కలిసే ముందుకు పోదాం
కలుపుకు ముందుకు పోదాం
ఆచార్యా అవధానీ
రైతన్నా… పదన్నా.
పేదవాడ్ని గొప్పవాడ్ని
పండితుడ్ని పామరుడ్ని
వైణికుడ్ని గాయకుడ్ని
సమసమాజ నిర్మాతని. |కలిసే|
నిన్నటి మొన్నటి దాకా… విషం మింగి బ్రతికేశాం
ఎవరో చెప్పిన మాటలు… ఎవరో ఇచ్చిన బాసలు
ఎవరో చూపిన బాటా… ఎవరో నేర్పిన పాటా
మనదంటూ గర్వించాం… మనకోసమే అనుకున్నాం.
ఇసుక మీద భవనాలని… ఎన్నెన్నో నిర్మించాం
పునాదనే మాట మరిచి… పంచరంగులతో నింపాం.
ఒక్కొక్కటి ఒక్కొక్కటి… కుప్పకూలిపోతుంటే
ఎవరెవరో కారణమని… భ్రమపడ్డాం భయపడ్డాం
మారే కాలంతో పాటు… మారని చట్టాల్ పెట్టుకు
మతులుపోయి నిలుచున్నాం… మౌనంగా విలపించాం
డోంట్ వర్రీ బ్రదరూ… మనకెందుకంత ఫియరూ!
అస్తమించిపోయిన రవి… మళ్ళీ రావట్లేదా
అమావాస్య చీకటెనక… మళ్ళీ పున్నమి లేదా.
ప్రతి తప్పూ ఒక ఒప్పే… సవరించే తెలివుంటే
ప్రతి ఒప్పూ ఒక తప్పే… తర్కంతో తలబడితే.
జీవితమో తప్పొప్పుల పట్టిక అని తెలియదా…
తెలుసుకున్న క్షణం.. జ్ఞాన పుష్పం ఎద విరియదా.
ఎన్నాళ్ళని గతంలోనే… మరల మరల బ్రతుకుతావ్
రేపటి సూర్యుని కెప్పుడు… స్వాగతాన్ని పలుకుతావ్?
ఉందంతా అయోమయం… అన్నమాట నిజం నిజం
కులమతాల ఊబిలోన… కూరుకుపోయాం సత్యం.
మనం తీసుకున్న గొయ్యి… మననే కబళిస్తుంటే
తెలిసి కూడా జాగెందుకు… దూరంగా రావెందుకు.
ధనమున్నది బలమున్నది… యోచించే మనసున్నది
ఒక్కసారి నీ బుద్ధిని… పదును పెట్టలేవా?
వాగ్దానాలను నమ్మి… మోసపోకు నాయనా…
బిత్తర చూపులు ఎందుకు… నీకు చేతకాకనా?
మహారాజులు కారయ్యా… యుద్ధంలో గెలిచేదీ
సామాన్యులు సైనికులే… ప్రాణాలను ఒడ్డేదీ.
పునాదిలో పడి వున్నా… శిఖరాగ్రంలో వున్నా
బరువెత్తేదిటికేనోయ్… ఇటుకలన్ని ఒకటేనోయ్.
సాధించాలనుకుంటే… ఎవ్వరు నిన్నాపగలరు
ఉవ్వెత్తున నువు లేస్తే… ఎవరు తలలు ఎత్తగలరు?
నిరాశనీ నిస్పృహనీ… దరికే రానీయకోయ్.
ఎదిగే సూర్యుని సాక్షిగ… నీ పని మొదలెట్టవోయ్.
పరివర్తన లేకుంటే… పని ముందుకు సాగదోయ్
కలుపుమొక్కనొదిలేస్తే… పంట చేతికందదోయ్…
మరణించిన తరువాత… ఏది వెంట వస్తుందీ
ఆస్తి రాదు పరువు రాదు… చివరికి తనువే రాదు.
అందరూ బాగున్న నాడె… నువ్వూ బాగుంటావూ
కడుపే కైలాసమంటె… ఒంటిగానె మిగులుతావు.
ఈ సంపద… యీ ప్రకృతి… అందరిదని తెలుసుకో
ప్రేమిస్తూ ప్రేమ పంచి… జీవితాన్ని మలచుకో.
అందుకే మిత్రమా… నాతో రమ్మంటున్నా
కలిసే ముందుకు పోదాం… కలుపుకు ముందుకుపోదాం.
కష్టాల్ నష్టాల్ గాయాల్… ఘోరాలెన్ని ఎదురైనా
కలిసే ముందుకి పోదాం… అనుకున్నది సాధిద్దాం.
అమ్మలార అక్కలార… నవయుగ నిర్మాతలార
కలిసే ముందుకు పోదాం… కలుపుకు ముందుకు పోదాం.
తెలుగుజాతి మన జాతని… తెలుగు భాష మన భాషని
గర్వంగా నినదిద్దాం… తెలుగుకి పట్టం కడదాం.
– భువనచంద్ర