకులు పాపం.. పిల్లలు ఎక్కడ ప్రభావితమవుతారో అని నాగమణి బాధపడుతోందండీ” అంటూ నాగమణి బాధలన్నీ, మోహన్ ముందు ఏకరవు పెడుతూ ఉంటుంది..

దానికి అతడు, “ఈ రోజుల్లో ఇది, ప్రతి ఇంట్లో ఉండే సమస్యే.. వాళ్ళ ఇళ్ళల్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది.. అది తీర్చలేని సమస్య.. నువ్వేమి అంటించుకోకు, మనసుకు తీసుకోకు” అంటూ సున్నితంగా ఆమెని మందలించాడు మోహన్..

అన్నీ విన్నట్లుగానే ఉంటుంది కానీ, వెనుకటి గుణమేల మాను కదరా సుమతి! అన్నట్లుగా మళ్లీ నాగమణి చెప్పినప్పుడు ఆమె కష్టాలు వింటూనే ఉంటుంది.. తన వంతుగా బాధపడటం మామూలయిపోయింది తనకు..

మద్యం అమ్మకాలు పెంచి, ఆదాయాన్ని పెంచాలనుకనే ప్రభుత్వం, ఇలాంటి సామాన్య కుటుంబాల జీవితాలపై అవి ఎంతగా చెడు ప్రభావం చూపిస్తున్నాయో పట్టించుకోదు.. ఇంకో పది ఏళ్లలో వారి పిల్లలు కూడా ఇలానే తయారవుతారేమో..

ఇలా వుండగా, ఒక రోజు నాగమణి ఏడుస్తూ ఫోన్ చేసింది..

“అమ్మా! మా ఆయన రోడ్డుపై వస్తుంటే ఎవరో స్కూటరుతో గుద్దారట.. బహుశా తాగి వున్నాడేమో.. నేను ఇవాళ పనికి రాలేనమ్మా” అంటూ హృదయవిదారకంగా ఏడుస్తూ చెప్పింది..

సరే, ఏం చేస్తాం, అనుకుంటూ చీపిరి తీసుకుంది వసంత, వాకిలి ఊడ్చేందుకు.. ఇలా ఎన్నిసార్లు మానేస్తుందో.. చేసుకుందామంటే చేతగాని వయస్సు.. అప్పటికీ మోహన్ ఎన్నోసార్లు చెప్పాడు.. కానీ తనే, తన సహజ దయాగుణంతో మాట వినదు.. పోనీలే అని అనుకుంది..

పక్క ఫ్లాట్‌లో ఉంటున్న పద్మ ఆ సాయంత్రం పనిగట్టుకుని వచ్చింది ఆమె దగ్గరికి..

“మీ పనిమనిషి, వాళ్ళ ఆయనతో ఈ రోజు సినిమా హాల్లో కనిపించింది” అంటూ చెప్పింది..

అదేమిటి? తన భర్తకు ఆక్సిడెంటని చెప్పింది కదా!, ఈ రోజు వుదయం.. సినిమాకు వెళ్ళడమేమిటి? ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడతుందా? తన అవస్థలు ఏకరువు పడుతుంటే, ఆమెతో పాటు తను కూడా బాధపడిందే..

అంతే, ‘మంచితనానికి పలితం వంచనా’ అనే పాట గుర్తుకు వచ్చి పాడుకుంటూ, ఇంత జాలి గుండె నాకెందుకిచ్చావ్ స్వామి అంటూ భగవంతుడిని ప్రశ్నించుకుంది.. అన్నిటికీ సమాధానాలు దొరికితే, ఈ ప్రపంచంలో ఇన్ని రకాల మనుషులు, రకరకాల గుణాలు ఎందుకు వుంటాయి..

భర్త మోహన్‌తో “ఏమండీ! నేను రేపటి నుండి పనికి రావద్దని నాగమణికి చెప్తాను” అని చెప్పింది..

“ఎందుకు ఎంత బాధపడతావు.. నేను వాచ్‌మన్‌కి చెప్తాను ఇంకొకరిని తీసుకొస్తాడు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చటుక్కున తీసేస్తున్నారు.. ఇక మన సంగతి ఏపాటి? ముందు నువ్వు మారు.. ఈసారి అంత జాలి చూపించకు” అంటూ చెప్పాడు మోహన్..

అది హెచ్చరికో లేక మందలింపో తనకు అర్థం కాలేదు. ఇలా ఎంతమందిని మారుస్తాము?.. మళ్ళీ కొత్తగా వచ్చిన అమెకు ట్రైనింగ్ ఇవ్వాలి.. నాగమణి పని అలవాటయింది కానీ, ఆ మనిషి మాటల్లో నిజాయితీ లేదు.. అదే తలంపు, బాధ మనసును కాల్చివేస్తూంటే, ఆ రోజు పని ముగించుకుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here